November 23, 2024
ఈ శీర్షిక అర్ధమేమిటో తర్వాత చెబుతాను. ముందు కొన్ని వార్తలు చూద్దాం.
గత మార్చిలో వచ్చిన వార్త ప్రకారం భారతదేశంలో గృహహింస కేసులకు సంబంధించి కేంద్ర గణాంక మంత్రిత్వ శాఖ నివేదికను విడుదల చేసింది. విమెన్‌ అండ్‌ మెన్‌ ఇన్‌ ఇండియా 2022 సర్వే పేరుతో విడుదల చేసిన ఈ నివేదికలో గృహహింస కేసుల జాబితాలో 50.4% తెలంగాణ రెండవ స్థానంలో ఉందని షాకింగ్‌ విషయాన్ని వెల్లడిరచింది. 75% గృహహింస కేసులతో అస్సాం రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచింది. ఆపై తెలంగాణ రాష్ట్రం 50.4 శాతం గృహింస కేసులతో రెండవ స్థానంలో, 48.9%తో ఢల్లీి మూడవ స్థానంలో నిలిచాయి.
గతంలో సుప్రీంకోర్టు గృహహింస చట్టం, అదే 498ఏ దుర్విని యోగాన్ని నివారించడానికి కొన్న మార్గదర్శకాలు జారీ చేసింది. ఫిర్యాదు రాగానే అరెస్టు చేయరాదని, ఒక కమిటీకి ఫిర్యాదు పంపి, ఆ నివేదిక వచ్చిన తర్వాతే చర్యలు ప్రారంభించాలని చెప్పింది. ఐపిసి 498ఏ చట్టం దుర్వినియోగం గురించి చాలా కాలంగా చర్చ జరుగుతూనే ఉంది. భార్యాబాధిత సంఘాలు ఈ విషయమై విమర్శలు సంధిస్తూనే ఉన్నాయి. మరోవైపు స్త్రీవాదులు ఈ చట్టాన్ని సమర్ధిస్తూ మాట్లాడుతూనే ఉన్నారు.
నిజం చెప్పాలంటే ఐపిసి 498ఏ కోరలు పీకే కార్యక్రమం ఎప్పటి నుంచో మొదలైంది. నెమ్మదిగా కొనసాగుతోంది. తప్పుడు కేసులు వేస్తున్నారని, మనోవర్తి పెద్దమొత్తంలో రాబట్టడానికి ప్రయత్ని స్తున్నారని ఇలా రకరకాల ఆరోపణలు చాలా వినిపిస్తున్నాయి. ఈ సెక్షను కింద కేసుల్లో శిక్షలుపడిన శాతం చాలా తక్కువ. కాబట్టి ఈ కేసులు చాలా వరకు తప్పుడు కేసులే అని తీర్మానించేవారు కూడా ఉన్నారు. కాని పరిశోధనాధికారులు తగిన శ్రద్ధ చూపకపోతే, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు తగిన శ్రద్ధ చూపకపోతే కోర్టుల్లో శిక్షలు పడే అవకాశాలు కూడా ఉండవు కదా. కాబట్టి శిక్షలు పడిన శాతం తక్కువైనంత మాత్రాన కేసులన్నీ తప్పుడు కేసులే అనడం కూడా సరికాదు. అలా అని ఈ చట్టం దుర్వినియోగం కాలేదని కూడా చెప్పలేం. భర్తను, అత్తమామలను వేధించడానికి కేసులు వేసిన వారు కూడా ఉండొచ్చు. ఆ మాట కొస్తే దేశంలో దుర్వినియోగం కాని చట్టమంటూ ఏదన్నా ఉందా? ఇంతకుముందు వ్యాసంలో పరువునష్టం కేసులు ఎలా ఎందుకు వేస్తున్నారో చెప్పుకున్నాం. రెవిన్యూ చట్టాలు దుర్వినియోగం కావడం లేదా? దుర్వినియోగమవుతున్న చట్టాలు చాలానే ఉన్నాయి. కాని ప్రతి చట్టం విషయంలో ఇలాంటి చర్చ జరగడం లేదు.
