November 21, 2024

మోడీ ప్రభుత్వం వరుసగా భారతరత్న అవార్డులు ప్రదానం చేస్తోంది. ఈ సంవత్సరం మొత్తం ఐదుగురికి భారతరత్న ఇవ్వడం జరిగింది. గతంలో ఎప్పుడు ఒకే సంవత్సరం ఇంతమందికి భారతరత్న ఇచ్చింది లేదు. మాజీ ప్రధాని పి.వి.నరసింహరావుకు భారతరత్న ఇచ్చి సత్కరించింది. తెలుగుబిడ్డకు భారతరత్న లభించడం తెలుగువారందరు సంతోషించదగిన విషయం.

పి.వి.నరసింహరావు సుదీర్ఘ రాజకీయ జీవితంలో అనేక విజయాలు సాధించారనడంలో సందేహం లేదు. స్వేచ్ఛా విపణికి రెడ్ కార్పెట్ పరిచింది ఆయనే. ఒక మైనారిటీ ప్రభుత్వాన్ని ఐదేళ్ళపాటు నడిపించిన ఘనత ఆయనది. భారతరత్న ఆయనకు లభించిన సందర్భంలో ఎంత కాదన్న మూడు విషయాలు గుర్తుకు వస్తున్నాయి.
అందులో మొదటిది 1984లో ఢిల్లీలో జరిగిన సిక్కుల ఊచకోతలు. అప్పుడు కేంద్ర హోంమంత్రి ఆయనే. ఈ అల్లర్లలో మూడువేలకు పైబడి మరణించారు. అప్పుడు కేంద్రంలో ఉన్నది కాంగ్రెసు ప్రభుత్వం. ఈ విషయమై కాంగ్రెసు ప్రభుత్వాన్ని, రాజీవ్ గాంధీని, రాహుల్ గాంధీని అనేకసార్లు అనేకమంది ప్రశ్నించారు. కాని అప్పటి హోంమంత్రిగా పి.వి. చేసిందేమిటి? పోలీసులు ఈ ఊచకోతలను చోద్యం చూశారన్న వార్తలు కూడా అప్పట్లో వచ్చాయి. పదిహేడు భాషలు మాట్లాడగలిగిన పీ.వీ. ఢిల్లీ తగలబడుతుంటే ఏ ఒక్క భాషలో కూడా మాట్లాడలేదు. పీ.వీ.ని సమర్ధించే వారు ఆయన చేతుల్లో ఏమీ లేదని, గాంధీ నెహ్రూ కుటుంబం మొత్తం కథ నడిపించిందని వాదించవచ్చు. కాని కాంగ్రెసు తరఫున రెండు సార్లు ప్రధానిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ స్వయంగా సిక్కు మతస్తుడు. ఆయన మాటల ప్రకారం ఢిల్లీ అల్లర్లను అదుపు చేయడానికి సైన్యాన్ని పిలవాలన్న విజ్ఞప్తులను పీ.వీ. పెడచెవిన పెట్టారు.
మరచిపోలేని మరో సంఘటన 1992 బాబరీ మస్జిదు కూల్చివేత. డిసెంబరు 6వ తేదీన కూల్చివేత జరిగింది. అప్పుడు పీ.వీ.నరసింహరావు ప్రధాని. ఎల్.కే.అద్వానీ రథయాత్ర పొడవునా మతఘర్షణలు అట్టుడికి పోతున్నప్పటికీ రథయాత్రను ఆపడానికి ఆయనేమీ చేయలేదు. బాబరీ మస్జిదు కూల్చివేతను అడ్డుకోడానికి ఆయన ఏమీ చేయలేదు. లాలూ యాదవ్ బీహారులో అద్వానీని అరెస్టు చేసి చూపించారు. పి.వీ.నరసింహరావు ఉద్దేశ్యపూర్వకంగా ఏమీ చేయకుండా తమాషా చూస్తూ కూర్చున్నారని పలువురు విశ్లేషించారు, పలువురు అభిప్రాయపడ్డారు. బాబరీ కూల్చివేత జరుగుతున్నప్పుడు ప్రధానిగా ఆయన ఎవరికి అందుబాటులో లేరు. ఆయన పూజలో బిజిగా ఉన్నారని అసదుద్దీన్ ఒవైసీ ఇటీవల పార్లమెంటులో చెప్పారు. బహుశా అందుకేనేమో మణిశంకర్ అయ్యర్ ఒకసారి పీ.వీ.గురించి మాట్లాడుతూ ‘‘భారతదేశానికి మొదటి బీజేపీ ప్రధాని పీ.వీ’’ అన్నారు. బాబరీ మస్జిద్ కూల్చివేత సంఘటన ఆ తర్వాత బీజేపీ విజయాలకు సోపానమయ్యింది.
