November 12, 2024

మరోసారి బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనా ఘనవిజయం సాధించారు. అవామీలీగ్ పార్టీ మరోసారి అధికారం చేజిక్కించుకుంది. మొత్తం 300 పార్లమెంటు స్థానాలకు గాను 299 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. అవామీలీగ్ ఏకంగా 223 స్థానాలు సొంతం చేసుకుంది. ప్రధాన ప్రతిపక్షమైన జతియా పార్టీకి కేవలం 11 సాట్లు లభించాయి. బంగ్లాదేశ్ కల్యాణ్ పార్టీ కేవలం ఒక స్థానంలో గెలిచింది. స్వతంత్ర అభ్యర్థులు 62 స్థానాల్లో జయకేతనం ఎగరేశారు.

షేక్ హసీనా 2009 నుంచి ప్రధానిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు వరుసగా నాలుగోసారి గెలిచారు. మొత్తంగా చూస్తే ఆమె ప్రధానికావడం ఇది ఐదోసారి. ఈ సారి ఆమె గెలవటానికి ప్రధానకారణాల్లో ఒకటి ప్రముఖ పార్టీలు ఈ ఎన్నికలను బహిష్కరించడం. మాజీ ప్రధాని ఖాలిదా జియా నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీతో సహా మరో 15 పార్టీలు ఈ సారి ఎన్నికలకు దూరంగా ఉన్నాయి. ఎన్నికల్లో కేవలం 41.8 శాతం పోలింగ్ నమోదైంది.
ఇంతకు ముందు జరిగిన ఎన్నికల్లో కూడా ప్రతిపక్షాలు బాయ్ కాట్ చేశాయి. చాలా తక్కువ పోలింగ్ నమోదైంది. గత ఎన్నికల మాదిరిగానే ఈ సారి ఎన్నికల తర్వాత కూడా అనేక ఆరోపణలు వస్తున్నాయి. భారీ ఎత్తున అవకతవకలు, అక్రమాల వార్తలు గుప్పుమన్నాయి. అధికార అవామీ లీగ్‌ ‘ఇది ప్రజా తీర్పు’ అంటుంటే…‘అంతా మోసం, దగా’ అని విపక్షాలు విమర్శిస్తున్నాయి. గతంలోను ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. మళ్ళీ ఎన్నికలు జరపాలని డిమాండ్లు వచ్చాయి. కాని షేక్ హసీనాను గద్దె దించలేకపోయారు.
ప్రధాన ప్రతిపక్షం బిఎన్పీ 1991లోను, 2001లోను రెండుసార్లు అధికారంలో ఉంది. ఈ సారి భారి ఎత్తున రిగ్గింగ్ జరిగిందని, ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యానికి మచ్చవంటివని విమర్శించింది. ఈ సారి ఎన్నికల్లో జనరల్ జియావుర్రహ్మాన్ కుటుంబం నుంచి ఎవ్వరు పోటీలో లేరు. బంగ్లాదేశ్ రాజకీయాల్లో రెండు కుటుంబాలే ప్రధానంగా కనిపిస్తాయి. అవి షేక్ ముజీబుర్రహ్మాన్, జనరల్ జియావుర్రహ్మాన్ కుటుంబాలు. ముజీబుర్రహ్మాన్ కుమార్తె షేక్ హసీనా. జనరల్ జియావుర్రహ్మాన్ భార్య ఖాలిదా జియా. బిఎన్ఫీ పార్టీకి ఈమె అధినేత. అవినీతి ఆరోపణలతో జైలులో ఉన్న ఖాలిదా జియా ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయలేకపోయారు. ఆమె కుమారుడు తారిక్ రహ్మాన్ లండనులో తలదాచుకున్నాడు. రాజకీయ కక్షసాధింపులతో వారిద్దరినీ శిక్షించారన్న బలమైన ఆరోపణలున్నాయి.
