September 17, 2024

గాజాలో ఇస్రాయీల్ ఆపరేషను బహుశా పూర్తయిపోయిందన్న సంకేతాలు అందుతున్నాయి. గాజాలో నెతన్యాహు దురాక్రమించుకోవాలనుకున్న భూభాగాన్ని ఆక్రమించుకున్నాడు. ఎంత నరమేధం చేయాలో అంత నరమేధం జరిపేశాడు. ఇటీవల జరగిన సంఘటనలనే చూద్దాం.  

ఇజ్రాయెల్ దళాలు గాజా లోకి చొచ్చుకుపోయాయి. అమెరికా ఇచ్చిన ఆయుధబలం, అండదండలు పుష్కలంగా ఉన్న ఇస్రాయీల్ దళాలు అక్కడ చొచ్చుకుపోవడంలో ఆశ్చర్యము లేదు.. ఈ దాడుల్లో పాలస్తీనీయుల మరణాల సంఖ్య గణనీయంగా పెరిగింది. పాలస్తీనా మరణాల సంఖ్య తాజా అంచనాల ప్రకారం 10,000 దాటింది. U.S. సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్‌ మానవీయ కాల్పుల విరమణకు ఇచ్చిన పిలుపును  ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు తిరస్కరించారు. ఐక్యరాజ్యసమితి ప్రతినిధులకు ఇస్రాయీల్ వీసాలు కూడా నిరాకరించింది. అస్సలు గాజాలో మానవసంక్షోభం ఏదీ లేదని నెతన్యాహు ప్రకటించేశాడు.  హమాస్ బంధీలను విడుదల చేయకపోతే సైనిక కార్యకలాపాలలో విరామం ఇచ్చేది లేదన్నాడు. హమాస్ అయితే బంధీలను విడుదల చేయలేదు. చనిపోయిన 10వేల మందిలో చిన్నపిల్లలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. పాశ్చాత్య చానళ్ళతో సహా ఇక్కడి చానళ్ళు కూడా హమాస్ బాలబ్రిగేడు ఉందని, వాళ్ళే చనిపోయారన్నట్లు ప్రచారం మొదలెట్టాయి. ఏది ఏమైనా ఇస్రాయీల్ సైనికచర్యతో చంపింది పిల్లలను, ఆసుపత్రుల్లోని రోగులను, మహిళలను, వృద్ధులనే, సాధారణ ప్రజలనే అన్నది ఇప్పుడు యావత్తు ప్రపంచం కాదనలేని సత్యం. హమాస్ ఇస్రాయీల్ పై దాడి చేసింది. ఇస్రాయీల్ దాడిలో చనిపోయింది పాలస్తీనా సాధారణ ప్రజలు. హమాస్ కు ఎంత నష్టం వాటిల్లిందో చెప్పగలిగిన పరిస్థితి ఎక్కడా కనబడడం లేదు. ఇజ్రాయెల్ గాజాపై ముఖ్యంగా గాజా నగరం చుట్టూ వైమానిక దాడులు నిరంతరం చేసింది.. నవంబర్ 3, 2023న తేదీన  గాజా నగరంపై  కొనసాగుతున్న వైమానిక బాంబు దాడుల కారణంగా ఇజ్రాయెల్‌లో పనిచేస్తున్న సుమారు 3,000 మంది పాలస్తీనియన్ల జీవనోపాధి దెబ్బతిన్నది. నవంబర్ 4న  గాజా నగరానికి సమీపంలోని జబాలియా శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు వరుసగా రెండో రోజు కూడా జరిగాయి. ఈ శిబిరం గాజాలో అతిపెద్ద శరణార్థుల శిబిరం. అంతకుముందు రోజు, మంగళవారం నాడు జరిగిన వైమానిక దాడిలో కనీసం 50 మంది పాలస్తీనియన్లు మరణించారు, 150 మందికి