April 14, 2024

బీజేపీ మిత్రపక్షాలు వరుసగా షాకులు తింటున్నాయి. తమిళనాడులో అన్నాడిఎంకే చాలా కాలంగా బీజేపీ మిత్రపక్షం. ఇప్పుడు అన్నాడిఎంకేలో ముసలం పుట్టింది. ఇది బీజేపీకి గొప్ప అవకాశాలు కల్పిస్తోంది. తమిళనాడులో పాలకపక్షం డిఎంకేను నిలదీయగలిగిన ప్రతిపక్షం హోదాలో ఇప్పుడు అక్కడ బీజేపీ మాత్రమే కనిపించే వాతావరణం ఏర్పడింది.

అన్నాడిఎంకేలో అసమ్మతి చాలా కాలంగా ఉడుకుతూనే ఉంది. ఇపియస్ గా పిలువబడే ఎడప్పడి కె.పళనిస్వామి అన్నాడిఎంకే జనరల్ కౌన్సిల్ సభ్యులతో కలిసి ఓపియస్ అంటే ఓ.పన్నీర్ సెల్వంను పార్టీ నుంచి బహిష్కరించాడు. పార్టీ ప్రాథమిక సభ్యత్వం కూడా రద్దు చేశారు. ఇప్పుడు అన్నాడిఎంకే చాలా బలహీనమైన పార్టీ. బీజేపీ మిత్రపక్షమైనప్పటికీ తమిళనాడులో తన బలం పెంచుకోడానికి ప్రయత్నిస్తోంది. తమిళనాడులో బీజేపీ కన్నా పెద్ద పార్టీగా ఉన్న అన్నాడిఎంకే ఆ స్థాయిని నిలబెట్టుకోవడం ఇప్పుడు కష్టం. బీజేపీ కన్నా బలహీనమైన పార్టీగా మారే అవకాశాలున్నాయి. అవసరమైతే మిత్రపక్షాలను బలిపెట్టయినా బలం పెంచుకోడానికి బీజేపీ ప్రయత్నిస్తుంది. తమిళనాడులో ఇప్పుడు అన్నాడిఎంకే బీజేపీల మధ్య సంబంధాలు దెబ్బతినే సూచనలున్నాయి. కాని అన్నాడిఎంకే ఏమీ చేయలేని నిస్సహాయస్థితికి చేరుకుంది.

ఇది ఒక్క తమిళనాడు పరిస్థితి మాత్రమే కాదు. బీజేపీ మిత్రపక్షాలతో కలిసి పనిచేస్తున్న అన్ని రాష్ట్రాల్లోను ఏదో ఒక రూపంలో ఈ పరిస్థితి మనకు కనబడుతుంది. ఆయా రాష్ట్రాల్లో విస్తరించడానికి బీజేపీ మిత్రపక్షాలను బలిపెట్టడానికి క్షణం సంకోచించదని అనేకసార్లు రుజువయ్యింది. మహారాష్ట్రలో జరిగింది ఇదే. శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రేపై శివసేన నాయకుడు ఏక్ నాథ్ షిండే తిరుగుబాటు వెనుక వెన్నుదన్ను బీజేపీదే అని వేరే చెప్పనవసరం లేదు. శివసేన బీజేపికి ఒకప్పటి మిత్రపక్షమే. బీహారులో నితీష్ కుమార్ పార్టీతో బీజేపీకి పొత్తు ఉంది. కాని అక్కడ కూడా నితీష్ కుమార్ కు, బీజేపీకి మధ్య పడడం లేదు. ఇదేమీ రహస్యం కూడా కాదు. పొరపొచ్చలు బాహాటంగానే బయటపడుతున్నాయి. 1990లో బీజేపీకి నితీష్ కుమార్ కు మధ్య పొత్తు కుదిరింది. కాని ఇప్పుడు ఈ మైత్రిసంబంధంలో అనుమానాల మబ్బులు దట్టంగా కమ్ముకున్నాయి.

బీజేపీ రాజకీయాలు అనేక రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలను తల్లకిందులు చేస్తున్నాయి. ఇతర పార్టీలు, మిత్రపక్షాలు కూడా బీజేపీ రాజకీయాల పట్ల అనుమానపడే పరిస్థితి ప్రతి చోట కనిపిస్తోంది. మిత్రపక్షాలకు బీజేపీ మీద ఇప్పుడు నమ్మకం లేదు. బీజేపి సంకీర్ణ ధర్మాన్ని పాటించడం లేదని, మిత్రపక్షాలను బలహీనపరిచే ప్రయత్నాలు చేస్తుందనే అనుమానాలున్నాయి.

