October 5, 2024

Video wall with small screens digital concept

ఆజ్ తక్ హిందీ వార్తా చానల్. ఇప్పుడు చానళ్ళన్నీ కూడా ప్రభుత్వానికి వంతపాడుతున్నాయన్నది అందరికీ తెలిసిన వాస్తవమే. ఆజ్ తక్ కూడా అందుకు మినహాయింపు కాదు. నిజానికి చాలా చానళ్ళు ఇండియా కూటమి పేరును ఇండియా కూటమి అని కాకుండా ఐ ఎన్ డీ ఏ కూటమి అని అక్షరాలు వేర్వేరు చేసి కూడా చెబుతున్నాయి. పాలకపక్షానికి అనుకూలంగా ఉండడానికి ఎన్ని తంటాలు పడుతున్నారో చూస్తే నవ్వు కూడా వస్తుంది.

ఇటీవల ఆజ్ తక్ చానల్లో సుధీర్ చౌదరీ ఒక కార్యక్రమంలో కర్నాటక ప్రభుత్వం గురించి చెప్పిన మాటలు అబద్దాలని, అబద్దాల ప్రచారం చేస్తున్నందుకు ఆయనపై ఇప్పుడు కర్నాటకలో కేసు నమోదయ్యింది. సుధీర్ చౌదరీ అంటే ఎవరని తెలుగు పాఠకులు కాస్త అయోమయపడవచ్చు. సుధీర్ చౌదరీ ఒక బలవంతపు వసూళ్ళ కేసులో, దాదాపు వంద కోట్ల రూపాయల వ్యవహారంలో తీహార్ జైలుకు వెళ్ళిన పాత్రికేయుడు. ఇటీవల కాస్త హద్దు దాటి, తాను వంతపాడే బీజేపీ పార్టీలోని నాయకురాలు స్మృతి ఈరానీని టమాటాల ధర పెరగడంపై ప్రశ్నించినప్పుడు ఆమె చానల్ కార్యక్రమంలోనే జైలు జీవితాన్ని సుధీర్ చౌదరీకి గుర్తు చేసింది. సుధీర్ చౌదరీ కిక్కురు మనలేదు. ఈ సుధీర్ చౌదరీయే నానా రకాల జిహాదుల గురించి కూడా కార్యక్రమం చేశాడు. హిందూ ముస్లిం చిచ్చుపెట్టి పాలకపక్షం ప్రసన్నత కోసం ప్రయత్నించే అనేకమంది పాత్రికేయుల్లో ఇలాంటి పేర్లు చాలా మన ముందుకు వస్తుంటాయి.

ఇప్పుడు ఈ సుధీర్ చౌదరీపై కేసు ఎందుకు పడిందంటే, ఆజ్ తక్ చానల్ ప్రైమ్ టైములో అంటే రాత్రి 9 గంటల అతిముఖ్యమైన కార్యక్రమంలో కర్నాటకలోని కాంగ్రెసు ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేసేలా, ఒక అబద్దాన్ని ప్రచారం చేశాడు. కర్నాటక సర్కారు మైనారిటీలకు మూడు లక్షల రూపాయల సబ్సిడీ ఇస్తుందని, హిందువులకు ఏమీ ఇవ్వడం లేదని చెప్పాడు. కర్నాటకలోని ఒక స్కీము గురించి అబద్దాలు ప్రచారం చేసి, హిందూ ముస్లిం వివాదాలు సృష్టించేలా ఈ కార్యక్రమం ఉంది. కర్నాటక మంత్రి ఆజ్ తక్ పై తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అబద్దాలు మొదట బీజేపీ నేతలు ప్రచారంలో పెట్టారని తర్వాత మీడియా కూడా ఈ అబద్దాలను ప్రచారం చేస్తున్నాయని అన్నారు.