పైగా గాయపడ్డారు. గాజాలో తీవ్రమైన మనావీయ సంక్షోభం నెలకొంది. ఈ శిబిరంలోని ఉగ్రవాద కమాండర్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశామని పేర్కొంది. పాలస్తీనా సాధారణ ప్రజలు మరణించారని హమాస్ పేర్కొంది. దాడి తర్వాత సహాయ సిబ్బంది శిథిలాల నుంచి బాధితులను, మృతదేహాలను వెలికి తీస్తున్న భయంకర దృశ్యాలు ప్రపంచం చూసింది. జబాలియా శరణార్థి శిబిరంపై భారీ వైమానిక దాడులు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధలో తలెత్తిన తీవ్రమైన మానవీయ సంక్షోభాన్ని చాటి చెబుతున్నాయి. ఈ దాడులపై అంతర్జాతీయంగా కూడా ప్రతిస్పందన వినిపించింది.  గాజాలోని షాతీ శరణార్థుల శిబిరం (దీనిని బీచ్ క్యాంప్ అని కూడా పిలుస్తారు) పై జరిగిన దాడిలో 500 మంది పాలస్తీనియన్లు మరణించారు.  దాదాపు 2,700 మంది గాయపడ్డారు. ఈ దాడులు పాలస్తీనా సాధారణ ప్రజలపై జరుగుతున్న అమానుష దాడులకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. కాగా ఇస్రాయీల్ ఈ దాడులను సమర్థించుకోడానికి హమాస్ పౌరులను మానవ కవచాలుగా వాడుతుందన్న వాదన వినిపిస్తోంది. హమాస్ జనసాంద్రత ఉన్న ప్రాంతాల్లో సైనికసామాగ్రి, ఆయుధాలు దాచిపెడుతుందని, ఆ విధంగా మహిళలు,  పిల్లలతో సహా పౌరులను మానవ కవచాలుగా ఉపయోగిస్తుందని ఇజ్రాయెల్ ఆరోపించింది. ఈ ఆరోపణల ద్వారా సాధారణ ప్రజలను చంపడాన్ని సమర్థించుకుంటూ వస్తోంది. హమాస్ పౌరులను మానవ కవచాలుగా ఉపయోగిస్తుందనే వాదనపై అనేక సందేహాలు వినిపిస్తున్నాయి. అనేక విమర్శలు వస్తున్నాయి. ఇజ్రాయెల్ వాదనలో ప్రధానమైన  లోపాలేమిటంటే,  ఇస్రాయీల్ చెబుతున్నట్లు హమాస్ పౌరులను మానవకవచాలుగా ఉపయోగిస్తున్నట్లు ఆధారాలు లేవు. యుద్ధప్రాంతంలో పరిశీలకులు ప్రవేశించే అనుమతులు లేవు. కాబట్టి ఈ వాదనను ధృవీకరించడం సాధ్యం కాదు. ఈ ధృవీకరణ లేకుండా ఇస్రాయీల్ చెబుతున్న మాటలను నమ్మలేం. రెండవ కారణం, ఇస్రాయీల్ అత్యధిక బలప్రయోగానికి పూనుకుంటోంది.  హమాస్ పౌరులను మానవ కవచాలుగా ఉపయోగిస్తుందా లేదా అన్నది పక్కన పెట్టినా, ఇజ్రాయెల్ బలప్రయోగం అత్యధిక స్థాయిలో ఉంది. ఇలాంటి సైనికచర్యల్లో సాధారణ పౌరులు అత్యధికంగా మరణిస్తారని నిపుణులు వాదిస్తున్నారు. అంతర్జాతీయ చట్టం సైనికచర్యల్లో బలప్రయోగం పరిమితికి మించడం కుదరదు. కాని ఇస్రాయీల్ గాజాలో చేస్తున్నది అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే అంటున్నారు పరిశీలకులు. అంతర్జాతీయ మానవతా చట్టం ప్రకారం యుద్ధం చేస్తున్న సైనికులు, సాధారణ పౌరుల మధ్య తేడాను సైనికదళాలు గుర్తించాలి. ఇజ్రాయెల్ ఈ సూత్రాన్ని పాటించడంలో విఫలమైందని, ఫలితంగా పౌరులు మరణించారని విమర్శకులు పేర్కొన్నారు.  