విచిత్రమేమంటే, 498ఏ చట్టం చాలా కఠినంగా ఉన్న రోజుల్లోను భార్యని చావబాదేవాళ్ళు తమ పని కొనసాగించారు. చట్టం ఎంతవరకు ఆ దుర్మార్గాలను అడ్డుకుందో లెక్కలు తీసి చెప్పే వాళ్ళు ఎవరూ లేరు. కేవలం చట్టం చేసినంత మాత్రాన సమస్య పరిష్కారం అవుతుందంటే అంతకన్నా హస్యాస్పదం మరేదీ ఉండదు. ముఖ్యంగా ఇలాంటి సమస్యల్లో సామాజిక ఆలోచనాసరళి మారవలసిన అవసరం ఉంది.
పెండ్లాం బెల్లాం తల్లి దయ్యం, పెండ్లాం బెల్లం ముక్క తల్లి మట్టిగడ్డ లాంటి సామెతలు మనకున్నాయి. ఆలి వైపు వారు ఆత్మబంధువులైరి, తల్లి వైపు వారు తగిన పాటి, తండ్రి వైపు వారు దాయాదులైరయా వగైరా పద్యాలు కూడా చాలా మంది చదివి ఉంటారు. ఇవన్నీ చూస్తే, పెండ్లి తర్వాత మగవాడు భార్యకు దాసోహం అయిపోతాడన్న ఒక భావన కలిగేలా ఉన్నాయి. అది నిజమా?
అది నిజం కాదన్న సంగతి ప్రతిరోజు మనకు కనబడుతూనే ఉంటుంది. భార్యను కొట్టడం అనే అనాగరికమైన చర్య చాలా మామూలు విషయం. వేధింపులు, సతాయింపులు సమాజంలో నిత్యం చూస్తూనే ఉన్నాం. అంటే చెప్పుకోడానికి, జోకులేసుకోడానికి మాత్రమే పెండ్లాం బెల్లం అంటున్నారు కాని నిజానికి పెండ్లాం అంటే స్వంత ఆస్తి ఇష్టమొచ్చినట్లు వాడుకోవచ్చన్న భావనే బలంగా ఉంది.
తల్లి ప్రేమ గురించి సెంటిమెంటల్‌ గా చెప్పే మాటలు మనం చాలా వింటాం. మాతృదేవోభవ వగైరా ఉపదేశాలు కూడా వింటాం. పతియే ప్రత్యక్ష దైవం వంటి మాటలు కూడా వింటాం. కాని అలాంటి మాటలే భార్య గురించి ఎందుకు వినడం లేదు? ఎందుకు చెప్పుకోవడం లేదు? సామాజిక ఆలోచనా సరళిలో మార్పు రావాలంటే ఇలాంటి మాటలను వెదికి వాటిని ప్రచారంలో పెట్టాలి.
అలాంటి ప్రయత్నమే క్రింది మాటలు.
ఇస్లామ్‌ మతం ప్రకారమే కాదు, క్రయిస్తవ, యూద మతాల ప్రకారం కూడా ప్రపంచంలో మొట్టమొదటి మానవసంబంధం కేవలం ఆలుమగల సంబంధం మాత్రమే. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, కొడుకులు, కూతుళ్ళు… ఈ సంబంధాలన్నీ తర్వాత వచ్చిన సంబంధాలే. అన్నింటికన్నా ముందు, ప్రప్రథమ మానవ సంబంధం. అనుబంధం భార్యభర్తలదే. ఈ మూడు ప్రధాన మతాలు ఈ విషయాన్ని ఒప్పుకుంటాయి. ఎలాగంటే, ఈ మూడు మతాలూ ఆదమ్‌ తొలి మానవుడిగా భావిస్తాయి. కొన్ని ఇస్రాయీలీ రిఫరెన్సుల ప్రకారం, తొలి మానవుడు ఆదమ్‌ను మట్టితో చేసిన దేవుడు 40 సంవత్సరాల వరకు ఆయన్ను ప్రాణం లేకుండా అలాగే వదిలేశాడట. ఇస్లామ్‌, క్రయిస్తవ రిఫరెన్సుల ప్రకారం కూడా తొలి మానవుడు ఆదమ్‌ కు ప్రాణం పోసిన వెంటనే దేవుడు ఆయనకు జంటను సృష్టించలేదు. ఆయన్ను ఒంటరిగానే స్వర్గంలో ఉండమన్నాడు. స్వర్గంలో ఉన్నప్పటికి ఒంటరిగా ఉన్న ఆదమ్‌ సంతోషంగా లేరు. ఉల్లాసంగా లేరు. చాలా నిరీక్షణ తర్వాత సంతోషాన్ని, ఉల్లాసాన్ని, శాంతిని కలుగజేసేలా దేవుడు ఒకరోజు ఆయనకు జంటగా హవ్వాను సృష్టించాడు. ఆదమ్‌ ఒకరోజు నిద్ర నుంచి మేల్కొనే సరికి ఆయన ముందు ఆయన జంట, ఆయన భార్య హవ్వ ఉంది.
