July 27, 2024

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో మతవిద్వేషాన్ని రెచ్చగొట్టే శక్తులపై మండిపడ్డారు. విద్వేషాల బాజారులో తాను ప్రేమాభిమానాల దుకాణం తెరుస్తున్నానని గర్వంగా చెప్పారు. రాహుల్ గాంధీ ప్రసంగాల్లో నిస్సందేహంగా ఆ పట్టుదల కనిపిస్తుంది. అంతెందుకు ఇప్పుడు వరల్డ్ కప్ క్రికెట్టులో అసాధారణ ప్రతిభ చూపించిన ముహమ్మద్ షమీ విషయంలో 2021లో పాకిస్తాన్ తో జరిగిన టి20 మ్యాచ్ లో భారతదేశం ఓడిపోయింది. అప్పుడు దేశంలోని మతతత్వ ఆన్ లైన్ ట్రోల్ మూకలు ముహమ్మద్ షమీ మతాన్ని తీసుకొచ్చి, అతన్ని ఓటమికి బాధ్యుడిగా చేసి ట్రోల్ చేస్తున్నప్పుడు రాహుల్ గాంధీ బలంగా ముహమ్మద్ షమీ పక్షాన నిలబడ్డారు.

రాహుల్ గాంధీ నిజాయితిగానే దేశంలో తన ప్రేమాభిమానాల దుకాణాన్ని తెరువాలనుకుంటున్నారు. వివిధ రాష్ట్రాల్లోని కాంగ్రెస్ నేతలకు ఈ పని ఇష్టముందా? కాంగ్రెసు అవకాశవాద రాజకీయాలు నడుపుతూ అవసరమైతే సాఫ్ట్ హిందుత్వ ప్రయోగిస్తూ నెట్టుకురావడానికి ప్రయత్నించడం లేదా? రాహుల్ గాంధీ నిజాయితీగానే ప్రయత్నాలు చేస్తుండవచ్చు, కాని ఆ ప్రయత్నాలను కాంగ్రెస్ నేతలు సఫలమయ్యేలా చేస్తారా? లేక అడ్డుకుంటారా? ఇటీవలి కొన్ని పరిణామాలను గమనిస్తే అనుమానాలు పెరుగుతున్నాయి.
కర్నాటకలో ఇప్పుడు కాంగ్రెసు ప్రభుత్వం ఉంది. కర్నాటక ఎగ్జామినేషన్ అధారిటీ ఇటీవల రిక్రూట్ మెంట్ పరీక్షల్లో అభ్యర్థులు పరీక్ష రాస్తున్నప్పుడు తలపై ఎలాంటి అచ్ఛాదన ధరించరాదని కొత్త నియమాన్ని తీసుకువచ్చింది. పరీక్ష హాలులో బ్లూటూత్, ఇయర్ ఫోన్లు వగైరా ఏవీ ధరించరాదని ఆంక్షలు పెట్టడంలో అర్థముంది. తలపై ఏదీ ధరించరాదన్న ఆంక్ష దేనికి? ఈ ఆంక్ష వల్ల ప్రభావితులయ్యేది ముఖ్యంగా ముస్లిం బాలికలే. బ్లూటూతులు వగైరా పరికరాలను కేవలం తలపై ధరించే ఆచ్ఛాదనలోనే దాచుకుని వస్తారా అభ్యర్థులు. అయినా పరీక్షకు ముందు చెకింగు జరుగుతుంది కదా? ఈ ఆంక్ష వెనుక ఉన్న మతలబేమిటి? ఈ వార్త మీడియాలో వచ్చిన తర్వాత కర్నాటక ప్రభుత్వం రిక్రూట్ మెంట్ పరీక్షల్లో హిజాబ్ పై బ్యాన్ ఏదీ లేదని ఒక వివరణ ఇచ్చింది. కాని ఇలాంటి నిర్ణయాలు ఎందుకు వస్తున్నాయన్నది ఆలోచించవలసిన ప్రశ్న. ఇంతకు ముందు కర్నాటకలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ విద్యాసంస్థల్లో ముస్లిం బాలికలు ధరించే హిజాబ్ ను నిషేధించింది. కాంగ్రెసు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హిజాబ్ బ్యాన్ పై ఇంతవరకు చేసిందేమీ లేదు.
మధ్యప్రదేశ్ విషయం చూద్దాం.
