December 6, 2024

కొన్ని సంఘటనల వార్తలు మనకు ప్రధానస్రవంతి పత్రికల్లో కనిపించవు. ఇటీవల గోవాలో జరిగిన ఒక సంఘటన ఇక్కడ ప్రస్తావించాలి. అక్కడ కేశవ్ స్మృతి హయ్యర్ సెకండరీ స్కూలు ప్రిన్సిపాల్ శంకర్ గావంకర్ ను సస్పెండ్ ఛేశారు. ఆయన చేసిన తప్పేమిటంటే, ఆయన విద్యార్థులు మస్జిదును సందర్శించే అనుమతి ఇచ్చాడు. మస్జిదులో విద్యార్థినులతో బలవంతంగా హిజాబ్ తొడిగించారు. అందువల్ల ఆయన్ను సస్పెండ్ చేయాలని హిందూత్వ సంస్థలు గగ్గోలు చేశాయి. చివరకు ఆయన్ను సస్పెండ్ ఛేశారు. కాని ఆయన్ను సస్పెండు చేయడం విద్యార్థులకు నచ్చలేదు. వెంటనే ఆయన్ను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ర్యాలీలు తీశారు. విద్యార్థినులు స్పష్టంగా తమనెవరు బలవంతం చేయలేదని, సాధారణంగా ఆరాధనాలయాల్లోకి వెళుతున్నప్పుడు మర్యాదపూర్వకంగా అక్కడి ఆచారాలు పాటించే మాదిరిగానే తామే స్వచ్ఛందంగా తలపై దుపట్టా లేదా స్కార్ఫ్ కట్టుకున్నామని చెప్పారు.

అసలు జరిగిందేమిటంటే, కేశవ్ స్మృతి స్కూలు యాజమాన్యానికి ఒక ముస్లిం సంస్థ నుంచి విజ్ఞప్తి వచ్చింది. ఆ ముస్లిం సంస్థ ఒక విద్యాపరమైన వర్క్ షాప్ నిర్వహిస్తుంది. ఆ వర్క్ షాప్ కు విద్యార్థులను పంపాలని విజ్ఞప్తి చేశారు. స్కూలు నుంచి మొత్తం 22 మంది విద్యార్థులు వెళ్ళారు. అందులో ఇద్దరు హిందూ అమ్మాయిలు, ఇద్దరు క్రయిస్తవ విద్యార్థినులు ఉన్నారు. ఈ వర్క్ షాపులో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల విద్యార్థినులు కూడా పాల్గొన్నారు. ఆ ముస్లిం సంస్థ నిర్వహించిన వర్క్ షాప్ పేరు Mosque open for all. ఇది అవగాహన పెంచే వర్క్ షాప్. మస్జిదేమిటి? ఏం చేస్తారు? మొదలైన విషయాలు స్వయంగా చూసి తెలుసుకునేలా నిర్వహించిన వర్క్ షాప్. ఈ వర్క్ షాప్ కు హాజరైన విద్యార్థినులు, టీచర్లు స్పష్టంగా తమనెవ్వరు బలవంతం చేయలేదని, తాము మర్యాదపూర్వకంగా మస్జిదు సంప్రదాయాన్ని గౌరవిస్తూ తలపై దుపట్టా ధరించామని అన్నారు. కాని హిందూత్వ సంస్థలకు ఇది తమ రాజకీయ పార్టీలకు ఉపయోగపడే హిజాబ్ సమస్యగా కనిపించింది. వెంటనే గగ్గోలు మొదలైంది.

