July 15, 2024

నోట్లరద్దు నిర్ణయాన్ని తప్పుబట్టలేమని ఐదుగురిలో నలుగురు న్యాయమూర్తుల మెజార్టీతో అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. 2016 నవంబర్‌ 8న కేంద్ర ప్రభుత్వం రూ.1,000, రూ.500 నోట్లను రద్దు చేస్తూ తీసుకును నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను రాజ్యాంగ ధర్మాసనం కొట్టివేసింది. నోట్లరద్దుపై సుప్రీంకోర్టు చెప్పిందేమిటి? నోట్లరద్దు సాధించిందేమిటి?

ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం నోట్లరద్దు కేసుపై డిసెంబర్‌ 7న విచారణను పూర్తి చేసి, తీర్పు రిజర్వ్‌ చేసింది. రెండవ తేదీన సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎస్‌ అబ్దుల్‌ నజీర్‌, జస్టిస్‌ బిఆర్‌ గవారు, జస్టిస్‌ ఎఎస్‌ బోపను, జస్టిస్‌ వి రామసుబ్రమణియన్‌, జస్టిస్‌ బివి నాగరత్నలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం 382 పేజీల తీర్పు వెలువరించింది. నలుగురు న్యాయమూర్తులు నోట్లరద్దును సమర్థించగా, జస్టిస్‌ బివి నాగరత్న వ్యతిరేకించారు. మెజారిటీ అభిప్రాయాన్ని జస్టిస్‌ బిఆర్‌ గవారు చదివి వినిపించారు. నోట్లరద్దును తీసుకురావడానికి ఆర్‌బిఐకి స్వతంత్ర అధికారం లేదని అన్నారు. ఆర్థిక ప్రాముఖ్యత కలిగిన విషయాలలో జోక్యం చేసుకునే ముందు చాలా సంయమనం పాటించాలి. కేవలం కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదన వచ్చినందున నిర్ణయం తీసుకునే ప్రక్రియను తప్పుపట్టలేమనిపేర్కొంది. నోట్లరద్దు నోటిఫికేషన్‌ చెల్లుబాటు అవుతుందని, నోట్ల మార్పిడికి 52 రోజుల వ్యవధి అసమంజసమని చెప్పలేమని పేర్కొన్నారు. ఆర్‌బిఐతో కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు జరిపి ఆర్‌బిఐ చట్టంలోనిసెక్షన్‌ 26(2) కింద నోట్ల రద్దును తీసుకురావచ్చని అన్నారు. నోట్ల రద్దు లక్ష్యాలు నెరవేరాయా? లేదా? అన్నది ముఖ్యం కాదని పేర్కొన్నారు.

 నోట్లరద్దు చట్ట విరుద్ధమని జస్టిస్‌ బివి నాగరత్న అన్నారు. ధర్మాసనంలోనిమిగిలిన నలుగురు సభ్యుల అభిప్రాయాలతో ఆమె విభేదించారు. నోట్లరద్దు అంశంలో రిజర్వ్‌ బ్యాంక్‌ తగిన శ్రద్ధ చూపలేదని జస్టిస్‌ నాగరత్న విమర్శించారు. కేవలం 24 గంటల్లోనే కసరత్తును ముగించారని, దీన్ని ఆర్‌బిఐ చట్టంలోని సెక్షన్‌ 26(2) ప్రకారం సిఫార్సుగా భావించలేమని చెప్పారు. నోట్ల రద్దుకుసంబంధించిన ఆర్‌బిఐ పత్రాల్లో ”కేంద్ర ప్రభుత్వ ఇష్టానుసారం” అని ఉంది. ఆర్‌బిఐకి ఎటువంటి స్వతంత్ర ఆలోచన లేదని చూపిస్తుంది అన్నారు. నోట్ల రద్దు లక్ష్యాలు ఏమైనప్పటికీ, దానిని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుసరించిన విధానం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు.

