July 15, 2024

చంద్రబాబుకు వీపీ సింగ్‌ కాలం నుంచి జాతీయ రాజకీయాలతో సంబంధం ఉంది. తన సూచనల మేరకే ఎపిజే అబ్దుల్‌ కలామ్‌ను రాష్ట్రపతి చేశారని కూడా ఆయన  చెబుతూ  ఉంటారు. కాని ఇప్పుడు పరిస్థితి వేరు చంద్రబాబు అరెస్టయితే ఎన్డీయే నాయకులు స్పందించడం కూడా జరగలేదు. ఇండియా కూటమి నాయకులు పరామర్శించనూ లేదు. రెంటికి చెడ్డ రేవడిలా పరిస్థితి ఉంది. చంద్రబాబు జైల్లో జ్ఞానోదయం పొందుతారా? తాను ఉండవలసింది ఇప్పుడు ఇండియా కూటమిలో అని గుర్తిస్తారా?

2019 ఎన్నికల పరాజయం తర్వాత చంద్రబాబుకు 2014 ఎన్నికల సమీకరణం ఒక సెంటిమెంటుగా తయారైనట్లు ఉంది. తాను మోదీ పవన్‌ కల్యాణ్‌ కలిస్తే మళ్ళీ విజయం సాధించవచ్చని బలంగా నమ్ముతున్నారు. బీజేపీకి ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క ఓటు లేదు. గత ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక్క శాతం ఓట్లు కూడా రాలేదు. పవన్‌ కల్యాణ్‌ పార్టీకి 5.5 శాతం ఓట్లు వచ్చాయి. అంటే ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ కన్నా పవన్‌ జనసేన పెద్ద పార్టీ. 2014 ఎన్నికల్లో రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రప్రదేశ్‌ ఓటర్లు కాంగ్రెసుపై గుర్రుగా ఉన్నారు. కాని ఇప్పుడు పరిస్థితి వేరు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్‌, అభివృద్ధికి నిధులు, పోలవరం ఇలా అనేక అంశాల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్న అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది. కాని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పట్ల జగన్‌ చాలా నమ్మకంగా ఉన్నాడు. జగన్‌ ఓటు బ్యాంకులో రెడ్డి సామాజిక వర్గం తప్ప మిగిలిన వారంతా ముస్లిములు, క్రయిస్తవులు, ఎస్సీలు. వీళ్లంతా బీజేపీకి వ్యతిరేకులే. జగన్‌కు లోక్‌ సభలో 22 మంది సభ్యుల బలం ఉంది. రాజ్యసభలో 12 మంది ఉన్నారు. అయినా బీజేపీ పట్ల జగన్‌ విధేయంగా ఉండడానికి ఆయన స్వంత కారణాలు ఉండవచ్చు. మరో ముఖ్యమైన విషయమేమి టంటే, జగన్‌ బీజేపీ దృష్టిలో కాంగ్రెసుతో విభేదించి బీజేపీ వైపు వచ్చిన నాయకుడు. చంద్రబాబు బీజేపీతో విభేదించి కాంగ్రెసు వైపు వెళ్ళిన నాయకుడు. కాబట్టి బీజేపీ చంద్రబాబు కన్నా జగన్‌కే అధిక ప్రాముఖ్యం ఇస్తుంది. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు కన్నా జగన్‌ గెలవడమే తమకు మంచిదని బీజేపీ భావిస్తుంది. పురంధరేశ్వరీ, అమిత్‌ షాలు జగన్‌ను బహిరంగ సభల్లో గట్టిగా విమర్శిస్తున్నప్పటికీ వాళ్ళిద్దరు పవన్‌ కల్యాణ్‌తో పొత్తు గురించి కాని, చంద్రబాబుతో పొత్తు గురించి కాని మాట్లాడలేదు. బీజేపీ ఈ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నప్పటికీ చంద్రబాబు బీజేపీ సహకారం కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. బీజేపీ పట్ల చంద్రబాబుకు ఉన్న ఈ అబ్సెషన్‌ వల్లనే ఇండియా కూటమి సమావేశాలకు ఆయన్ను పిలవలేదు. సిపిఐ, సిపిఎం పార్టీలు కూడా నైరాశ్యంలో ఉన్నాయి. భారత్‌ జోడో యాత్ర తర్వాత కాంగ్రెసు శ్రేణుల్లో కాస్త ఉత్సాహం వచ్చింది. క్లుప్తంగా చెప్పాలంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి ఏమిటంటే, వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ ఈ పార్టీల్లో దేనికి ఓటేసినా చివరకు బీజేపీకే లాభమని చాలా మంది భావిస్తున్నారు. ఇప్పుడు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబును పోలీసులు అరెస్టు చేశారు. జి20 సమావేశాలు జరుగుతుండగానే చంద్రబాబు అరెస్టు జరిగిందంటే, ఈ విషయమై కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలకు ముందుగానే చెప్పి చేసి ఉంటారు. మోదీ అమిత్‌ షాలకు అసౌకర్యం కలిగించే పనులేవీ జగన్‌ ఇంతవరకు చేయలేదన్నది గమనించాలి. చంద్రబాబు అరెస్టు వల్ల టీడీపీకి లాభమా? నష్టమా? అనేది ఇప్పుడు బీజేపీ పరిశీలిస్తోంది. తెలుగుదేశం బంద్‌కు పిలుపు నిచ్చింది. పెద్దగా స్పందన వచ్చినట్లు కనిపించలేదు. చంద్రబాబును బలహీనపరిచి పవన్‌ కల్యాణ్‌ను ముందుకు తీసుకురావడం బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. ఈ వ్యూహాన్ని చంద్రబాబు బహుశా జైలులో తీరుబడిగా ఆలోచిస్తే అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబుకు వీపీ సింగ్‌ కాలం నుంచి జాతీయ రాజకీయాలతో సంబంధం ఉంది. తన సూచనల మేరకే ఎపిజే అబ్దుల్‌ కలామ్‌ను రాష్ట్రపతి చేశారని కూడా ఆయన  చెబుతూ  ఉంటారు. కాని ఇప్పుడు పరిస్థితి వేరు చంద్రబాబు అరెస్టయితే ఎన్డీయే నాయకులు స్పందించడం కూడా జరగలేదు. ఇండియా కూటమి నాయకులు పరామర్శించనూ లేదు. రెంటికి చెడ్డ రేవడిలా పరిస్థితి ఉంది. చంద్రబాబు జైల్లో జ్ఞానోదయం పొందుతారా? తాను ఉండవలసింది ఇప్పుడు ఇండియా కూటమిలో అని గుర్తిస్తారా? వామ పక్షాలు  ఇప్పుడు జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో ఉన్నాయి. చంద్రబాబు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో కాలమే చెప్పాలి.

 –  ఆయిషా