దైవ విశ్వాసి మొట్టమొదటి ప్రాముఖ్యత ఏమిటంటే, అతను ఇతరుల లోపాలను ఎంచటానికి బదులు తన లోపాలపై తాను లోతైన దృష్టిని సారిస్తాడు. స్వయంగా తనను తాను పరీక్షించు కుంటూ ఉంటాడు. దాని కారణంగా అతని హృదయపు అద్దంలో అతని మనసుకు పట్టిన తుప్పు మరకలన్నీ అతనికి స్పష్టంగా కనబడుతూ ఉంటాయి. అతను ఆ తుప్పు మరకల్ని తొలగించు కోవటం మొట్టమొదటి పనిగా భావించి అందులో నిమగ్నమై పోతాడు. అతను జీవితాంతం ఆ పనిలోనే లీనమై ఉంటాడు.
అతని రెండవ ప్రాముఖ్యత ఏమిటంటే, స్వంత వ్యక్తిత్వం ప్రాచుర్యం పొందటానికి, తన పేరు ప్రఖ్యాతలు మారు మ్రోగ టానికి అతను ఎంతమాత్రం పని చేయడు. అతని ఆచరణల ఫలితంగా కీర్తి ప్రతిష్టలు అతనికి ఇహలోకంలోనే లభిస్తాయేమో అని భయపడుతూ ఉంటాడు. వాటిని అతను ఒక ఆపదలా భావిస్తాడు. అతనిని ఎవ్వరూ గుర్తుపట్టకపోతే బాగుంటుంది అని భావిస్తాడు. తనను తాను గుప్తంగా ఉంచటాన్ని మాత్రమే ఇష్టపడతాడు.
అతని మూడవ ప్రాముఖ్యత ఏమిటంటే, ఈ విశ్వాసపు స్థితి అతని మరణం వరకు అలాగే పదిలంగా ఉంటుందో లేదో అని భయపడుతూ ఉంటాడు. ఇంకా అతను చేసే సత్కార్యాల పరంపర కూడా చివరి శ్వాస వరకు కూడా ఇలాగే ఉంటుందో లేదో అనే ఆందోళనకు గురవుతూ ఉంటాడు. ఈ భయం వల్ల స్వీయ సంస్కరణ విషయంలో అశ్రద్ధకు గురి కాడు. ఈ భయం అతనిలో వినమ్రతను కలిగిస్తుంది. దానితోపాటు అతనిని కోరికల వెంట పరిగెత్తకుండా ఆపుతుంది.
విశ్వాసి నాలుగో ప్రాముఖ్యత ఏమిటంటే, అతను చేసే సందేశ ప్రచార కార్యక్రమాల ద్వారా పొగడ్తలను ఎన్నటికీ కోరడు. కేవలం అతను చేసే ఈ సందేశ ప్రచార కార్యక్రమాలను అల్లాప్‌ా అంగీకరిస్తే చాలు అని భావిస్తూ ఉంటాడు.
అతని ఐదో ప్రాముఖ్యత ఏమిటంటే, అతను అందరి మేలును కోరుతాడు. వారి పట్ల మంచి అభిప్రాయాన్ని కలిగి ఉంటాడు. ఎవరి గురించి అతను తన హృదయంలో ఎలాంటి దురభిప్రాయాన్ని కలిగి ఉండడు.
అతని ఆరో ప్రాముఖ్యత ఏమిటంటే, అల్లాప్‌ా నామస్మరణతో అతనికి సహజ సంబంధం ఏర్పడుతుంది. అల్లాప్‌ా నామ స్మరణ లేకుండా ఎక్కువసేపు అతను ఉండలేడు. దాని కోసమే అతను విలువైన సమయాన్ని కేటాయిస్తాడు. ప్రాపంచిక పటాటోపాలతో తేలియాడటానికి అతని వద్ద ఎక్కువ సమయం ఉండదు. కనుక అతను ప్రాపంచిక కలాపాలను కుదించుకుంటాడు.
అతని ఏడో ప్రాముఖ్యత ఏమిటంటే, అతను తన మనసును అదుపులో ఉంచటానికి యుద్ధ మైదానంలో ఒక సైనికుడి మాదిరిగా పూర్తి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ తరువాత కూడా అతని మనసులో దుష్ట ఆలోచనలు రేకెత్తుతూ ఉన్నాయోమో అని అతని హృదయంపై ఒక కన్నేసి ఉంచుతాడు. చిన్న చిన్న దురాలోచనల పట్ల కూడా ఆందోళన చెందుతాడు. వాటిని కూడా అంతం చెయ్యటానికి కృషి చేస్తాడు. వాటి విషయంలో అల్లాప్‌ా సహాయాన్ని కూడా అభ్యర్థిస్తాడు.
అతని ఎనిమిదో ప్రాముఖ్యత ఏమిటంటే, అతను తన ఉపాధి విషయంలో అల్లాప్‌ానే నమ్ముకుంటాడు. ఆయనపైనే భారం వేస్తాడు. ఎవరిపైననూ ఆధారపడడు. అల్లాప్‌ాయే అతని అవసరాలకు సరిపోతాడని భావిస్తాడు. ఇంకా అతనికి ఏదైతే ప్రసాదిస్తాడో దాని పట్ల కృతజ్ఞతలు తెలియజేస్తాడు. ఏదైతే ప్రసాదింపబడలేదో దానిపై సహనం వహిస్తాడు. ఎంతైతే అతనికి ప్రసాదించబడుతుందో అంతటితోనే అతను సర్దుకుంటాడు. అల్లాప్‌ా వ్రాసిన విధి రాతలను పూర్తిగా విశ్వసిస్తాడు.