సంకీర్ణ రాజకీయాల్లో ఉన్న బలహీనతే ఇది. సాధారణంగా చిన్న చిన్న పార్టీలు తమ తాహతుకు మించిన గొంతెమ్మ కోరికలు కోరుతూ ఉంటాయి. రాజకీయ ఒత్తిడికి పాల్పడుతుంటాయి. ఇలా చేయడం సముచితమా కాదా అన్నది ఆలోచించవు. ఫలితంగా సంకీర్ణంలో పొరపొచ్చలు వస్తాయి. కూటమి కుప్పకూలుతుంది. కేంద్రంలో చాలా పెద్ద పార్టీగా ఉన్న పార్టీ కూడా ప్రత్యేక రాష్ట్రంలో చిన్నపార్టీగా ఉండే పరిస్థితి ఉంటుంది. కేంద్రంలో పెద్దపార్టీ, పాలకపక్షం అనే బలంతో రాష్ట్రంలో రాజకీయ ఒత్తిడి పెంచే ప్రయత్నాలు జరుగుతాయి. ఈ ప్రయత్నాలు రాష్ట్రంలో బలంగా ఉన్న మిత్రపక్షానికి మింగుడుపడవు. చివరకు మిత్రపక్షం చీలిపోయే పరిస్థితి వస్తే, బీజేపీ బలమైన పార్టీగా మారుతుంది.

బీజేపీ ఎన్నికల ప్రయోజనాలను ముఖ్యంగా దృష్టిలో ఉంచుకుని పొత్తులు కడుతుంది. అంతేతప్ప శాశ్వత మైత్రి సంబంధాలకు బీజేపీ ఎన్నడూ విలువ ఇవ్వలేదు. ఉత్తరప్రదేశ్ లో ఓం ప్రకాష్ రాజ్ భర్ ను పక్కన పెట్టి అప్నాదళ్ తో మైత్రి కొనసాగించింది. చివరకు ఉత్తరప్రదేశ్ లో అప్నాదళ్ 12 స్థానాలు గెలుచుకుంది. కాని ఈ చిన్న పార్టీ బీజేపీ కనుసన్నలను దాటి రాజకీయ నిర్ణయాలు తీసుకోవడం సాధ్యపడే పని కాదు. ఇదంతా కులసమీకరణాలను వాడుకునే రాజకీయం. కేవలం ఎన్నికల ప్రయోజనాల కోసం పొత్తులు కట్టడం. ఒకసారి కాలుమోపే అవకాశం లభిస్తే ఆ తర్వాత చిన్న పార్టీలను పక్కన పెట్టడం పెద్ద కష్టం కాదన్నది బీజేపీ వ్యూహం. దేశవ్యాప్తంగా ఉనికి ఉన్న కాంగ్రేసును దెబ్బతీయడానికి అనుసరించింది ఈ వ్యూహాన్నే. వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయపార్టీలతో పొత్తు పెట్టుకుని కాంగ్రేసును బలహీనపరిచింది. కాంగ్రేసు బలహీనపడిన తర్వాత ప్రాంతీయపార్టీని బలహీనపరచడం పెద్ద కష్టం కాలేదు. ఈ వ్యూహం గొప్ప ఫలితాలను కూడా ఇచ్చింది.