ఈ ధార్మిక గ్రంథాలు చెప్పే మానవ సృష్టి క్రమంలో తొలి మానవుడు సుదీర్ఘకాలం నిరీక్షించిన తర్వాత మాత్రమే లభించిన అపురూప వరం భార్య. ఈ వాస్తవాన్ని ఎందుకు మనం ప్రచారం చేయలేకపోతున్నాం. భార్య ఒక అపురూపమైన వరం అన్న వాస్తవాన్ని భర్తలకు అర్ధమయ్యేలా ఎందుకు చెప్పలేకపోతున్నాం.
ఖుర్‌ఆన్‌లో రూమ్‌ అధ్యాయంలో ఆసక్తికరమైన వాక్యాలున్నాయి. దేవుడు మనిషిని మట్టితో సృష్టించాడని చెప్పిన వెంటనే తర్వాతి వాక్యంలో మాటలు గమనించదగినవి. “ఆయన సూచనలలో మరొకటి ఏమంటే, ఆయన మీ కొరకు భార్యలను మీ జాతి నుంచే సృష్టించాడు. మీరు వారి వద్ద శాంతిని పొందడానికి, మీ మధ్య ప్రేమనూ, కారుణ్యాన్ని సృజించాడు. నిశ్చయంగా ఆలోచనాపరులకు ఇందులో ఎన్నో సూచనలున్నాయి”
ఈ వాక్యంలో గమనించవలసిన విషయమేమంటే, భార్యాభర్తల సంబంధాన్ని దేవుడు తన సూచనగా చెప్పడం. మొత్తం ఖుర్‌ఆన్‌ గ్రంథంలో మరో బాంధవ్యాన్ని దేన్ని కూడా దేవుడు తన సూచనగా చెప్పలేదు. తల్లిదండ్రుల పట్ల ఉత్తమంగా వ్యవహరించాలన్న వాక్యాలున్నాయి. తల్లిదండ్రులను గౌరవించాలని ఉపదేశాలు న్నాయి. కాని తన సూచనగా ఒక బాంధవ్యాన్ని గుర్తించడం అన్నది లేదు. కేవలం భార్యాభర్తల సంబంధం తప్ప. పై వాక్యంలో మీ జాతి నుంచే భార్యలను సృష్టించడం అన్నది ఇస్లామీయ గ్రంథాల అవగాహన లేనివారికి కాస్త విచిత్రంగా కనిపించవచ్చు. కాని అక్కడ ఆ వాక్యానికి అర్ధం మానవజాతిలోని పురుషులకు, మానవజాతికి చెందిన స్త్రీనే జంటగా చేశామన్నది. దేవుడు తలచుకుంటే మరో ప్రాణిని నీ జంటగా చేయగలిగే ఉండేవాడే అని చెప్పడం. ఈ బాంధవ్యంలో మూడు ముఖ్యమైన విషయాలను ప్రస్తావించాడు. ఒకటి శాంతిని పొందడం. రెండు ప్రేమ, మూడు కారుణ్యం. శాంతి అన్న పదం అనువాదంలో వాడారు కాని అసలు పదం సుకూనత్‌ అంటే ఒక ప్రశాంతచిత్తం, ఎలాంటి అలజడి లేని హాయి. కేవలం భార్యాభర్తల సంబంధంలోనే అది లభిస్తుందని చెబుతూ, ప్రేమ, కరుణ అనే రెండు పదాలను వరుసగా ఉపయోగించడానికి కారణాలు కొందరు వ్యాఖ్యాతలు వివరించారు. పెళ్ళయిన కొత్తలో, వయసులో ఉన్నప్పుడు ఆలుమగల మధ్య లైంగికసంబంధం వారి మధ్య బలమైన ప్రేమకు పరాకాష్ఠగా అవుతుందని, వయసు మళ్ళిన తర్వాత శరీరం శక్తులుడిగిన తర్వాత కూడా ఈ ప్రేమ ఒకరి పట్ల మరొకరు కరుణాపూరితంగా వ్యవహరించేలా చేస్తుందని వివరించారు.
