దాదాపు 3 కోట్ల 20 లక్షల మంది భారతీయులు విదేశాల్లో ఉన్నారు. అలాగే లక్షలాది మంది ప్రతి సంవత్సరం ఉపాధి అవకాశాల కోసం విదేశాలకు వెళుతున్నారు. ఇలా వలస వెళ్ళిన వారు అక్కడి నుంచి మాతృదేశంలో తమ కుటుంబా లకు తమ సంపాదన పంపిస్తున్నారు. 2021లో ఇలా విదేశాల నుంచి ప్రవాస భారతీయులు దేశానికి పంపించిన మొత్తం 89 బిలియన్ డాలర్లని తెలుస్తోంది. ఇది ప్రపంచం లోనే అత్యధిక మొత్తం. వంద బిలియన్ డాలర్లకు ఇది చేరుకుంటుందని అంచనా. ప్రవాస భారతీయులు మాతృ దేశంతో తమ సంబంధాన్ని పటిష్టంగా కొనసాగిస్తున్నారు. సాంస్కృతిక సంబంధాలు బలంగా ఉంటున్నాయి. ప్రవాస భారతీయుల్లో చాలా మంది రిటైర్మెంట్ తర్వాత తిరిగి స్వంత దేశానికి వచ్చి సెటిలవుతున్నారు. చాలా అరుదైన సందర్భాల్లో కొందరు అదే దేశంలో ఉండిపోతున్నారు.
భారతదేశంలో ఇప్పుడు జి20 దేశాల సదస్సు జరుగుతోంది. వసుధైక కుటుంబకం అనే భారతీయ భావనతో జరుగుతున్న సదస్సు ఇది. అయితే ప్రవాస భారతీయులు ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒక విచిత్రమైన సమస్య ఇక్కడ భారతదేశంలో ఎన్నడూ ఎవరికీ ఎదురు కాని సమస్య గురించి ఆలోచించ వలసిన అవసరం ఉంది. ఉదాహరణకు జర్మనీలోని బెర్లిన్‌లో గుజరాతీ కుటుంబానికి చెందిన ఒక పసిబాలికను అక్కడి చైల్డ్ సర్వీస్ ఏజన్సీ తల్లిదండ్రుల నుంచి దూరం చేసి చైల్డ్ కేర్ సెంటరుకు తరలించింది. కారణమేమిటంటే, తన మనుమరాలిని చూడ్డానికి జర్మనీ వచ్చిన నాయనమ్మ పొరబాటు వల్ల ఆ పసిపిల్లకు చిన్న గాయమైంది. ఆసుపత్రికి తీసుకెళితే ఆసుపత్రి డాక్టర్లు వైద్యం మాత్రమే చేయలేదు, తల్లిదండ్రులు, ఇంటివారే పసిదాన్ని గాయపరిచారని భావించి పోలీసులకు తెలియజేశారు. పోలీసులు వచ్చిన తర్వాత ఆ పసిపిల్లను తల్లిదండ్రుల నుంచి వేరు చేసి చైల్డ్ కేర్ సెంటరుకు తరలించారు. తల్లిదండ్రులు సమీప బంధు వులు ఒక పసిబాలికను గాయపరుస్తారని భావించడం కూడా భారత సమాజంలో మింగుడుపడని విషయం. కాని ఇది పాశ్చాత్య సమాజం. తల్లిదండ్రుల నుంచి లాక్కుని ఆ పసిబాలికను కనీసం చూడనివ్వడం కూడా లేదు. ఇలా చైల్డ్ కేర్ సెంటరుకు తరలించిన పిల్లలకు అక్కడి భాష కొత్త, వాతావరణం కొత్త, మనుషుల ముఖాలు కొత్త, వారి సంస్కృతి కొత్త, వారి ఆహారఅలవాట్లు కొత్త. అయినా సరే తల్లిదండ్రుల నుంచి వేరు చేస్తుంటారు. సల్మాన్ ఖుర్షిద్ విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు, ఎస్.ఎం.కృష్ణ విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు, సుష్మా స్వరాజ్ విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు ముందుకు వచ్చాయి.
తల్లిదండ్రులకు ఇది చాలా బాధాకరమైన పరిస్థితి అవుతుంది. తమ కన్న పిల్లలను కనీసం చూసుకునే అవకాశం లేదు. ఆస్ట్రేలియాలో ఇటీవల ఒక భారత దంపతులు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు. ఆ తల్లి చివరకు ఈ బాధను భరించలేక ఆత్మహత్య చేసుకుంది. ఇలాంటి ఆత్మహత్యలు కూడా ఈ పాశ్చాత్య కుహానా విలువలను ప్రభావితం చేయ లేకపోతున్నాయి. ఇలాంటి కేసులు మనకు భారతదేశంలో విచిత్రంగా కనిపిస్తాయి. కాని ప్రవాస భారత కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్య ఇది. చివరకు ఈ బాధను భరించ లేని తల్లిదండ్రులు విపరీతమైన నిర్ణయాలు తీసుకుంటు న్నారు. ప్రాణాలు విడిచిపెడుతున్నారు.
ఇలాంటి విషాదాలను నివారించాలంటే భారత ప్రభుత్వం తక్షణం తగిన చర్యలు చేపట్టాలి. అంతర్జాతీయ సమాజం ఇలాంటి కేసుల్లో తల్లిదండ్రుల పట్ల అనుమానాలు ఉంటే, తల్లిదండ్రుల నుంచి దూరం చేసిన పిల్లలను స్వంత దేశానికి వెంటనే దగ్గరి బంధువుల వద్దకు తరలించాలి. పాశ్చాత్య న్యాయ వ్యవస్థలోని నియమనిబంధనలను అక్కడకు వెళ్ళిన వారు గౌరవించడం అవసరమే. పిల్లల పట్ల తల్లిదండ్రులు దురుసుగా వ్యవహరిస్తున్నారని అనుమానించి చర్యలు తీసు కునే ఇలాంటి కేసుల్లో భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, ఇక్కడి విలువలు, కుటుంబాల్లో ఉండే అనుబంధాలు వీటన్నింటిని ఆయా దేశాలు గుర్తించి వ్యవహరించేలా ఒత్తిడి తీసుకురావాలి. నిజానికి పాశ్చాత్యదేశాల్లో భారత ప్రవాసులు ఎదుర్కొంటున్న ఈ సమస్య మానవీయ సమస్య. అందువల్లనే అనేకమంది హైకోర్టు మాజీ న్యాయ మూర్తులు జి20కి ఈ విషయమై లేఖ రాశారు. ఈ మానవీయ సమస్యకు సానుభూతితో కూడిన పరిష్కారం తీసుకోవాలన్నారు. జి20 సదస్సులో భారత ప్రభుత్వం ఈ సమస్యపై చర్చకు ప్రాముఖ్యమివ్వవలసిన అవసరం ఉంది.