2041 నాటికి బంగ్లాదేశ్ అభివృద్ధి చెందిన దేశంగా మారుస్తానని గత ఎన్నికల్లో ఆమె హామీ ఇచ్చారు. హసీనా అవలంబించిన ఆర్థిక విధానాలు బంగ్లా ప్రజల జీవితాల్లో మెరుగైన మార్పు తీసుకొచ్చాయన్నది వాస్తవం. పేదరికం గణనీయంగా తగ్గింది. ఆహారభద్రత ఏర్పడింది. సార్వత్రిక ప్రాథమిక విద్య వంటి అంశాల్లో దేశం ముందంజలో ఉంది. అతి తక్కువ అభివృద్ధి సాధించిన దేశాల జాబితా నుంచి బంగ్లాదేశ్‌ తప్పుకుని వర్ధమాన దేశాల జాబితాలో చేరింది. అవినీతి నిర్మూలనలో, ఛాందసవాద మిలిటెంట్ల ఆగడాలను అదుపు చేయడంలో కఠినంగా వ్యవహరించింది. అలాగని అంతా సవ్యంగా ఉన్నదని చెప్పడం అవాస్తవమవుతుంది. భావప్రకటనా స్వేచ్ఛకు ఆటంకాలు, విచ్చలవిడి ఎన్‌కౌంటర్లు, మనుషుల్ని అదృశ్యం చేయడం వంటివి ప్రభుత్వ తీరుతెన్నుల్ని ప్రశ్నార్థకం చేశాయి.  ఆమె హయాంలో అభివృద్ధి జరిగిందన్నది ఎంత నిజమో, నిరంకుశ పోకడలు పెరిగాయన్నది కూడా అంతే నిజం. మానవహక్కులకు సంబంధించిన ఫిర్యాదులు, భావప్రకటనాస్వేచ్ఛపై దాడులు, జర్నలిస్టుల అరెస్టులు జరిగాయి.
బీఎన్‌పీ అధినేత ఖలీదాతోసహా ఎందరో నేతల్ని అవినీతి కేసుల్లో శిక్షలు పడేలా చేయగలిగామని చెబుతున్నా…స్వపక్షం అవినీతి విషయంలో హసీనా సర్కారు ఉదాసీనంగా ఉంటోంది. భూ కబ్జాలు, మెగా ప్రాజెక్టుల్లో స్వాహాలు, పబ్లిక్‌ రంగ సంస్థల్లో అవినీతి, ముఖ్యంగా బ్యాంకింగ్‌ రంగంలో విచ్చలవిడిగా రుణాల మంజూరు, ఎగవేతదార్లపై చర్యలు తీసుకోకపోవడం వగైరాలు ఆర్థిక వ్యవస్థను కుంగదీస్తున్నాయి. మిలిటెన్సీని అణిచేస్తున్నామని చెబుతున్నా సెక్యులర్‌ విలువలున్న కళాకారులు, రచయితలపై దాడులు జరుగుతున్నాయి. ఏదో ఒక సాకుతో విపక్ష నేతల్ని, వారి మద్దతుదార్లను జైళ్లలోకి నెట్టి ఆ పార్టీలకు నాయకత్వమే లేకుండా చేసిన తీరు ఎన్నికల ప్రక్రియపైనే సందేహాలు రేకెత్తించింది.
ప్రధానమంత్రి షేక్ హసీనా వాజెద్ బంగ్లాదేశ్ జాతిపితగా పిలిచే షేక్ ముజిబుర్ రెహ్మాన్‌ కుమార్తె. హసీనా 2014లో మూడోసారి ప్రధాని పదవిని చేపట్టారు. 1960లో ఆమె ఢాకా విశ్వవిద్యాలయం చదువకున్నారు. ఆ కాలంలోనే  హసీనా రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారు. 1968లో ప్రముఖ శాస్త్రవేత్త ఎంఏ వాజెద్ మియాను హసీనా పెళ్లాడారు. ముజిబుర్ రెహ్మాన్ 1975 ఆగస్టు 15న  హత్యకు గురయ్యారు. ఆయనతోపాటు, హసీనా తల్లిని, ముగ్గురు సోదరులను పలువురు సైనికాధికారులు ఇంట్లోనే హత్య చేశారు. ఈ హత్యలు జరిగినప్పుడు షేక్ హసీనా బంగ్లాదేశ్‌లో లేరు. అప్పట్లో హసీనా ఆరేళ్లు ప్రవాసంలో ఉన్నారు. ఆ సమయంలోనే అవామీ లీగ్ నాయకత్వ బాధ్యతలు చేపట్టారు. 1981లో ఆమె బంగ్లాదేశ్ తిరిగివచ్చాక రాజకీయాల్లో ముఖ్యపాత్ర పోషంచడం ప్రారంభించారు. చాలా సార్లు గృహనిర్బంధానికి గురయ్యారు. 1990 డిసెంబర్‌లో బంగ్లాదేశ్ చివరి సైనిక పాలకుడు లెఫ్టినెంట్ జనరల్ మొహమ్మద్ ఎర్షాద్ రాజీనామా చేయక తప్పలేదు. 1991లో జరిగిన ఎన్నికల్లో షేక్ హసీనా పార్టీకి మెజారిటీ లభించలేదు. ఆమె ప్రత్యర్థి ఖలీదా జియా నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ఐదేళ్లకు 1996లో జరిగిన ఎన్నికల్లో అవామీ లీగ్ విజయం సాధించటంతో హసీనా తొలిసారి ప్రధానమంత్రి అయ్యారు.