మధ్యప్రదేశ్ లోని చత్తార్ పూర్ లో ఉన్న అంగోర్ గ్రామంలో ఏడాది క్రితం ఒక దళిత యువకుడు తన పెళ్ళికి గుర్రంపై ఊరేగింపుగా వెళ్లాలనుకున్నాడు. కాని అక్కడి బ్రాహ్మలు, రాజపుత్రులు దానికి ఒప్పుకోలేదు. చివరకు పోలీసులు వచ్చారు. ఆ దళిత యువకుడు గుర్రంపై వెళ్ళాలనుకున్న కోరిక తీరలేదు. ఆ ఊరు మొత్తం ఉద్రిక్తత అలుముకుంది. ఇది మధ్యప్రదేశ్ పరిస్థితి. ఈ చత్తార్ పూర్ జిల్లాలోనే భాగేశ్వర్ థామ్ ఉంది. మధ్యప్రదశ్ లో అత్యంత వెనుకబడిన జిల్లా ఇది. ఇక్కడ కులవివక్షకు సంబంధించి ఇలాంటి సంఘటనలు ఎన్నెన్నో. ఇక్కడ భాగేశ్వర్ థామ్ కార్యకలాపాలు పెరిగిన తర్వాత కులవివక్ష మరింత పెరిగిందన్న ఆరోపణలున్నాయి. భాగేశ్వర్ థామ్ లో భాగేశ్వర్ బాబాగా పిలువబడే ధీరేంద్రశాస్త్రి విద్వేష ప్రసంగాలు బాహాటంగా చేస్తుంటాడు. సనాతన ధర్మాన్ని విశ్వసించని వాళ్ళు, రాముడి కోసం జరిగే పనిని అడ్డుకునేవాళ్ళు, హిందూరాష్ట్రను అడ్డుకునే వారి ఇండ్ళను బుల్ డోజర్లతో కూల్చేయాలని చెప్పాడు. భాగేశ్వర్ బాబాతో బీజేపీ నేతలు సన్నిహితంగా ఉండడం అర్థం చేసుకోవచ్చు. కాని బీజేపీ కన్నా ఇప్పుడు కాంగ్రెసు నేతలు ఈ బాబాకు ప్రణమిల్లుతున్నారు. నవంబర్ 17వ తేదీన మధ్యప్రదేశ్ లో ఎన్నికలు జరగబోతున్నాయి. కాంగ్రెసు ముఖ్యమంత్రిగా ప్రచారమవుతున్న కమల్ నాథ్ భాగేశ్వర్ బాబాను రాసుకుపూసుకు తిరుగుతున్నారు. ముస్లిములకే కాదు, దళిత, వెనుకబడిన సముదాయాలకు కూడా ఇది మింగుడు పడడం లేదు. మధ్యప్రదేశ్ లో కాంగ్రెసును కమల్ నాథ్ ముంచుతాడని చాలా మంది భావిస్తున్నారు. అంతెందుకు, దేశంలో విద్వేష వాతావరణానికి కారణమవుతున్న కొందరు యాంకర్లను ఇండియా కూటమి బహిష్కరిస్తూ ఒక ప్రకటన చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఆ యాంకర్లలో ఒక చానల్ యాంకర్ ను పిలిచి సగౌరవంగా తనతో పాటు కూర్చోబెట్టుకుని ఇంటర్వ్యు ఇచ్చిన నాయకుడు కమల్ నాథ్.
మధ్యప్రదేశ్ కాంగ్రెసు నాయకుడు కమల్ నాథ్ ఇప్పుడు చేస్తున్న పని సాధువులను రాసుకుపూసుకు తిరగడం, విగ్రహాలను నిర్మించడం వగైరా. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ సాఫ్ట్ హిందూత్వ లేకపోతే గెలవలేమనే స్థాయిలో ఉంది. రాహుల్ గాంధీ చెప్పే ముహబ్బత్ కా దుకాన్ ఇదేనా? కమల్ నాథ్ ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా బీజేపీ కోర్ ఓటు బ్యాంకు చెక్కుచెదిరేది కాదని, సాఫ్ట్ హిందూత్వ ప్రయోగాలు ఇంతకు ముందు కూడా కాంగ్రెసు పుట్టి ముంచాయని చాలా మంది విశ్లేషిస్తున్నారు. అయినా కాంగ్రెసు నేతలు అవకాశవాద రాజకీయాలు మానుకోవడం లేదు. కమల్ నాత్ సాఫ్ట్ హిందూత్వ రాజకీయాల వల్ల నిజానికి బీజేపీకే లాభమని కూడా చాలా మంది భావిస్తున్నారు. ముఖ్యంగా ఛత్తార్ పూర్ లో వెనుకబడిన వర్గాలు, బలహీన వర్గాల ప్రజలు కాంగ్రెసుకు దూరమయ్యే ప్రమాదం ఉంది. అలాగే ముస్లిములు కూడా దూరమయ్యే ప్రమాదం ఉంది.  