ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని 30 మదర్సాలలోని 7,399 మంది విద్యార్థుల్లో దాదాపు 10% మంది ముస్లిమేతరులేనని ఉత్తరా ఖండ్ మదర్సా ఎడ్యుకేషన్ బోర్డు ఇటీవలి నివేదిక వెల్లడించింది. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ హైలైట్ చేసిన ఈ గణాంకాలు ఉత్తరాఖండ్‌లోని విద్యారంగం పరిస్థితి ఎలా ఉందో చెబుతున్నాయి.
బీజేపీ ప్రభుత్వ హయాంలో విద్యా హక్కు చట్టం ప్రకారం పాఠశాలలుగా పరిగణించబడని మదర్సాలలో ముస్లిమేతర పిల్లలు చదువుకుంటున్నారు. నేషనల్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ప్రకటించిన అభ్యంతరాలు, విమర్శలు సమస్యను ప్రతిబింబిస్తున్నాయి. ఉత్తరాఖండ్‌లోని కాంగ్రెస్ పార్టీ, అధికార ప్రతినిధి గరిమా మెహ్రా దాసౌని బీజేపీ పాలిత రాష్ట్రంలో విద్యావ్యవస్థ దుస్థితిని వేలెత్తి చూపించారు. చదువుకునే అవకాశాలు లేని ముస్లిమేతర పిల్లలు మదర్సాలలో చదువుకోవడం బిజెపి పాలన వైఫల్యానికి నిదర్శనంగా కాంగ్రెసు విమర్శిస్తోంది. ముస్లిమేతర కుటుంబాలు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు బదులు మదర్సాలకు పంపవలసి వస్తున్న ఈ పరిస్థితి బీజేపీ వైఫల్యానికి నిదర్శనంగా చూపిస్తున్నారు. దీనిపై బీజేపీ స్పందించింది. రాష్ట్ర మీడియా ఇన్‌చార్జి మన్‌వీర్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ ఈ అడ్మిషన్‌లకు దారితీసిన పరిస్థితులను పరిశోధించి, అక్రమంగా నడుస్తున్న మదర్సాలను మూసేస్తామని అన్నాడు. విద్యాజ్ఞానాలు అందిస్తున్న మదరసాలను మూసేస్తాం అంటున్నాడు కాని, విద్యా సౌకర్యాలు కల్పించడం గురించి మాత్రం మాట్లాడలేదు. ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్ అమలు, సంస్కృతం ప్రవేశపెట్టడంతోపాటు మదర్సాలను ఆధునీకరించేందుకు ఉత్తరాఖండ్ వక్ఫ్ బోర్డు చేస్తున్న కృషి అభినందనీయం. కాని బీజేపీ నేతలు మాత్రం మతపరమైన విషయాలను లేవనెత్తి, విద్యాపరమైన సదుపాయాలు కల్పించలేని తమ ప్రభుత్వ అసమర్థతను దాచిపెట్టి రాజకీయాలు చేస్తున్నారు. విద్య, వైద్య ఆరోగ్య , ఆర్థిక రంగాల్లో సమస్యల పరిష్కారానికి బదులు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మతతత్వ రాజకీయాలు నడపడమే ప్రధానంగా కనిపిస్తుంది.