ఓటుకు నోటు కేసు ఎవరికైనా గుర్తుందా? 1993లో పీ.వీ.ప్రభుత్వం అవిశ్వాస తీర్మానానికి గురైంది. ఝార్ఖండ్ ముక్తి మోర్చా, జనతాదళ్ ఎం.పీ.లకు లంచమిచ్చి అవిశ్వాస తీర్మానం నుంచి గట్టెక్కారనే బలమైన ఆరోపణలు వచ్చాయి. కేవలం 14 ఓట్లతో అవిశ్వాస తీర్మానం నుంచి గట్టెక్కారు. పీ.వీ.ప్రభుత్వంలో పెచ్చరిల్లిన అవినీతి విషయమై ఈ అవిశ్వాస తీర్మానం వచ్చింది. సిపిఐకి చెందిన ప్రకాష్ కరాత్ దీని గురించి వ్యాఖ్యానిస్తూ సూటుకేసులు సృష్టించిన సమస్యను సూటుకేసుతో పరిష్కరించారని చెప్పారు. సిబిఐ ఈ కేసును చేపట్టింది. విచారణ జరిగింది. చివరకు కోర్టు పీ.వీ.ని దోషిగా నిర్ధారించి మూడేళ్ళ జైలు శిక్ష కూడా విధించింది. అలా శిక్షపడిన మొదటి ప్రధాని కూడా ఆయనే. తర్వాత ఉన్నత న్యాయస్థానం నుంచి  ఆయనకు ఊరట లభించింది.
నిజానికి 1991లో ఇక రాజకీయాల నుంచి విరమించుకునే నిర్ణయానికి వచ్చిన పీ.వీ. అకస్మాత్తుగా లోక్ సభ ఎన్నికల మధ్యలో రాజీవ్ గాంధీ దారుణ హత్యకు గురికావడంతో, సోనియాగాంధీ ప్రధాని పదవి స్వీకరించడానికి ఆసక్తి చూపకపోవడంతో, అప్పటి రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ప్రధాని అయ్యారు.
లిబరలైజేషన్ ద్వారా భారత ఆర్థికవ్యవస్థను పీ.వీ. నిలబెట్టారు.  పీ.వీ.కాలంలో మన్మోహన్ సింగ్ ఆర్థికమంత్రిగా భారత ఆర్థికవ్యవస్తను పట్టాలెక్కించారు. నేడు మనం చూస్తున్న భారతఆర్థిక ప్రగతి నాటి సంస్కరణల ఫలితమే అని చెప్పాలి. పంజాబులో ఉగ్రవాదాన్ని అణిచేసిన ఘనత ఆయనదే. 1998లో వాజపేయి ప్రభుత్వం అణుపరీక్షలు నిర్వహించింది. కాని ఆ అణుపరీక్షల కార్యక్రమాన్ని ప్రారంభించింది పీ.వీ.యే. అంతకుముందు ఉక్కుమహిళ ఇందిరాగాంధీ కాలంలో పోఖ్రాన్ లో అణుపరీక్షలు నిర్వహించడం జరిగింది.