July 27, 2024

 

కొన్ని చాలా ఆసక్తికరమైన వార్తలు ఇటీవల వచ్చాయి. ఈ వార్తలను విశ్లేషిస్తే ప్రస్తుత పరిస్థితుల గురించి మన అవగాహన పెరుగుతుంది. వీటిలో మొదటి వార్త సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగరత్న ఒక పుస్తకావిష్కరణ సందర్భంగా లౌకికవాదంపై చేసిన ప్రసంగం.

భారత రాజ్యాంగం ఒక లౌకిక వ్యవస్థను నొక్కి చెబుతుంది. అంటే ఏ ఒక్క మతానికి లేదా మతసమూహానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వదు. మత మైనారిటీల హక్కులకు భద్రత ఉంటుంది. ఈ మాటలు చెప్పింది మరెవరో కాదు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.వి.నాగరత్న చెప్పారు. ఇవి మనందరికి తెలిసిన మాటలే.

దక్ష్ అనే సంస్థ తరఫున జరిగిన ఒక పుస్తకావిష్కరణ సభలో న్యాయమూర్తి ఇటీవల మాట్లాడారు. ఆ పుస్తకం పేరు ’’కాంస్టీట్యూషనల్ ఐడియల్స్‘‘ అంటే రాజ్యాంగ ఆదర్శాలు. న్యాయవ్యవస్థ, చట్టాలు, అందరికీ న్యాయం కోసం పనిచేస్తున్న స్వచ్ఛందసంస్థ దక్ష్ అని తెలుస్తోంది. ఈ వివరాలు మనకు లివ్ లా వెబ్ సైటులో ఉన్నాయి.

వివిధ రాజకీయర, సామాజిక, ఆర్థిక పరిస్థితుల్లో దేశంలోని న్యాయవ్యవస్థ రాజ్యాంగాన్ని ఎలా నిర్వచించిందో వివరించే వ్యాసాల సంపుటి ఆమె ఆవిష్కరించిన పుస్తకం. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లౌకికవాదాన్న మరింత వివరించారు. భారతదేశంలో లౌకికవాదం అంటే ప్రభుత్వం ఏ ఒక్క మతానికి చెందినది కాదు. ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా గౌరవిస్తుంది. కులమత వ్యత్యాసాలకు అతీతంగా న్యాయం ప్రాతిపదికన కొత్త సామాజిక సరళి లౌకికవాదం. భారత లౌకికవాదం పాశ్చాత్య దేశాల్లోని లౌకికవాదం వంటిది కాదు. పాశ్చాత్య దేశాల్లో చర్చికి, ప్రభుత్వానికి మధ్య ఘర్షణల్లో లౌకికవాదం జన్మించింది. కాని ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు. భారతదేశ సంస్కృతి బహుళసంస్కృతి. ఈ బహుళ సంస్కృతి మన లౌకికవాదంలో కనిపిస్తుంది. భారతదేశంలో లౌకికవాదం గురించి మనకు ఈ విషయాలన్నీ తెలిసినవే అయినా పునరుద్ఘాటన, పునశ్చరణలు అవసరమనే పరిస్థితులు కూడా ఉన్నాయి.

రెండవవార్తను పరిశీలిస్తే ఈ పునశ్చరణ ఎందుకు అవసరమో అర్థం అవుతుంది.

ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రారంభించారు. ప్రభుత్వం మూడేళ్ళ కాలంలో నిర్మించిన భవ్య నిర్మాణం ఇది. ఇలాంటి ప్రారంభోత్సవ కార్యక్రమాలను బీజేపీ అట్టహాసంగా నిర్వహిస్తుందన్నది గతంలో కూడా మనం చాలా సార్లు చూశాం. ఇప్పుడు కూడా అదే జరిగింది. ఒకవైపు ఆడంబరంగా పార్లమెంటు భవన ప్రారంభోత్సవ కార్యక్రమం, మీడియా హడావిడి జరుగుతుంటే మరోవైపు అదే భవనం ఎదుట ’మహిళా సమ్మాన్ పంచాయతి‘ నిరసన నిర్వహించింది. ఎందుకంటే, మహిళా మల్లయోధులు గత కొంతకాలంగా చేస్తున్న న్యాయపోరాటానికి మద్దతుగా ఈ నిరసన జరిగింది.