నిజానికి ఛత్తార్ పూర్ లో వెనుకబడిన వర్గాలు ఇప్పటి వరకు బీజేపీ వెంటే ఉన్నాయి. కాని ఇటీవల బీజేపీ పట్ల విసుగు కూడా వారిలో కనిపిస్తుంది. కాని ఇప్పుడు కాంగ్రెసు కూడా అదే బాటన నడుస్తుంటే బీజేపీని వదిలి కాంగ్రెసు వైపునకు వచ్చే బదులు బీజేపీ వెంటే ఉండడం మంచిదని కూడా వాళ్ళు భావించవచ్చు. కమల్ నాథ్ హిందూత్వ రాజకీయాలు ఇప్పుడు కాంగ్రెసుకు ఉచ్చు బిగుస్తున్నాయి. భాగేశ్వర్ బాబాతో కాంగ్రెసు, బీజేపీలు ఎంతగా రాసుకుపూసుకు తిరుగుతున్నాయంటే, బీజేపీ ఛత్తార్ పూర్ జిల్లాలో కథా కార్యక్రమాలు అనేక చోట్ల నిర్వహించింది. కమల్ నాథ్ కూడా పోటీగా నిర్వహించాడు. చత్తార్ పూర్ లో బాబా ను సందర్శించాడు.
దళిత వర్గాల్లోను, ముస్లిముల్లోను భాగేశ్వర్ బాబా ప్రసంగాలు వ్యాఖ్యల పట్ల ఆగ్రహం ఉంది. ఒక దళిత యువకుడు తన పెళ్ళికి గుర్రంపై ఎక్కే పరిస్థితులు కూడా లేని సమాజాన్ని దళితులు వ్యతిరేకిస్తున్నారు. అలాగే వెనుకబడిన వర్గాలు కూడా ఈ సారి కేవలం వెనుకబడిన వర్గాల అభ్యర్థులకే ఓటు వేయాలని భావిస్తున్నాయి. కాంగ్రెసు కులజనగణన గురించి మాట్లాడుతుంది. కాని మధ్యప్రదేశ్ లో కాంగ్రెసు నేతల వైఖరి చూస్తే కులజనగణనపై కాంగ్రెసును నమ్మలేమన్న భావన వెనుకబడిన వర్గాల్లో పెరుగుతోంది. మధ్యప్రదేశ్ లో మొత్తం 230 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇందులో కేవలం 62 స్థానాల్లో మాత్రమే వెనుకబడిన వర్గాలను కాంగ్రెసు నిలబెట్టింది. బీజేపీ 71 మందికి టిక్కెట్లు ఇచ్చింది. కేవలం వెనుకబడిన వర్గాల అభ్యర్థికి మాత్రమే ఓటు వేయాలన్న ధృఢమైన సంకల్పం ఈ సారి వెనుకబడిన వర్గాల్లో కనిపిస్తోంది. మధ్యప్రదేశ్ లో ముస్లిముల శాతం చాలా తక్కువ. కేవలం 6 శాతం ఓట్లు మాత్రమే ఉన్నాయి.
కమల్ నాథ్ వైఖరి మరికాస్త లోతుగా చూడడం అవసరం. నవభారత్ టైమ్స్ అనే టీవీ చానల్ లో ఒక కార్యక్రమం వచ్చింది. గర్బా అనే హిందూ పండుగ కార్యక్రమంలో ముస్లిములు పాల్గొని అక్కడ లవ్ జిహాద్ చేస్తున్నారన్నట్లు మతవిద్వేషాన్ని రెచ్చగొట్టే ఈ కార్యక్రమానికి యాంకర్ నావికా కుమార్.  ఈ కార్యక్రమం విషయంలో NBDSA అంటే News Broadcasting & Digital Standards Authority తీవ్రమైన ఆక్షేపణ తెలియజేసింది. ఈ కార్యక్రమంలో మతవిద్వేషాలను వ్యాపింపజేసే ప్రయత్నాలు చేసినందుకు టైమ్స్ నౌ నవభారత్ చానల్ వెంటనే ఈ కార్యక్రమాన్ని తొలగించాలని కూడా ఆదేశించింది. ఈ కార్యక్రమం యాంకర్ ఇంతకు ముందు చెప్పుకున్నట్లు నావికా కుమార్. ఇండియా కూటమి నిషేధించిన యాంకర్ల జాబితాలో ఈ పేరు కూడా కనిపిస్తుంది. ఈ యాంకర్ల ఏ కార్యక్రమంలోనూ ఇండియా కూటమి నేతలు, ప్రతినిధులు పాల్గొనడం జరగదని ప్రకటించారు. ఈ కూటమిలో పెద్దన్న కాంగ్రెసు. ఇప్పుడు మధ్యప్రదేశ్ లో కాంగ్రెసు ముఖ్యమంత్రిగా ముందుకు వచ్చిన కమల్ నాథ్ స్వయంగా ఈ నావికాకుమార్ ను పిలిచి ఇంటర్వ్యు ఇచ్చాడు. హెలికాప్టరులో తన పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడాడు. ఈ ఇంటర్వ్యు వచ్చింది. ఇండియా కూటమి నిర్ణయాలకు కాంగ్రెసు పెద్దలు కట్టుబడరాదని అనుకున్నప్పుడు ఆ కూటమిలో ఎందుకు ఉన్నట్లు? అందుకే ఉమర్ అబ్దుల్లా కుండబద్దలు కొట్టినట్లు కాంగ్రెసు నాటకం ఇప్పుడే బయటపడడం మంచిదయ్యిందన్నాడు.