పెద్ద నోట్ల రద్దును ప్రకటించడానికి ముందు కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ యాక్ట్ లోని సెక్షన్ 26 (2)ను సరిగ్గా వర్తింపజేసిందా? లేదా? అనే విషయంపైనే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని, అంతకుమించి ఇంకేమీ ఇందులో లేదని కాంగ్రెసు సీనియర్ నాయకుడు జైరామ్ రమేష్ అన్నారు. పెద్ద నోట్ల రద్దు దేశ వృద్ధి రేటు వేగాన్ని దెబ్బతీసిందిని, ఎంఎస్ఎంఈలను నిర్వీర్యం చేసిందని జైరామ్ రమేష్ అన్నారు. అసంఘటిత రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసిందని, ఫలితంగా లక్షలాది మంది జీవనోపాధిని కోల్పోయారని చెప్పారు.

సరిగ్గా ఆరేళ్ల కింద 2016 నవంబర్‌ 8న నరేంద్ర మోదీ ప్రభుత్వం హఠాత్తుగా రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసింది. నల్ల ధనాన్ని వెలికి తీయడం, తీవ్రవాదానికి కళ్లెం వేయడం, అవినీతికి అడ్డుకట్ట వేయడం పెద్దనోట్ల రద్దు లక్ష్యం అని ప్రధానమంత్రి మోదీ రేడియో, టీవీల్లో ప్రత్యక్షమై ప్రకటించారు.

నోట్ల రద్దు ప్రక్రియ పేదలు, సామాన్యుల్ని ఎంతగానో ఇక్కట్లకు గురిచేసింది. నోట్లరద్దుతో చిన్న, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలు దెబ్బతిని..కోట్లాది మంది రోడ్డున పడ్డారు. నగదు లావాదేవీలు తగ్గించడానికి నోట్లరద్దు చేశామన్నారు. కాని ప్రస్తుతం దేశవ్యాప్తంగా రూ.30.88 లక్షల కోట్ల విలువైన నగదు చలామణిలో ఉందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా డేటా చెబుతోంది. నోట్లరద్దుకు ముందు అంటే నవంబర్‌ 4, 2016లో నగదు చలామణి కేవలం రూ.17.7 లక్షల కోట్లు. అంటే నగదు చలామణి 71.84 శాతం పెరిగింది. ఆర్థిక వ్యవస్థలో నగదు వినియోగం అనూహ్యంగా పెరిగిందనేది సుస్పష్టం. నోట్ల రద్దు తర్వాత డిజిటల్‌ మోడ్‌లోనూ ఆర్థిక లావాదేవీలు మొదలయ్యాయి. కోవిడ్‌ సంక్షోభం కారణంగా డిజిటల్‌ లావాదేవీలు ఎన్నోరెట్లు పెరిగాయి. వాటితో పాటు నగదు చెలామణి కూడా పెరిగింది. నల్లధనం, అవినీతి ఎన్నో రెట్లు పెరిగిందేగానీ, తగ్గలేదు. దర్యాప్తు ఏజెన్సీల దాడుల్లో నోట్ల కట్టలు, సంచులు దొరుకుతున్నాయి. ఆర్థిక వ్యవస్థలో నగదు చలామణి భారీగా పెరగటం ద్రవ్యోల్బణానికి దారితీస్తుందన్నది తెలిసిందే. ఇప్పుడు దీనిని అరికట్టలేక ఆర్‌బీఐ సతమతమవుతోంది.

