October 5, 2024

అస్సాంలో ఇప్పుడు ముస్లిములను ఖాళీ చేయించే కార్యక్రమాన్ని బీజేపీ ప్రభుత్వం చేపట్టింది. సెక్యులర్ పార్టీలుగా చెప్పుకునే పార్టీలన్నీ ఈ వ్యవహారాన్ని తమాషా చూస్తున్నాయి. అస్సాంలో. మౌలానా బద్రుద్దీన్ అజ్మల్ గారి ఆల్ ఇండియా యునైటెడ్ డెమొక్రటికి ఫ్రంట్ పార్టీ కూడా ఈ నిరుపేదల గురించి మాట్లాడడం లేదు. కాగా జనహస్తాక్షేప్ అనే సంస్థ మాత్రం దీనిపై గొంతు విప్పింది. రానున్న లోక్ సభ ఎన్నికల్లో మతతత్వ రాజకీయాలు నడపడానికి జరుగుతున్న ప్రయత్నాలను, విద్వేష ప్రచారాన్న ఖండిస్తూ ముందుకు వచ్చింది. అస్సాం ముఖ్యమంత్రి హేమంత బిశ్వ శర్మ నడుపుతున్న రాజకీయాలను జనహస్తాక్షేప్ సంస్థ బట్టబయలు చేసింది.

దారంగ్ జిల్లాలో ఊళ్ళకు ఊళ్ళు ఖాళీ చేయించారని సంస్థ కన్వినర్ డా. వికాస్ బాజపేయి, కోకన్వినర్ అనిల్ దూబేలు చెప్పిన వార్తలు వచ్చాయి. అస్సాంలో ముస్లిములపై, ముఖ్యంగా బెంగాలీ మాట్లాడే ముస్లిములపై కొనసాగుతున్న దౌర్జన్యాలు వారి బతుకులను చిందరవందర చేస్తున్నాయి. మే 2021లో మేమంత బిశ్వ శర్మ అధికారంలోకి వచ్చిన తర్వాతి నుంచి ఇప్పటి వరకు దాదాపు 4449 బెంగాలీ ముస్లింల ఇండ్లు కూలగొట్టారని తెలుస్తోంది. పోలీసుల బలగాలతో ప్రజలను భయపెట్టి ఇండ్లు ఖాళీ చేయిస్తున్నారు. సెప్టెంబర్ 2021లో ధోల్ పూర్ గ్రామంలో ఇండ్లు ఖాళీ చేయిస్తున్నప్పుడు ప్రతిఘటించిన వారిపై పోలీసులు కాల్పులు జరిపారు. అక్కడ ఫోటోలు తీయడానికి పోలీసులు తీసుకొచ్చిన ఫోటోగ్రాఫర్ పోలీసు కాల్పుల్లో మరణించిన బెంగాలీ ముస్లిం మృతదేహంపై పైశాచికానందంతో ఎగిరెగిరి దూకుతున్న ఫోటో ఒకటి వైరల్ అయ్యింది. ఇళ్ళు ఖాళీ చేయించే ఈ కార్యక్రమం ఇప్పుడు ఉధృతంగా నడుస్తోంది. నవంబరు మాసంలో హోజాయ్ జిల్లాలోని లండింగ్ రిజర్వు ఫారెస్టు ప్రాంతంలో 550 కుటుంబాలను ఇలాగే ఖాళీ చేయించారు. డిసెంబరులో నాగోం జిల్లాలో కూడా ఇండ్లు ఖాళీ చేయించారు.

బీజేపీ అస్సాంలో చేపట్టిన ఎన్నార్సీ ప్రక్రియ వల్ల బీజేపీకే తలనొప్పులు మొదలయ్యాయి. ఎన్నార్సీలో ఈ మతతత్వ శక్తులు ఊహించినట్లు భారీసంఖ్యలో ముస్లిముల పేర్లు రాలేదు. బంగ్లాదేశీ చొరబాటుదారులంటూ మతతత్వ రాజకీయాలు నడిపే అవకాశం లభించలేదు. ఎన్నార్సీ ద్వారా అస్సాంలో ముస్లిముల ఓటు హక్కును హరించాలనుకున్న ప్రయత్నాలు ఫలించలేదు కాబట్టి ఇప్పుడు అక్రమంగా ఇళ్ళు కట్టారన్న నెపంతో ముస్లిముల ఇండ్లను కూలగొట్టే కార్యక్రమాన్ని చేపట్టారు. తరతరాలుగా నివసిస్తున్న ముస్లిములను ఖాళీ చేయించి ఆ భూములను హేమంత బిశ్వ శర్మ ప్రభుత్వం తనకు ఓటు వేస్తారని నమ్ముతున్న సముదాయానికి పంచిపెడుతోంది.

