October 5, 2024

పశ్చిమాసియా యుద్ధంలో ఇస్రాయీల్‌కు అనుకూలంగా ఫేక్‌ వార్తలు విస్తృతంగా ప్రచారంలోకి వస్తున్నాయి. అలాంటి ఒక ఫేక్‌ వార్తలో గాజాలో చనిపోయిన వ్యక్తి తన కళ్ళు తెరిచినట్లు చూపించే ఒక వైరల్‌ వీడియో వచ్చింది. ఇది ఫేక్‌ వార్తగా తర్వాత నిర్ధారణ అయ్యింది. కాని అప్పటికే ఈ ఫేక్‌ వార్త సోషల్‌ మీడియాలో చాలా మంది షేర్‌ చేశారు. చాలా మంది ఈ వార్తను నమ్మేసి పాలస్తీనాలో మరణాలన్ని కేవలం ఫేక్‌ మరణాలనే అభిప్రాయానికి వచ్చేసి ఉంటారు.

అసలు ఈ వీడియో గాజకు చెందినది కాదు. ఈ వీడియో వాస్తవానికి మలేషియాకు సంబంధించింది. అక్కడ అంత్యక్రియలు ఎలా చేయాలనే శిక్షణకు సంబంధించిన వీడియో ఇది. మలేషియాలోని బందర్‌ దిరాజా క్లాంగ్‌ అధికారిక మసీదులో జరిగిన ఈ కార్యక్రమంలో స్వచ్చంద సేవకులు అంత్యక్రియల ప్రక్రియ ఎలా ఉంటుందో చూపించడానికి శవాలుగా వ్యవహరిస్తారు. ఇజ్రాయెల్‌-గాజా యుద్ధానికి సంబంధించినది కాదు. ఆల్ట్‌ న్యూస్‌ ఈ వాస్తవాన్ని బట్టబయలు చేసింది. మలేషియా వీడియోను గాజా వీడియోగా తప్పుదారి పట్టించే శీర్షికలతో షేర్‌ చేశారు. ఇలాంటి ఫేక్‌ వార్తలతో ఇస్రాయీల్‌ క్రూర యుద్ధానికి మద్దతు సంపాదించుకుంటున్నారు.
మరో ఫేక్‌ వార్త చూద్దాం భారత రాజకీయాల్లో యువ సంచలనం కన్హయ్య కుమార్‌కు సంబంధించిన ఒక వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ప్రజలు ఇస్లాంను స్వీకరించాలని ఆయన చెబుతున్నట్లు ఈ వీడియోలో చిత్రీకరించారు. సెప్టెంబరు 28 నుంచి ఈ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నిజానికి కన్హయ్య కుమార్‌ మహారాష్ట్రలోని నాందేడ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో చేసిన సుదీర్ఘ ప్రసంగంలో చిన్న ముక్క ఇది. ఆల్‌ ఇండియా తంజీమ్‌-ఇ-ఇన్సాఫ్‌ నిర్వహించిన కార్యక్రమం అది. అసలు ప్రసంగంలో, మైనారిటీలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మాట్లాడుతూ మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ గురించి కూడా ప్రస్తావించారు. ఆ ప్రసంగంలో ఆయనెక్కడ కూడా ఇస్లాం స్వీకరించాలని ప్రజలను కోరడం జరగలేదు. కాని వైరల్‌ క్లిప్పులో అలా చెప్పినట్లు ఎడిటింగ్‌ మాయాజాలం ప్రదర్శించారు. దీనివల్ల సాధించిందేమిటంటే, కన్హయ్య కుమార్‌ లేదా కాంగ్రెస్‌ నేతలు లేదా ఇండియా కూటమి నేతలు కేవలం ఇస్లాం కోసం ముస్లిముల కోసం మాత్రమే ఆలోచిస్తారు, పనిచేస్తారు, హిందువులను నాశనం చేస్తారనే అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించడం. ఇలాంటి అభిప్రాయాలు ప్రజల్లో కలిగించడం వల్ల ఏ పార్టీకి లాభం కలుగుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇది ఫేక్‌ వార్తగా నిజనిర్ధారణ మీడియా సంస్థలు చెప్పే లోపుగానే ఈ అబద్దం ప్రపంచాన్ని చుట్టి వచ్చేస్తుంది. చాలా మంది గుడ్డిగా నమ్మేసి అనేకమందికి పంచుతూ పోతుంటారు. ఫేక్‌ వార్తల ఫ్యాక్టరి కొనసాగుతూ ఉంటుంది.