ముస్లిములకు సంబంధించిన రోజుకో కొత్త వార్త వివక్ష, పక్షపాతాలకు సంబంధించింది మన ముందుకు వస్తోంది. ఇప్పుడు ఇవి వార్తలుగా కూడా ఎవరు భావించలేని స్థాయికి మామూలు వ్యవహారాలై పోయాయి. ఇటీవలి సంఘటనలనే తీసుకుందాం ఉత్తరప్రదేశ్ ముజఫ్ఫర్ నగర్ లో ఒక ముస్లిం విద్యార్థిని, చిన్నపిల్లవాడిని టీచరు స్కూల్లో ఇతర విద్యార్థులతో చెంపదెబ్బలు కొట్టించింది. అంతేకాదు, ముస్లిముల గురించి అనుచిత వ్యాఖ్యలు పిల్లల ముందు చేసింది. పైగా తాను చేసింది తప్పేమీ కాదన్నట్లు తర్వాత కూడా ఆమె మాట్లాడింది. ఆమెకు మద్దతివ్వడానికి బీజేపీ పెద్దలు రెక్కలు కట్టుకుని వాలిపోయారు. హర్యానా గురుగ్రామ్ లో శోభాయాత్రకు ముందు పోస్టర్లు వేసి ముస్లిములు ఆ ప్రాంతం వదిలి వెళ్ళిపోవాలని హెచ్చరికలు జారీ చేశారు.

ఇలాంటి సంఘటనలు మరికొన్ని జరిగితే ఆ తర్వాత ఇది మామూలైపోతుంది. ఒక వార్తగా కూడా ప్రాముఖ్యం ఉండదు. వార్తా పత్రికలు, చానళ్ళు ఈ సంఘటనలకు వార్తలుగా ప్రాధాన్యం కూడా ఇవ్వవు. పదే పదే ఇవే వార్తలు ఇస్తే పాఠకులు మాత్రం ఎందుకు చదువుతారు. ప్రేక్షకులు మాత్రం ఎందుకు వింటారు. కాబట్టి ఇది బిజినెస్ యాజ్ యూజువల్ స్థాయికి చేరుకుంటుంది.

 

హిజాబ్ వార్తలు కూడా ఇలాంటివే. కర్నాటకలో హిజాబ్ వివాదం జరిగినప్పుడు అది వార్త. కాని ఇప్పుడు గోవాలో హిజాబ్ అంటూ హిందూత్వ సంస్థలు చేసిన గగ్గోలు వార్తగా చాలా పత్రికలకు కనబడనే లేదు. కర్నాటకలో జరిగిందేమిటి? కాలేజీ విద్యార్థినులు కొందరు తమ తలపై దుపట్టా ధరించారు. అది బురఖా కూడా కాదు. అదనంగా ఒక వస్త్రం తలపై ధరించడం కుదరదని, నియమనిబంధనలు ఎంత లెక్క చెప్పాయో అంతే లెక్క ప్రకారం ధరించాలని ఆ అమ్మాయిలు విద్యాసంస్థల్లోకి అడుగుపెట్టకుండా అడ్డుకున్నారు. ఆ అమ్మాయిలు కోర్టుకు వెళ్ళారు. ఈ కేసు సింగిల్ జడ్జి బెంచ్ నుంచి హైకోర్టు వరకు వెళ్ళింది. హైకోర్టు స్థాయిలోను వచ్చిన తీర్పు ఏమిటంటే, స్కూలు యూనిఫారంలో అదనపు ఆచ్ఛాదనలు ఎలా సాధ్యం? స్కూళ్ళలో మతపరమైన చిహ్నాలను ఎలా అనుమతించగలం? అని కోర్టు ప్రశ్నించింది. చివరకు కేసు సుప్రీంకోర్టుకు వెళ్ళింది. పదకొండు రోజుల పాట వాదనలు జరిగాయి. ఒక్క అదనపు అచ్ఛాదన తలపై అమ్మాయిలు ధరించినందుకు సుదీర్ఘ వాదోపవాదాలు జరిగాయి. ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనంలో ఇద్దరు న్యాయమూర్తులు వేర్వేరు తీర్పులు చెప్పారు. కర్నాటకలో తర్వాత ప్రభుత్వం మారింది. ఇప్పటికి కూడా కర్నాటకలో హిజాబ్ బ్యాన్ కొనసాగుతోంది. ప్రభుత్వం తక్షణం ఈ నిషేధం తొలగించడం సాధ్యం కాదని కాంగ్రెస్ మంత్రి అన్నారు. ఈ క్రమంలో అనేకమంది ముస్లిం అమ్మాయిలు పరీక్షలు రాయలేకపోయారు. అనేకమంది విద్యాసంస్థల నుంచి డ్రాపవుట్ అయ్యారు. బేటీ బచావ్, బేటీ పడావ్ నినాదం అద్భుతంగా రాజకీయ నేతలు ఇస్తూనే ఉన్నారు. ఒక అదనపు అచ్ఛాదన తలపై ధరించినందుకు ముస్లిం అమ్మాయిలు చదువుకోవడం సాధ్యం కాని పరిస్థితి సృష్టించారు.

