గుజరాత్ లో విషాదం చోటు చేసుకుంది. మోర్బీ బ్రిడ్జి కూలిపోయిన సంఘటనలో 141 మంది మరణించారు. వడోదరకు 300 కి.మీ. దూరంలో ఉన్న ఈ బ్రిడ్జిపై చాలా మంది చాట్ పూజ చేస్తున్నప్పుడు ఈ దుర్ఘటన జరిగింది. ఈ వంతెన బ్రిటీషు కాలంలో కట్టిన వంతెన. దాదాపు 150 సంవత్సరాల పాత వంతెన. మచు నదిపై ఉన్న ఈ వంతెన మరమ్మత్తుల కోసం గత ఏడు నెలలుగా మూసిఉంచారు. గుజరాత్ కొత్త సంవత్సరం అక్టోబర్ 26వ తేదీన దీన్ని మళ్ళీ ప్రారంభించారు. కాని వంతెన ప్రారంభించే ముందు సంబంధిత అధికారుల నుంచి ఫిట్ నెస్ సర్టిఫికేటు కూడా తీసుకోలేదని తెలుస్తోంది.
గుజరాత్ అనేక విషాదాలను ఇటీవల చవి చూసింది. 2019 జులైలో అహ్మదాబాద్ లోని కంకారియా సరస్సువద్ద ఉన్న పెండ్యులమ్ జాయ్ రైడ్ కూలిపోయి ఇద్దరు మరణించారు. మే 2019లో సూరత్ లో చట్టవిరుద్దంగా కట్టిన ఒక ట్యూషన్ క్లాసులో అగ్నిప్రమాదం సంభవించి 22 మంది విద్యార్థులు మరణించారు. మంటల్లో చిక్కుకున్న విద్యార్థులు నాల్గవ అంతస్తు నుంచి బయటకు దూకుతున్న భయానక చిత్రాలు కంటనీరు పెట్టించాయి. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులు తర్వాత బెయిలుపై బయటకు వచ్చేశారు. 2003లో దమన్ గంగ నదిపై వంతెన మరమ్మత్తుల తర్వాత కూలిపోయింది. 30 మంది మరణించారు. ఇందులో చాలా మంది స్కూలు విద్యార్థులు. ఈ కేసులో తీర్పు 19 సంవత్సరాల తర్వాత 2022లో వచ్చింది. దోషులకు రెండేళ్ళ జైలు శిక్ష విధించారు.
ఇప్పుడు మోర్బి వంతెన కూలిన దుర్ఘటనలోను తర్వాత విచారణలు జరుగుతాయి. కాని ఈ విచారణలు సాధించేదేమిటి? ఇలాంటి విషాదాలకు మూల కారణాలను పసిగట్టి, ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరక్కుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటారా? ఈ ప్రశ్నలకు ఎవరి వద్ద తగిన సమాధానం లేదు. విచారణలు ఎప్పటికి పూర్తవుతాయి. ఎప్పుడు దోషులకు శిక్ష పడుతుంది? ఈ ప్రశ్నలకు కూడా సమాధానాలు లేవు.
ప్రమాదాలు, అల్లర్లు, అవినీతి ఇలాంటి సంఘటనల్లో విచారణలు సాధించేదేమిటి?విచారణలు సుదీర్ఘ కాలం కొనసాగుతాయి. దోషులకు శిక్ష పడుతుందనే నమ్మకం కూడా సాధారణ ప్రజల్లో ఇప్పుడు కనిపించడం లేదు. మహా అయితే బలిపశువులుగా చిన్నస్థాయి ఉద్యోగులకు శిక్షలు పడతాయని కూడా సగటు ప్రజలు భావించే పరిస్థితి ఉంది.
ఇప్పుడు జరిగిన ప్రమాదం చిన్నది కాదు. అనేక కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. అనేక కుటుంబాలను చిన్నాభిన్నం చేసింది. ఇలాంటి దుర్ఘటనకు కారకులను గుర్తించి తగిన శిక్షలు విధిస్తారా? ఎక్కడ అవినీతి జరిగింది? ఎవరు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నది నిష్పక్షపాతంగా విచారణ జరుగుతుందా? దోషులు ఎంత పెద్దవారైనా, ఎలాంటి రాజకీయ సంబంధాలు కలిగిన వారైనా సరే వారికి శిక్షలు పడతాయన్న నమ్మకాన్ని ప్రజల్లో కలిగిస్తారా? ఈ విషాదకరమైన సంఘటనలో ఆప్తులను కోల్పోయిన వారికి న్యాయం లభిస్తుందా? ఈ ప్రశ్నలకు భవిష్యత్తే సమాధానం చెప్పాలి.
ఈ దుర్ఘటన జరిగినప్పుడు తెలంగాణాలో భారత్ జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీని ఈ ప్రమాదం గురించి అడిగినప్పుడు ఈ ప్రమాదాన్ని రాజకీయం చేయదలచుకోలేదని ఖచ్చితంగా చెప్పడం అభినందించదగిన విషయం. ’’ఈ ప్రమాదాన్ని రాజకీయం చేయడం ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి పట్ల అనుచితంగా వ్యవహరించడమే అవుతుంది. విషాదంలో ఉన్న ఆయా కుటుంబాల మనోభావాలను మరింత గాయపరచడం అవుతుందన్నారు‘‘. సాధారణంగా ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు పాలకపక్షాన్ని ఇరుకున పెట్టడానికి ఆరోపణల వర్షం కురిపించడం ప్రతిపక్షంలో ఉన్న వారు చేస్తుంటారు. గతంలో అలాంటి అనేక ఉదాహరణలు చూశాం. పైగా గుజరాత్ లో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో రాజకీయాలకు ప్రతి చిన్న విషయాన్ని నేతలు వాడుకునే ప్రయత్నం చేస్తారు. అయినా రాహుల్ గాంధీ చూపించిన సంయమనం ప్రశంసించదగింది.
ప్రభుత్వాన్ని విమర్శించి ఇరుకున పెట్టడం కన్నా బాధిత కుటుంబాల మనోభావాలను గౌరవించడం ముఖ్యమని భావించే ప్రతిపక్ష నాయకుడు రాజకీయాల్లో ఉండడం భారతరాజకీయాల ప్రమాణాలను పెంచింది.
కాని నిజాలు మాట్లాడుకోవడం కూడా చాలా అవసరం. మోర్బీ ప్రమాదం నిస్సందేహంగా ఆడ్మినిస్ట్రేషన్ వైఫల్యం వల్ల జరిగింది. వ్యవస్థలోని లోపాల వల్ల జరిగింది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగింది. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి ప్రమాదాలు మరోసారి జరక్కుండా ప్రమాదానికి కారణాలపై సమగ్రమైన దర్యాప్తు జరగాలి. దోషులకు కఠినమైన శిక్షలు పడాలి.