May 16, 2024

అయూబ్‌ నీ కూతురు ఖులా తీసుకుని భర్తతో విడిపోయి అయిదారేళ్లు దాటుతోంది కదా. ఇలా ఎంతకాలమని ఒంటరిగా ఉంటుంది. ఎక్కడయినా సరైన జీవిత భాగస్వామిని చూసి మరో నికాహ్ జరిపించెయ్యకూడదూ.. నీకూ బరువు బాధ్యతలు తగ్గుతాయి’అని చెప్పాను నా మిత్రుడు అయూబ్‌తో.

అది విని అతని మొహం మ్లానమైపోయింది. కళ్ళల్లో నీళ్ళు నిలిచాయి.

‘అరే నేనేమైనా తప్పు మాట అన్నానా? ఎందుకలా ఉన్నావ్‌?.

కాని కొన్ని నిమిషాల పాటు మౌనం దాల్చిన తరువాత నోరు విప్పాడతను.

‘నా బిడ్డ పెళ్ళి చేసుకునే స్థితిలో లేదు. మేము మామూలు స్థితికి తీసుకురావటానికి ప్రయత్నిస్తున్నాము. తన భర్త నుండి దూరమైనప్పటి నుంచి ఆమె మానసిక స్థితి బాగోలేదు. డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయింది. రాత్రింబవళ్ళు గదిలో ఒంటరిగా గడుపుతోంది. తనలో తాను ఏదో మాట్లాడుకుంటుంది. తనకు మరో నికాహ్ వద్దంటుంది…. చెప్పాడు అయూబ్‌ రుద్ద కంఠంతో.

‘అరె… నాకు తెలియదే. డాక్టర్లకు చూపించారా?’ అడిగాను.

అతను తలూపాడు. అవును చాలామంది సైక్రియాటిస్ట్‌లకు చూపించాము. జీవితంలో కోలుకోలేని దెబ్బ తగిలిందట. అందుకే మానసిక క్రుంగుబాటుకు గురైందట. అంతేకాదు, మా ఇంటికి వచ్చిన బంధుమిత్రులందరూ అయ్యో పాపం అంటూ జాలి, సానుభూతిని చూపించడంతో అది తట్టుకోలేక  మరింత క్రుంగిపోయింది. తన గదికే పరిమితమైంది. ఎవరికీ మొహం కూడా చూపించడంలేదు. ఎప్పుడు ఎలాంటి అఘాయిత్యం చేసుకుంటుందోనని మేమంతా భయాందోళనలలో గడుపు తున్నాము.

అలా చెప్పుతూ భారంగా నిట్టూర్చాడు.

అయూబ్‌కు మునీరా ఒక్కగానొక్క కూతురు డిగ్రీ దాకా చదివింది. తరువాత ఓ తగిన వరుడికిచ్చి పెళ్ళి చేశారు. కానీ ఆ వివాహ బంధం ఎక్కువ కాలం నిలువలేదు. పంతాలు, పట్టింపులతో ఆ బంధం అతికొద్ది కాలంలోనే తెగిపోయింది.

ఆ రోజుల్లో తండ్రిగా కూతురి పక్షాన నిలబడి వారితో పోరాడాడు. కూతురికి  ఖులా తీసుకోమని ఒత్తిడి చేశాడు. ఆనాడు అతను చేసిన తప్పిదం కారణంగా ఈనాడు తీవ్ర మానసిక క్షోభననుభవిస్తున్నాడు.

కూతురి  జీవితం అగమ్యగోచరంగా అనిపించసాగింది. అత్తవారింట్లో భర్త పిల్లాపాపలతో సుఖమయమైన జీవితం గడపవలసిన తరుణంలో తొందరపాటుతో చేసిన ఓ తప్పిదానికి బలైపోయి జీవచ్ఛవంలా బ్రతుకును సాగిస్తున్నది. జీవితంలో చేసిన ఓ పొరపాటుకు సరిదిద్దుకోలేక జీవితాంతం మానసిక క్షోభను అనుభవించవలసిందేనా?

నాకు మరో  సంఘటన కూడా గుర్తుకు వచ్చింది. స్వయాన నా తమ్ముడి కూతురు విషయంలో ఇలాగే జరిగింది. నసీమాకు పాతికేళ్ళు దాటిన తరువాత గానీ ఆమె పెళ్ళి మాట తలెత్తలేదు ఇంట్లో. ఆమె డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం చేస్తానంటే ఆమె ఇష్టానికి అడ్డు తగలలేదు పెద్దవాళ్ళు. తరువాత పెళ్ళిమాట తలపెట్టినా ఒక్క సంబంధం కుదరలేదు. వరుడిలో అతని కుటుంబంలో ఎన్నో లోపాలను చూసేవారు ఇంట్లో వాళ్ళు. ఒకరికి నచ్చితే మరొకరికి  నచ్చేది కాదు.  అలా ఆమె పెళ్ళి జరగటానికి కాలయాపన జరిగింది. తరువాత కొంతకాలానికి ఎలాగో పెళ్ళి కుదిరింది.