2001 అక్టోబరులో ఎన్నికల్లో ఖలీదా జియా నేతృత్వంలోని బీఎన్‌పీ, మూడు సంకీర్ణ భాగస్వామ్య పక్షాల చేతిలో అవామీ లీగ్ ఓడిపోయింది. 2004 ఆగస్టులో ఢాకాలో అవామీ లీగ్ ర్యాలీపై గ్రెనేడ్ దాడి జరిగింది.  22 మంది మరణించారు. దాడి నుంచి హసీనా అదృష్టవశాత్తు బతికిబయటపడ్డారు. 2008 డిసెంబరు సార్వత్రిక ఎన్నికల్లో 300 స్థానాలకుగాను 250కి పైగా స్థానాల్లో హసీనా సారథ్యంలోని అవామీ లీగ్ జయకేతనం ఎగరేసింది. 2014 జనవరిలో సార్వత్రిక ఎన్నికలను బీఎన్‌పీ బహిష్కరించింది. పోటీ లేని  ఎన్నికల్లో అవామీ లీగ్ విజయం సాధించి మూడోసారి ప్రధానిగా హసీనా బాధ్యతల స్వీకరించారు.
తూర్పు పాకిస్తాన్ ప్రజలపై పాకిస్తాన్ అకృత్యాల వివరాలు తెలిసిన వారికి షేక్ హసీనా ప్రభుత్వం  1971 నాటి యుద్ధ నేరస్థులను ఉరి తీయడం చాలా సంతోషం కలిగించవచ్చు. 44 ఏళ్ల క్రితం బంగ్లాదేశ్ అవతరణకు ముందు పాకిస్తాన్ ప్రభుత్వం తమ దేశంలో అంతర్భాగమైన అప్పటి తూర్పు పాకిస్తాన్ మీద హద్దుమీరిన అకృత్యాలకు పాల్పడిందనే ఆరోపణలున్నాయి. లక్షలాది మంది ఆ మారణకాండలో ప్రాణాలు కోల్పోయారు. ఈ అకృత్యాలను అవామీలీగ్ నాయకురాలు  షేక్ హసీనా యుద్ధ నేరాలుగా పరిగణించి యుద్ధ నేరాలను విచారించడానికి బంగ్లా దేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ ఏర్పాటు చేసింది. ఆ ట్రిబ్యునల్ 2013లో ఇచ్చిన తీర్పుల మేరకు ఉరి శిక్షలు అమలైనాయి.  మరణ దండన విధించడంపై సహజంగానే జాతీయంగానూ అంతర్జాతీయంగాను తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. యుద్ధ నేరాల ఆరోపణలు  ఎదుర్కుంటున్న వారి విచారణ సవ్యంగా జరగలేదన్న విమర్శలూ వచ్చాయి. అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు మరణ దండన విధించడాన్ని ఆక్షేపించాయి. పశ్చిమ దేశాలు బంగ్లా ప్రధాని షేక్ హసీన మీద తీసుకు రావాల్సినంత ఒత్తిడి తీసుకొచ్చాయి. షేక్ హసీనా 1996లో మొట్టమొదటి సారి ప్రధాన మంత్రి అయినా యుద్ధ నేరస్థులకు శిక్ష విధించి తీరాలన్న పట్టుదల మాత్రం 2009లో రెండో సారి ప్రధాన మంత్రి అయిన తర్వాతే పెరిగింది. మరువైపు సెక్యులర్ వాదులైన బ్లాగర్ల మీద హత్యాకాండ, విదేశీయులను హతమార్చడం కూడా జరిగిందని గుర్తించాలి.
ఖాలిదా జియా 1991లోను, 2001లోను పదిసంవత్సరాల కాలం బంగ్లదేశ్ ప్రధానిగా పనిచేశారు. బంగ్లాదేశ్ చరిత్రలో ఆమె మొదటి మహిళా ప్రధాని. ముస్లిం దేశాల్లో బెనజీర్ బుట్టో తర్వాత ప్రధానిగా పనిచేసిన రెండవ మహిళ. ఆమె భర్త జియావుర్రహ్మాన్ బంగ్లాదేశ్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయనే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ స్థాపించాడు. 1982లో బంగ్లదేశ్ లో మిలిటరీ కుట్ర ద్వారా జనరల్ ఎర్షాద్ అధికారంలోకి వచ్చిన సంఘటన తర్వాత, ఖాలిదా జియా బంగ్లాదేశ్ లో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడడానికి పోరాడారు. 1990లో ఎర్షాద్ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత, 1991 ఎన్నికల్లో ఆమె ప్రధాని అయ్యారు. 1996లో అవామీ లీగ్ అధికారంలోకి వచ్చింది. 2001లో మళ్ళీ ఖాలిదా జియా ప్రధాని అయ్యారు. 2006లో జరగవలసిన ఎన్నికలు రాజకీయ హింస వల్ల జరగలేదు. మళ్ళీ మిలిటరీ అధికారంలోకి వచ్చింది. ఖాలిదా జియాపై, ఇద్దరు కుమారులపై అవినీతి కేసుల పెట్టి జైలుకు పంపించారు. తర్వాత 2009 ఎన్నికల్లో అవామీలీగ్ మళ్ళీ అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి షేక్ హసీనా ప్రధానిగా పాలిస్తున్నారు.