సరే అసలు కార్యక్రమం పార్లమెంటు ప్రారంభోత్సవ కార్యక్రమం విషయానికి వస్తే, రాజ్యాంగ స్ఫూర్తి, లౌకికవిలువలు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కనిపించాయా అన్నది ప్రతి ఒక్కరు ఆలోచించుకోవలసిన ప్రశ్న. ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగిన దేశంలో, దాదాపు నూటనలభై కోట్ల మంది ప్రజలు వివిధ మతాల వారు, వివిధ ప్రాంతాల వారు, వివిధ సముదాయాలు, కులాల వారు ఉన్న దేశంలో, ఈ ప్రజలందరికి చెందిన ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమం ఒక మతకార్యక్రమంలా కనిపించలేదా?

మీడియాలో వచ్చిన వార్తల శీర్షికలు గమనిస్తే మరింత స్పష్టంగా విషయం అర్థమవుతుంది. ’’మేరీ సంసద్ మేరీ షాన్‘‘ (నా పార్లమెంటు, నా గర్వకారణం), ’’నయీ సంసద్ మెం సెంగూల్‘‘ (కొత్త పార్లమెంటులో రాజదండం), ’’సనాతన్ సంస్కృతికా హువా ఉద్ఘోష్‘‘ (సనాతన సంస్కృతి ప్రకటన), ’’హిందూ యుగ్ కా ఆరంభ్, సనాతన్ కా శంఖనాద్‘‘ (హిందూయుగారంభం, సనాతన శంఖనాదం)   – ఇవి కొన్ని హిందీ చానళ్ళలో కనిపించిన శీర్షికలు. ఈ శీర్షికలను చూస్తే ఏమనిపిస్తోంది. భారతదేశం లౌకికతత్వాన్ని వదిలి హిందూ రాష్ట్రదశలోకి ప్రవేశించిందని చెప్పటం లేదా? ఇప్పటి వరకు హిందూ హృదయ సామ్రాట్ గా పేరు పడిన ప్రధాని మోడీ ఇక భారత దేశ సామ్రాట్టయిపోయారని చెప్పినట్లు అనిపించడం లేదా? అనేక ప్రముఖ పత్రికలు కూడా ఇదే బాట పట్టాయి.

కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం ఒక చారిత్రక సందర్భంగా మీడియా కోడై కూసింది. హిందూ ధర్మ ప్రాభవాన్న చాటి చెప్పే కార్యక్రమంగా ఇది మారింది. ఈ కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేసిన ప్రతిపక్షాలను దేశానికి శత్రువులుగా చెప్పారు. నిజానికి మీడియాలో బీజేపీ కార్యకర్తలు ఎవరున్నారన్నది గుర్తించడం అంత తేలిక కాదు. ప్రధాని మోడీ సెంగూల్ లేదా రాజదండం ముందు సాష్టాంగ ప్రణామం చేశారు. ఒక హిందూ ధార్మిక కార్యక్రమంలాగే జరిగింది. ఇంతకు ముందు 2020లో అయోధ్యలో రామమందిర శంఖుస్థాపన కూడా ఆయనే చేశారు. అప్పుడు కూడా ధార్మిక కార్యక్రమం నిర్వహించారు. అదేమాదిరి పార్లమెంటు శంఖుస్థాపన కార్యక్రమంలో కూడా హిందూ పూజారులు, సాధుపుంగవుల మంత్రోచ్ఛారణలతో జరిపించారు. అదే ఇప్పుడు కూడా జరిగింది.

