July 27, 2024

బీహారు ముఖ్యమంత్రి ఇటీవల రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. కులజనగణన లెక్కలు విడుదల చేశారు. జమాఅతె ఇస్లామీ హింద్‌ కులజనగణనను స్వాగతించింది. ఒక్క బీహారు లోనే కాదు యావద్దేశంలో కులజనగణన జరగాలని కోరింది. వెనుకబడిన, బలహీన వర్గాల సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడానికి  ఈ  డాటా ఎంతైనా అవసరమని పేర్కొంది. వివిధ సముదాయాల మధ్య  అసమానతలు తొలగించడానికి ఈ జనాభా లెక్కల ఆధారంగా రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలని చెప్పింది. జమాఅతె ఇస్లామీ హింద్‌ ఉపాధ్యక్షులు ప్రొ.ముహమ్మద్‌ సలీమ్‌ మాట్లాడుతూ తాజాగా ముందుకు వచ్చిన లెక్కల ప్రకారం చూస్తే జనాభాకు, ప్రస్తుతం ఇస్తున్న రిజర్వేషన్లకు మధ్య చాలా తేడా ఉన్నట్లు స్పష్టంగా కనబడుతోందని చెప్పారు. బీహారు ముఖ్య మంత్రి నితీష్‌ కుమార్‌ విడుదల చేసిన లెక్కల ప్రకారం బీహారులో ఇతర వెనుకబడిన వర్గాలు 27 శాతం, అత్యధికంగా వెనుకబడిన వర్గాలు 36 శాతం, మొత్తం వెనుకబడిన  వర్గాల జనాభా 63 శాతం ఉంది. దళితులు 19.65 శాతం,  గిరిజన సముదా యాలు 1.68 శాతం ఉన్నారు. మిగిలిన జనాభా 15.52 శాతం. రిజర్వేషన్లు జనాభా ప్రాతిపదికన ఉండాలని ప్రొ.సలీమ్‌ అన్నారు.

కులజనగణన లెక్కలు బయటపెట్టి నితీష్‌ కుమార్‌ బీజేపీపై రాజకీయంగా పెద్ద  దెబ్బతీశారు.  ప్రతిపక్షాలు అన్నీ కలిసి ఇండియా కూటమి ఏర్పడిన  తర్వాతి  నుంచి బీజేపీకి కష్టాలు పెరుగుతూనే ఉన్నాయి. ఇండియా కూటమి మూడవ సమావేశం ముంబయిలో జరగడానికి ముందు ప్రధాని నరేంద్రమోడీ పార్లమెంటు ప్రత్యేక సమావేశం గురించి ప్రకటించారు. కాని సమావేశం ఎజెండా ఏమిటో చెప్పలేదు. ఆ విధంగా ఇండియా కూటమిని కాస్త ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించారు. ప్రత్యేక సమావేశంలో మహిళా రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టారు. కాని ఈ బిల్లు అమల్లోకి ఎప్పుడు వస్తుందంటే, నియోజక వర్గాల పునర్విభజన, జనాభా లెక్కల సేకరణ జరిగిన తర్వాత అమల్లోకి వస్తుందన్నారు. అంటే మరి కొన్ని సంవత్సరాల వరకు ఈ బిల్లు అమల్లోకి రాదు. మోడీ భజన చేసే మీడియా సంస్థలు ఇది మాస్టర్‌ స్ట్రోక్‌ అని ఊదరగొట్టాయి.   కాని  ఈ బిల్లుపై చర్చలోనే రాహుల్‌ గాంధీ వెనుకబడిన వర్గాల మహిళల విషయం ప్రస్తావించి ఈ మాస్టర్‌ స్ట్రోక్‌లో స్ట్రోక్‌ మిగలకుండా చేశాడు. ఇప్పుడు నితీష్‌ కుమార్‌ బీహారులో కులజనాభా లెక్కలు బయటపెట్టి బీజేపీని మరింత ఇరకాటంలో పెట్టాడు. బీహారులో కులసమీకరణలే కాస్త అటు యిటుగా హిందీ రాష్ట్రాలన్నింటా ఉండవచ్చని చాలా మంది భావిస్తున్నారు. కులజనాభా లెక్కలు బయటకు వచ్చిన తర్వాత సహజంగానే వెనుకబడిన వర్గాల్లో అలజడి చెలరేగుతుంది. తమ జనాభాకు అనుగుణంగా తమకు ప్రగతి ఫలాలు దక్కడం లేదన్న చైతన్యం పుడుతుంది. ఇది మండల్‌ 2.0కు  దారి తీస్తుంది.  ముఖ్యంగా బీహారు,                 ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో కులసమీకరణలు బీజేపీకి వ్యతిరేకంగా మారవచ్చు. ఈ రెండు రాష్ట్రాల్లో 125 లోక్‌ సభ నియోజకవర్గాలున్నాయి. 2019 ఎన్నికల్లో బీజేపీ మిత్రపక్షాలతో కలిసి 104 స్థానాలు గెలుచుకుందిక్కడ.  ఓబీసీ మద్దతు వల్లనే నిజానికి నితీష్‌ కుమార్‌ ఇంత  సుదీర్ఘకాలం  అధికారంలో ఉన్నారు. బీహారు రాజకీయాలను  గమనిస్తే అత్యధికంగా వెనుకబడిన వర్గాలు నితీష్‌కు  మద్దతిచ్చాయి. 36.01 శాతం జనాభా ఉన్న ఈ సముదాయాల మద్దతు వల్లనే వెనుకబడిన వర్గాల మద్దతు ఉన్న లాలూ ప్రసాద్‌ యాదవ్‌ను కూడా దెబ్బతీయగలిగారు.  ఇప్పుడు  రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి.  ఇప్పుడు నితీష్‌, లాలూ ఒకే పక్షాన         ఉన్నారు. వెనుకబడిన వర్గాలు, అత్యధికంగా వెనుకబడిన వర్గాలు,  ముస్లిములు,  వామపక్షాల ఓటుబ్యాంకు, కాంగ్రెస్‌ ఓటుబ్యాంకు  ఇవన్నీ ఇండియా కూటమి వైపున ఉన్నాయి. ఈ పరిస్థితి ఇప్పుడు బీజేపీకి మింగుడుపడని పచ్చి వెలక్కాయ అయ్యింది. పరిస్థితి ఇలాగే ఉంటే 2024 లోక్‌ సభ ఎన్నికల్లో బీహారులో బీజేపీ నామమాత్రంగా మిగలడం  కూడా  కష్టమని కొందరి అభిప్రాయం. ఈ కలవరమే జర్నలిస్టులపై, రాజకీయ నాయకులపై ఈడీ దాడుల వెనుక ఉందని, బీహారు కులజనాభా లెక్కల నుంచి ప్రజల దృష్టి మళ్ళించడానికి ఈ అరెస్టులు మొదలయ్యాయని కొందరు వాదిస్తున్నారు.

