April 29, 2024

బిల్కిస్ బాను కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చరిత్రలో నిలిచిపోతుంది. ఈ తీర్పు చాలా ప్రత్యేకమైనది. మహిళాన్యాయవాదులు ఒక మహిళ కోసం చేసిన పోరాటంలో ఒక మహిళాన్యాయమూర్తి ఇచ్చిన తీర్పు ఇది. బాధిత మహిళ బిల్కిస్ బాను చెక్కుచెదరని ధైర్యంతో చేసిన న్యాయపోరాటం ప్రశంసించదగింది.

అగష్టు 2022లో ఒకవైపు ప్రధాన మంత్రి నారీశక్తి గురించి మాట్లాడుతున్నప్పుడే గుజరాత్ ప్రభుత్వం బిల్కిస్ బాను సామూహిక అత్యాచారం, మూడేళ్ళ పసికందు సహా 14 మంది ఆమె బంధువులను హత్య చేసిన కేసులో నేరస్తులకు క్షమాభిక్ష ప్రసాదించి విడుదల చేసింది. గుజరాత్ ఫ్రభుత్వ నిర్ణయాన్ని పలువురు మహిళలు సుప్రీంకోర్టులో సవాలు చేశారు. సిపిఎం నేత సుభాషిణీ అలీ, ప్రొఫెసర్ రూప్ లేఖ వర్మ, జర్నలిస్టు రేవతి కౌల్, తృణమూల్ కాంగ్రెస్ ఎం.పీ. మహువా మొయిత్రా, మాజీ పోలీసు అధికారిణి మీరాన్ చందా బోర్వాంకర్లు ఈ పిటీషన్ వేశారు. న్యాయవాది శోభ గుప్తా ఈ కేసులో వాదించారు. సీనియర్ న్యాయవాదులు ఇందిరా జైసింగ్, వృందాగ్రోవర్, అపర్ణ భట్ తదితరులు కూడా కేసులో పాల్గొన్నారు. ఈ మహిళలందరూ న్యాయం కోసం అద్భుతమైన పోరాటపటిమ చూపించారు. జస్టిస్ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ఈ కేసులో తీర్పు చెప్పారు. ఈ కేసులో నేరస్తులు 11 మందికి జీవితఖైదు విధించారు. కాని గుజరాత్ ప్రభుత్వం వారికి క్షమాభిక్ష ప్రసాదించి విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం కూడా గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది. ఇప్పుడు కోర్టు నేరస్తులను తిరిగి జైలుకు పంపాలని ఆదేశించింది. అయితే ఈ నేరస్తులు ఇప్పుడ పరారీలో ఉన్నారట. వాళ్ళను తిరిగి జైలుకు పంపిస్తారా?
జాతీయ నేరగణాంకాల ప్రకారం మహిళలపై నేరాలు పెరుగుతున్నాయి. అత్యంత హీనమైన నేరాలు జరుగుతున్నాయి. మణిపూర్ లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించారు. వారిపై అత్యాచారాలు జరిగి ఉంటాయని కూడా వార్తలు వచ్చాయి. ఒలింపిక్స్ లో దేశానికి మెడల్స్ సాధించిన క్రీడాకారిణి కూడా రెజ్లింగ్ ఫెడరేషన్ అధినేత  లైంగిక వేధింపులకు పాల్పడ్డారని న్యాయం కోసం ఆక్రోశించవలసిన పరిస్థితి వచ్చింది. బెనారస్ హిందూ యూనివర్శిటీలో ఒక విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఆమెను తుపాకితో బెదిరించి వివస్త్రను చేసి వీడియో తీశారు. ముగ్గురు నిందితుల్లో ఇద్దరికి బీజేపీ సోషల్ మీడియా సెల్ తో సంబంధాలున్నాయని తెలిసింది. ఇవన్నీ ఇటీవలి సంఘటనలు మాత్రమే.
బిల్కిస్ బాను నేరస్తులకు గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసిన తర్వాత వారికి విశ్వహిందూ పరిషద్ కార్యాలయంలో పూలమాలలు వేసి ఘనసత్కారం, సన్మానాలు చేసిన వార్తలు అప్పట్లో వచ్చాయి. ఈ వార్తలు ఎలాంటి కొత్త భారతదేశాన్ని ఆవిష్కరిస్తున్నాయి.
సుప్రీంకోర్టు తీర్పు తర్వాత బిల్కిస్ బాను చెప్పిన మాటలు గమనార్హమైనవి. దేశంలో చట్టబద్దపాలన అన్నింటికన్నా ముఖ్యమైనది కావాలి. చట్టం ముందు అందరూ సమానులుగా ఉండాలన్నదే దేవునితో నా ప్రార్థన అన్నారామె.