పౌరమరణాల సంఖ్య ఎక్కువగా ఉండటం,  ఇస్రాయీల్ వైఫల్యాన్ని, అంతర్జాతీయ చట్టాల పట్ల నిర్లక్ష్యాన్ని సూచిస్తుంది. పౌర ప్రాణనష్టాలకు జవాబుదారీతనం లేకపోవడం కూడా ఈ యుద్దంలో కనబడుతుంది. ఈ జవాబుదారీతనం లేకపోవడం వల్ల ఇజ్రాయెల్ వాదనలకు  చట్టబద్ధత లేదని, ఇస్రాయీల్ వాదనలో డొల్లతనాన్ని ఇవి సూచిస్తున్నాయని చాలా మంది వాదిస్తున్నారు. కాగా మరోవైపు ఇజ్రాయెల్ భూ బలగాలు ఉత్తర గాజాలో కార్యకలాపాలను కొనసాగించాయి. నవంబర్ 3న  వైద్యసహాయ బృందంపై జరిగిన దాడిలో కనీసం 15 మంది పాలస్తీనియన్లు మరణించారు. UN సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ఈ సంఘటనను తీవ్రంగా ఖండించారు. నవంబర్ 3న  పాఠశాలలపై, ఆసుపత్రులపై  జరిగిన  వైమానిక దాడుల్లో  కనీసం 35 మంది మరణించారు. ఇస్రాయీల్ దాడుల్లో సాధారణ పౌరులు ఎలా లక్ష్యమవుతున్నారో ఈ దాడులు చెబుతున్నాయి. కనీసం ఆరోగ్యవైద్య బృందాలను కూడా వదలకుండా దాడులు చేయడం జరుగుతోంది. మరోవైపు US విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ టెల్ అవీవ్‌ మూడవసారి పర్యటించారు. నవంబర్ 3న  ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుతో సమావేశమయ్యారు. జోర్డాన్‌లో అరబ్ నాయకులతో బ్లింకెన్ కాల్పుల విరమణ గురించి చర్చించబోతున్నారు. నవంబర్ 3న  హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా పాలస్తీనా గురించి మాట్లాడారు. US ప్రమేయాన్ని విమర్శించారు. యుద్ధం ప్రారంభమైన తర్వాత ఆయన చేసిన తన మొదటి ప్రసంగంలో అక్టోబర్ 7న జరిగిన హమాస్ దాడిని ప్రశంసించారు. హిజ్బుల్లా వైఖరి ఈ ప్రాంతంలో మరింత జటిలసమస్యలకు దారితీస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇంకోవైపు ఇజ్రాయెల్ దళాలు వెస్ట్ బ్యాంక్ పై దాడులు ప్రారంభించింది. కనీసం 41 మంది పాలస్తీనియన్లను అదుపులోకి తీసుకున్నారు. నబ్లస్, జెనిన్, హెబ్రాన్,  బెత్లెహెం వంటి పట్టణాలలో  143 మంది కంటే ఎక్కువ మంది పాలస్తీనీయులు మరణించారు. ఏది ఏమైనా ఇప్పుడు పాలస్తీనా తీవ్రమైన మానవ సంక్షోభాన్ని ఎదుర్కుంటుందన్నది ఎవ్వరు కాదనలేని వాస్తవం.