ఈ బాంధవ్యంలోని ఈ గొప్పదనాన్ని ఇప్పుడు వివరణాత్మకంగా ఎందుకు ప్రచారం చేయడం లేదు? ఇదేదో పవిత్రసంబంధం కాదు. ఇది ప్రేమకారుణ్యాల సంబంధం. ఇక్కడ ప్రేమ అన్నది ఏదో అలౌకికమైన ప్రేమ కాదు. ఇది మనిషి సహజమైన లైంగిక ఆకర్షణ వల్ల జనించిన ప్రేమ, ఆ ప్రేమే తర్వాత ఒకరి పట్ల మరొకరిలో కరుణార్ధ్రమైన భావనగా మారుతుంది. భార్యాభర్తల సంబంధం పవిత్ర బంధం అంటూ ఆచరణకు సాధ్యం కాని దైవత్వమూ దానికి కల్పించనవసరం లేదు. ఇది మానవీయమైన సంబంధం. మనుషుల మాదిరిగా కలిసి ఉండవలసిన బాంధవ్యం. ప్రేమకరుణల సంబంధం. దాని గురించి గొప్పగా చెప్పుకోవాలి.
పైన చెప్పిన ఖుర్‌ఆన్‌ అధ్యాయంలో దేవుడు తన సృష్టిలో తన ఉనికికి సంబంధించిన సూచనలను తెలియజేశాడు. రాత్రిపగలు, భాషలు, యాసలు, శరీరవర్ణాలు, భూమ్యాకాశాలు, మెరుపులు, వర్షం కురిసి నేలపై పచ్చిక ప్రాణం పోసుకోవడం వీటన్నింటిని ప్రస్తావిస్తూ, అదే వరుసలో భార్యాభర్తల సంబంధాన్ని ప్రస్తావించాడన్నది గమనించాలి. తన ఉనికిని గుర్తించే సూచనల్లో భార్యాభర్తల సంబంధం, అందులోని ప్రేమ, కరుణ, వీటన్నింటిని స్వయంగా దేవుడే ప్రస్తావిస్తుంటే మతానుయాయులు దానికి ఎంతగా నిబద్దులు కావాలి.
భార్య తనతో బాగుంటే తాను కూడా భార్యతో చక్కగా వ్యవహ రించడంలో సామరస్యం ఏముంది? ఇమామ్‌ గజాలీ చెప్పిన ఒక మాట ఈ సందర్భంగా గమనించదగింది. తలబిరుసు, అవిధేయత, తిరస్కారంతో వ్యవహరించే భార్య పట్ల సహనం, ఓర్పు ప్రదర్శించిన భర్త ప్రళయదినాన నోవా, లూత్‌ ప్రవక్తలతో పాటు ఉంటాడని చెప్పారాయన. అలాగే దుర్మార్గం, తలబిరుసు, తిరస్కారంతో వ్యవహరించే భర్త పట్ల సహనం చూపిన భార్య హజ్రత్‌ ఆసియా (ఫారో భార్య)తో పాటు ఉంటుందని చెప్పారు. ఈ మాటల అంతరార్థం భార్యాభర్తలు ఒకరి పట్ల ఒకరు సహనం, ఓర్పు కలిగి ఉండాలన్నది. ఒకరి మాటతీరు, వ్యవహారశైలి నచ్చకపోయినా సర్దుకుపోవాలన్నది. కేవలం భార్యకు మాత్రమే బోధించలేదు. భర్తకు కూడా బోధించడం జరిగింది. నిజానికి భర్తకే ముందు చెప్పడం జరిగింది. తర్వాత భార్యను కూడా ఈ బోధనలో కలిపారు.