ప్రధానమంత్రి హోదాల మోడీ నిర్వహించిన కార్యక్రమాలివి. ఆయన వ్యక్తిగత స్థాయిలో తన విశ్వాసాల ప్రకారం నిర్వహించిన కార్యక్రమాలు కాదు. ఇవన్నీ పరిశీలిస్తే ఏమనిపిస్తోంది. ఒక ప్రత్యేక మతానికి మాత్రమే ప్రాధాన్యత ఉందని స్పష్టంగా తెలియడం లేదా? దేశంలోని ఇతర మతస్తులందరికి స్పష్టంగా ఒక సందేశమిస్తున్నారు. రాజ్యాంగంలోని లౌకికస్ఫూర్తి ఎలా ఉన్నాసరే, ఆచరణలో జరిగేది, జరుగుతున్నది ఇదేనని స్పష్టంగా చెబుతున్నారు. అందుకే ఇప్పుడు లౌకికతత్వం గురించి, రాజ్యాంగ స్ఫూర్తి గురించి పునశ్చరణ అవసరమయ్యింది.

అయోథ్యలో రామమందిర నిర్మాణానికి పూజాదికాలు నిర్వహించిన కార్యక్రమంలో కూడా మోడీ ప్రధాని హోదాలోనే పాల్గొన్నారు. అప్పుడాయన లోక్ సభ ఎన్నికల్లో భారీ గెలుపు సాధించిన ప్రధానిగా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాని ఇప్పుడు, కర్నాటక ఎన్నికల ప్రచారంలో మోడీ స్వయంగా ఎంత ప్రయత్నించినా, ఆయన పేరు మీద పార్టీ ఎన్నికల్లో గెలవడానికి ప్రయాసపడినా ఓటమి తప్పలేదు. కర్నాటక ఓటమితో దక్షిణాదిలో బీజేపీ కనుమరుగయ్యింది. మోడీ అజేయుడనే మాట ఉత్తదే అని తేలిపోయింది. హిందూత్వ రాజకీయాల పరిమితులు కూడా బయటపడ్డాయి. ఇప్పుడు పార్లమెంటు భవనం ప్రారంభోత్సవంలో, ప్రజాస్వామ్య మందిర ప్రారంభోత్సవాన్ని హిందూ మందిర ప్రారంభోత్సవం మాదిరిగా నిర్వహించడం ద్వారా హిందూత్వ ఓటు బ్యాంకును కాపాడుకునే ప్రయత్నాలు బహుశా చేస్తున్నారని అనుకోవచ్చు. కర్నాటక ఓటమి తర్వాత మతతత్వ రాజకీయాలు మరింత ఉధృతమవుతాయా? కర్నాటక ఓటమి తర్వాత బిజేపీ బహుశా ప్రజాసమస్యల గురించి మాట్లాడుతుందని, మతతత్వ రాజకీయాలకు దూరంగా జరుగుతుందని కొందరు అనుకున్నారు. కాని అలాంటి సూచనలు లేవని పార్లమెంటు భవన ప్రారంభోత్సవ కార్యక్రమం స్పష్టం చేసింది.

మణిపూర్ లో హింసాకాండ తర్వాత కూడా అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో మహిళా మల్లయోధులు న్యాయం కోసం పోరాడుతున్నారు. వారిని అరెస్టు చేసి నిర్బంధిస్తున్నారు. మహిళా మల్లయోధులను లైంగికంగా వేధించాడని ఆరోపణలు ఎదుర్కుంటున్న బీజేపీ నేత బ్రిజ్ భూషన్ సింగ్ కొత్త పార్లమెంటులో చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తున్నాడు. ఇవన్నీ ప్రజలు కూడా చూస్తున్నారు. ప్రధాన మీడియా ఎంత సాగిలబడుతున్నప్పటికీ, స్ట్రాంగ్ లీడర్ ప్రధాని మోడీ ఇమేజ్ ను మహిళా మల్లయోధుల నిరసనలు దెబ్బతీస్తూనే ఉన్నాయి. ఇప్పుడు రాజదండం స్వీకరించిన రాజుగా ఆయన పార్లమెంటులో ప్రవేశిస్తున్నారన్నది కూడా గమనించాలి. కాబట్టి బహుశా ఈ సమస్యలేవీ ఆయన పట్టించుకోకపోవచ్చు.