అక్టోబర్ 7వ తేదీన జరిగిన హామాస్ దాడి తర్వాత అనేకమంది ఇస్రాయీల్ పౌరుల్ని హమాస్ బంధీలుగా చేసిందనే వార్త వచ్చింది. ఇంతమంది ఇస్రాయీల్ పౌరులు హమాస్ వద్ద బంధీలుగా ఉంటే ఇస్రాయీల్ సైన్యం గాజాలో ప్రవేశించి బంధీల ప్రాణాలకు ముప్పు తెస్తుందా? అనే ప్రశ్న వచ్చింది. కాని ఇస్రాయీల్ గాజాపై దాడి చేసింది. పిల్లలు, మహిళలను, వృద్ధులు రోగుల్ని చంపింది. చివరకు ఐక్యరాజ్యసమితికి చెందిన వారు కూడా చనిపోయారు.
అమెరికా ఇస్రాయీల్ కు మద్దతిస్తుందని చాలా మంది భావిస్తారు. కాని తాజా సంఘటనల తర్వాత అర్థమవుతున్నదేమిటంటే, నెతన్యాహు ఆదేశిస్తే జో బైడెన్ పాటిస్తారని స్పష్టమయ్యింది. ఇప్పుడు అమెరికాలో దౌత్యవేత్తలు కొందరు అమెరికా ప్రభుత్వ వైఖరిపై అసమ్మతి ప్రకటిస్తూ లేఖ రాశారని తెలుస్తోంది. ఇప్పుడు నెతన్యాహు గాజాలో సగం ప్రాంతాన్ని ఆక్రమించుకునే ప్లాను సిద్ధం చేసుకున్నాడు. నెతన్యాహు ఇటీవల చేసిన ప్రకటన ఏమిటంటే గాజా రక్షణ బాధ్యత అనిశ్చిత కాలం వరకు ఇస్రాయీల్ తీసుకుంటుందన్నాడు. రక్షణ బాధ్యత అంటే ఇక్కడ మనం గాజాలోని పాలస్తీనా ప్రజలపై దౌర్జన్యాలు చేసే హక్కుగా అర్థం చేసుకోవాలి. ఉత్తర గాజాపై బాంబుల వర్షం కురిపించి అక్కడి ప్రజలను దక్షిణ గాజావైపు నెట్టేసి ఇప్పుడు పూర్తి ఉత్తరగాజాను తన వశం చేసుకోవాలని భావిస్తున్నారు. ఇప్పుడు గాజాలోని 70 శాతం జనాభా నిరాశ్రయులయ్యారు. ఇప్పుడు ఉత్తరగాజాను తన గుప్పిట పెట్టుకోవాలని భావిస్తోంది. అంటే అక్కడ సెటిల్మెంట్ల నిర్మాణం మొదలెడతారు. ఇలాగే పాలస్తీనా భూభాగాలను ఇస్రాయీల్ కబళించిందన్నది చరిత్ర చదివితే అర్థం అవుతుంది.
గమనించవలసిందేమిటంటే, ఇంతకు ముందు కూడా గాజాపై ఇస్రాయీల్ దురాక్రమణ చేసింది. ఆ తర్వత ఒక ఒప్పందం వల్ల గాజా నుంచి ఇస్రాయీల్ వైదొలగవలసి వచ్చింది. ఇప్పుడు ఆ పని మళ్ళీ చేసింది. పాలస్తీనాలో జరుగుతూ వస్తున్నది ఇదే. పాలస్తీనాలోని మిలిటెంట్లు ఇస్రాయీల్ పై దాడి చేస్తారు. ఇస్రాయీల్ ప్రతిదాడి పేరుతో పాలస్తీనా సాధారణ ప్రజలపై దాడులు చేస్తుంది. ఈ క్రమంలో పాలస్తీనా భూభాగాలు కబళిస్తుంది. తర్వాత అమెరికా శాంతిచర్చలంటూ ముందుకు వస్తుంది. దురాక్రమించిన భూభాగాలను ఇస్రాయీల్ వదిలిపెట్టడం జరగదు. పాలస్తీనాలో మిలిటెన్సీ తగ్గుముఖం పట్టడం కూడా జరగదు. ఇప్పుడు పాలస్తీనా అధ్యక్షుడిపై దాడి జరిగింది. పాలస్తీనా ప్రజల్లో ఆయన పట్ల తీవ్రమైన ఆగ్రహం ఉంది. ఇక్కడ గమనించవలసిన మరో విషయమేమిటంటే పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ హమాస్ ను ఉగ్రవాద సంస్థగా చెబుతారు. ఇస్రాయీల్ సృష్టించిన మిలిటెన్సీగా చెబుతారు. నిజానికి భారతదేశం ఇంతవరకు హమాస్ ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించలేదు. కాని పాలస్తీనా అధ్యక్షుడు హమాస్ విషయంలో ఇలాంటి మాటలు చాలా సార్లు చెప్పారు.