భారత  రాజకీయాలను  గమనిస్తే, 2017లో ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలు జరిగాయి.  బీజేపీకి 40 శాతం ఓట్లు లభించాయి. ఉత్తరప్రదేశ్‌ శాసనసభలో మూడింటా రెండు వంతుల స్థానాలు గెలుచుకుంది. ఇది భారీ విజయం. ఈ విజయం సాధించడానికి బీజేపీ వివిధ సముదాయాలను హిందూత్వ వైపు మళ్ళించే అద్భుతమైన సోషల్‌ ఇంజనీరింగ్‌ అమలు చేసి చూపించింది. ఇదెలా  సాధించిందంటే,  వివిధ  కులసముదాయాలన్నీ హిందూత్వకు ఓటేసేలా తయారు చేయగలిగింది. బీజేపీకి సంప్రదాయికంగా ఓటేసే అగ్రవర్ణాలే కాకుండా, వెనుకబడిన వర్గాలు పెద్ద ఎత్తున ఓటేశారు. దళితులు కూడా ఓట్లు వేశారు. ఈ సముదాయాలు బీజేపీవైపు వచ్చేలా చేయడానికి ఈ సము దాయాల సమస్యల గురించి మాట్లాడడం, ఈ సముదాయాల నేతలకు ప్రాతినిధ్యం ఇవ్వడం వంటి చర్యలు చేపట్టారు. వాటితో పాటు ముస్లిములను విలన్లుగా, ఉమ్మడి శత్రువులుగా చూపించే వ్యూహం కూడా క్షేత్రస్థాయిలో ఫలితాలను ఇచ్చింది. 2019లో ఈ వ్యూహమే  గొప్ప  విజయాన్ని మోడీకి కట్టబెట్టింది. బీజేపీ రాజకీయాలను ఎలా ఎదుర్కోవాలో తెలియని  అయోమయంలో ప్రతిపక్షాలు సతమతమయ్యాయి. చివరకు బీజేపీ రాజకీయాలకు విరుగుడు ఇప్పుడు ప్రతపక్షాల చేతికి దొరికినట్లు కనిపిస్తోంది.

