July 27, 2024

కేరళ ప్రభుత్వం,  ముఖ్యమంత్రి  పినరయి విజయన్‌ నేతృత్వంలో, రాష్ట్రంలో ఇస్లామిక్‌  సంస్కృతిని  హైలైట్‌ చేయడానికి ఒక ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. కేరళలో ఇస్లాం చరిత్ర చాలా పాతది.  రాష్ట్రంలో ఇస్లామీయ సాంస్కృతిక వికాసాన్ని ప్రదర్శించే ఒక  మైక్రోసైట్‌ తయారు చేయడానికి కేరళ టూరిజం 93.8 లక్షల రూపాయల మొత్తాన్ని కేటా యించింది. ఈ మైక్రోసైట్‌ పర్యాటకాన్ని ప్రోత్సహించే విస్తృత ప్రయత్నాల్లో భాగంగా ప్రారంభిస్తున్నారు. ఇది అంతర్జాతీయ, దేశీయ  పర్యాటకులను ఇది ఆకర్షిస్తుందని భావిస్తున్నారు.   కేరళలో 7వ శతాబ్దం నుంచి ఇస్లాం ఉనికిలో ఉంది. కేరళలో ఇస్లాం చరిత్రను ఈ మైక్రోసైట్‌లో ప్రదర్శిస్తారు.

ఇందులో ఆరు వేర్వేరు విభాగాలుగా ప్రదర్శిస్తున్నారు. ప్రతి ఒక్క విభాగం  ఇస్లామిక్‌  సంస్కృతిలోని  ప్రత్యేక  కోణాన్ని పరిచయం చేస్తుంది. కేరళ సామాజిక చట్రంలో ఇస్లాం ఎలా విడదీయరాని  భాగమయ్యిందో వివరిస్తుంది.  మొదటి విభాగంలో మలబార్‌ తీరం వెంబడి ప్రారంభ కాలం నాటి వ్యాపారులు,  వారి స్థావరాల వివరాలతో కేరళలో ఇస్లాం ప్రవేశించిన చరిత్రను ప్రదర్శిస్తారు. తిరువనంతపురంలోని బీమపల్లి నుండి కాసరగోడ్‌లోని చారిత్రాత్మక జుమా మసీదు వరకు కేరళ అంతటా విస్తరించి ఉన్న ఇస్లామీయ ధార్మిక క్షేత్రాల ఆకర్షణీయమైన కథనాన్ని ఇందులో ప్రస్తావిస్తారు.  వివిధ  పురాతన మసీదులు ప్రముఖంగా  ప్రదర్శించబడ తాయి. వీటిలో కొడంగల్లూర్‌లోని చేరమాన్‌ జుమా మసీదు, మలప్పురంలోని  జామా-అత్‌ మసీదు, కోజికోడ్‌లోని మిష్కాల్‌ మసీదు మొదలైనవి ఉన్నాయి. మైక్రోసైట్‌ కేరళలోని  ముస్లింల వంటకాల ప్రత్యేకతలను కూడా వివరిస్తుంది. ప్రత్యేకంగా  మాప్పిలా  వంటకాలను ముఖ్యంగా ప్రదర్శిస్తారు. పర్షియన్‌, యెమెన్‌, అరబ్‌ ప్రభావాలతో కూడిన సాంప్రదాయ కేరళ రుచుల  ప్రత్యేక సమ్మేళనం ఇది. జీవనశైలి విభాగంలో   ముస్లిముల వస్త్రధారణ వారి ఆచారాల గురించి వివరణాత్మక కథనాలు న్నాయి.  వివాహాలు, వివాహానికి  ముందు ఆచారాలు, వివాహానంతర వేడుకలు పర్యాటకలను ముఖ్యంగా ఆకర్షిస్తా యని భావిస్తున్నారు.  ఇంకా ఇస్లామిక్‌ వాస్తు కళకు సంబంధించిన విభాగంలో  కేరళలోని స్వదేశీ నిర్మాణ సాంకేతికతలతో  అరబిక్‌ నిర్మాణ సంప్రదాయాల సమ్మిళిత వాస్తుకళను ప్రదర్శిస్తారు, చివరి విభాగంలో కేరళలోని ముస్లిం సమాజానికి సంబంధించిన కళారూపాలు, పండుగ లను చూపిస్తారు.  16వ శతాబ్దంలో కేరళలో జన్మించిన  జానపద సంప్రదాయంపై మాప్పిలా పాటల ప్రభావంపై కూడా ప్రత్యేకమైన పరిశోధనాత్మక కథనాలు న్నాయి.  కేరళ ప్రభుత్వం  చేపట్టిన ఈ కార్యక్రమం కేరళ సంస్కృతిలో  గణనీయ  పాత్ర పోషించిన ఇస్లాం  మతానికి సంబంధించిన  సమస్త సమాచారాన్ని  ఒకే  వేదికపై  అందించే ప్రయత్నంగా భావించవచ్చు. ఇది పర్యాటకాన్ని ప్రోత్సహించడమే కాకుండా కేరళకు మత పండితులు, చరిత్రకారులు, విద్యార్థులు, యాత్రికులను ఆకర్షిస్తుంది. కేరళలో ఇస్లాం వారసత్వం గురించి  వారి  అవగాహనను సుసంపన్నం చేస్తుంది.