నిజానికి నోట్ల రద్దు అనేది భారత చరిత్రలో ఇది మూడోసారి. ఇంతకు ముందు రెండుసార్లు ఈ పని చేసారు. మొదటిసారి 1946లో అంటే బ్రిటీషు కాలంలో జరిగింది. 1946 జనవరిలో 1000, 5000, 10,000 రూపాయల నోట్లను రద్దు చేశారు. అంటే స్వాతంత్ర్యానికి ఏడాదిన్నర ముందు బ్రిటీషు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అప్పట్లో 10,000 రూపాయల నోట్లు కూడా ఉండేవి. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రింటు చేసిన అతి పెద్ద నోటు కూడా ఇదే. 1938లో మొదటిసారి ప్రవేశపెట్టారు. 1946లో రద్దయిన ఈ నోట్లను మళ్ళీ 1954లో ప్రవేశపెట్టారు. డెబ్బైలలో టాక్సుల విచారణ కోసం భారత ప్రభుత్వం వాంఛూ కమిటీని నియమించింది. నల్లధనం కనిపెట్టడానికి, దాన్ని తొలగించడానికి పెద్ద నోట్లను రద్దు చేయాలని ఆ కమిటీ సూచించింది. ఈ సూచనల గురించి ముందే తెలియడం వల్ల నల్లధనం దాచుకున్న వారు ప్రభుత్వం చర్య తీసుకోకముందే పెద్ద నోట్లను వదిలించుకున్నారు. 1977లో జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రధానిగా పనిచేసిన మురార్జీదేశాయ్ నల్లధనంపై, దొంగనోట్లపై కొరడా ఎత్తారు. 1978 జనవరి 16న మళ్ళీ 1000, 5000, 10,000 నోట్లను రద్దు చేశారు. కాని అప్పట్లో రిజర్వు బ్యాంకు గవర్నరుగా ఉన్న ఐ.జి.పాటిల్ ఈ చర్యను సమర్ధించలేదు. నల్లధనాన్ని పట్టుకునే వివిధ పద్ధతులుంటే నోట్ల రద్దు లాంటి చర్య చేపట్టడమేమిటని విమర్శించడానికి వెనుకాడలేదు. ఇప్పుడు మోడీ తీసుకున్న నిర్ణయం పూర్తిగా అప్పట్లో మురార్జీ దేశాయ్ తీసుకున్న నిర్ణయానికి కాపీ వంటిదే. ప్రధాని మోడీకి అనుకూలంగా ఉన్న విషయమేమంటే,  రిజర్వు బ్యాంకు గవర్నర్ గా ఉర్జిత్ పటేల్ నోట్ల రద్దును సమర్ధిస్తూ, మోడీని ప్రశంసిస్తూ మాట్లాడడం. నోట్లరద్దు దెబ్బకు సగటు మనిషి రోడ్డున పడ్డాడు. దేశంలో క్యూలో నిలబడని సగటు పౌరుడెవ్వడూ లేడంటే అతిశయోక్తి కాదు. అయితే, దేశంలోని దళిత, ఆదివాసి ప్రజల పరిస్థితి మరింత దయానీయంగా మారింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పూటగడవని స్థితిలో అలమటిస్తున్నారు. తినడానకి తిండి, వైద్యానికి మందులు దొరకని పరిస్థితి ఏర్పడింది.  బ్యాంకుల ముందు నోట్లు డిపాజిట్ చేయడానికి పెద్ద పెద్ద క్యూల్లో నల్లకుబేరులెవరూ కనబడలేదు కాని, రైతులు, కూలీలు, మహిళలు, ముసలివాళ్ళు, మధ్యతరగతి ప్రజలు గంటలతరబడి నిలబడ్డారు. నవంబర్ 9, 2016 నుంచి డిసెంబర్ 30, 2016 వరకు మాత్రమే పాతనోట్లు డిపాజిట్ చేయడానికి అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ఆ నోట్లు పనికిరాని కాగితం ముక్కలైపోతాయి.

2016 నవంబర్ 8వ తేదీకి ముందు దేశంలో 500 నోట్లు, 1000 నోట్లు మొత్తం 15 లక్షల 41 వేల నోట్లు చెలామణిలో ఉండేవి. ఇప్పుడు తిరిగి వచ్చిన నోట్లు ఎన్నంటే, 15 లక్షల 32 వేల నోట్లు తిరిగి వచ్చేశాయి. అంటే రద్దయిన నోట్లలో 99.3 శాతం నోట్లు తిరిగొచ్చేశాయి. నోట్లు రద్దు చేస్తే కొత్త నోట్లు ముద్రించాలి కదా. కొత్త నోట్లు ముద్రించడానికి 7,965 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. 2016లో ప్రభుత్వం కొత్త నోట్లు ప్రింట్ చేయడానికి 3,421 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఇంత చేస్తే బ్యాంకులకు తిరగిరాని నోట్ల విలువ కేవలం 10 వేల కోట్ల రూపాయలు. మరి నల్లడబ్బేమై పోయింది. బ్యాంకులకు రాకుండా కనీసం మూడు నాలుగు లక్షల కోట్ల రూపాయల నల్లధనం ఉండిపోతుందని, అదంతా ప్రభుత్వఖాతాలోకి వస్తుందని, ప్రజాసంక్షేమకార్యక్రమాలకు ఉపయోగిస్తారని చెప్పిన మాటలేమయ్యాయి? నోట్లరద్దు అసలు లక్ష్యం నల్లధనాన్ని నల్లకుబేరులను పట్టుకోవడమే. అదే నెరవేరలేదు. ఎంత నల్లడబ్బు తెచ్చారు. ఈ లెక్కలు ఎప్పటికైనా చెబుతారా