మరో ముఖ్యమైన వార్త కూడా ప్రస్తావించడం అవసరం. పార్లమెంటు భవనాన్ని ఎవరు ప్రారంభించాలి? అనే ప్రశ్న కూడా ముందుకు వచ్చింది. నిజానికి ఫస్ట్ సిటిజన్ గా రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరగాలి. కాని అలా జరగలేదు. పాలకపక్షానికి, ప్రతిపక్షాలకు మధ్య ఈ విషయమై వివాదం చెలరేగింది. ఆ తర్వాత సెంగూల్ వివాదం ముందుకు వచ్చింది. ఇప్పటి వరకు బహుశా ఎవ్వరు కూడా ఈ సెంగూల్ లేదా రాజదండం గురించి విని ఉండరు. కొత్తగా ఇప్పుడు బీజేపీ దీన్ని భారత ప్రజలకు పరిచయం చేసింది. ఈ రాజదండం రాజ్యాధికారానికి ప్రతీకగా భావించాలని చెప్పింది. భారత ప్రథమ ప్రధాని నెహ్రూ గారు ఈ రాజదండాన్ని అప్పట్లో స్వీకరించారనే వార్త మీడియాలో మొదట కనిపించింది. ఈ రాజదండం ఇప్పుడు అలహాబాద్ మ్యూజియంలో అనేక ఇతర వస్తువులతో పాటు పడి ఉందన్న వార్త వచ్చింది. రాజదండం ఉండవలసింది కొత్త పార్లమెంటు భవనంలో అనే వాదన మొదలయ్యింది.

ఈ రాజదండం చరిత్ర కూడా చాలా మంది చెప్పారు. 1947లో లార్డ్ మౌంట్ బాటన్ ఈ రాజదండాన్ని బ్రిటీషు వారి నుంచి రాజ్యాధికారాన్ని బదిలీ చేస్తున్న చిహ్నంగా నెహ్రూ గారికి ఇచ్చాడని హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఈ రాజదండం ఎక్కడిదయ్యా అంటే తమిళనాడుకు చెందినదట. ఇది తమిళనాడుకు చెందిన చారిత్రక చిహ్నమని, దీన్ని నెహ్రూ గారు బ్రిటీషు వారి నుంచి రాజ్యాధికార బదిలీకి చిహ్నంగా స్వీకరించాడని, దాన్ని తర్వాత మ్యూజియంలో ఉంచేశారని అన్నారు. ఇప్పుడు దాన్ని మళ్ళీ పార్లమెంటులో ప్రతిస్ఠిస్తున్నామని చెప్పారు. అంటే నెహ్రూ గారి తప్పులు, పాపాల జాబితాలో మరొకటి చేర్చారన్నమాట.

తమిళనాడులోన తిరువవాదుతురై అధీనం మఠానికి చెందిన మతపెద్దలు ఈ రాజదండాన్ని మతపరమైన క్రతువులతో సిద్ధం చేస్తారు. ఎందుకంటే ఇది తమిళనాడులోని ఆ మఠానికి చెందిన మతపెద్దలే నెహ్రూ గారికి లార్డ్ మౌంట్ బాటన్ ద్వారా ఇప్పించారట.