మనం ముందు చెప్పుకున్నట్లు ధార్మికంగా ఆలోచిస్తే ప్రపంచంలో మొట్టమొదటి బాంధవ్యం ఆలుమగల సంబంధం. అలాగే చిట్టచివరి వరకు నిలబడే బాంధవ్యం కూడా ఇదే. ఖుర్‌ఆన్‌ ఈ విషయంలో స్పష్టంగా పుణ్యాత్ములైన భార్యాభర్తల జంటను అలాగే స్వర్గంలో కొనసాగిస్తారని ప్రకటించింది. అంటే ఇదొక్కటే శాశ్వతమైన సంబంధం. మరో విషయమేమంటే, ప్రవక్త ముహ మ్మద్‌ హదీసు ప్రకారం ఆదమ్‌ను సృష్టించిన తర్వాత దేవుడు ఆయనకు జంటగా హవ్వాను ఆదమ్‌ ఎడమ పక్కటెముకతో సృష్టించాడని చెప్పారు. ఈ హదీసుకు వ్యాఖ్యాతలు వివరణ ఇస్తూ, స్త్రీ స్థానం హృదయానికి దగ్గరగా ఉందని, అందువల్లనే ఎడమ పక్కటెముకతో సృష్టించాడని అన్నారు. ఈ సందర్భంగా గమనించవలసిన మరో విషయం ఏమంటే ప్రవక్త ముహమ్మద్‌ చెప్పిన మరో హదీసు ప్రకారం ’’స్త్రీల పట్ల కరుణతో వ్యవహ రించండి. స్త్రీ పక్కటెముకతో చేయబడిరది. పక్కటెముక వంకరగా ఉంటుంది. దాన్ని తిన్నగా చేయాలని ప్రయత్నిస్తే విరిగిపోతుంది. అలాగే ఉంచితే వంకరగానే ఉంటుంది. కాబట్టి కరుణతో వ్యవహరించండి.‘‘ ఈ మాటలకు వివరణ ఇస్తూ వ్యాఖ్యాతలు చెప్పిన మాటలు గమనించాలి. భర్త అనుకున్నట్లు భార్య ఉండడం, అలాగే వ్యవహరించడం కూడా జరక్కపోవచ్చు. ఆమె తన ఇష్టం వచ్చినట్లే ఉంటుంది. ఆమె మాటలు ఒక్కోసారి అతన్ని బాధించనూ వచ్చు. ఈ హదీసు కేవలం భర్తలను మాత్రమే ఉద్దేశించింది కాదు, తండ్రి, అన్న, తమ్ముడు, మామ వగైరా బంధువులైన పురుషులందరినీ ఉద్దేశించినది. కాబట్టి స్త్రీ మాటలు, చేతలు ఏవైనా బాధించినా ఆమెను సరిచేయాలని ప్రయత్నించి విరిచేయకండి అని చెప్పడం జరిగింది.

మరో హదీసు ప్రకారం ప్రవక్త ముహమ్మద్‌ ఒకసారి మాట్లాడుతూ ‘‘భార్య పట్ల ఉత్తమంగా వ్యవహరించేవాడే మీలో ఉత్తముడు’’ అన్నారు. ఈ మాటలు ముస్లిములెందరు పాటిస్తున్నారో ఆత్మవిమర్శ చేసుకోవలసిన అవసరం ఉంది. ప్రవక్త ముహమ్మద్‌ తమకు ఆదర్శమని ప్రకటించుకునే ప్రతి ముస్లిమ్‌ గమనించ వలసిన వాస్తవమేమంటే, ప్రవక్త ఇంటిపనుల్లో సహాయపడేవారు, పిండి కలిపేవారు, తన దుస్తులకు తానే కుట్లు వేసుకునేవారు, తన చేతులతో భార్యకు తినిపించేవారు, భార్యతో పరుగుపందెం వేసేవారు. ఎంతమంది నేడు ఇంటి పనుల్లో సహాయపడు తున్నారు? ఎంతమంది భార్యకు మానసికోల్లాసం కలిగేలా బయట తీసుకెళ్ళడం, సరదాగా పందెం వేసుకోవడం వంటివి చేస్తున్నారు. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఒకే పాత్రలో నీళ్ళతో భార్యాభర్తలు కలిసి స్నానం చేసేవారు. భార్యాభర్తల మధ్య బాంధవ్యాన్ని బలపరిచే ఈ మాటలు ఎంతమంది పాటిస్తున్నారు.