బ్రిటన్, యూరోపియన్ యూనియన్, అమెరికా దేశాలు అత్యంత తీవ్రమైన స్వరంతో ఈ ఎన్నికలను ఖండించాయి. అంతర్జాతీయంగా బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ప్రతిష్ఠ అడుగంటే పరిణామాలివి. ఓటర్లను భయపెట్టడం, బెదిరించడం, ఒత్తిడికి గురిచేయడం వంటి చర్యలు చోటు చేసుకున్నాయని, పెద్దస్థాయిలో రిగ్గింగ్ జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కాని షేక్ హసీనా ఎలాంటి అవకతవకలు జరగలేదంటున్నారు.బంగ్లాదేశ్ లో చాలా శాంతియుతంగా ఎన్నికలు జరిగాయని, ప్రజలు ఎంతో ఉత్సాహంతో తమ పార్టీకి ఓటేశారని ఆమె అంటున్నారు. కాని 223 స్థానాలు అవామీలీగ్ పార్టీకే లభించాయంటే ఎన్నికలు ఎంత నిష్పక్షపాతంగా జరిగాయో తెలుస్తోందని విమర్శకులు అంటున్నారు. ప్రజాస్వామిక దేశాల్లో ఇలా 96 శాతం గెలుపు ఒకే పార్టీ సాధించడం  ఉండదు.
బంగ్లాదేశ్ లో అత్యధికంగా విదేశీ పెట్టుబడులు పెడుతున్న దేశం అమెరికా. అమెరికా కూడా బంగ్లాదేశ్ ఎన్నికలపై విమర్శలు జారీ చేసింది. దక్షిణాసియాలో అత్యధికకాలం ప్రధాని పదవిలో కొనసాగిన మహిళగా షేక్ హసీనా రికార్డు సృష్టించారు. ప్రధానప్రత్యర్థి ఖాలిదా జియాను జైలు పాలు చేయడం, ఆమె కుమారుడు ప్రవాసంలో బతకడం, 2014 తర్వాతి నుంచి బిఎన్పీ పార్టీకి మిత్రపక్షాలైన జమాఅతె ఇస్లామీ వంటి పార్టీలను ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధించడం వంటి చర్యలతో షేక్ హసీనా సాధించిన విజయాన్ని అనేకమంది వేలెత్తి చూపిస్తున్నారు. వరుసగా ఆమె ఇలాంటి ఎత్తుగడలతోనే గెలుపు సాధిస్తూ వస్తున్నారు. ఈ సారి కూడా కుట్రలు, కుతంత్రాలు, ప్రతిపక్షాలపపై వేధింపులు, భారీసంఖ్యలో అరెస్టులు, నిర్బంధాలు, హింస, రాజ్యాధికారాన్ని దుర్వినియోగం చేయడం వంటి అనేక ఆరోపణలతో పాటు అతితక్కువ సంఖ్యలో ఓటర్లు ఎన్నికల్లో పాల్గొన్నారు. 2014లో కూడా అతి తక్కువ పోలింగ్ జరిగింది. అప్పుడు గెలిచిన షేక్ హసీనా గెలుపును చాలా మంది వేలెత్తి చూపించారు. దాదాపు సగం మంది అవామీలీగ్ సభ్యులు అప్పట్లో ఎలాంటి పోటీ లేకుండా గెలిచారు. ఇలాంటి విమర్శలు రాకుండా ఉండటానికి ఈ సారి కొంతమంది తమ వారినే స్వతంత్ర అభ్యర్థులుగా నిలబెట్టి గెలిపించారు.