నల్లధనం సంగతి సరే, అవినీతి విషయంలోను నోట్లరద్దు వల్ల సాధించిందేమీ లేదని తెలుస్తోంది. నోట్లరద్దు అవినీతి అధికారులను, రాజకీయనాయకులను ఏమీ చేయలేకపోయింది. తీవ్రవాద ఉగ్రవాద కార్యకలాపాల విషయానికి వస్తే నోట్లరద్దు వల్ల అవేమీ తగ్గుముఖం పట్టలేదని తెలుస్తూనే ఉంది. డిజిటల్ పేమెంట్లపై వేస్తున్న చార్జీలు, బ్యాంకుల చార్జీలు పెరగడంతో సగటు మనిషి నలిగిపోయాడు.  నోట్లరద్దు తర్వాత తీసుకున్న పెద్ద నిర్ణయం 2000 రూపాయల నోటును ప్రవేశపెట్టడం. అవినీతిని అంతం చేయాలనుకుంటే పెద్ద నోట్లను రద్దు చేయాలి. కాని అంతకన్నా పెద్దనోటును ప్రవేశపెట్టడం ఎందుకని అప్పట్లో కొందరు ప్రశ్నించినా ఆ ప్రశ్నలన్నీ జాతివ్యతిరేక ప్రశ్నలుగా ముద్రవేయబడ్డాయి. కాని, ఇప్పుడు ఈ 2000 నోటు కూడా దాని సహజమరణం పొందేలా ఉంది. ఎకనమిక్ టైమ్స్  లో గతంలో వచ్చిన వార్త ప్రకారం రిజర్వు బ్యాంకు నుంచి 2000 నోట్ల సరఫరా తగ్గిపోయింది. అంటే ప్రభుత్వం కావాలనే 2000 నోట్లను క్రమేణా తగ్గిస్తుందన్న అనుమానాలు వినిపించాయి. అప్పట్లోనే లివ్ మింట్ పత్రికలో 2000 నోట్ల ముద్రణ ఆగిపోయిందని, రిజర్వు బ్యాంకు 2000 నోట్లను ప్రింటు చేయడం లేదని చెప్పింది.

హడావిడిగా అమలు చేసిన నోట్లరద్దు తర్వాత మార్కెట్లోకి కరెన్సీని వెంటనే సరఫరా చేయడానికి పెద్ద డినామినేషన్ 2000 ప్రవేశపెట్టారు. దీనివల్ల రద్దయిన నోట్లకు బదులుగా కొత్త నోట్లను ఇవ్వడం తేలికవతుందని భావించారు. అంతకు మించి 2000 నోటును ప్రవేశపెట్టడంలో వ్యూహాత్మక ఆలోచనలేమీ కనబడడం లేదు. తర్వాత నెమ్మదిగా మార్కెట్లో 500 నోట్లను పెంచుతూ 2000 నోట్లను తగ్గిస్తూ వచ్చారు. 2019 నుంచి ఇప్పటి వరకూ పింక్ నోట్ ఒక్కటి కూడా ముద్రించలేదని భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ మధ్యే ఓ ఆర్టీఐ ప్రశ్నకు సమాధానంగా చెప్పింది.

