April 29, 2024

ఢిల్లీలో 2020లో అల్లర్లు జరిగాయి. అత్యంత భయంకరంగా జరిగిన ఈ అల్లర్లలో 50 మంది మరణించారు. ఇందులో ఎక్కువమంది ముస్లిములే. హిమాచల్ ప్రదేశ్ కు చెందిన మయాంక్ రావత్ అనే 27 సంవత్సరాల యువకుడు ఈ అల్లర్లలో హింసాకాండ, మతతత్వాలను చూసి చలించిపోయాడు. సోషల్ మీడియాలో ముస్లిం వ్యతిరేక విద్వేషప్రచారం అతడిని ఆలోచింపజేసింది. విద్వేష వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడం చూశాడు. మయాంక్ ఇది భారతీయత కాదనుకున్నాడు. అమెరికా ర్యాప్ సంగీతకళాకారుడు జోయ్నర్ లూకాస్ కు అభిమాని అయిన మయాంక్ ర్యాప్ ఐడి పేరుతో తన స్వంత ర్యాప్ తయారు చేసి విడుదల చేశాడు.

మయాంక్ రావత్ హిందువు. మతవిద్వేషాన్ని, సమాజంలో విభజనలను అడ్డుకోవడం అవసరంగా భావించాడు. ఈ విషప్రచారాలు సమాజాన్ని నాశనం చేస్తాయని అనుకున్నాడు. ప్రజల్లో చైతన్యం పెంచడానికి తన స్థాయి ప్రయత్నం చేశాడు. మతవిద్వేష వాతావరణానికి వ్యతిరేకంగా అనేక ర్యాప్ స్వరాలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. మనం మనుషులమన్నది ఎల్లప్పుడు గుర్తుంచుకోవాలని మయాంక్ అన్నాడు.
2019లో పౌరచట్ట సవరణ చట్టం వచ్చింది. మతపరమైన పక్షపాతంతో ఉన్న ఈ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు పెల్లుబికాయి. తన మతసముదాయానికి చెందినవారు పెద్ద సంఖ్యలో ఈ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు చేయడాన్ని పదిహేడేళ్ళ వయసులో చూశాడు అబ్దుర్రహ్మాన్ షేక్. ముంబయి ధారవిలో నివసిస్తుంటాడు. అప్పటి నుంచి భారత ముస్లిముల పరిస్థితిపై ర్యాప్ గీతాలు రాయడం ప్రారంభించాడు. అల్లర్లు, విద్వేషనేరాలు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, మతస్వేచ్ఛ అంతరిస్తుండడం తదితర అంశాలపై రాశాడు.  ముస్లిముల హక్కుల గురించి, బలహీన వర్గాల గురించి మాట్లాడం ప్రారంభించాడు. అతని గీతాలకు మొదట్లో పెద్దస్థాయిలో ప్రజాదరణ లభించింది. ప్రజాదరణతో పాటు మతతత్వ శక్తుల బెదరింపులు కూడా రావడం ప్రారంభమయ్యింది. హత్యచేస్తామన్న బెదిరింపులు కూడా వచ్చాయి.
ఇస్లామిక్ కౌన్సిల్ ఆప్ విక్టోరియా ప్రకారం 2022లో  ప్రపంచంలో అత్యధికంగా ఇస్లామ్ విద్వేష ప్రచారం నడుస్తున్న దేశాలు మూడు. అమెరికా, బ్రిటన్, ఇండియా. ఇస్లామును టెర్రరిజంతో ముడివేసి ప్రచారం చేయడం, ముస్లిములు లైంగిక నేరాలు చేస్తారన్నట్లు చూపించడం, పాశ్చాత్యదేశాల్లో అయితే ముస్లిములు శ్వేతజాతీయుల కన్నా మించిపోతారన్న ప్రచారం, ఇండియాలో అయితే హిందువుల కన్నా మించిపోతారన్న ప్రచారం, హలాల్ అమానుషం అని చెప్పడం వగైరాలు అన్ని చోట్లా ఈ విద్వేష ప్రచారంలో కనిపిస్తాయి. ముస్లిం వ్యతిరేక విద్వేష ట్వీట్లలో 55.12 శాతం ఇండియా నుంచే వస్తున్నాయని కూడా తెలుస్తోంది.
ఈ సంవత్సరం ప్రారంభంలో సాహిల్ వాల్మిక్ అనే కొత్త ర్యాప్ కళాకారుడు తెరపైకి వచ్చాడు. దేశంలో ముస్లిం వ్యతిరేక రాజకీయాలను, ప్రచారాలను గమనిస్తూ వచ్చాడు. చానళ్ళలో జరుగుతున్న చర్చలను చూస్తూ వచ్చాడు. వాల్మిక్ తండ్రికి ప్రత్యేకంగా ఎన్నడూ ముస్లిములపై వ్యతిరేకత లేదు. కాని అలాంటి వ్యక్తి కూడా ముస్లిములపై విద్వేషం పెంచుకుని ఎన్నో ఏళ్ళుగా తమ ఇంటికి పాలు తెచ్చి ఇస్తున్న ముస్లిం పాలవాడితో అనుచితంగా వ్యవహరించడాన్ని వాల్మిక్ చూశాడు. ఈ విద్వేష వరదను ఆపడానికి ఏదైనా చేయాలనుకున్నాడు. ప్రధానస్రవంతి మీడియాలో వస్తున్న ప్రచారాలను ఖండిస్తూ ర్యాప్ గీతాలు రాసి విడుదల చేశాడు.
మధ్యప్రదేశ్ కు చెందిన మీర్జా సుహేల్ బేగ్ ఈ వాతావరణాన్ని చక్కదిద్దడానికి నయీ సోచ్ పేరుతో ర్యాప్ గీతాలకు కలమెత్తాడు. తనతో కలిసి పెరిగిన హిందూ మిత్రులు ప్రస్తుత విద్వేష వాతావరణంలో తనకు దూరమవ్వడాన్ని అతను భరించలేకపోయాడు. కోవిడ్  వచ్చినప్పుడు జరిగిన ప్రాపగాండ చూశాడు. ముస్లిములను ఆర్థికంగా బాయ్ కాట్ చేయాలన్న పిలుపులు విన్నాడు. మతతత్వ రాజకీయాలు చేస్తున్న నేతలను గుడ్డిగా నమ్మవద్దంటూ ర్యాప్ గీతాలు రాశాడు.
ఒకవైపు మయాంక్, షేక్, వాల్మిక్ వంటి ర్యాప్ కళాకారులు శాంతియుత సహజీవనాల భారతదేశం కోసం రాస్తుంటే మరోవైపు విద్వేషాన్ని ర్యాప్ గీతాల్లో నింపుతున్నారు.
శాంతియుత సహజీవనమే నిజమైన భారతీయతగా తప్పక నిలబడుతుందని ఆశిద్దాం.