ఎన్నార్సీ ప్రక్రియను కూడా మసిపూసి మారేడు కాయ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అగష్టు 2019లో ఎన్నార్సీ ప్రచురించడం జరిగింది. 3.3 కోట్ల మంది ధరఖాస్తుదారుల్లో కేవలం 19 లక్షల మంది పేర్లు మాత్రమే ఎన్నార్సీ జాబితాలో చోటు సంపాదించుకోలేకపోయాయి. ఇందులో కూడా ఎక్కువ మంది హిందువుల పేర్లు కనిపించాయని తెలుస్తోంది. ఇప్పుడు కాంప్ట్రోలర్ అండి ఆడిటర్ జనరల్ ఎన్నార్సీ అప్డేట్ ప్రక్రియలో అనేక లోపాలున్నయని తప్పుపట్టారు. ప్రధాన సాప్ట్ వేరులో 215 అదనపు యుటిలిటీలు హడావిడిగా చేర్చారని దీనివల్ల ఎన్నార్సీ పేర్లలో అవకతవకలు జరిగే అవకాశాలు పెరిగాయని పేర్కొన్నారు.

అస్సాం నుంచి వస్తున్నవార్తలు అక్కడ ఎలాంటి మతోన్మాద పాలన నడుస్తుందో స్పష్టం చేస్తున్నాయి. అస్సాంలోని మదరసాల్లో అస్సాం బయటి నుంచి అంటే ఇతర రాష్ట్రాల నుంచి ఉపాధ్యాయులు వచ్చి పనిచేస్తుంటే వాళ్ళు క్రమం తప్పకుండా దగ్గరి పోలీసు స్టేషనులో రిపోర్టు చేయవలసి ఉంటుందని ప్రభుత్వం కొత్తగా ఆదేశాలు జారీ చేసింది. ఒక పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుడిని నేరస్తుడి మాదిరిగా దగ్గరిలోని పోలీసు స్టేషనుకు క్రమం తప్పకుండా వెళ్ళి రిపోర్టు చేయాలని ఆదేశించడంలో వెనుక మతతత్వ విద్వేష రాజకీయాలున్నాయన్నది గమనించాలి.

అస్సాంలో నెలకొన్న ఈ పరిస్థితులపై ఎవరు మాట్లాడడం లేదు. ప్రతిపక్షాలు కూడా ఈ నిరుపేదలను పట్టించుకోవడం లేదు. దేశంలో హిందూ ముస్లిం రాజకీయాలు నడిపే శక్తులు ఈ రాజకీయాలు ఇలాగే కొనసాగితే జరిగేదేమిటి? కర్నాటకలోను బీజేపీ ప్రభుత్వమే ఉంది. ఇటీవల కర్నాటక బీజేపీ అధ్యక్షుడు నళిన్ కుమార్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ప్రజలకు కనీస సదుపాయాలు, తాగునీరు, సాగునీరు, డ్రైనేజి సదుపాయాలు, రోడ్లు, రోడ్లపై గుంతల సమస్య ఇవన్నీ చాలా చిన్న చిన్న సమస్యలు, వీటి గురించి పట్టించుకోవద్దు, లవ్ జిహాద్ పెద్ద సమస్య, లవ్ జిహాద్ ను ఎదుర్కోవాలంటే బీజేపీ పార్టీ అధికారంలో ఉండాలి అన్నాడు. లవ్ జిహాద్ కేసులు దేశంలో ఎన్ని ఉన్నాయి. ఒక్క కేసయినా రుజువయ్యిందా? ఈ మతవిద్వేష రాజకీయాలు చేస్తున్న నష్టాన్ని దేశప్రజలందరూ గుర్తించాలి.