తమిళనాడులో ఏం జరిగిందో చూద్దాం. 2016లో బీజేపీ మొత్తం 232 స్థానాల్లో పోటీ చేసింది. ఒక్క స్థానంలో కూడా గెలవలేదు. అన్నాడిఎంకే 136 స్థానాలు గెలుచుకుంది. 2021లో బీజేపీ వ్యూహం మారింది. ఈ సారి అన్నాడిఎంకేతో పొత్తు పెట్టుకుంది. ఎన్డీయే కూటమిలో అన్నాడిఎంకే చేరింది. ఈ సారి అన్నాడిఎంకే 65 స్థానాలు గెలిస్తే బీజేపీకి 4 స్థానాలు లభించాయి. అన్నాడిఎంకేకు ఈ పొత్తు వల్ల కలిగిన లాభం ఏదీ లేదు. ప్రధాన ప్రతిపక్షం హోదా దొరికింది అంతే. కాని బీజేపీకి చాలా లాభం కలిగింది. తమిళనాడులో బీజేపీకి కాలుమోపే స్థలం లభించింది. గత నెలలో జరిగిన సంఘటనలు కూడా మనం గమనించాలి. అన్నాడిఎంకేను బీజేపీ తీవ్రంగా విమర్శిస్తూ బీజేపీ ఉత్తమ ప్రతిపక్షం అని తనకు తానే ఒక బిరుదు ఇచ్చుకుంది. రాష్ట్రంలోని 65 మంది అన్నడిఎంకే శాసనసభ్యుల కన్నా బీజేపీకి ఉన్న నలుగురు శాసనసభ్యులు చాలా గొప్పగా పనిచేస్తున్నారని బీజేపీ నాయకుడు గర్వంగా చెప్పుకున్నాడు. అన్నాడిఎంకే మరోవైపు బీజేపీపై విమర్శలు సంధిస్తోంది. కావేరీ జలవివాదంలో తమిళనాడుకు మోసం చేశారని అన్నాడిఎంకే నేత సి.పొన్నయాన్అన్నాడు. కాని ఆయన వ్యాఖ్యలకు పార్టీకి సంబంధం లేదని అన్నాడిఎంకే అధినేతలు ప్రకటించారు. గుడి రాజకీయాలు లేనిదే బీజేపీ రాజకీయాలు ఉండవు. రాష్ట్రంలో గుడులకు ప్రభుత్వ నియంత్రణ నుంచి స్వేచ్ఛ కల్పించాలని బీజేపీ కొత్త ఉద్యమం ప్రారంభించి పాలకపక్షాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేసింది. చివరకు బీజేపీ రాష్ట్ర అధినేత కె.అన్నామలై మనసులో మాటలు చెప్పేశాడు. తమిళనాడులో మరో ఏక్ నాథ్ షిండే పుడతాడని చెప్పేశాడు. అంటే మహారాష్ట్రంలో శివసేనను చీల్చింది బీజేపీయే, అలాగే తమిళనాడులో కూడా డిఎంకేను చీలుస్తామని కుండబద్దలు కొట్టేశాడు. బీజేపీ అసలు వ్యూహం తమిళనాడులో అన్నాడిఎంకేను పూర్తిగా ధ్వంసం చేసి ప్రధానప్రతిపక్షం హోదా ఆక్రమించుకోవడమే అని మరికొందరు విశ్లేషిస్తున్నారు.

రాజకీయనాయకుడిగా అవతారం దాల్చిన ఐపియస్ అధికారి అన్నామలై తమిళనాడులో బీజేపీ రాజకీయాలను, హిందూత్వ రాజకీయాలను ఉధృతంగా నడిపిస్తున్నాడు. మరోవైపు డిఎంకే ప్రాంతీయపార్టీగా బలమైన పునాదులు కలిగి ఉంది. చీలికలు పేలికలవుతున్న అన్నాడిఎంకే ఇప్పుడు ఉనికి నిలబెట్టుకునే ప్రయత్నాల్లో ఉంది. కాస్త గమనిస్తే 2019 తర్వాతి నుంచి ఇప్పటి వరకు బీజేపీ 19 మిత్రపక్షాలను దూరం చేసుకుంది.

మహారాష్ట్ర రాజకీయాలను గమనిస్తే బీజేపీ రాజకీయాల మరో స్వరూపం మన ముందుకు వస్తుంది. మహారాష్ట్రలో మహావికాస్ అగాడి ప్రభుత్వం అధికారంలో ఉంది. కాని శివసేనలో ఏక్ నాథ్ షిండే తిరుగుబాటు చేసేలా ప్రోత్సహించింది బీజేపీ. 1989 తర్వాతి నుంచి బీజేపీ శివసేనల మధ్య బలమైన స్నేహం ఉంది. 1990లో మొదటిసారి శివసేన, బీజేపీ కలిసి మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేశాయి. శివసేన 52 స్థానాలు గెలుచుకుంది. బీజేపీ 42 స్థానాలు గెలుచుకుంది. కాని కాలక్రమేణా బీజేపీ బలపడింది. శివసేన బలహీనమయ్యింది. చివరకు రెండు పార్టీల మధ్య దూరం పెరిగింది.

ఇక బీహారు విషయానికి వస్తే నితీష్ కుమార్ పార్టీ జనతాదళ్ యునైటెడ్ తో బీజేపీకి రెండు దశాబ్ధాల స్నేహం ఉంది. 2020 ఎన్నికల్లో నితీష్ కుమార్ పార్టీ బలహీనపడింది. బీజేపీ బలం బాగా పెంచుకుంది. అయినా నితీష్ కుమార్ ను ముఖ్యమంత్రి చేయక తప్పలేదు. రెండు పార్టీల మధ్య భేదాభిప్రాయాలు చాలా ఉన్నాయి. నితీష్ కుమార్ పలుకుబడిని, రాజకీయ బలాన్ని తగ్గించడానికి బీజేపీ తన ప్రయత్నాలు చేస్తోంది. బీజేపీ ప్రయత్నాలు ఎదుర్కోడానికి నితీష్ బిజి బిజిగా ఉన్నాడు.