బంగ్లాదేశ్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. దేశంలోని నిరుపేద ప్రజానీకం ఈ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందాలంటే అవామీలీగ్ కు మాత్రమే ఓటు వేయాలని, లేకపోతే ప్రయోజనాలేవీ లభించని స్థితి సృష్టిస్తామని బెదిరించినట్లు కూడా తెలుస్తోంది. సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందుతున్న వారికి ఆ ప్రయోజనాలు పొందడానికి గుర్తింపు కార్డులు జారీ చేశారు. ఎన్నికలకు ముందు ఆ కార్డులను స్థానిక అవామీలీడ్ నేతలు స్వాధీనం చేసుకుని తాము గెలిస్తేనే కార్డులు తిరిగి ఇస్తామని బెదిరించి మరీ ఓట్లు వేయించుకున్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి.
బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనా తాను బంగ్లాదేశ్ ను ఆర్థికంగా అభివృద్ధి చేశానని చెబుతున్నారు. కాని ఈ అభివృద్ధి ప్రజాస్వామ్యాన్ని పణంగా పెట్టిన అభివృద్ధిగా విమర్శకులు అంటున్నారు. ఇప్పుడు బంగ్లాదేశ్ ఆర్థికాభివృద్ధి కూడా పతనావస్థలో పడింది. విదేశీమారకద్రవ్యం 20 బిలియన్ అమెరికా డాలర్ల కన్నా తక్కువకు పడిపోయింది. వంద బిలియన్ డాలర్ల విదేశీ అప్పు ఉంది. బ్యాంకింగ్ రంగం అస్తవ్యస్తంగా మారుతోంది. నిరర్థక ఆస్తులు పెరిగిపోతున్నాయి. ద్రవ్యోల్బణం 9 శాతానికి పెరిగిపోయింది. బంగ్లాదేశ్ కరెన్సీ టాకా విలువ పడిపోతోంది. గత కొన్ని నెలలుగా దుస్తుల పరిశ్రమ ఎగుమతులు పడిపోయాయి. దేశంలో క్రోనీ కేపిటలిజం, అవినీతి వల్లనే దేశం ఆర్థిక సంక్షోభ దశకు చేరుకుంటుందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఆర్థిక సంక్షోభం ముదురుతున్న కొద్ది కార్పోరేట్లు, వ్యాపార వర్గాలు మరిన్ని మినహాయింపులు, ప్రయోజనాలు కోరుతారు. ఈ సమస్యలను అధిగమించడం ఈ సారి అంత తేలిక కాదు. ఆర్థిక సంక్షోభపరిస్థితుల వల్ల ఇప్పటికే దేశంలోని మధ్య, దిగువ తరగతి ప్రజలు తీవ్రమైన సమస్యలకు గురవుతున్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత బంగ్లాదేశ్ పరిస్థితి మరింత దిగజారింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి 4.7 బిలియన్ డాలర్ల బెయిలవుట్ కోసం ప్రయత్నించవలసి వచ్చింది.
రష్యా, చైనా దేశాలు బంగ్లాదేశ్ ఎన్నికల్లో అనవసరంగా అమెరికా, పాశ్చాత్యదేశాలు జోక్యం చేసుకుంటున్నాయని విమర్శిస్తున్నాయి. బంగ్లాదేశ్ ఇప్పుడు చైనాకు సన్నిహితమయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ప్రధాన ప్రత్యర్థి ఖాలిదా జియా పార్టీని నిషేధించడం జరగవచ్చని, అదే జరిగితే దేశంలో హింసాకాండ పెచ్చరిల్లవచ్చని పలువురు భావిస్తున్నారు. అవామీలీగ్ అధికారంలో ఉండడం అక్కడి వ్యాపారవర్గాలకు చాలా అవసరం. అలాగే విదేశీ పెట్టుబడిదారులకు కూడా ఆమె అధికారంలో కొనసాగడం అవసరం. బంగ్లాదేశ్ 2.6 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు కేవలం చైనా నుంచి పొందింది. జపాన్ పెట్టుబడులు కేవలం 380 డాలర్లు మాత్రమే. అవామీలీగ్ అధికారంలో ఉండడం చైనాకు మంచిది. అందువల్లనే నిరంకుశ విధానాలతో ప్రతిపక్షాలను పూర్తిగా తుడిచేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
ఒకప్పుడు బంగ్లాదేశ్ లో ప్రజాస్వామ్యాన్ని కాపాడ్డం కోసం పోరాడిన షేక్ హసీనా ఇప్పుడు బంగ్లాదేశ్ లో ప్రజాస్వామ్యా్ని తుడిచేసేలా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు పెరుగుతున్నాయి. బంగ్లదేశ్ ప్రజాస్వామ్యం షేక్ హసీనా హయాంలో ఎలాంటి మలుపుతు తిరుగుతుందో వేచి చూడాలి.