ఇక్కడ గమనించవలసిన మరో విషయం ఏమిటంటే, అల్ అక్సా మస్జదుపై ఇస్రాయీల్ దళాలు దాడులు చేయడం హమాస్ దాడికి ముందు నుంచే జరుగుతోంది. ఇప్పుడు కూడా మళ్ళీ జరిగింది. అల్ అక్సా వెస్ట్ బ్యాంకులో ఉంది. గమనించవలసిన మరో విషయమేమిటంటే గాజాపై ఇస్రాయీల్ ఇంత భయంకరమైన దాడులు చేస్తున్నా హమాస్ ఎలాంటి ప్రతి దాడి చేసిన దాఖలా లేదు. అలాగే ఇస్రాయీల్ బంధీలను హమాస్ ఏం చేసిందన్న వివరాలేవీ రాలేదు. ఇస్రాయీల్ కూడా బంధీల విషయంలో భయపడుతున్న దాఖలా లేదు. హమాస్ ఏం చేస్తున్నట్లు? గాజాపై దాడి చేసే అవకాశాన్ని ఇస్రాయీల్ కు ఇచ్చి ఊరుకోవడడమే హమాస్ పనా? ఈ పరిస్థితులు హమాస్ పై అనుమానాలను పెంచుతున్నాయి. ఇస్రాయీల్ కోసం పనిచేస్తుందా? అనే ప్రశ్నలు బలంగా వినిపిస్తున్నాయి.  ఇప్పుడు హమాస్ బంధీల గురించి తమకేమీ తెలియదని చెబుతోంది. మరోవైపు హిజ్బుల్లా ఇస్రాయీల్ తో తలపడుతున్న వార్తలు వస్తున్నాయి. కాని హమాస్ నుంచి ఎలాంటి ప్రతిస్సందన లేదు. హమాస్ చేసిన దాడులకు సంబంధించిన వార్తలు ప్రపంచానికి తెలియడం లేదా? వార్తలు సెన్సార్ అవుతున్నాయా?
కాని ఒకటి వాస్తవం. ఇస్రాయీల్ ప్రధాని నెతన్యాహు కోరినట్లే అంతా జరిగింది. దేశంలో అవినీతి ఆరోపణలతో రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడిన నెతన్యాహు ఇప్పుడు గాజా భూమిని ఆక్రమించుకోవడం ద్వారా హీరో అయిపోయే అవకాశం దొరికింది. అమెరికా
దాదాపు 50వేల కోట్లకు పైగా విలువైన ఆయుధాలు ఈ క్రమంలో అమెరికా ఇస్రాయీల్ కు అమ్మింది.
ఏది ఏమైనా పాలస్తీనాలో ఇస్రాయీల్ దురాక్రమణల పరంపర కొనసాగుతూనే ఉంది. పాశ్చాత్యదేశాలు ఇస్రాయీల్ కు మద్దతివ్వడం కొనసాగుతూనే ఉంది. పాశ్చాత్యదేశాల్లో ఈ యుద్ధం తర్వాత తలెత్తిన ప్రజాభిప్రాయం కూడా కొంతకాలానికి చల్లారిపోతుంది. కాని అన్యాయాల దురాక్రమణల పర్వం ఎంత కాలం కొనసాగుతుందన్నది తెలియదు.

– వాహెద్