కాంగ్రెసులో రాష్ట్రాల్లో ఉన్న పెద్ద పెద్ద నాయకులు అధిష్ఠానం కంట్రోలు లేరన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఇదే నిజమైతే రాహుల్ గాంధీ నాయకత్వమే ప్రశ్నార్థకమవుతుంది. ఇండియా కూటమిని బలహీనపరచడంలో కాంగ్రెసు హస్తం కనిపిస్తోంది. గత ఎన్నికల్లో సమాజవాది పార్టీకి మధ్యప్రదేశ్ లో సీట్లు ఇచ్చారు. సమాజవాదిపార్టీ అప్పుడు తన అభ్యర్థులను నిలబెట్టింది. ఈ సారి సమాజవాది పార్టీకి సీట్లు ఇవ్వలేదు. ఈ విషయమై కమలనాథ్ ను అడిగినప్పుడు, అఖిలేష్ విషయంలో చాలా అమర్యాదగా ప్రతిస్పందించారు. ఒక మాజీ ముఖ్యమంత్రి గురించి, ఇండియా కూటమిలోని ఒక ముఖ్యమైన పార్టీ అధినేత గురించి అమర్యాదగా కాంగ్రెసు నాయకుడు మాట్లాడితే ఇండియా కూటమిలో కాంగ్రెసు ఎలాంటి పాత్ర పోషిస్తున్నట్లు. అఖిలేష్ యాదవ్ దీనిపై మండిపడ్డారు. కాంగ్రెసులోని చిల్లర నాయకులు చేసే వ్యాఖ్యలను కాంగ్రెసు అదుపు చేయడం మంచిదని జవాబిచ్చారు. అంతేకాదు, కాంగ్రెసు ఇప్పుడే అసలు రంగు చూపించడం మంచిదయ్యిందన్నాడు. ఉత్తరప్రదేశ్ లో కూడా కాంగ్రెసు, సమాజవాది పార్టీల మధ్య సయోథ్య లేదు. దాడులు ప్రతిదాడులు జరుగుతున్నాయి. మధ్యప్రదేశ్ లోను, ఉత్తర ప్రదేశ్ లోను కాంగ్రెసు నాయకులు ఇప్పుడు ఇండియా కూటమికి తూట్లు పొడిచే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు. బీహారు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి తనకు చేతనైన ప్రయత్నాలు చేస్తున్నారు.