అతని తొమ్మిదో ప్రాముఖ్యత ఏమిటంటే, అతనికి వివేకానికి సంబంధించిన జ్ఞానం ఎక్కడినుండి లభించినా స్వీకరిస్తాడు. అతనికంటే తక్కువ వయస్సు గల వాడి నుండి లభించినా లేదా పెద్ద జ్ఞాని వద్ద నుంచి లభించినా సరే. అతను దైవప్రవక్త(స) గారి ఈ సూక్తి ప్రకారం నడుచుకుంటాడు. వివేకం విశ్వాసి వారసత్వపు సంపద. అతనికి అది ఎక్కడి నుంచి లభించినా దానిని స్వీకరిస్తాడు.
అతని పదో ప్రాముఖ్యత ఏమిటంటే, అతని సంకల్పం అతని ఆచరణ కంటే కూడా ఉత్తమంగా ఉంటుంది. అంటే అతని ఆచరణల వెనుక అతని చిత్తశుద్ధి ఇంకా అతని, పరిశుద్ధమైన భావాలు ఉంటాయి. అల్లాప్‌ా ప్రేమ, ఆయన సంతోషం కోసం చిత్తశుద్ధితో చేసే ఆచరణలు అల్లాప్‌ా దృష్టిలో మరింత విలువైనవిగా ఉంటాయి. అతని స్థానాలను మరింత ఉన్నతంగా పెంచుతాయి.
అతని పదకొండో ప్రాముఖ్యత ఏమిటంటే, అతను ప్రాపంచిక సదుపాయాలతో, సౌకర్యాలతో లాభాన్ని తప్పకుండా పొందు తాడు, వాటన్నింటినీ అవసరానికి వాడుకుంటాడు. కాని ప్రాపంచిక భోగభాగ్యాలను ఆస్వాదించటంలోనే లీనమైపోడు. ఎందుకంటే సుఖసంతోషాల జీవితం అతనిని ఇహలోకంలోనే లీనం చేస్తుందని భయపడతాడు. ఎందుకంటే దివ్య ఖుర్‌ఆన్‌లో ప్రాపంచిక జీవితాన్ని గురించి అల్లాప్‌ా సెలవిచ్చిన ఈ వాక్యాన్ని దృష్టిలో పెట్టుకుంటాడు. స్త్రీలు, సంతానం, వెండి, బంగారు రాసులు, మేలు జాతి గుర్రాలు, పశువులు, సేద్యపు భూములు వంటి వ్యామోహాలపై ప్రేమ ఆకర్షణగా చెయ్యబడిరది. కాని ఇవన్నీ అసత్యమైన ఐహిక జీవిత సంపదలు మాత్రమే. అసలైన ఉత్తమ నివాసం అల్లాప్‌ా వద్ద ఉన్నదే. (3: 14) కనుక అతను వినోదాలు, క్రీడలు లాంటి వ్యామోహాలకు బహు దూరంగా ఉంటాడు. వాటిలో అతను తన జీవితపు విలువైన సమయాన్ని వృధా చేసుకోడు.
అతని పన్నెండో ప్రాముఖ్యత ఏమిటంటే, అతను ఆరోగ్య స్థితిలో ఉన్నా లేదా అనారోగ్యస్థితిలో ఉన్నా అతను కలిమిలో ఉన్నా లేదా లేమిలో ఉన్నా అతను తాను లాభంలోనే ఉన్నాననే విషయాన్ని విశ్వసిస్తాడు. అతను ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడు దైవారాధనలో అత్యధికంగా లీనమై ఉంటాడు. అల్లాప్‌ా పవిత్ర నామాన్ని ఎల్లప్పుడూ జపిస్తూ ఉంటాడు. ఇంకా అల్లాప్‌ా ఆజ్ఞలను, ఆయన ప్రవక్త ఉపదేశాలను ఆచరించే విషయంలో చురుగ్గా ఉంటాడు.
అనారోగ్య స్థితిలో అతను సహన స్థైర్యాలను కూడగట్టుకుంటాడు. అల్లాప్‌ా ముందు తన నిస్సహాయతను వ్యక్తపరుస్తాడు. ఆరాధనలు, దైవనామస్మరణ జపం, ఇతర సందేశ కార్యక్రమాలు అధికంగా చెయ్యలేకపోవటం పట్ల దుఃఖపడతాడు. తన దుఃఖాన్ని తన కారుణ్య ప్రభువు ముందు బహిరంగ పరుస్తాడు. తనకు సహాయ సహకారాలు అందించమని ప్రార్థిస్తాడు. ఈ విధంగా అతను ఆరోగ్యంలో ఉన్నా, అనారోగ్యంలో ఉన్నా అల్లాప్‌ాకు సన్నిహితంగానే ఉంటాడు.
అదేవిధంగా అతను కలిమిలో ఉన్నప్పుడు అల్లాప్‌ా మార్గంలో సందేశ ప్రచార కార్యక్రమాలలో అధికంగా ఖర్చు చేస్తాడు. ఒకవేళ లేమికి గురైనట్లయితే అల్లాప్‌ా మార్గంలో ఖర్చుపెట్టలేక పోతున్నానని బాధపడతాడు. అల్లాప్‌ానే ప్రసాదించమని వేడుకుంటాడు. ఈ విధంగా ఒక విశ్వాసి అల్లాప్‌ా చుట్టూనే, ఆయన ఆజ్ఞల చుట్టూనే పరిభ్రమిస్తూ ఉంటాడు.
నసీరాబేగం