April 13, 2024

మహిళా మల్లయోధుల నిరసనలు కొనసాగుతున్నాయి. జంతర్ మంతర్ వద్ద నిరసన నిర్వహిస్తున్న మహిళా మల్లయోధులను పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీలో 700 మంది నిరసన కారులను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. వివిధ సెక్షన్ల క్రింద వారిపై కేసులు నమోదు చేశారు. వినేష్ ఫోగాట్, సాక్షి మలిక్, భజరంగ్ పునియా వంటి వారు కూడా అరెస్టయిన వారిలో ఉన్నారు.

ఒకవైపు మహిళా మల్లయోధులు న్యాయం కోసం నిరసన ప్రదర్శనలు చేస్తుంటే మరోవైపు లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కుంటున్న బీజేపీ నాయకుడు బ్రిజ్ భూషన్ సింగ్ ను బీజేపీ పార్టీ, ప్రధాని అందరూ సమర్థిస్తున్నట్లు కనిపిస్తున్నారు. మహిళా మల్లయోధులు ప్రారంభంలో న్యాయం కోసం పోరాడుతున్నామని, రాజకీయ పార్టీలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అందువల్లనే సిపిఎంకు చెందిన బృందాకరత్ ను తమ వేదికపై అనుమతించలేదు. కాని ఇప్పుడు తమకు సంఘీభావం ప్రకటించే వారందరినీ ఆహ్వానిస్తున్నారు. నెమ్మదిగా ఈ పోరాటం రాజకీయ రంగు సంతరించుకుంటోంది. అనేకమంది వారి నిరసనకు మద్దతిస్తున్నారు. కార్మికులు, రైతులు, విద్యార్థులు యువకుల మద్దతే కాదు ఇప్పుడు ఖాప్ పంచాయతుల మద్దతు కూడా వారికి లభిస్తోంది. ఖాప్ మద్దతు చాలా కీలకమైనది. ఎందుకంటే, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పోరాడినప్పుడు ప్రభుత్వం వెనుకడుగు వేసింది ఖాప్ ల వల్లనే. అలాగే పౌరసత్వ సవరణ చట్టం విషయంలో కూడా ఒక ప్రత్యేక సముదాయం ఉద్యమించిన సందర్భాల్లో ప్రభుత్వం వెనుకడుగు వేయవలసి వచ్చింది.

పౌరసత్వ సవరణ చట్టం విషయంలో ముస్లిం మహిళలు ఉద్యమించడం కాని, వ్యవసాయ చట్టాల విషయంలో సిక్కు మహిళలు ఉద్యమించడం కాని ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడిని తీసుకువచ్చాయి. ఇప్పుడు మహిళా మల్లయోధుల నిరసనలు కూడా అదే బాటన నడుస్తున్నట్లు కనిపిస్తోంది. వ్యవసాయ చట్టాలపై జరిగిన నిరసన పోరాటంలో హర్యానా, రాజస్థాన్, మహిళలు జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదర్శన చేయడానికి కారణం ఖాప్ లే.

మహిళా మల్లయోధుల నిరసనకు ఇప్పుడు ఖాప్ ల మద్దతు కూడా లభించింది. ఇది కేవలం జాట్ సముదాయం చేస్తున్న నిరసన ప్రదర్శనగా మాత్రమే చూడరాదు. గుజ్జార్లు, ఠాకూర్లు, యాదవులు అందరూ ఈ నిరసనకు మద్దతిస్తున్నారు. మరోవైపు భీం ఆర్మీ నాయకుడు చంద్రశేఖర్ ఆజాద్ కూడా దీనికి మద్దతిచ్చాడు.

నిరసనలు హోరెత్తుతున్నాయి. కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవం మర్నాడు పత్రికల్లో ఈ వార్తతో పాటు నిరసన ప్రదర్శనలు చేస్తున్న మహిళలను పోలీసులు అరెస్టు చేస్తున్న ఫోటోలతో వార్తలు కూడా వచ్చాయి. మహిళలపై పోలీసులు దాడి చేసి నిర్బంధిస్తున్న వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ నిరసన అంతర్జాతీయ వార్త కూడా అయిపోయింది. కుస్తీ పోటీల అంతర్జాతీయ సంస్థ యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ కూడా ఇందులో జోక్యం చేసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి.

వ్యవసాయ చట్టాలపై నిరసనలు, పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనలు కూడా అంతర్జాతీయ వార్తలయ్యాయి. కాని ఇప్పుడు లైంగిక వేధింపుల కేసు ఈ స్థాయి నిరసనగా మారడాన్ని ప్రపంచ దేశాలు కూడా చూస్తున్నాయి. పైగా ఈ లైంగిక ఆరోపణలు ఎదుర్కుంటున్న వ్యక్తిపై ఇంతకు ముందు కూడా చాలా క్రిమినల్ కేసులున్నాయి. బీజేపీలో ఆయన బలమైన నాయకుడు. ఇంతగా నిరసనలు పెల్లుబుకుతున్నా ఆయన్ను రెజ్లింగ్ ఫెడరేషన్ పదవి నుంచి తప్పించడం కూడా జరగలేదు.

అంతర్జాతీయంగా భారతదేశానికి కీర్తి ప్రతిష్ఠలు సాధించిన క్రీడాకారులు, మెడళ్ళు సాధించిన క్రీడాకారులు, మహిళా క్రీడాకారులు న్యాయం కోసం మండుటెండల్లో పోరాడుతున్న దృశ్యాలు భారత మధ్యతరగతి ఓటర్లపై తీవ్రమైన ప్రభావం వేస్తాయన్నది మరిచిపోరాదు. మహిళా మల్లయోధుల నిరసనలు దేశరాజకీయాలలో కొత్త మార్పులకు కారణమైనా ఆశ్చర్యపోవలసిన పనిలేదు.