అది కర్నాటక కేసు, ఇప్పుడు మరో కేసు చూద్దాం. ఎంత నిస్సిగ్గుగా, బాహాటంగా ద్వంద్వప్రమాణాలు, రెండు నాల్కల వ్యవహరాలు నడుస్తున్నాయో ఇది పరిశీలిస్తే అర్థమవుతుంది. ఇది కూడా స్కూలులో హిజాబ్ కేసు. అయితే ఇది ప్రైవేటు స్కూలు. పైగా ప్రైవేటు మైనారిటీ స్కూలు. కాని ఇక్కడ విచిత్రంగా కోర్టు కర్నాటక కేసుకు విరుద్దమైన తీర్పు ఇచ్చింది. మధ్యప్రదేశ్ దామో లోని ఒక ప్రైవేటు మైనారిటీ స్కూలు విద్యార్థినుల యూనిఫారం సల్వార్ కమీజు తలపై దుపట్టా ధరించాలని నియమం పెట్టిందని, ముస్లిమేతర విద్యార్థులు బొట్టు ధరించడాన్ని అనుమతించడం లేదని, పైగా ఉర్దూ భాషను తప్పనిసరిగా బోధిస్తున్నారని గగ్గోలు మొదలయ్యింది.

ఆ స్కూలు పేరు గంగా జమునా స్కూలు. ఆ స్కూలు విద్యార్థులతో ది క్వింట్ వార్త సంస్థ మాట్లాడినప్పుడు తమనెవ్వరు బొట్టు ఎందుకు పెట్టుకున్నావంటూ మందలించడం లేదా స్కూలు నుంచి బయటకు పంపడం జరగడం లేదని, ఎవరిని బలవంతంగా హిజాబ్ ధరించాలని చెప్పడం లేదని అన్నారు. ఇలా చెప్పిన విద్యార్థులు ముస్లిం విద్యార్థులేమీ కాదు. ఈ స్కూలు విద్యార్థినులు బలవంతంగా హిజాబ్ ధరించేలా యాజమాన్యం ఒత్తిడి చేస్తుందంటూ వైరల్ వార్తలు మొదలయ్యాయి. చివరకు జిల్లా కలెక్టరు విచారణకు ఆదేశించాడు. హిందూ జాగారణ్ మంచ్, విశ్వహిందూ పరిషద్ తదితర సంస్థలు రంగంలోకి ప్రవేశించాయి. ఈ వైరల్ ప్రచారంలో కనిపిస్తున్న హిందూ అమ్మాయిల తల్లిదండ్రుల్లో ఒకరితో ది వైర్ వార్త సంస్థ మాట్లాడినప్పుడు ఆయన జవాబిస్తూ తమ పిల్లలను బలవంతం చేయడం జరగలేదని అన్నాడు. పిల్లల నుంచి కూడా ఇలాంటి ఫిర్యాదులేవీ తనకు రాలేదని చెప్పాడు. నిజానికి ఈ స్కూల్లో విద్యాప్రమాణాలు చాలా బాగున్నాయని, పిల్లలు మంచి ఫలితాలు సాధిస్తున్నారని, పిల్లల చదువులే ముఖ్యమని తల్లిదండ్రులు చెప్పారు. చివరకు స్కూలు మూతపడింది. తల్లిదండ్రులు వెంటనే స్కూలును తెరువాలని డిమాండ్ చేస్తున్నారు. స్కూలు పిల్లలను బలవంతం చేసి హిజాబ్ ధరించేలా చేస్తుందన్న వార్తల్లో నిజం లేదని విచారణలో కూడా తేలింది. కాని అంత తేలిగ్గా వదిలేస్తారా? అందులోను మైనారిటీ ముస్లిం స్కూలు. రాష్ట్ర బీజేపీ ప్రభుత్వ హోం మంత్రి కూలంకష విచారణకు ఆదేశించాడు. స్కూలు మూతపడింది. దామోహ్ లోని స్కూలు మాదిరిగా ఏ స్కూలైనా వ్యవహరిస్తే మూయించేస్తామని మామాజీగా పిలువబడే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అన్నారు. స్కూళ్ళు మూయించి ఈ మామాజీ పిల్లల బతుకులు బాగు చేస్తానంటున్నాడు. అంతేకాదు ముఖ్యమంత్రి చెప్పిన మరో మాట ఏమిటంటే, దేశవిభజన గురించి మాట్లాడిన వ్యక్తి కవిత్వన్ని ఈ స్కూల్లో చదివిస్తున్నారని చెప్పాడు. ఆయన చెప్పింది మహాకవి ఇక్బాల్ గురించి. సారే జహాంసే అచ్ఛా హిందూస్తాన్ హమారా గేయం రాసిన కవి గురించి ఆయన ఈ మాటలు చెప్పాడు. స్కూలుపై కేసు నమోదయ్యింది. హిందూ విద్యార్థులను బలవంతంగా మతం మార్చుతున్నారన్న సెక్షన్లకూడా పెట్టి కేసు నమోదు చేశారు. ప్రిన్సిపాల్ తో పాటు ముగ్గురిని అరెస్టు చేశారు.

