November 12, 2024

బేటీ బచావో… బేటీ పఢావో… కొంతకాలం క్రితం ప్రధాని మోడీ  హర్యానాలోని పానిపట్ లో ఇచ్చిన నినాదం ఇది. ఇప్పుడు అదే హర్యానాకు చెందిన ఇద్దరు బిడ్డలు వినేష్ ఫోగాట్, సాక్షి మలిక్ మరికొంతమంది అంతర్జాతీయ మెడళ్ళు గెలిచిన మహిళా మల్లయోధులతో  కలిసి న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ ఫుట్ పాతులపై నిరసన చేస్తున్నారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా గళం విప్పి పోరాడుతున్నారు.

అంతర్జాతీయ పోటీల్లో మెడళ్ళు గెలిచి వచ్చినప్పుడు అట్టహాసంగా వారిని స్వాగతించిన సందర్భాలు గుర్తున్నాయా? ఒలింపిక్స్ లో సత్తా చూపి భారత ప్రతిష్ఠను ప్రపంచదేశాల్లో చాటి చెప్పిన ఈ అమ్మాయిలు లైంగిక వేధింపుల గురించి ఆరోపిస్తే, వెంటనే ప్రధాని తక్షణం చర్యలు తీసుకుంటారని అనిపిస్తుంది. కాని ఆయన అస్సలు పెదవి విప్పలేదు. అసలు ఢిల్లీ పోలీసులు కేసు కూడా నమోదు చేయలేదు. ఫిర్యాదు చేస్తున్న వారిలో ఒకమ్మాయి మైనర్ కూడాను. అయినా పోలీసులకు కేసు నమోదు చేయాలనిపించలేదు. ఢిల్లీ పోలీసులు ఎంత స్వేచ్ఛగా పనిచేస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది.

ఈ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై కేసు నమోదు చేయడానికి ముందు ప్రాథమిక విచారణ జరపవలసి ఉందని పోలీసులు చెప్పడం మరో విచిత్రం. ఈ వార్త తర్వాత మహిళా సంఘాలు ఢిల్లీ పోలీసు కమీషనర్ సంజయ్ అరోరాను నిలదీశాయి. ఫిర్యాదు చేసిన రెజ్లర్లలో ఒలింపిక్స్, కామన్ వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించి దేశానికి గర్వకారణమైనవారు కూడా ఉన్నారు. దేశానికి పేరుప్రతిష్ఠలు సంపాదించి పెట్టిన అంతర్జాతీయ స్థాయి క్రీడాకారిణులు లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయకుండా, ప్రాథమిక విచారణ అంటూ మీనమేషాలు లెక్కపెట్టడమే కాదు, చివరకు ఈ క్రీడాకారిణులు న్యాయం కోసం ధర్నా చేసే పరిస్థితి ప్రపంచదేశాల్లో మన పరువును తీయడం లేదా? ఇదే విషయాన్ని అనేక మహిళా సంఘాలు నిలదీసి అడిగాయి. ఎఫ్ ఐ ఆర్ కన్నా ముందు ప్రాథమిక విచారణ జరపాలని ఎప్పటి నుంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది? ఎఫ్ ఐ ఆర్ స్వయంగా ప్రాథమిక విచారణ కాదా? ఎఫ్ . ఐ. ఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు కాదా? అంటూ మహిళా సంఘాలు అడిగిన ప్రశ్నలు దేశంలో బేటీ బచావ్ నినాదాన్ని నమ్మిన అందరి ప్రశ్నలు.

ఈ క్రీడాకారులు ఏ రాజకీయపార్టీని తమ నిరసనస్థలం వద్దకు రానీయలేదు. వారి నిరసనల తర్వాత ఒక కమిటీని ఏర్పాటు చేశారు. కాని ఒక మైనర్ బాలిక లైంగిక వేధింపుల ఫిర్యాదు చేస్తే పోస్కో క్రింద వెంటనే కేసు నమోదు చేయవలసింది పోయి, కమిటీ వేయడమేమిటి? ఈ కమిటీ విచారణ జరిపింది. నివేదిక ఏమిటో బయటపెట్టలేదు. చివరకు ఈ అమ్మాయిలు, క్రీడాకారిణులు కోర్టు తలుపులు తట్టవలసి వచ్చింది. వ్యవహారం కోర్టు వరకు వెళ్ళిన తర్వాత పోలీసులు కోర్టు చెబితే కేసు నమోదు చేస్తామన్నారు. ఫిర్యాదు చేసిన అమ్మాయిల పేర్లు బయటకు వచ్చేశాయి. వారికి ఇప్పుడు బెదిరింపులు వస్తున్నట్లు వార్తలు వచ్చాయి. బీజేపీకి చెందిన బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కాకుండా కాంగ్రెసుకు చెందిన సురేష్ కల్మాడీపై ఇలాంటి ఆరోపణలు వచ్చి ఉన్నట్లయితే దేశంలో ఈ పాటికి ఎలాంటి గగ్గోలును ఎవరు చేసి ఉండేవారో వేరే చెప్పనక్కర్లేదు.