పెళ్ళి చేసుకున్న తర్వాత భార్య ప్రయివసీని ఎంతమంది గుర్తిస్తున్నారు. ఉమ్మడి కుటుంబం అన్న భావన ఇస్లామ్‌ లో లేదు. కాని విచిత్రమేమంటే ఇప్పుడు అదో గొప్ప నైతిక విషయమై పోయింది. ఒకరికి ఒకరు సహాయపడుతూ అందరూ కలిసిమెలిసి ఉండే ఉమ్మడి కుటుంబం మంచిదే. కాని ఇప్పుడలా ఉందా? అత్తమామల సూటిపోటి మాటలు, మరదళ్ళకు, మరుదులకు సేవలందించే మెషీన్‌ లా ఇంటికొచ్చిన కోడలిని మార్చడం జరగడం లేదా? పెళ్ళయిన తర్వాత ప్రత్యేకంగా వేరే ఇంట్లో పెట్టాలన్నది ఇస్లామీయ బోధనల్లో ఉన్న విషయమే. అంత స్తోమత లేకపోతే అందరూ కలిసి ఉంటున్నప్పటికీ భార్యాభర్తలు ప్రత్యేకంగా ఒక గది, వంటిల్లు కలిగి ఉండాలి. అదీ సాధ్యం కాకపోతే కనీసం ప్రత్యేకంగా ఒక గది ఇచ్చే స్తోమత అన్నా ఉండాలి. ఆ స్తోమత కూడా లేకపోతే పెళ్ళి చేసుకోరాదు. మీలో స్తోమత ఉన్నవాళ్ళు వెంటనే వివాహం చేసుకోవాలి, స్తోమత లేనివారు ఉపవాసాలు పాటించడం ద్వారా తమ కోరికలను అదుపులో ఉంచుకోవాలని ప్రవక్త చెప్పారు. అంటే పెళ్ళి చేసుకోడానికి స్తోమత అన్నది షరతు, మగవాడికి వర్తించే షరతు. ఆ షరతుకు అనుగుణంగా ఉన్నప్పుడే పెళ్ళి చేసుకోవాలి. లేకపోతే ఉపవాసాలు పాటిస్తూ కోరికలను అదుపు చేసుకోవాలి అంతే తప్ప స్తోమత లేకపోయినా పెళ్ళి చేసుకుని ఒక అమ్మాయి గొంతు కోయడం తగిన పని కాదు.
ఎందుకంటే భార్యాభర్తల సంబంధం సమాజానికి పునాది వంటిది. సమాజంలో శాంతిశ్రేయాల చల్లని నీడ కొనసాగాలంటే ఈ సంబంధంలో సంతోషం ఉల్లాసాలు ఉండాలి. మరో హదీసులో ప్రవక్త చెప్పిన మాటలు కూడా ఇక్కడ గమనార్హమైనవి. షైతాను ప్రతిరోజు దర్బారు నిర్వహిస్తాడట. తన అనుచరులను అడుగు తాడట. ఈ రోజు మీరు సాధించింది చెప్పండని. ఒక్కో అనుచరుడు తాను ఫలానా మనిషిని ఫలానా దుర్మార్గం చేసేలా ప్రోత్సహించానని, తప్పుదారి పట్టించానని ఇలా చెబుతున్నప్పటికీ షైతానుకు సంతోషం కలుగదు. మీరంతా ఏమీ గొప్ప పని చేయలేదు అంటుంటాడు. చివరకు ఒక అనుచరుడు లేచి, దొర, నేను ఒక భార్యాభర్తల జంటలో మనస్పర్థలు పెంచి వాళ్ళు విడిపోయేలా చేశానంటాడు. ఆ వెంటనే షైతాన్‌ వాడిని పిలిచి చాలా గొప్ప పని చేశావు అని కావలించుకుంటాడు. అంటే మానవాళిని నాశనం చేయాలనుకునే షైతానుకు భార్యాభర్తల సంబంధం తెగిపోవడం అన్నది ఎంతో సంతోషకరమైన విషయం. ఎందుకంటే, ఈ సంబంధం తెగిపోతే సమాజం పునాదులు కదులుతుంటాయి. భవిష్యతరాల బతుకులు నాశనమవు తుంటాయి.