ఇది తమిళనాడుకు గర్వకారణమని చెబుతున్నారు. ఈ రాజదండం కథ మరింత విస్తారంగా కూడా చెబుతున్నారు. దేశరాజ్యాధికారాన్ని బదిలీ చేసే విషయమై నెహ్రూ గారిని మౌంట్ బాటన్ ప్రశ్నించారట. నెహ్రూ గారు రాజగోపాలాచారి గారిని అడిగారట. రాజగోపాలాచారి గారు చేర, చోళ పాండ్య రాజరికాల పద్ధతి పాటించాలని చెప్పారట. నెహ్రూ గారు ఈ సూచన స్వీకరించారట. ఆ ప్రకారమే రాజదండాన్ని మౌంట్ బాటన్ గారు, నెహ్రూ గారికి ఇచ్చారట. కాని ఇదంతా కట్టుకథ అని కాంగ్రెసు కొట్టి పారేస్తోంది. దీనికి ఎలాంటి ఆధారాలు లేవని చెబుతోంది. ఒకవేళ ఇలాంటి కార్యక్రమమే అప్పట్లో జరిగి ఉంటే దాని గురించి ఇంతకాలం ఎవరికీ తెలియకపోవడం చాలా ఆశ్చర్యం. దీన్ని కాంగ్రేసు వారు మరుగున పాడేశారని అనుకున్నా, గత పదేళ్ళుగా రాజ్యాధికారంలో తిరుగులేని నాయకుడు మోడీ గారు వచ్చిన తర్వాత కూడా ఈ రాజదండం గురించి ఇంతకాలం వెలుగులోకి రాకపోవడం మరో ఆశ్చర్యం. కాంగ్రెసు నాయకుడు జైరాం రమేష్ ఇదంగా బోగస్ అని కొట్టి పారేశారు. వెంటనే అమిత్ షా ఇది తమిళనాడును అవమానించటమే అన్నారు. తమిళనాడులోని తిరువాదితురై శైవమఠం స్వయంగా ఈ రాజదండం ప్రాముఖ్యం గురించి చెబుతుంటే కాంగ్రెసు నేతలు దాన్ని బోగస్ అంటున్నారని ధ్వజమెత్తారు.

తమిళనాడులో బీజేపీ కాలుమోపే ప్రయత్నాలు చాలా కాలం నుంచి చేస్తుంది. ఇప్పుడు ఈ రాజదండం అలాంటి అవకాశాలు ఇస్తుందని అందుకే ఈ ప్రయత్నాలని చాలా మంది విశ్లేషిస్తున్నారు. కొన్ని వారాల క్రితం వరకు కూడా ఈ సెంగూల్ లేదా రాజదండం గురించి ఎవరికీ తెలియదు. ఇప్పుడు దేశప్రజలందరికీ తెలుసు. 1980ల వరకు  బాబరి మస్జిద్ వివాదం గురించి కూడా దక్షిణాది వారికి తెలియదు. ఉత్తరాదిలో కూడా అంతగా ఈ వివాదం ప్రచారంలో లేదు. కాని తర్వాత యావత్తు ప్రపంచానికి తెలిసింది. భారత రాజకీయాలు మారిపోయాయి. ఇప్పుడు రాజదండం సీనులోకి వచ్చింది. ఇప్పుడు చాలా మందికి తెలియదు. కాని తమిళనాడు ఎన్నికల వరకు చాలా మందికి తెలుస్తుంది. లోక్ సభ ఎన్నికల్లోను ఇది రాజకీయాస్త్రం కావచ్చు.

కొత్త పార్లమెంటు భవనం, కొత్త రాజదండం మంత్రోచ్ఛారణలతో ప్రారంభోత్సవాల నడుమ మనం మరిచిపోతున్న విషయాలు చాలా ఉన్నాయి. రైతుల నిరసన వల్ల వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకోక తప్పలేదు. ఇప్పుడు రైతులు మహిళా మల్లయోధుల న్యాయపోరాటానికి మద్దతిస్తామంటున్నారు. కర్నాటకలో మైనారిటీ రిజర్వేషన్లను రద్దు చేస్తామని, హిజాబ్ నిషేధమని, హలాల్ నిషేధమని చేసిన మతతత్వ రాజకీయాలు బెడిసికొట్టాయి. మరింత ఉధృతంగా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇవే రాజకీయాలు నడిపితే మరోసారి రాజ్యాధికారం తప్పక లభిస్తుందని బీజేపీ పెద్దలు ఆలోచిస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే ఈ రాజదండం వంటి వివాదాలు ముందుకు వస్తున్నాయి. దేశప్రజలు ఎటు మొగ్గు చూపిస్తారో రానున్న ఎన్నికల్లోనే తెలుస్తుంది.

రాజ్యంగ స్ఫూర్తి గురించి, లౌకికతత్వం గురించి మనం మాట్లాడుకునే మాటలు, చెప్పుకునే ఆదర్శాలు ఆచరణలో ఉన్నప్పుడే నా జన్మభూమి ఎంత అందమైన దేశమూ అని పాడుకునే ఆహ్లాదకరమైన సామాజిక వాతావరణం ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.