అంతర్జాతీయ ప్రతిష్ఠ పొందిన క్రీడాకారిణులు తమపై లైంగిక వేధింపులు జరిగాయని ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయడానికి కూడా మీనమేషాలు లేక్కేసిన ఈ ఢిల్లీ పోలీసులు ఇంతకు ముందు ఏం చేశారో ఒక్కసారి చూద్దాం –

భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ శ్రీనగర్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక ప్రసంగంలో మాట్లాడుతూ కొందరు మహిళలు తన వద్దకు వచ్చి తమపై జరిగిన అత్యాచారాల గురించి చెప్పారని అన్నాడు. ఆ తర్వాత ఢిల్లీ పోలీసులు రాహుల్ గాంధీకి ఒక నోటీసు పంపించారు. లైంగిక అత్యాచారాలకు గురైన మహిళలు తన వద్దకు వచ్చి మొరపెట్టుకున్నారని రాహుల్ గాంధీ చెప్పిన వెంటనే ఆయనకు నోటీసులు పంపించడమే కాదు ఆయన ఇంటికి వెళ్ళి ప్రశ్నించారు కూడా. ఆ మహిళలెవరో చెప్పండి వెంటనే న్యాయం చేసేస్తాం అన్నారు పోలీసులు.

రాహుల్ గాంధీ ఇంటి ముందు వాలిపోయి, ఫిర్యాదు చేసిన మహిళలెవ్వరో చెప్పండి న్యాయం చేసేస్తాం అన్న ఈ పోలీసులే లైంగిక వేధింపులు జరిగాయి అంటూ క్రీడాకారిణులు ఫిర్యాదు చేస్తే అసలు కేసు నమోదు చేయకుండా తాత్సారం చేశారు.

మహిళా క్రీడాకారిణులు మొదట జనవరి నెలలో ధర్నాకు దిగారు. వరల్డ్ రెజ్లింగ్ ఫెడరేషన్ పదవి నుంచి బ్రిజ్ భూషణ్ సింగ్ ను తప్పించాలని డిమాండ్ చేశారు. స్పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ లు కల్పించుకుని సింగ్ పై వచ్చిన ఆరోపణలను విచారిస్తామన్నాయి. ఒక కమిటీని ఏర్పాటు చేశాయి. ఒలింపిక్స్ క్రీడాకారిణి మేరీకోమ్ అధ్యక్షతన ఏర్పడిన కమిటీ నివేదిక ఇచ్చింది. నివేదికలో ఏముందో బయటపెట్టడం జరగలేదు. ఆ తర్వాత మళ్ళీ క్రీడాకారిణులు ధర్నాకు దిగారు. క్రీడామంత్రి అనురాగ్ ఠాకూర్ కు, ఒలింపిక్స్ కమిటీ సభ్యులకు ఫోను చేయాలని ప్రయత్నించినా వారెవ్వరి నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాలేదు. సింగ్ పై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయాలని క్రీడాకారిణులు డిమాండ్ చేయడం ప్రారంభించారు. బీజేపీ ఈ వ్యవహారంలో మౌనమే నా మాట అంటూ వచ్చింది.

మొదటి సారి ఆరోపణలు వచ్చినప్పుడు సింగ్ మీడియాతో మాట్లాడుతూ లైంగిక వేధింపుల విషయంలో వినేష్ ఫోగట్ తప్ప ఇంకెవ్వరైనా ఒక్కరైనా ఫిర్యాదు చేశారా? మరొక్కరు ముందుకు వచ్చి ఫిర్యాదు చేసినా నన్ను ఉరితీయండి అన్నాడు. ఆ తర్వాత ఏడుగురు మహిళా క్రీడాకారిణులు ఫిర్యాదులతో ముందుకు వచ్చారు. అందులో ఒకరు మైనర్.