ఇంకో ఫేక్‌ వార్త చూద్దాం, అమెరికా అధ్యక్షుడిని ఒక కార్యక్రమంలో అసభ్యంగా దూషించారన్నట్లు ఒక వీడియో ప్రచారంలోకి వచ్చింది. ఒక కార్యక్రమంలో జరిగిన ప్రసంగంలో అధ్యక్షుడు జో బిడెన్‌కు వ్యతిరేకంగా ప్రజలు అసభ్య పదజాలంతో దూషించారన్నట్లు చూపించారు. నిజానికి ఈ వీడియో జూలై 2022 నాటిది. అసలు వీడియోలో అలాంటి అసభ్య పదాలు లేవని బూమ్‌ వార్తాసంస్థ స్పష్టం చేసింది. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా అధికారిక యూట్యూబ్‌ ఛానెల్‌ కూడా సెప్టెంబర్‌ 24న ఈ వార్తను ప్రచారంలో పెట్టింది. వాస్తవానికి జరిగిన సంఘటన ఏమిటంటే, జో బైడెన్‌ మాట్లాడుతున్నప్పుడు ఫ్లోరిడాలోని పార్క్‌ల్యాండ్‌లో పాఠశాల కాల్పుల్లో బాధితురాలి తండ్రి మాన్యువల్‌ ఆలివర్‌ అధ్యక్షుడి ప్రసంగాన్ని అడ్డుకున్నాడు. తుపాకీ భద్రతా చట్టంపై తన అభ్యంతరాలు చెప్పాడు. ఆయన ఎలాంటి అసభ్యమైన పదజాలం వాడలేదు.
మరో ఫేక్‌ వార్త చూద్దాం, అక్టోబరు 29వ తేదీన కేరళలోని కలమస్సేరిలో జరిగిన యెహోవాసాక్షుల మతసదస్సులో వరుస పేలుళ్ళు జరిగాయి. ఈ పేలుళ్ళలో ముగ్గురు మరణించారు, 50 మందికి పైగా గాయపడ్డారు. అసలు నేరస్థుడు, 48 ఏళ్ల డొమినిక్‌ మార్టిన్‌, అతను కూడా యోహోవా సాక్షులు సముదాయానికి చెందినవాడే. ఈ పేలుళ్ళకు బాధ్యత వహిస్తూ స్వయంగా పోలీసులకు లొంగి పోయాడు. తాను ఈ పేలుళ్లకు ఎందుకు పాల్పడ్డాడో వివరిస్తూ సోషల్‌ మీడియాలో వీడియోను విడుదల చేశాడు. కాని మార్టిన్‌ లొంగిపోక ముందు ఫేక్‌ వార్తలు వీరవిహారం చేశాయి. మతవిద్వేష శక్తులు రెచ్చిపోయాయి. ముఖ్యంగా ముస్లిం విద్వేష శక్తులకు చేతినిండా పని దొరికింది. ఇస్రాయీల్‌కు అనుకూలంగా పోస్టులు పెట్టారు. యూదుల సమావేశంపై ముస్లిములు చేసిన దాడిగా చిత్రీకరించిన ఫేక్‌ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. దేశంలో ఏం జరిగినా వెంటనే ముస్లిములతో ముడేసి ప్రచారం చేయడం ఫేక్‌ వార్తల ఫాక్టరీ చేస్తున్న నిత్యకృత్యం అని మరోసారి రుజువైంది. పేలుళ్లను ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధంతో ముడిపెట్టి ప్రచారం చేశారు. నిజానికి క్రయిస్తవుల్లో యెహోవా సాక్షులు త్రిత్వ సిద్ధాంతాన్ని విశ్వసించరు. జియోనిజం పట్ల తటస్థ వైఖరి కలిగి ఉన్నారు. కేరళ కలమస్సేరి జనాభాలో యూదులు చాలా తక్కువ. డొమినిక్‌ మార్టిన్‌పై ఖAూA, పేలుడు పదార్ధాల చట్టం, ఐపీసీ వంటి వివిధ చట్టాల కింద అభియోగాలు మోపబడ్డాయి. అతను దుబాయ్‌లో ఉండేవాడు, పేలుళ్లకు రెండు నెలల ముందు భారతదేశానికి తిరిగి వచ్చాడు. అతను పాల్పడిన పేలుళ్ళకు ముస్లిములకు సంబంధమే లేదు. అయినా ఇదంతా ముస్లిములు చేసిందిగా ఫేక్‌ వార్తలు ప్రచారంలో పెట్టారు.