మోదీ ప్రభుత్వం నోట్ల రద్దుకు కారణాలుగా చెప్పిన వాటిలో నల్లధనాన్ని అరికట్టడం అనేది అన్నింటికన్నా ముఖ్యమైంది. కానీ, ముఖ్యంగా గత ఏడాది కాలంగా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల దాడులు, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, ఉపఎన్నికల సమయంలో అధికారులకు సోదాల్లో దొరికిన నగదులో ఎక్కువగా రెండు వేల నోట్ల కట్టలే ఉన్నాయి. తెలంగాణలో జరిగిన హుజూరాబాద్‌ ఉప ఎన్నిక, మునుగోడు ఉప ఎన్నికలో లెక్కా పత్రం లేని డబ్బు ప్రవాహాన్ని చూసిన తరువాత నోట్లరద్దుతో నల్లడబ్బు నాశనమైపోయిందని నమ్మగలమా? ఇటీవలనే పశ్చిమ బెంగాల్‌ మంత్రి పార్థా చటర్జీ, అతని సన్నిహితురాలు అపర్ణా ముఖర్జీ ఇళ్లలో అధికారికంగా ప్రకటించిన రూ.49.80 కోట్ల నగదు కట్టలు, ఐదు కోట్ల విలువైన బంగారం వారి వద్దకు ఎలా చేరినట్లు? చిత్తశుద్ధితో దాడులు చేస్తే దేశంలో అలాంటివి ఇంకా ఎన్నో దొరకవచ్చు. నగదును పెద్ద మొత్తంలో దాచేందుకు రెండు వేల రూపాయల నోటు అనువుగా మారిందన్నది స్పష్టం. అలాగే నల్లధనాన్ని నిల్వ చేస్తున్న వారు దాన్ని రెండువేల నోట్ల రూపంలో దాచే అవకాశం ఎక్కువగా ఉందని బ్యాంకింగ్ రంగ నిపుణుల అభిప్రాయం. మరోవైపు రెండువేల రూపాయల దొంగనోట్లు పెరుగుతున్నాయనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో 2వేల రూపాయల నకిలీ నోట్ల ముద్రణ 55 శాతం పెరిగినట్లు  కేంద్ర బ్యాంక్ గుర్తించింది.

 నోట్ల రద్దు వల్ల పేద, మధ్యతరగతి ప్రజలే కష్టాల పాలయ్యారు. సంపన్నులెవరు కష్టపడిన వార్తలు రాలేదు. జనాభా లెక్కల ప్రకారం చూస్తే దేశంలోని దళిత కుటుంబాల్లో కేవలం 7.3శాతం మాత్రమే ఉద్యోగాల్లో ఉన్నారు. అందులో కేవలం 3.96 శాతం మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నారు. 2.42 శాతం ప్రయివేటు ఉద్యోగాల్లో ఉన్నారు. ఆదివాసి జనాభా విషయానికి వస్తే కేవలం 4.38 శాతం మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నారు. 1.48 ప్రయివేటు ఉద్యోగాల్లో ఉన్నారు. మిగిలిన జనాభా, అంటే దళితుల్లో 92.7 శాతం, ఆదివాసుల్లో దాదాపు 94 శాతం జనాభా వ్యవసాయకూలీలుగా, కాజువల్ లేబరుగా, పారిశుధ్యకార్మికులుగా, హెల్పర్లుగా చిన్న చిన్న పనులు చేసుకుంటూ తమ జీవనోపాధి పొందుతున్నారు. నోట్ల రద్దు వల్ల వ్యవసాయ కూలీలుగా ఈ దళిత, ఆదివాసి ప్రజలకు తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితి ఎదురైంది. దేశంలోని గణాంకాలను పరిశీలిస్తే కేవలం 53శాతం మందికి మాత్రమే బ్యాంకు ఎక్కౌంట్లున్నాయి. మిగిలిన 47శాతం ప్రజల్లో అంటే బ్యాంకు ఎక్కౌంట్లు లేని ప్రజల్లో అత్యధిక శాతం దళిత, ఆదివాసి జనాభాయే ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బ్యాంకు ఎక్కౌంటే లేని ఈ జనాభా చెక్కుల ద్వారానో లేదా క్రెడిట్ కార్డుల ద్వారానో తమ అవసరాలకు ఖర్చు పెడుతుందని, క్యాష్ లెస్ ఎకానమిలో భాగమైపోతుందని అనుకోవడం భ్రమల్లో బతకడమే. అప్పట్లో సంబిత్ పాత్ర వంటి బీజేపీ అధికారప్రతినిధులు జన్ ధన్ ఖాతాల్లో 18 లక్షల ఖాతాలు అనుమానాస్పదమైనవి పట్టుకున్నామని చెప్పారు. కాని, 18 లక్షల ఖాతాల్లో ఎంత నల్లడబ్బు దొరికిందో ఇంతవరకు ఎవ్వరు చెప్పలేదు.

