April 14, 2024

గుజరాత్ ఎన్నికలు డిసెంబరులో జరగబోతున్నాయి. రాహుల్ గాంధీ గుజరాత్ వ్యతిరేకి అని బీజేపీ అధ్యక్షుడు నడ్డా విమర్శించారు. దీనికి కారణమేమిటంటే, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో నర్మదా బచావో ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న మేధాపాట్కర్ పాలుపంచుకోవడం. మేధాపాట్కర్ అభివృద్ధి వ్యతిరేకి, ఆమె భారత్ జోడో యాత్రలో పాల్గొన్నది కాబట్టి రాహుల్ గాంధీ గుజరాత్ వ్యతిరేకి. ఈ అభివృద్ధిలో ఆదివాసీలు ఎక్కడ? అనే ప్రశ్నకు జవాబు దొరకదు.

నిజానికిప్పుడు గుజరాత్ లో కాంగ్రెసు పార్టీ పరిస్థితి దయానీయంగానే ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ బలం పుంజుకుంది. గుజరాత్ లో కాంగ్రెసుకు ప్రచారం చేస్తున్న రాజస్థాన్ ముఖ్యమంత్రి గెహ్లాట్ తాము క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నామని అన్నారు. ఏబిపి-సివోటర్ సర్వే ప్రకారం చూస్తే బీజేపీకి 135 నుంచి 143 స్థానాలు లభిస్తాయి. అంటే గతంలో కన్నా ఎక్కువ స్థానాలు. కాంగ్రెసు ఓట్ల శాతం తగ్గిపోయే సూచనలున్నాయి. గుజరాత్ లో ప్రచారం నిర్వహంచే ఆర్థిక స్తోమత కూడా పార్టీకి లేదు. కాబట్టి ఇంటింటికి ప్రచారం చేయడంతోనే సరిపెట్టుకుంటోంది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర గుజరాత్ నుంచి ప్రారంభిస్తే బాగుంటుందని అప్పట్లో చాలా మంది గుజరాత్ కాంగ్రెసు నేతలు భావించారు. కాని రాహుల్ గాంధీ గుజరాత్, హిమాచల్ ఎన్నికల కంటే తన భారత్ జోడో యాత్రకే ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చారు. ఇది రాజకీయంగా తెలివైన నిర్ణయమా కాదా అనేది వేరే విషయం.

గమనించవలసిన విషయమేమిటంటే, కాంగ్రెసుపార్టీకి, రాహుల్ గాంధీకి దేశంలోని జాతీయ మీడియాలో జాగా లేదని తెలిసిపోతోంది. తుకడే తుకడే గ్యాంగులనే వార్తలకు ఉన్న ప్రాముఖ్యం టీవీల్లో జోడో యాత్రకు లేదు. జైల్లో ఉన్న ఆప్ మంత్రికి మాసాజ్ గురించిన వార్తకు ప్రాముఖ్యం ఉంది. శ్రద్ధ హత్య కేసులో డమ్మీ నార్కో టెస్టులు, నాటకీయ రూపాంతరణలతో టీవీ స్క్రీనులు హోరెత్తతున్నాయి కాని గుజరాత్ లో రాహుల్ గాంధీ మొదటిసారిపాల్గొన్న ఎన్నికల ర్యాలీ గురించి కేవలం ఒక సౌండ్ బైట్ చాలనుకున్నాయి.

రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధం ప్రపంచయుద్ధంగా మారుతుందా? ఉక్రెయిన్ ఎంత సాహసంగా పోరాడుతుంది? రష్యా ఎంత బీభత్సం సృష్టిస్తోంది వగైరా వార్తలకు ప్రాముఖ్యం లభించింది. ఉక్రెయిన్ పొరబాటున పోలండ్ పై వేసిన మిస్సయల్ వార్తకు అధిక సమయం లభించింది. కాని భారత్ జోడో యాత్రకు క్షణం కూడా దొరకడం లేదు.