అండగా నిలిచిన క్రీడాకారులు:

ఒలిపింక్స్ లో బంగారుపతకాలు సాధించిన అభినవ్ బింద్రా, నీరజ్ చోప్రాలు అనేకమంది క్రీడాకారులతో కలిసి రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రజ్ భూషణ్ పై నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్న ఈ మహిళా క్రీడాకారిణులకు మద్దతుగా ముందుకు వచ్చారు. ప్రపంచ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్, క్రికెట్ క్రీడాకారులు హర్భజన్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, గ్రాండ్ స్లామ్ విజేత సానియా మీర్జా, మహిళా హాకీ కెప్టెన్ రాణీ రాంపాల్ తదితరులు కూడా మద్దతుగా ముందుకు వచ్చారు. ఆరుగురు మహిళా క్రీడాకారిణులు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయకపోవడం నిర్ఘాంతపరుస్తోందని నవజోత్ సింగ్ సిద్ధూ అన్నాడు. రిజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ పై పోరాడుతున్న క్రీడాకారిణుల్లో వినేష్ ఫోగాట్ ఇంటిపేరు చాలా మందికి సుపరిచితంగా వినిపించవచ్చు. కామన్ వెల్త్ గేమ్స్ లో బంగారుపతకం సాధించిన గీతా ఫోగట్ కజిన్ ఈ వినేష్ ఫోగాట్. విచిత్రమేమిటంటే ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా ఉన్న పి.టీ.ఉష ఈ క్రీడాకారిణులకు మద్దతిచ్చే బదులు క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్నారన్నట్లు మాట్లాడి విమర్శల పాలయ్యారు.

ఎవరీ బ్రిజ్ భూషణ్:

బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ నన్నెవరేం చేస్తారన్నట్లు ధీమాగా ఉండడానికి కారణాలు లేకపోలేదు. ఉత్తరపరదేశ్ లోని అరడజను నియోజకవర్గాల్లో ఆయన బీజేపీకి ఓట్లు వేయించగలడు. సాధువులతో ఆయనకు బలమైన సంబంధాలున్నాయి. అయోథ్య ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన నాయకుడిగా బీజేపీలో గుర్తింపు ఉంది. కాబట్టి ఏం చేసినా చెల్లుతుందనే వాతావరణం ఉంది.

అంతేకాదు, ఉత్తరప్రదేశ్ లో దాదాపు డజను విద్యాసంస్థలకు ఆయనే యజమాని. పైగా ఉత్తరప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలున్నాయి. ఈ ఎన్నికల సమయంలో బీజేపీకి ఆయన చాలా అవసరం.

విభిన్నమైన పార్టీగా చెప్పుకునే బీజేపీ, బేటీ బచావో నినాదాలిచ్చే బీజేపీ బ్రిజ్ భూషణ్ పై వచ్చిన ఆరోపణలను అస్సలు పట్టించుకోవడం లేదు. ఎందుకంటే బ్రిజ్ భూషణ్ పై చర్య తీసుకుంటే ఎన్నికల్లో చావుదెబ్బ తగులుతుందేమో అన్న భయం. నేరస్తులెవరైనా సరే తప్పించుకోలేరు, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోవలసిందే అని వీరంగాలు వేసే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ కూడా బ్రిజ్ భూషణ్ ను ఏమీ చేయలేడు.

అయోథ్య బాబరీ మస్జిద్ రామమందిర వివాదం నడుస్తున్నప్పుడు, అయోథ్య ఉద్యమంలో అప్పట్లో బ్రిజ్ భూషణ్ కీలకపాత్ర పోషించాడు. అప్పట్లో ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ఊరు పేరు కూడా ఉండేది కాదు. అద్వానీ రథయాత్ర ప్రారంభించినప్పుడు ఆ రథాన్ని డ్రయివ్ చేస్తానని వచ్చి నడిపాడు. 1991లో మొదటిసారి గోండా నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యాడు. ఆ మరుసటి సంవత్సరమే ఆయనే బాబరీమస్జిద్ కూల్చివేత కేసు నమోదయ్యింది. ఆ తర్వాతి నుంచి ప్రముఖ హిందూత్వ నాయకుడైపోయాడు. 2020లో బాబరీ మస్జిద్ కూల్చివేత కేసు నుంచి బయటపడ్డాడు. గోండా నుంచి ఆరుసార్లు లోక్ సభకు ఎన్నికయ్యాడు. ఆయనపై అనేక క్రిమినల్ కేసులు నడిచాయి. 1996లో అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రాహీం అనుచరుడికి ఆశ్రయం ఇచ్చిన కేసు నమోదైంది. అది టాడా కేసు. అందులో జైలుకు పోవలసి వచ్చింది. జైల్లో ఉన్నప్పుడు స్వయంగా వాజపేయి ఉత్తరం రాసి సావర్కర్ నుంచి ధైర్యసాహసాల స్ఫూర్తి పొందాలని చెప్పారట. చివరకు సాక్ష్యాధారాలు తగినన్ని లేనందువల్ల ఆ కేసు నుంచి బయటపడ్డాడు. ఆయన జైల్లో ఉన్నప్పుడే బీజేపీ అతని భార్యకు టిక్కెట్టిచ్చింది. సింగ్ కు ఎల్లప్పుడు బీజేపీ వంతపాడుతూనే వచ్చింది.