క్యాష్ లెస్ ఎకానమి విషయానికి వస్తే నోట్లరద్దు జరిగిన తర్వాత క్యాష్ లెస్ లావాదేవీలు పెరిగాయి. ఎందుకంటే నగదు అందుబాటులో లేనందువల్ల. కాని నగదు మార్కెటులోకి వచ్చిన తర్వాత మళ్ళీ యథాప్రకారమే. పన్నుల ఎగవేత ఉండదని అన్నారు. టాక్స్ కలెక్షన్ పెరుగుతుందని అన్నారు. 14 శాతం టాక్స్ కలెక్షన్ పెరిగిందని చెప్పారు. 2013లో కూడా నోట్లరద్దు లేకపోయినా ఇంతే టాక్స్ కలెక్షన్ పెరిగింది. పెద్ద నోట్ల రద్దు వలన పన్నుల వసూలు పెరిగిందని చెప్పవచ్చు తప్ప నోట్లరద్దు వల్లనే పెరిగాయని ఆధారాలు చూపటం చాలా కష్టం. ఎందుకంటే నోట్లరద్దు జరిగిన కొద్ది నెలలకే 2017 జులైలో జిఎస్‌టి విధానాన్ని తీసుకు వచ్చారు.ఆ తరువాత కార్పొరేట్‌ పన్ను మొత్తాన్ని గణనీయంగా తగ్గించారు. పెద్ద నోట్ల రద్దుకు ముందు 2011-12 నుంచి 2016-17 వరకు జిడిపి వృద్ధి రేటు 5.2 నుంచి 8.3 శాతానికి పెరిగింది. నోట్ల రద్దు తర్వాత కరోనాకు ముందు 2019-20 నాటికి నాలుగు శాతానికి దిగజారింది. మరుసటి ఏడాది కరోనాతో 7.3 శాతం తిరోగమనంలో పడింది. తరువాత వృద్ధి రేటు ఇంకా కరోనా పూర్వపు స్థితికి చేరుకోలేదు. పన్ను ఎగవేతలు, ఆర్థిక నేరాలకు తావు లేకపోతే గత ఎనిమిదిన్నర సంవత్సరాల్లో విపరీతంగా పెరిగిన ఐటి దాడులు ఎందుకు జరుగుతున్నాయి? 2004 నుంచి 2014 వరకు 112 ఇ.డి దాడులు జరిగితే 2014 నుంచి 2022 వరకు 3,010 డాడులు చేసినట్లు ప్రభుత్వం పేర్కొన్నది. నోట్లరద్దు వల్ల మొదటి 50 రోజుల్లోనే 1.28 లక్షల కోట్ల నష్టం అని అంచనా. నాలుగు నెలల కాలంలో 15 లక్షల మంది ఉపాధి కోల్పోయారు. జిడిపి దాదాపు 2శాతం తగ్గింది. మాజీ ప్రధాని ఖచ్చితంగా ఈ విషయం పార్లమెంటులోనే చెప్పారు. దాదాపు ఇరవై కోట్ల రూపాయలు నోట్ల ముద్రణకు ఖర్చు చేశారు. నోట్లరద్దు దెబ్బ దాదాపు ఆరులక్షల కోట్ల రూపాయలని అంచనా. ఆల్ ఇండియా మాన్యఫాక్చరింగ్ ఆర్గనైజేషన్ ప్రకారం నోట్ల రద్దు తర్వాత చిన్నస్థాయి మధ్యస్థాయి పరిశ్రమలు, వ్యాపారాల్లో ఆదాయం 50 శాతం తగ్గింది. అసంఘటిత రంగంలో దాదాపు 4 కోట్ల మంది ఉపాధి కోల్పోయనట్లు అంచనా.