జాతీయ మీడియాగా చెప్పుకునే చాలా చానళ్ళ ధోరణి ఇలాగే ఉంది. సంచలనాత్మకమైతేనే వార్తగా మారింది. టీవీ డిబేట్లలో వినేవారికి అర్థం కాకుండా ఒకరిపై ఒకరు అరుచుకునే చర్చలకు చాలా సమయం ఉంది. జాకిర్ నాయక్ ను ఖతర్ ఫుట్ బాల్ పోటీలకు ఆహ్వానించిందనే వార్తపై టీవీల్లో వాడి వేడి చర్చలు జరిగాయి. కాని సూరత్ లో రాహుల్ సభల వార్తలు కనిపించలేదు.

ఒకే సారి రాహుల్ గాంధీ గురించిన వార్త ప్రముఖంగా వచ్చింది. అది ఎప్పుడంటే సావర్కర్ పై రాహుల్ విమర్శలు సంధించినప్పుడు.

సావర్కర్ గురించి రాహుల్ గాంధీ మాట్లాడుతూ సావర్కర్ బ్రిటీషు వారికి క్షమాపణ పత్రం రాశాడని, ఆయనేమీ వీరుడు కాదని అన్నాడు. ఈ మాటలేమీ కొత్త కాదు. అండమాన్ జైలులో ఉన్నప్పుడు సావర్కర్ బ్రిటీషు వారికి క్షమాభిక్ష కోసం లేఖలు రాసారని చాలా మంది చెబుతూనే ఉన్నారు. అలాగే ఆయన లేఖల్లో ’యువర్ ఒబిడియంట్ సర్వెంట్‘ అనేపదాలు ఉపయోగించిన విషయం కూడా నేడు కొత్తగా బయటపడిందేమీ కాదు. సావర్కర్ స్వంత రాష్ట్రంలో ఈ మాటలు రాహుల్ గాంధీ ఎందుకు చెప్పారనేది ఆయన రాజకీయ విజ్ఞత. శివసేనతో మైత్రి చెడుతుందని తెలిసినా ఆయన ఈ మాటలు చెప్పాడు. పైగా బీజేపీ విమర్శనాస్త్రాలు సంధించే అవకాశం ఆయన ఇచ్చాడు. కాని మరోవైపు గాంధీజీ మునిమనుమడు తుషార్ గాంధీ ఈ చర్చలోకి ప్రవేశించి రాహుల్ గాంధీచి మద్దతివ్వడం, సావర్కర్ పై ట్వీట్లు చేయడంతో ఒక కొత్త చర్చ ప్రారంభమైంది. ఏది ఏమైనా రాహుల్ గాంధీ ఈ విమర్శ వల్ల కాంగ్రెసు తన మిత్రపక్షం శివసేనకు కోపం తెప్పించింది. అంటే జోడో స్ఫూర్తికి ఈ వ్యాఖ్య విరుద్దమైనది. సంచలనాత్మకమైనది, వివాదాలకు ఆస్కారమున్న వార్త కాబట్టి వెంటనే టీవీ కెమెరాల కళ్ళు విచ్చుకున్నాయి.

యాత్ర దక్షిణాది నుంచి ప్రారంభమైంది కాబట్టి, ఈ సోకాల్డ్ జాతీయ చానళ్ళు ఎక్కువగా ఉత్తరాది వార్తలకే ప్రాముఖ్యం ఇస్తాయి కాబట్టి మొదట్లో జోడో యాత్రపై దృష్టి పెట్టలేదని అనుకున్నప్పటికీ ఇప్పుడు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ లలో యాత్ర ప్రవేశించినా, ఈ రాష్ట్రాల్లో కాంగ్రెసుకు ఇప్పటికి కూడా చెప్పుకోదగ్గ బలం ఉన్నప్పటికీ జాతీయ చానళ్ళకు జోడో యాత్ర కనిపించడం లేదు. నేరాలు ఘోరాల వార్తలకు ప్రాముఖ్యం ఉంది. కాని సమాచార సాధనాలు ఈ జాతీయ చానళ్ళు మాత్రమే కాదు కాబట్టి ఇతర సాధనాలు కూడా ఉన్నాయి కాబట్టి భారత్ జోడో యాత్రకు ప్రజల స్పందన ఊహించిన దాని కన్నా ఎక్కువగా ఉందనేది స్పష్టంగా అర్థమవుతోంది. అయినప్పటికీ ఈ జాతీయ చానళ్ళు ఎందుకు ఈ యాత్రను కవర్ చేయడం లేదు? ఎందుకంటే ఇది ప్రధాని నరేంద్రమోడీకి సంబంధించిన వార్త కాదు కాబట్టి. లేదా హోంమంత్రి అమిత్ షాకు సంబంధించిన వార్త కాదు కాబట్టి. పైగా ఇప్పుడు మీడియా దృష్టిలో గుజరాత్ లో ప్రధాన పార్టీలు రెండే బీజేపీ, ఆప్ కాబట్టి. పైగా రాహుల్ గాంధీకి, కాంగ్రెసుకు మీడియాతో సత్సంబంధాలేమీ లేవు కాబట్టి.