అస్సాంలో బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్ బీజేపీతో స్నేహం చేసి మోసపోయింది. అస్సాం గణసంగ్రామ పరిషద్ ఇప్పుడు నామమాత్రంగా మిగిలింది. మణిపూర్ లో 2017లో చిన్న చిన్న పార్టీల మధ్దతు కూడగట్టుకుని అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఈ చిన్న చిన్న పార్టీలన్నీ రాజకీయంగా దెబ్బతిన్నాయి. 2022లో బీజేపీ స్వంతంగా మెజారిటీ సాధించింది.

ఆంధ్రప్రదేశ్ లో కూడా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంది. కాని 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తెగతెంపులు చేసుకుంది. కాని అప్పటికే పొత్తు వల్ల ఆంధ్రప్రదేశ్ లో కాలుమోపిన బీజేపీ నెమ్మదిగా విస్తరించడం ప్రారంభమయ్యింది. తెలుగుదేశం రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి మారిపోయారు.

మిత్రపక్షాలకు షాకులిస్తూ ఆయా రాష్ట్రాల్లో బలపడడం అధికారం చేజిక్కించుకోవడం మాత్రమే కాదు, బీజేపీ రాజకీయాలను గమనిస్తే పాలకపక్షాన్ని చీల్చి ప్రభుత్వాలను పడగొట్టడం కూడా అందులో భాగంగా కనిపిస్తుంది. కర్నాటకలో కాంగ్రెసు కూటమి ప్రభుత్వాన్ని బీజేపీ కూల్చింది. రాజస్థాన్ లో కాంగ్రెసు ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం విఫలమయ్యింది. మధ్యప్రదేశ్ లో ప్రభుత్వాన్ని కూల్చడంలో సఫలమయ్యింది.

వీటన్నింటిలోను ఒడిశా ఉదాహరణ గమనించదగింది. 1998 నుంచి నవీన్ పట్నాయక్ నాయకత్వంలోని బిజు జనతాదళ్ ఎన్డీయేలో భాగంగా ఉంది. ఈ పొత్తు 2009 వరకు కొనసాగింది. 2009 ఎన్నికల్లో రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేశాయి. బిజు జనతాదళ్ 109 స్థానాలు గెలచుకుంటే బీజేపీకి కేవలం ఆరు స్థానాలు లభించాయి. అప్పటి నుంచి నవీన్ పట్నాయక్ రాష్ట్రంలో తన పార్టీ పలుకుబడి దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చాడు. అయినా 2019 ఎన్నికల్లో బిజు జనతాదళ్ కు 112 స్థానాలు లభిస్తే, బీజేపీకి 23 లభించాయి. ఈ లెక్కలు కాస్త వెనక్కు వెళితే ఇంకా బాగా అర్థమవుతాయి. 2000లో బిజు జనతాదళ్, బీజేపీ కలిసి పోటీ చేసినప్పుడు బిజు జనతాదళ్ కు 68 స్థానాలు, బీజేపీకి 38 స్థానాలు లభించాయి. 2004లోను రెండు పార్టీలు కలిసి పోటీ చేశాయి. అప్పుడు బిజు జనతాదళ్ కు 61స్థానాలు, బీజేపీకి 32 స్థానాలు లభించాయి. ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేసినప్పుడు బీజేపీ లాభపడింది. తెగతెంపుల తర్వాత బీజేపీ గ్రాఫ్ పడిపోయింది. చాలా రాష్ట్రాల్లో జరిగింది ఇదే. పొత్తుల వల్ల బీజేపీ లాభపడింది. నెమ్మదిగా ఆయా రాష్ట్రాల్లో బలాన్ని పెంచుకుంది.

ఏది ఏమైనా ఈ రాజకీయ సమీకరణాల్లోనే బీజేపీ పెద్దల సమయమంతా గడిచిపోతోంది. ఎన్నికల ప్రచారాలు, ప్రభుత్వాలను పడగొట్టే వ్యూహాలు, పార్టీలను చీల్చే ప్రయత్నాలు, మిత్రపక్షాలను బలహీనపరిచే తతంగాలు ఇందులోనే పార్టీ పెద్దలు నిమగ్నమై ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రూపాయి మారకం విలువ పడిపోవడం, నిరుద్యోగం పెరగడం, ధరలు పెరగడం, పేదరికం వంటి సమస్యలను పట్టించుకునేది ఎవరు?