పెళ్ళి  కూడా జరిగిపోయింది. వారిద్దరికీ పొసగలేదు. పుట్టింటికి వచ్చినప్పుడల్లా భర్తపై పితూరీలు చెప్పేది. అసలు అతను భర్తగా అనర్హుడని చెప్పేసింది. ఇంకేముంది ఇరుపక్షాల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. మాటా మాటా పెరిగింది. బంధం తెగేదాకా లాగారు. తమ కొడుకుపై పెద్ద అభాండం వేసిందని వారు లబోదిబోమన్నారు.  తమ  ఆడకూతురి  జీవితం  నాశనం అయిందని వీళ్ళు గుండెలు బాదుకున్నారు. తెగతెంపులు చేసుకున్నారు.

ఆమె పుట్టిళ్ళు చేరుకుంది. చేస్తున్న ఉద్యోగం వదిలేసింది. ఇక ఇంట్లో ఖాళీగా కూర్చుంది. ఆమె మానసిక స్థితి  దిగజారిపో సాగింది. బయటికి వెళ్ళాలంటేనే అవమానంగా తోచేది. కానీ ఎలాగోలా ఆమె మనస్సును మళ్ళించటానికి మరో ఉద్యోగంలో చేర్పించారు. కానీ అందులో ఇమడలేకపోయింది. ఎక్కడా మనసును స్థిమితంగా పెట్టలేకపోయింది. అలా కొన్ని సంవత్సరాలు దొర్లిపోయాయి.

మానసిక వైద్యశాలలో కూడా వైద్యం తీసుకుంది. మందుల ప్రభావంతో కొంత కోలుకోవటంతో కన్నవాళ్ళు కొంత స్థిమిత పడ్డారు.

మళ్ళీ నికాహ్ జరిపించటానికి ప్రయత్నాలు కొనసాగించారు. అలా ప్రయత్నాలు చెయ్యగా చెయ్యగా చివరికి వారికి నచ్చిన ఓ వ్యక్తితో నికాహ్ జరిపించారు.

ఓ అయిదారు నెలలు గడిచాయో లేదో మళ్ళీ షరామామూలే. ఆమె ఒక మానసిక రోగి అని తెలుసుకున్న ఆమె భర్త తరఫు వారు ఆమెను చులకనగా చూడసాగారు. అయినా భర్త ఆమె పట్ల ప్రేమగానే ఉండేవాడు. అన్నీ సర్దుకుపోయేవాడు. మందులు ఇప్పించేవాడు. కానీ ఆమె ప్రవర్తన వింతగా ఉండేది. అందరినీ ద్వేషించసాగింది. ఆమె తల్లిదండ్రులను సైతం ద్వేషించసాగింది.

చివరికి ఏదో ఒక సాకుతో పోట్లాట పెట్టుకుని పుట్టిల్లు చేరి పోయింది. ఇంటికి తిరిగి వచ్చేయమని భర్త, అత్త ఎంత పిలిచినా భర్త ఇంటికి చేరలేదు.

అలా చేతులారా తన వివాహ బంధాన్ని విచ్ఛిన్నం చేసుకుందా అమ్మాయి.

అది గుర్తుకొచ్చి బాధపడ్డాను. ఇక్కడ ఎవరిది తప్పు? ప్రశ్నించుకున్నాను. తప్పటడుగులు వేస్తున్న సమయంలో తమ బిడ్డల్ని తప్పొప్పులను తెలియజేస్తూ వారి జీవితాలు సరైన మార్గంలో పడేటట్లు చెయ్యటం వారి కన్నవాళ్ళ బాధ్యత, కర్తవ్యం.

జీవితపు విలువలు గురించి నైతిక విలువల గురించి చిన్నప్ప ట్నుంచి బోధపర్చాలి. కుటుంబ వ్యవస్థ, వివాహ బంధం విశిష్టత గురించి తెలియజెయ్యాలి.

వివాహమంటే ఒకరిని విడిచి మరొకరిని పెళ్ళాడటం కాదు. తనకు నచ్చిన విధంగా జీవించాలనుకుంటే ఎన్నో కష్టనష్టాలను భరించ వలసి వస్తుంది. మన ఆడపిల్లలు ఎవరో పాశ్చాత్య దేశం వారిని, లేదా ఆధునికతను అలవర్చుకున్నవారిని అనుకరించటం కాదు. వారి జీవితాలను ఆపాదించుకుని వారి అనుకరిస్తూ జీవిస్తే చివరికి అన్నీ పోగొట్టుకుని మతిని పోగొట్టుకోవల్సిందే.

మన పుణ్యస్త్రీమూర్తులయిన బీబీ ఫాతిమా(ర), బీబీ ఆయిషా(ర) మున్నగు వారి జీవితాలను గ్రహించి నడుచుకోవాలి. వారు చేసిన త్యాగాలను, పుణ్యాలను తెలుసుకుని జీవిత సత్యాలను గ్రహించాలి.

 

    • -షహనాజ్ బేగం, అనంతపురం