మీడియాలో కాంగ్రెసుకు ప్రాముఖ్యం లభించడం లేదన్నది స్పష్టం. కాని కాంగ్రెసు ఈ విషయాన్ని పట్టించుకుంటుందా? నెగిటివ్ వార్తల కన్నా అస్సలు కాంగ్రెసు గురించి వార్తలే లేకపోవడం మేలని భావిస్తుందా?

రాహుల్ గాంధీని జోకర్ గా చూపించే ప్రయత్నాలు వరుసగా జరుగుతూనే ఉన్నాయి. ఈ జోడో యాత్ర సందర్భంగా కూడా అవి జరిగాయి. ఉదాహరణకు ఆయన్ను సద్దాం హుస్సేన్ లా కనిపిస్తున్నాడని వ్యాఖ్యానించడం వగైరా. ఈ వైఖరి గత రెండు దశాబ్దాలుగా రాజకీయంగా బీజీపికి లాభించింది. పప్పు లాంటి పదాలు చక్కర్లు కొట్టాయి. కాని ఇప్పుడు ఈ వ్యూహం బెడిసికొట్టే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. రాహుల్ గాంధీ వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నాలు కూడా ఇప్పుడు జరుగుతున్నాయి.

కొంతకాలం క్రితం ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్ విద్యార్థులతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ తన తండ్రిని హతమార్చిన హంతకులను తాను క్షమించానని అన్నాడు. ఎల్టీటీయి కమాండర్ ప్రభాకరన్ ను భద్రతాదళాలు కాల్చి చంపినప్పుడు తాను ప్రభాకరన్ పిల్లల గురించి ఆలోచించానని చెప్పాడు. ఆ పరిస్థితి, ఆ బాధ ఎలాంటిదో తనకు తెలుసని అన్నాడు.

విద్వేష ప్రసంగాలు మామూలై పోయిన కాలంలో క్షమించడం, ఇతరుల బాధ గురించి మాట్లాడడం తాజాగాలి. కాని రాహుల్ గాంధీ చెప్పిన ఆ మాటలు అప్పట్లో పెద్దగా మీడియాలో రాలేదు.

తన పినతండ్రి ప్రమాదంలో మరణించినప్పుడు రాహుల్ వయసు 10 సంవత్సరాలు. తన నాయనమ్మ ఇందిరా గాంధీ హత్య జరిగినప్పుడు అతని వయసు 14 సంవత్సరాలు. తనకు తెలిసిన వారే, తాను ఎవరితో కలిసి బాడ్మింటన్ ఆడేవాడో ఆ వ్యక్తులే తన నాయనమ్మను హతమార్చడాన్ని చూశాడు. తన తండ్రి రాజీవ్ గాంధీ హత్యను చూశాడు. తన తల్లిని విదేశీ వనితగా చీత్కరించడాన్ని చూశాడు. 2004లో తన తల్లికి ప్రధాని అయ్యే అవకాశం వచ్చినప్పుడు, ఆమె ప్రధాని అయితే తలగొరిగించుకుని గుండు చేయించుకుంటానంటూ వీరంగాలు వేసిన నేతల విద్వేష విషాన్ని చూశాడు. పప్పు అంటూ హేళనలు చేయడాన్ని భరించాడు. క్లిష్ట పరిస్థితులు విషాదాల నుంచి రూపుదిద్దుకున్న తన వ్యక్తిత్వం ఎలా ఉందో ఇప్పుడు భారత్ జోడో యాత్ర ద్వారా దేశప్రజలందరూ చూసే అవకాశం లభించింది.