మధ్యప్రదేశ్ లో కమల్ నాథ్, దిగ్విజయ్ సింగ్ వంటి నేతలు తమను తాము ఫ్యూడల్ ప్రభువులనుకుంటారు. రాష్ట్రం తమ స్వంత సామ్రాజ్యం అనుకుంటారు. ఇటీవల దిగ్విజయ సింగ్ ఒక వ్యాఖ్య చేశాడు. బీజేపీ నాయకులు మస్జిదులకు వెళ్ళే ప్రయత్నాలు కూడా చేస్తుంటారని అన్నాడు. బీజేపీ నేతలు మందిరాలకు వెళితే ఏమిటి? మస్జిదులకు వెళితే ఏమిటి? వాళ్ళ ప్రచారం వాళ్ళు చేసుకుంటారు. ప్రధాని మోడీ, ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్ ఇప్పుడు ముస్లిముల గురించి మాట్లాడుతున్నారని కూడా దిగ్విజయ సింగ్ అన్నాడు. ఇక్కడ ఆలోచించవలసిన ప్రశ్న ఏమిటంటే, మధ్యప్రదేశ్ లో కాంగ్రెసు ప్రజాసమస్యలపై ఎన్నికల్లో పోరాడుతుందని చెప్పుకున్నారు. కొంతివరకు కమల్ నాథ్ ప్రచారంలో కూడా ప్రజాసమస్యలను ప్రస్తావిస్తూ వచ్చాడు. కాని అకస్మాత్తుగా దిగ్విజయ్ సింగ్ మస్జిదు గురించి మాట్లాడి ఎవరి మస్జిదుకు వెళ్ళే నేతలు అనే చర్చకు తెరతీశాడు. ఈ చర్చ ప్రారంభించవలసిన అవసరం దిగ్విజయ్ సింగ్ కు ఏమొచ్చింది? దిగ్విజయ్ సింగ్ అంతటితో ఆగలేదు. కేవలం ఎన్నికలు వచ్చినప్పుడే పాప్యులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాపై బీజేపీ చర్యలు తీసుకుంటుందని అన్నాడు. దీనికి జవాబుగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ చౌహాన్ మాట్లాడుతూ పిఎఫ్ఐ పై చర్యలు తీసుకుంటే కాంగ్రెసుకు ఏమన్నా కష్టమా? ఈ చర్యలను వ్యతిరేకిస్తున్నారా? అని ప్రశ్నించారు. అంటే మొత్తం చర్చ ఇప్పుడు మతతత్వ చర్చగా మారిపోయింది. ఇలాంటి చర్చను తీసుకొచ్చింది ఎవరు? దిగ్విజయసింగ్ ఈ వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నట్లు? మధ్యప్రదేశ్ లో ఇప్పుడు దిగ్విజయ సింగ్, కమలనాథ్ మధ్య పోటీ నడుస్తోంది.
మధ్యప్రదేశ్ లో ప్రజలు బీజేపీ పట్ల విసిగిపోయారని, కాంగ్రెసు గెలిచే అవకాశాలున్నయని విశ్లేషణలు వస్తున్న నేపథ్యంలో కూడ ఈ సాఫ్ట్ హిందూత్వ కమల నాథ్ కు ఎందుకు అవసరమయ్యింది. ఇండియా కూటమి నిర్ణయాన్ని తుంగల్లో తొక్కి బహిష్కరించిన యాంకర్ కు ఇంటర్వ్యు ఇచ్చి ఇండియా కూటమిని బలహీనపరిచే పని ఎందుకు చేస్తున్నట్లు? మధ్యప్రదేశ్ లో బాబాలు, సాధువులతో, మతవిద్వేష వ్యాఖ్యలు చేసేవారితో సన్నిహితంగా కమల నాథ్ ఎందుకు వ్యవహరిస్తున్నట్లు? NBDS స్వయంగా ఏ యాంకరు కార్యక్రమాన్ని మతవిద్వేషాల కార్యక్రమంగా పేర్కొని ఆదేశాలు జారీ చేసిందో అదే యాంకరును పిలిచి ఎందుకు ఇంటర్వ్యు ఇచ్చినట్లు?
నిస్సందేహంగా రాహుల్ గాంధీ నిర్భయంగా సంఘపరివార్ కు వ్యతిరేకంగా గొంతువిప్పుతున్నారు. సంఘపరివార్ ఇప్పుడు అస్సలు ఇష్టపడని నాయకుడు రాహుల్ గాంధీ అనేది కూడా నిజమే. రాహుల్ గాంధీ రాజకీయ భవిష్యత్తును నాశనం చేయడానికి, పప్పుగా ప్రచారం చేసి తొక్కేయడానికి చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదన్నది నిజమే. రాహుల్ గాంధీ నిజాయితిగా దేశంలో అసలు సమస్యలపై మాట్లాడుతున్నారు. నిజాయితీగానే మతవిద్వేషాన్ని వ్యతిరేకిస్తున్నారు. కానీ, ఆయన పార్టీ నాయకులేం చేస్తున్నారు? కమలనాథ్, దిగ్విజయసింగ్ వంటి నేతలను అదుపు చేయవలసిన బాధ్యత కూడా రాహుల్ గాంధీపైనే ఉంది. ఆ పనిలో ఆయన విఫలమైతే, ఆయన సామర్థ్యమే ప్రశ్నార్థకమవుతుంది. కాంగ్రెసు ఒక నమ్మశక్యం కాని పార్టీగానే గుర్తించబడుతుంది.

– వాహెద్