మన నవభారతంలో ఈ స్కూలు ఒక్కటే ఈ ప్రాంతంలో ఉన్న ఇంగ్లీషుమీడియం స్కూలు. దాదాపు 12వందల మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. చాలా మంది విద్యార్థులు నిమ్నాదాయ వర్గాలకు చెందిన వారు. స్కూలును మూయించడంతో ఆగలేదు, బుల్డోజర్ రాజకీయాలు ఇప్పుడు జోరుగా నడుస్తున్నాయి. ముస్లిముల ఆస్తులు, ఇండ్లపై బుల్డోజర్లు నడపడం ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మామూలు విషయం. అది ఒక వార్త కూడా కాదు. గంగా జమున తెహజీబ్ ముస్లిం మైనారిటీ స్కూలు. వెంటనే ఈ స్కూలు భవనంపై కూడా బుల్డోజర్ నడిపారు. స్కూల్లో కొంత భాగం అక్రమ నిర్మాణమని ఇప్పుడు కనిపెట్టి కూల్చేశారు. ఈ కేసులో అరెస్టెయిన ప్రిన్సిపాల్, మరో ఇద్దరు బెయిలు కోసం హైకోర్టుకు ధరఖాస్తు చేసుకున్నారు. హైకోర్టులో చివరకు షరతులతో బెయిలు దొరికింది.

 

మధ్యప్రదేశ్ హైకోర్టు ఏం చెప్పిందో ఇక్కడ కాస్త గమనించాలి. స్కూల్లో ముస్లిమేతర విద్యార్థులు తమ మతానికి సంబంధించిన చిహ్నాలు పవిత్రదారాలు, బొట్టు వగైరాలు ధరిస్తే అభ్యంతరాలు చెప్పరాదని కోర్టు చెప్పింది. అలాగే ముస్లిమేతర విద్యార్థులు తప్పనిసరిగా ఉర్దూ చదివేలా బలవంతం చేయరాదని కూడా పేర్కొంది. రాష్ట్ర విద్యాబోర్డు సూచించిన జాబితాలో లేని ఏ భాష కూడా పిల్లలకు బలవంతంగా నేర్పరాదని చెప్పింది.

కర్నాటక హిజాబ్ కేసులో కోర్టు ఏం చెప్పింది?  స్కూళ్ళలో మతపరమైన చిహ్నాలను ఎలా అనుమతించగలం? ఈ ప్రశ్న ఒక హైకోర్టు అడిగిందా? లేదా? మరో హైకోర్టు ఇప్పుడు మతపరమైన చిహ్నాలు ధరిస్తే అడ్డుకోరాదని చెబుతోంది. నవభారతం???

