November 1, 2024

నవంబర్ 24వ తేదీకి అస్సాం చరిత్రలో ఒక ప్రాముఖ్యం ఉంది. అస్సామీలు అమితంగా గౌరవించే లాచిత్ బోరఫుకాన్ అనే వీరుడి 400వ జయంతి ఆ రోజు. అస్సాంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. ఏడాదంతా జయంతి ఉత్సవాలు జరపాలని నిర్ణయించింది.

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ స్వయంగా ఈ ఉత్సవాలు ఫిబ్రవరిలో ప్రారంభించారు. నవంబరులో ఢిల్లీలో కార్యక్రమాలు జరపాలని నిర్ణయించారు. నవంబర్ 24న జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోడీ పాల్గొని లచిత్ బోర్పుకాన్ కు నివాళులు అర్పించారు. ఛత్రపతి శివాజీకి లభించిన గుర్తింపు లచిత్ బోర్పుకాన్ కు లభించలేదని అస్సాం ముఖ్యమంత్రి హేమంత బిశ్వ శర్మ ఆవేదన వ్యక్తం చేశాడు.

ముగల్ సైన్యాలను ఓడించిన వీరుడిగా అస్సామీలు బోర్పుకాన్ ను గౌరవిస్తారు. 1671లో జరిగిన సరాయ్ ఘాట్ యుద్ధంలో ఆయన విజయం సాధించాడు. అస్సాంలో బీజేపీ బోర్పుకాన్ ను ముస్లిం దురాక్రమణలను తిప్పికొట్టిన వీరుడిగా ప్రచారం చేస్తోంది.

కాని చరిత్రకారులు ఏమంటున్నారన్నది చూడాలి. బోర్పుకాన్ చరిత్రను మతతత్వ రాజకీయాలకు వాడుకోవడాన్ని చాలా మంది నిరసిస్తున్నారు. అస్సాంలోని ఆహోం రాజ్యానికి, ముగల్ సామ్రాజ్యానికి మధ్య 1671లో జరిగిన యుద్ధంలో మతకోణం లేదంటున్నారు. ఇది హిందువులకు ముస్లిములకు మధ్య జరిగిన యుద్ధం కానే కాదు. 17వ శతాబ్దంలో ముగల్ పాలకులు అస్సాంలోకి సామ్రాజ్యాన్ని విస్తరించాలనుకున్నారు. అహోం రాజ్యం 600 సంవత్సరాల చరిత్ర కలిగిన రాజ్యం. ప్రతిఘటించింది. అహోం సైన్యాలకు బోర్పుకాన్ సైన్యాధ్యక్షుడు. ఔరంగజేబు పంపిన సైన్యాన్ని ఆయన తిప్పికొట్టాడు. ఇక్కడ గమనించవలసిన విషయమేమిటంటే, అస్సం దిబ్రూగఢ్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ జహ్నబి గోగోయ్ ప్రకారం బోర్పుకాన్ పై యుద్ధానికి ఔరంగజేబు పంపిన సేనలకు రాజా రామ్ సింగ్ కచ్వాహా సైన్యాధ్యక్షుడు. రాజా రామ్ సింగ్ రాజ్ పుత్ వీరుడు. ఔరంగజేబు సైన్యంలో అనేకమంది హిందూ సైనికులున్నారు. అలాగే గౌహతి కాటన్ కాలేజీ ప్రిన్పిపల్ ఉదాయదిత్య భరాలీ ప్రకారం అహోం సైన్యంలో అనేకమంది ముస్లిములున్నారు. అహోం నౌకాదళానికి ఇస్మాయీల్ సిద్ధీకీ నేవీ జనరల్ గా ఉన్నాడని ఆయన అన్నారు. బోర్పుకాన్ సైన్యంలో ముస్లిములున్నారు. ఔరంగజేబు సైన్యంలో హిందువులున్నారు. బోర్ఫుకాన్ నౌకాదళానికి ముస్లిం నాయకత్వం వహించాడు. ఔరంగాజేబు సైన్యాలకు హిందువు నాయకత్వం వహించాడు. ఈ యుద్ధంలో మతం ఎక్కడుంది? ఇది ముగల్ పాలకులకు, అహోం రాజ్యానికి మధ్య జరిగిన యుద్ధం.

మరో విషయమేమిటంటే, బోర్ఫుకాన్ తాయ్ మతానికి చెందినవాడని, అస్సాంలో 1714 తర్వాత సిబ్ సింగ్ కాలంలో హిందూమతం ముఖ్యమైన మతంగా మారిందని అంతకు ముందు కాదని, బోర్ఫుకాన్ సైన్యంలో చాలా మంది సైనికులు గిరిజనమతానికి చెందినవారని కూడా భరాలితో సహా అనేకమంది చరిత్రకారుల అభిప్రాయం. ముగల్ సైన్యాలు ఢిల్లీ సైన్యాలు, అహోం రాజ్యంపై దాడికి వచ్చాయి. బోర్ఫుకాన్ ఈ దాడిని తిప్పికొట్టాడు.

ఎనభైలలో అస్సాం ఆందోళన బయటి వారికి వ్యతిరేకంగా ప్రారంభమైన ఆందోళన. అప్పట్లో బోర్ఫుకాన్ పేరు మరింత ప్రచారంలోకి వచ్చింది. బయటి నుంచి వచ్చిన ఢిల్లీ సైన్యాల నుంచి అహోం రాజ్యాన్ని కాపాడిన వీరుడిగా బోర్ఫుకాన్ పేరు అస్సాంలో ఇంటింటా వినిపించేది. నవంబర్ 24వ తేదీన లచిత్ దివస్ గా జరుపుకోవడం ప్రారంభమైంది. 2016 శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఈ చరిత్రకు కొత్త భాష్యం చెప్పింది. బర్ఫుకాన్ భారతదేశాన్ని ముగల్ సైన్యాల నుంచి రక్షించిన వీరుడిగా చిత్రించింది. బోర్ఫుకాన్ పోరాడింది అహోం రాజ్యం కోసం. ముగల్ సైన్యాలు పరాయి సైన్యాలు, భారతదేశంపై దండెత్తి వచ్చిన సైన్యాలు, ముస్లిం సైన్యాలనే కొత్త భాష్యలు ముందుకు వచ్చాయి. కాంగ్రెసును ముగల్ పాలకులతో పోల్చడం ప్రారంభమైంది. అస్సాంలో బయటి ప్రవాసులపై ఉన్న వ్యతిరేకతను ముస్లిములపై వ్యతిరేకతగా మార్చడం ప్రారంభమైంది. చరిత్రలో రాజుల మధ్య జరిగిన యుద్ధాలను ప్రజల మధ్య చిచ్చుపెట్టడానికి ఉపయోగించుకోవడం మొదలైంది. ఇది చరిత్ర రాజకీయం.