నోట్లరద్దు మరుసటి రోజు నుంచి జనం బ్యాంకుల ముందు పడిగాపులుపడి నోట్లు మార్చుకోవడానికి నానాయాతన పడ్డారు. ఈ క్రమంలో కనీసం 150 మంది మరణించారు. నోట్లరద్దు అవ్యవస్థీకృత రంగంలో పనిచేస్తున్న వారిని కష్టాలపాలు చేసింది. చిన్న, మధ్యతరగతి వ్యాపారులను కోలుకోలేని దెబ్బతీసింది. మన దేశంలో అవ్యవస్థీకృత రంగంలో పనిచేస్తున్న వారే 94 శాతం ఉన్నారు. వీరికే తీవ్ర విఘాతం కల్గింది. చేతిలో డబ్బు ఆడనందువల్ల చిన్న, మధ్య తరగతి వ్యాపారులు చాలా ఇబ్బందిపడ్డారు. కొందరైతే ఈ వ్యాపారాలు మానుకోవలసి వచ్చింది. ఇలాంటి వ్యాపారాలు పరిస్థితి కుదుటపడ్డ తరవాత పుంజుకోవడానికి ఉండే అవకాశం చాలా తక్కువ. ఇలా వ్యాపారాలు కోల్పోయినవారు ఉపాధికోసం యాతనపడ్డారు. నోట్ల రద్దు నిరుద్యోగాన్ని పెంచింది. నోట్లు రద్దయిన తరవాత నోట్ల కొరత రెండు మూడునెలలు తీవ్రంగానూ, ఏడాదిపాటు ఓ మోస్తరుగానూ కొన సాగింది. పెద్దనోట్లరద్దు తరవాత 2017-18లో ఆర్థికాభి వృద్ధి రేటు 8శాతం ఉంటే 2019-20లో అది 3.1 శాతానికి పడిపోయిందని అధికారికలెక్కలే చెప్తున్నాయి. పెద్దనోట్లరద్దు గురించి వాస్తవాలు బయటపెట్టాలని సమాచార హక్కు కింద ఎన్ని దరఖాస్తులు పెట్టుకున్నా మోదీ సర్కారు చలించ లేదు. దానికి సంబంధించిన పత్రాలను వెల్లడించలేదు.

న‌గ‌దును బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ‌ల్లోకి తీసుకురావ‌డం వల్ల ప‌న్ను చెల్లించేవాళ్లు పెరిగి ప‌న్ను వ‌సూళ్లు భారీగా పెరుగుతాయన్నారు. జ‌రిగింది ఏమిటంటే, ట్యాక్స్ రిట‌ర్న్స్ ఫైల్ చేసిన వాళ్ల‌ 25 శాతం పెరిగారు. ఇలా జ‌ర‌గడం నోట్లరద్దు తర్వాత మాత్రమే జరగలేదు. గ‌తంలోనూ 27 శాతం వ‌ర‌కు పెరిగిన సంద‌ర్భాలు ఉన్నాయి. 2017లో ప‌న్ను వ‌సూళ్లు 20 శాతం పెరిగాయి. 2015లో 16 శాతం పెరుగుద‌ల క‌నిపించింది.

 నోట్లరద్దుపై సుప్రీంకోర్టు మైనారిటీ భిన్నాభిప్రాయాలతో కూడిన తీర్పు మోడీ ప్రభుత్వానికి చెంపదెబ్బ అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం వ్యాఖ్యానించారు. చరిత్రలో ఈ తీర్పు  చిరస్మరణీయంగా నిలిచిపోతుందని అన్నారు. నోట్ల రద్దు చట్టవిరుద్ధమంటూ ధర్మాసనంలోని జస్టిస్‌ నాగరత్న చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ చిదంబరం ఈ విధంగా స్పందించారు. ‘నోట్ల రద్దుపై భారత అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును గౌరవిస్తాం. అయినప్పటికీ, ఈ నిర్ణయాన్ని అందరూ సమర్థించారా, ప్రభుత్వం వాటి లక్ష్యాలను సాధించిందా అనే అంశాన్ని ప్రస్తావించడం అవసరం. లక్ష్యాలను సాధించే అంశంపై సుప్రీం కోర్టులోని మెజారిటీ ధర్మాసనం స్పష్టత ఇచ్చింది. ఇదే సమయంలో నోట్ల రద్దు చట్టవిరుద్ధ మార్గంలో జరిగినట్లు ధర్మాసనంలోని ఒక న్యాయమూర్తి పేర్కొనడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఇది ప్రభుత్వానికి చెంపపెట్టు వంటిది’ అని అన్నారు. .నోట్ల రద్దులో అక్రమాలను, అవతవకలను మైనారిటీ తీర్పు ఎత్తి చూపడాన్ని  కాంగ్రెస్‌ స్వాగతిస్తోందని అన్నారు.

నోట్లరద్దు దేశానికేమిచ్చింది? ప్రజలకేమిచ్చింది? ఎంత నల్లధనం వెలికి తీశారు? ఆర్బీఐ గణాంకాలు ఏం చెప్పాయి? సర్కారు వాదనల్లో నిజాలెన్ని? నోట్లరద్దు సముచితమే … కాని సాధించిందేమిటి? ఈ ప్రశ్నలకు జవాబు ఎప్పటికైనా లభిస్తాయా?