మరో విషయం ఉర్దూ విదేశీ భాష కాదు. భారతీయ భాష. మన కరెన్సీ నోట్లపై కూడా ఉర్దూ కనిపిస్తుంది. మధ్యప్రదేశ్ రాష్ట్ర విద్యాబోర్డు గుర్తించిన బాషల జాబితాలో కూడా ఉర్దూ ఉంది. అలాంటప్పుడు ఒక స్కూలు తన సిలబసులో విద్యాబోర్డు సూచించిన భాషల్లో ఒక భాషను బోధించడానికి నిర్ణయిస్తే, కేవలం ఆ భాష ముస్లిముల భాషగా కొందరు ముద్రవేశారు కాబట్టి, మతతత్వంతో ఆ భాషను బోధించరాదని నిషేధిస్తారా?

ఇక హిజాబ్ గురించి చూద్దాం. గంగా జమునా స్కూలులో యాజమాన్యం ముస్లిమేతర విద్యార్థినులు అంటే హిందూ, జైన తదితర మతాల విద్యార్థినులు తలపై దుపట్టా ధరించేలా బలవంతం చేయరాదని కోర్టు పేర్కొంది. కర్నాటక హైకోర్టులో హిజాబ్ సమస్య వచ్చినప్పుడు స్కూల్లో యూనిఫాంకు సంబంధించి, అందులోను ప్రైవేటు స్కూలులో యూనిఫాం స్కూలు యాజమాన్యమే నిర్ణయిస్తుందని ప్రభుత్వ ఉత్తర్వులో పేర్కొన్నారు. దీన్ని హైకోర్టు ఒప్పుకుంది.

ఇక్కడ మనం కేరళకు సంబంధించి 2018 కేసు కూడా చూద్దాం. ఒక ముస్లిం బాలిక కేరళ హైకోర్టులో కేసు వేసింది. ఒక క్రయిస్తవ విద్యాసంస్థలో చదువుతుంది. తాను హిజాబ్ ధరించడాన్ని విద్యాసంస్థ వ్యతిరేకిస్తుందని ఆమె వాదించింది. అప్పుడు కూడా కోర్టు విద్యాసంస్థకే యూనిఫాం నిర్ణయించే అధికారం ఉందని పేర్కొంది. కర్నాటక హైకోర్టులో కూడా ఈ కేరళ హైకోర్టు తీర్పును ప్రస్తావనకు వచ్చింది. ఇప్పుడు మధ్యప్రదేశ్ లోని దామో లో ఉన్న గంగా జమునా స్కూలు కూడా ప్రైవేటు స్కూలే కదా. ఆ స్కూలు యాజమాన్యం ఒక యూనిఫాం నిర్ణయించినప్పుడు, ఇక్కడ మాత్రం మతచిహ్నాలు ధరించడాన్ని అడ్డుకోరాదని అంటున్నారు????

కర్నాటకలో 2021, 2022 సంవత్సరాల్లో ముస్లిం మహిళలు హిజాబ్ కోసం నిరసన ప్రదర్శనలు చేశారు. అప్పటి రాష్ట్రప్రభుత్వం హిజాబ్ నిషేధం విధించింది. కోర్టులు సమర్థించాయి. చాల మంది ముస్లిం అమ్మాయిలు చదువు మానేశారు. స్తోమత ఉన్నవారు హిజాబ్ అవకాశం ఉన్న ప్రైవేటు విద్యాసంస్థలకు మారిపోయారు. స్కూలు యూనిఫారం విషయంలో స్కూలు యాజమాన్యానిదే పూర్తి అధికారమని, యాజమాన్యమే యూనిఫారం నిర్ణయిస్తుందని పేర్కొనేవారు, స్కూలు యూనిఫారంలో మతచిహ్నాలను ఎలా అనుమతిస్తామని చెప్పేవారు, మధ్యప్రదేశ్ దామోలోని గంగాజమునా స్కూలు విషయంలో వాటన్నింటిని పక్కన పడేసి మతచిహ్నాలు ధరిస్తే అడ్డుకోరాదని ఆంక్షలు పెట్టారు. ఇదా నవభారతం???

–      వాహెద్