వాస్తవాలేమిటో చూద్దాం. కర్నాటకలో స్వాలంబీ సారథీ యోజన సబ్సిడీ స్కీము అమలవుతుంది. ఈ స్కీము ప్రకారం మైనారిటీలకు ఆటోలు కొనుక్కుని జీవనోపాధి పొందడానికి గరిష్ఠంగా మూడు లక్షల రూపాయలు లేదా 50 శాతం సబ్సిడీ ఇస్తారు. అలాగే యస్సీ, యస్టీలకు గరిష్టంగా 4 లక్షల రూపాయలు లేదా 75 శాతం సబ్సిడీ ఇస్తారు. ఇందులో గమనించవలసిన విషయమేమిటంటే, మైనారిటీలంటే కేవలం ముస్లిములు మాత్రమే కాదు సిక్కు, క్రయిస్తవ, బౌద్ధ, జైన మతవర్గాలన్నీ మైనారిటీల క్రిందికే వస్తాయి. వీళ్ళందరికీ ఈ సబ్సిడీ వర్తిస్తుంది. సాధారణంగా జరిగేదేమిటంటే, విమానాశ్రయాలు, ఆసుపత్రులు తదితర బహిరంగ ప్రదేశాల్లో టీవీలు నడుస్తుంటాయి. వార్తలు చూపిస్తుంటారు. కాని ఆడియో ఉండదు. కేవలం వీడియో మాత్రమే చూపిస్తుంటారు. సుధీర్ చౌదరీ ఈ వార్త చెబుతూ కేవలం ముస్లిములు నమాజు చేస్తున్న దృశ్యాలు చూపించాడు. పైగా హిందువులకు సబ్సిడీ లేదని రాతలు స్క్రీనుపై ఉన్నాయి. ఆడియో లేకుండా ఇది చూసిన వాళ్ళు ఏమనుకుంటారు. ముస్లిములకు మాత్రమే కర్నాటక ప్రభుత్వం దోచిపెడుతుందని అనుకుంటారు. అలా అనుకోవాలన్నదే ఈ దుర్మార్గం. ఇంకో ముఖ్యమైన విషయమేమిటంటే, ఈ సబ్సిడీ స్కీము గురించి మాట్లాడుతూ ముస్లిములు నమాజు చేస్తున్న దృశ్యం చూపించడం. ముస్లిములు సామూహికంగా రోడ్లపై నమాజులు చేస్తుంటారని హిందూత్వ సంస్థలు చేస్తున్న గగ్గోలు చాలా మందికి తెలిసిందే. గురుగ్రామ్ లో ఈ విషయమై జరుగుతున్న వివాదాలు తెలిసినవే. కర్నాటకలో కాంగ్రెసు ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇక్కడ ఈ నమాజు సమస్య వస్తుందనే మాదిరిగా ఈ క్లిప్పులు చూపించాడు. ఈ మతతత్వ ధోరణి ఆజ్ తక్ చానల్, సుధీర్ చౌదరీలు ప్రదర్శించడం ఇదే మొదటిసారి కాదు.

ఇక్కడ గమనించవలసిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, హిందువులకు సబ్సిడీ లేదన్నాడు. కాని యస్సీ, యస్టీలకు 75 శాతం, అంటే మైనారిటీల కన్నా ఎక్కువ సబ్సిడీ ఇస్తున్నారు. యస్సీ, యస్టీలు హిందువులు కాదా? సుధీర్ చౌదరీ హిందువులకు సబ్సిడీ ఇవ్వడం లేదని ఎందుకు అన్నాడు.

కర్నాటకలో మైనారిటీ సంక్షేమానికి ఉద్దేశించిన స్కీముల గురించి అల్పసంఖ్యాకులకు తెలియజేయడానికి ఉద్దేశించిన ప్రకటనలను కూడా బీజేపీనేతలు వాడుకుని ఈ స్కీముపై అబద్దాలు ప్రచారం చేయడానికి ప్రయత్నించారు. మైనారిటీల స్కీముల గురించి ప్రకటన ఉన్నప్పుడు వారికి లభించే ప్రయోజనాల గురించి మాత్రమే అందులో ఉంటుంది కదా? యస్సీ యస్టీ లేదా మరో సముదాయం గురించిన ప్రస్తావనలు ఉండవు కదా? ఈ ప్రకటనలను కూడా వాడుకుని హిందూ ముస్లిం విద్వేషం రగిలించే ప్రయత్నాలు చేశారు. ఇలాంటి ప్రయత్నాలు చేసే పాత్రికేయులు దేశంలో ఎలాంటి విద్వేష వాతావరణం ఏర్పడేలా చేస్తున్నారో ప్రజలంతా గుర్తించాలి.