ఇస్లామ్‌ను పాటిస్తామనుకునే ముస్లిములందరూ గమనించ వలసిన వాస్తవాలివి.
ఇవన్నీ ఏవో ధార్మిక విషయాలని పక్కన పెట్టవచ్చు. కాని ఇవి సమాజానికి దిశా నిర్దేశం చేసే విషయాలుగా కూడా గమనించాలి.
చివరిగా ఈ వ్యాసానికి శీర్షికగా పెట్టిన విషయం. ఇది ఖుర్‌ఆన్‌ లోని ఒక వాక్యం:
‘‘వారు (భార్యలు) మీకు దుస్తులు. మీరు వారికి దుస్తులు’’ (అల్‌ బఖర్‌ 187)
భార్యాభర్తల సంబంధాన్ని ఖుర్‌ఆన్‌ వర్ణించిన తీరిది. దుస్తులకు మనిషి శరీరానికి మధ్య స్పేస్‌ మరేదీ ఉండదు. అలాంటి సాన్ని హిత్యం భార్యాభర్తల మధ్య ఉండాలని, వారి మధ్య రహస్యాలు ఉండరాదని, సుఖదుఃఖాలన్నీ సమానంగా ఉండాలని, దుస్తులు శరీరాన్ని వాతావరణం నుంచి కాపాడినట్లు ఒకరినొకరు కాపాడాలని, శరీరంలో లోపాలను దుస్తులు కప్పినట్లు భార్యాభర్తలు ఒకరి లోపాలను మరొకరు కప్పిపెడుతూ ఒకరికి ఒకరుగా ఉండాలని, దుస్తులు మనిషికి అందాన్నిచ్చినట్లు ఒకరికి ఒకరు అందాన్ని ఆహ్లాదాన్ని ఇస్తూ ఉండాలన్నది దానికి భావం.
ఇవన్నీ కుటుంబం, భార్యాభర్తల సంబంధాలకు సంబంధించిన విషయాలు. నేను ఎక్కువగా ఇస్లామీయ గ్రంథాలనే ఉటంకిం చాను. ప్రారంభంలో క్రయిస్తవ, యూద రిఫరెన్సు ఒక్కటే ఇచ్చాను. నాకు అవగాహన ఉన్న విషయాలివి మాత్రమే కాబట్టి వీటి గురించి మాట్లాడాను. హిందూధర్మంలో ఇలాంటి విషయాలు చాలా ఉండవచ్చు. వాటి గురించి తెలిసిన వారు రాయాలి. ప్రపంచంలో జనాభా అత్యధిక శాతం మతావలంబికులు కాబట్టి మతాలు ఈ విషయంలో బోధించే మంచి మాటలను ప్రచారంలో పెట్టడం వల్ల ఆలోచనాసరళిలో మార్పులు వచ్చే అవకాశాలున్నాయి.
కేవలం చట్టాలు చేయడం వల్ల మార్పులు రావు. ఆలోచనా సరళిలోను మార్పులు రావాలి. చట్టం దుర్వినియోగమై పోతుందంటూ దానిని నీరుకార్చడం వల్ల కూడా ప్రయోజనం లేదు. దుర్వినియోగం కాని చట్టం అంటూ ఏదీ లేదని కూడా గుర్తించాలి.

 

రూహి