దక్షిణాది నుంచి ఈ యాత్ర ప్రారంభించడం కూడా ఆసక్తికరమైన అంశం. ఎందుకంటే ఒక్క కర్నాటక తప్ప దక్షిణాదిలో ఇప్పుడు కాంగ్రెసుకు మరే రాష్ట్రంలో కూడా ఉనికి లేదని చెప్పాలి. పశ్చిమం నుంచి తూర్పుకు యాత్ర ప్రారంభించి ఉంటే కనీసం ఏడు రాష్ట్రాల్లో కాంగ్రెసు బలంగా ఉన్న ప్రాంతాల నుంచి ప్రయాణించి ఉండేవారు. కాని ఇప్పుడు దక్షిణాదిలో భారత్ జోడో యాత్రకు బలమైన స్పందన లభించిందని వార్తలు వచ్చాయి.

మరోవైపు మల్లికార్జున ఖర్గే కాంగ్రెసు అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టారు. ఆయన అద్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించే కార్యక్రమంలో పాల్గొనడానికి రాహుల్ ఢిల్లీ వచ్చారు.

గాంధీ నెహ్రూల పట్ల బీజేపీ నేతలు చేస్తున్న, గతంలో చేసిన వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫేక్ వార్తలు అన్నింటిని పరిశీలిస్తే క్లుప్తంగా అర్థమయ్యేదేమంటే, గాంధీనెహ్రులు హిందువులు కాదు. వారికి హిందువులుగా చెప్పుకునే కోరిక లేదు, వారు అసలు మన సంస్కృతికి చెందిన వారు కాదు, పరాయి వారు. పరాయీకరించడమే రాజకీయ వ్యూహంగా మారిన నేపథ్యంలో భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీని భారత రాజకీయాల్లో హీరో చేస్తుందా జీరో చేస్తుందా? అనేది వేచి చూడాలి.

దక్షిణాదిలో భారత్ జోడో యాత్రకు లభించిన ప్రజాస్పందన చాలా మందిని ఆశ్చర్యానికి గురి చిసంది. కాంగ్రెసు శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. కాని జోడో యాత్ర ఎన్నికల గెలుపు అవుతుందా అంటే చాలా కష్టమనే చెప్పాలి. కాని మునుగుతున్న కాంగ్రెసు పడవను మునగకుండా కాపాడిందినేది వాస్తవం.

రాహుల్ గాంధీ గతంలో తన హిందూ గుర్తింపును చాటి చెప్పుకోడానికి గుళ్ళు పర్యటించాడు. కాని రాహుల్ గాంధీ కేవలం గుడుల దర్శనం మాత్రమే చేయగలడు. నరేంద్రమోడీ కొత్త మందిరాలు కట్టించగలడు. ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నాడు. కాబట్టి బీజేపీని గుళ్ళు గోపురాల వ్యవహారంలో అధిగమించడం కాంగ్రెసు తరం కాదు. పైగా రాహుల్ గాంధీ వరుసగా కాంగ్రెసుకు పరాజయాలు కట్టబెట్టాడు.

కాని ఇప్పుడు భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ రాజకీయంగా తాను ఎక్కడ ఉండాలో అక్కడ, అంటే ప్రజల మధ్య ఉన్నాడు. యాత్ర తర్వాత అనేక రాష్ట్రాల్లో రాహుల్ ప్రజాదరణ రేటింగులు పెరిగాయి. సి వోటర్ సర్వే గురించి వార్తలు వచ్చాయి. కేరళ,తమిళనాడు, కర్నాటక, తెలంగాణా, ఆంధ్రప్రదేశ్,మహారాష్ట్రల గుండా యాత్ర ఉత్సాహంగా సాగుతోంది. పప్పుగా పిలిచిన వారు ఇప్పుడు నోరెళ్ళబెట్టి చూసే పరిస్థితి వచ్చింది. నిన్నటి వరకు కాంగ్రెసు ఎక్కడుంది? అనే ప్రశ్న వినిపించేది. ఇప్పుడు కాంగ్రెసు ప్రతి రోడ్డుపై కనిపించింది. ఈ కసరత్తు ఓట్లపంట పండిస్తుందా లేదా అన్నది వేచి చూడాలి. కాని ప్రతి రోడ్డుపై ప్రజలకు కనిపిస్తున్న కాంగ్రెసు జాతీయ చానళ్ళ కెమెరాల కళ్ళకు ఎప్పుడు కనిపిస్తుందో కూడా వేచి చూడాలి.