July 27, 2024

Sare Jahan se accha

జన్మభూమిపై మమకారం ఉండాలి. కాని ఇతరుల జన్మ భూమిని కూడా గౌరవించే గుణం అవసరం.
‘‘తనకు తాను సుఖపడితే తప్పు కాదు. తన చుట్టూ ఉన్న వారు కూడా సుఖంగా ఉండాలి అని కోరుకోవాలి’’ అని అన్నారు ప్రవక్త ముహమ్మద్‌ సల్లల్లాహు అలైహి వసల్లం.
ఈ సృష్టికి సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే. మానవులందరు సమానులే. కులం మతం ప్రాంతం, జాతి, వర్ణం, ధనికులు పేదలు అనే బేధ భావం వలదని చాటి చెప్పినప్పుడు. మక్కా ధనవంతులు ప్రవక్తను, ఆయన అనుచరులను ఊరు నుంచి వేలి వేసి, ఆహారం నీరు అందకుండా బంధించారు.
వారి దౌర్జన్యాలు, ఆగడాలు భరించలేక మదీనా వలస వెళుతూ, మక్కాలోని కాబా గృహం వైపు చూస్తూ,
ఓ మక్కా నగరమా నిన్ను విడిచి వెళ్ళడానికి మనసు అంగీకరించడం లేదు. కానీ ఈ దుర్మార్గుల దౌర్జన్యాలను భరించలేక వెళ్ళుతున్నాను అని ఆవేదన వ్యక్తం చేశారు ప్రవక్త ముహమ్మద్‌ సల్లల్లాహు అలైహి వసల్లం.
పుట్టి పెరిగిన ఊరు మీద ఊరివాళ్ళ మీద ప్రతి ఒక్కరికీ ప్రేమానురాగాలు ఉండటం సహజం. ఊరి మీద నిజమైన ప్రేమ ఉంటే ఆ ఊరికి ఎలాంటి నష్టం కలుగకుండా చూసుకోవాలి. ఆ ఊరిలో పెరిగి పెద్దయినందుకు ఆ ఊరికి ఏదైనా మంచి పనిచేసి చూపించాలి.
అలాగే నిజమైన దేశభక్తి అంటే ఆ దేశానికి ఎలాంటి కష్టం నష్టం వాటిల్లకుండా చూడ్డమే.
దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా.
దేశమంటే మట్టి కాదోయ్‌ దేశమంటే మనుషులోయ్‌.
దేశమును ప్రేమించే వారు ఆ దేశంలోని సాటి మానవుల పట్ల మంచితనంతో, ప్రేమ అనురాగాలతో, అప్యాయత అనుబంధాలు కలిగి ఉండాలి.
అన్నింటికన్నా ముఖ్యంగా సకల చెడులకు దూరంగా ఉంటూ మంచి పనులు చేస్తూ జీవించాలి. అంతేకాదు సమాజంలో చెడులు జరుగకుండా చూడాలి.
న్యాయం ధర్మం నాలుగు పాదాల నడిచే లా చూడడమే దేశం మీద నిజమైన ప్రేమ. అదే నిజమైన దేశభక్తి.
మీలో మంచి వైపుకు పిలిచేవారు, చెడునుంచి వారించే వారు కొందరు తప్పకుండా ఉండాలి. వారే సాఫల్యం పొందేవారు అని ఖురాన్‌లో అల్లాప్‌ా సెలవిచ్చాడు.
మీలో ఎవరైనా చెడు జరుగుతుండగా చూసినట్లు అయితే, చేతితో ఆపాలి. అంటే బలాన్ని ఉపయోగించి ఆపాలి. లేదా నోటితో నైనా ఆపాలి. అంటే నువ్వు చెడు చేస్తున్నావు తప్పు చేస్తున్నావు అని చెప్పాలి. లేదా కనీసం మనసులోనైనా చెడు చెస్తున్నావు అని అనుకోవాలి. లేదా ఆ చెడు మీరు చేసినట్లే అని అన్నారు ప్రవక్త ముహమ్మద్‌ సల్లల్లాహు అలైహి వసల్లం.
మంచివారు నూటికి తొంబై శాతం ఉన్న, చెడును చెడు అని చెప్పే ధైర్యం లేకపోవడంతో నేడు చెడు రాజ్యం ఎలుతుంది.
మద్యం, జూదం, వ్యభిచారం నట్టింట్లో నాట్యం చేస్తున్నాయి. మనం మన సంతానం కూడా ఆ చెడుల వరదల్లో చిక్కుకుని అల్లాడుతున్నాం.
చెడు చేయడానికి సిగ్గుపడే రోజులు పోయాయి. చెడు చేయడమే ఫ్యాషన్‌ అయిపోయింది.
ఎప్పుడైతే చెడును చెడు అని మనసులో కూడా అనుకోరో, అప్పుడు దైవం ఏలా అయితే ఒక పూసల దండల తెగిపోతే, పూసలు ఒకదాని వెంట ఒకటి రాలుతాయో అలా మీ మీద అపదల వెల్లువ విరుచుకుపడుతాయి. అప్పుడు మీరు విలపిస్తారు. దైవాన్ని ప్రార్ధిస్తారు. కానీ దైవం మీ మొరలు ఆలకించడు. అని అన్నారు ప్రవక్త ముహమ్మద్‌ సల్లల్లాహు అలైహి వసల్లం. మన ఇల్లు పరిశుభ్రంగా ఉంటే సరిపోదు. మన చుట్టూ ఉన్న ఇళ్ళు కూడ పరిశుభ్రం గా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. లేదా బయటి కంపు కొడుతుంటే వాటివల్ల ప్రబలే రోగాలు మనకు కూడా అంటుకుంటాయి. అందుకే నిజమైన భక్తి పరులు దైవాన్ని విశ్వసించేవారు చెడులకు దూరంగా ఉంటూ సమాజంలో చెడులను దూరం చేయాలి లేదా ఆ చెడుల ఊబిలో చిక్కుకొని మనం మన సంతానం కూడా కొట్టుకుపోతాం. రండి! నేటి నుంచి నిశ్చయించుకుందాం. చెడు చేయను. చెడు చేయనియ్యను. నేను నా చుట్టూ ఉన్న సమాజంలో న్యాయం, ధర్మం ప్రేమ ఆప్యాయత అనురాగాలు మానవతా విలువలు వెల్లివిరిచేలా నిరంతరం కృషి చేస్తాను అని.

 

 షేక్‌ అబ్దుల్‌ బాసిత్‌