చివరకు కోర్టు జోక్యం వల్ల మాత్రమే ఎఫ్.ఐ.ఆర్ నమోదయ్యింది. ఎఫ్.ఐ.ఆర్ నమోదైన తర్వాత బ్రిజ్ భూషణ్ మాట్లాడుతూ రాజీనామా చేయడం పెద్ద విషయం కాదని, కాని నేరస్తుడిగా రాజీనామా చేయనని అన్నాడు. ఎలాగూ రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షపదవీ కాలం కూడా పూర్తి కావస్తుందని కూడా ఆయన చెప్పాడు. కేసు రిజిష్టరైనా సరే తనకేమీ కాదన్న ధీమా ఆయన మాటల్లో కొట్టవచ్చినట్లు కనిపిస్తోంది.

ఉత్తరప్రదేశ్ బీజేపీ శ్రేణుల్లో బాహుబలి, పహిల్వాన్ జీగా పిలువబడే  బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై కేసు నమోదయ్యింది కాని ఆయన్నెవరు అరెస్టు చేయలేదు. ఆయన్ను అరెస్టు చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది. కాని బీజేపీ ఏం చేయాలో తోచని స్థితిలో ఉంది. 2024లో సాధారణ ఎన్నికలు రాబోతున్నాయి. ఉత్తరప్రదేశ్ ఆరు నియోజకవర్గాల్లో బ్రిజ్ భూషన్ మాత్రమే గెలుపు సాధించి పెట్టగలడని బీజేపీ విశ్వాసం. ఆరెస్సెస్, వి.హెచ్.పిలతో బలమైన సంబంధాలున్న బ్రిజ్ భూషన్ పై చర్య తీసుకోవడం బీజేపీకి అంత తేలికేమీ కాదు. మరోవైపు అంతర్జాతీయ మెడళ్ళు సాధించిన క్రీడాకారిణుల తీవ్రమైన ఆరోపణలున్నాయి. ఆరు నియోజకవర్గాల్లో గెలుపు సాధించి పెడతాడా లేక తీవ్రమైన ఆరోపణలున్న బ్రిజ్ భూషణ్ పై చర్య తీసుకోకపోతే పార్టీ ప్రతిష్ఠ మంటగలుస్తుందా? పేవ్ మెంట్ పై ధర్నా చేస్తున్న క్రీడాకారిణుల దృశ్యాలు బీజేపీ ప్రతిష్ఠను మసకబారుస్తున్నాయన్న భయం ఇప్పుడు చాలా మంది బీజేపీ నేతల్లో కూడా కనిపిస్తోంది.

హిపోక్రసీ:

ప్రధాని సబ్ కా సాత్ సబ్ కా వికాస్ నినాదమిచ్చారు. అందరూ విన్నారు. కాని బీజేపీలో ఒక్క ముస్లిం ఎం.పీ. లేడు. ముస్లిం ఎమ్మెల్యేలు కనిపించరు. మైనారిటీలపై మూకహత్యలకు పాల్పడిన నేరస్తులకు బీజేపీ మంత్రులు పూలమాలలు వేసి సత్కరిస్తారు. బిల్కిస్ బానో అత్యాచారం హత్య కేసులో విడుదలైన నేరస్తులకు పూలమాలలతో స్వాగతించి సత్కరించారు. అంతకుముందు జయంత్ సింగ్ మంత్రిగా ఉన్నప్పుడు మూకహత్య నేరస్తులకు మిఠాయిలు తినిపించి పూలమాలలతో సత్కరించిన వార్త కూడా చాలా మందికి గుర్తుండే ఉంటుంది. అయినా సబ్ కా సాత్ అనే నినాదం వినిపిస్తూనే ఉంటారు.

స్పష్టంగా, కొట్టొచ్చినట్లు చెప్పే మాటలకు పనులకు పొంతన లేకపోవడం కనిపిస్తూనే ఉంది. సబ్ కా సాత్ వంటి జుమ్లాలు ఎన్నికల్లో ఉపయోగపడతాయి కాబట్టి ఉపయోగిస్తున్నారు. అలాంటిదే బేటీ బచావో… బేటీ పఢావో.. ఉన్నవ్ అత్యాచారం కేసు గుర్తుందా? ఏం జరిగింది? హత్రస్ గుర్తుందా? అక్కడేం జరిగింది? ఇప్పుడు జంతర్ మంతర్ వద్ద మహిళా క్రీడాకారిణులు లైంగిక వేధింపుల ఫిర్యాదుతో ధర్నా చేయవలసిన పరిస్థితి. బేటీ బచావో నినాదం నిజానికి మరో ఎన్నికల జుమ్లా తప్ప మరేమీ కాదని తెలుస్తూనే ఉంది.

–  వాహెద్