బీజేపీ సోషల్‌ ఇంజనీరింగ్‌లోని ముఖ్యమైన ఇటుకలనే ఇండియా కూటమి విరగ్గొట్టింది. లోక్‌సభలో రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ 90  మంది కీలకమైన పదవుల్లో ఉన్న కార్యదర్శుల్లో కేవలం ముగ్గురే  వెనుకబడిన  వర్గాల వారని ప్రకటించడంతో ఇది ప్రారంభమైంది.  వెనుకబడిన వర్గాల లెక్కలు తీయాలన్న డిమాండ్‌ బలం పుంజుకుంది. మహిళా రిజర్వేషన్‌ బిల్లులో వెనుకబడిన వర్గాల మహిళలకు ప్రాతినిథ్యం ఎక్కడుందన్న ప్రశ్న ముందుకు వచ్చింది. ఇప్పుడు నితీష్‌ కుమార్‌ బీహారులో కులాల లెక్కలు బయటపెట్టి బీజేపీకి గుక్కతిప్పుకోనివ్వలేదు. బీహారులో అత్యధిక జనాభా వెనుకబడిన వర్గాలదే. వారి ప్రాతినిథ్యమేమిటి? కేవలం పదిహేను శాతం ఉన్న అగ్రవర్ణాల ప్రాతినిథ్యమేమిటనే ఆలోచనలు ముందుకు వస్తున్నాయి.   ఎంత  జనాభా  ఉంటే అంత భాగం కావాలన్న డిమాండ్‌ ఊపందుకుంటోంది. క్లుప్తంగా చెప్పాలంటే  ఇది  బీజేపీ  సోషల్‌  ఇంజీనీరింగ్‌కు విరుగుడు. కాని ఇది ఎన్నికల్లో ఫలితాలు చూపిస్తుందా?

ఎంత  జనాభా  ఉందో  అంత భాగస్వామ్యం అన్న నినాదాన్ని ఇండియా కూటమి  వినిపిస్తోంది.  అంటే  వివిధ కులసముదాయాలు ఎంత జనాభా కలిగి ఉన్నాయో అంత భాగస్వామ్యం, ప్రగతిఫలాలు వారికి లభించాలన్నది ఈ నినాదం వెనుక  ఉద్దేశ్యం. ఇప్పుడు మోడీ  గారు  కూడా ఇదే నినాదం వినిపిస్తు న్నారు.  కాని  ఎంత జనాభా ఉందో అంత భాగస్వామ్యం అనే నినాదం నిర్వచనంలో తేడా ఉంది. హిందువులు జనాభా అధికం కాబట్టి వారికి అధిక భాగస్వామ్యం అనే తాత్పర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. హిందువులంతా ఏకశిలాసమానంగా భావించేలా చేయగలిగితే ఈ నినాదం ఫలితాలిస్తుంది. కాని కులాల జనాభా లెక్కలు బయటకు వచ్చిన తర్వాత, ఎంతమంది అగ్రవర్ణాలకు, ఎంత  మంది  వెనుకబడిన వర్గాలకు ఎంతెంత భాగస్వామ్యం లభిస్తుందన్నది కళ్ళకు కనిపిస్తున్నప్పుడు తాత్పర్యాలు మారిపోతాయి.  కాంగ్రెస్‌  హిందువులను  విభజించి దేశాన్ని  నాశనం చేయాలని  చూస్తోందంటూ  మోడీ  దాడి చేస్తున్నారు.

ఈ క్రమంలో మోడీ  మాజీ  ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ చెప్పిన మాటలంటూ ప్రస్తావించిన విషయాలపై కూడా చాలా విమర్శలు వచ్చాయి. మన్మోహన్‌సింగ్‌  ఎన్నడూ  చెప్పని  విషయాలను ప్రధాని మోడీ చెబుతున్నారని, మోడీ అబద్దాలు చెబుతున్నారనే విమర్శలు కూడా వినవచ్చాయి.  2006లో  మన్మోహన్‌ సింగ్‌ మాట్లాడుతూ దేశవనరులపై మొదటి హక్కు అల్పసంఖ్యాకులకు అందులోను  ముస్లిములకు  ఉంటుందని చెప్పినట్లు మోడీ అన్నారు. పైగా  కాంగ్రెస్‌  ఇప్పుడు ముస్లిముల హక్కులు కొల్లగొడుతుందా అంటూ కొత్త అర్థం తీశారు. నిజానికి ఇంతకు ముందు బీజేపీ రాజకీయాలన్నీ ముస్లిముల బుజ్జగింపు అనే మాట చుట్టు తిరిగేవి. విచిత్రంగా ఇప్పుడు మోడీ ప్రసంగంలో కాంగ్రెస్‌  హిందువులను  బుజ్జగిస్తుందన్నట్లు  మాట్లాడారు. ఇదంతా ఒక విధమైన కలవరానికి చిహ్నంగా చాలా మంది విశ్లేషిస్తున్నారు.

చాలా మందికి గుర్తుండే ఉంటుంది 1990లలో హిందీ రాష్ట్రాల్లో మండల్‌ ఉద్యమం ఎగిసిపడింది. అదే కాలంలో బాబరీ మస్జిద్‌ వివాదం కూడా తీవ్రంగా ఉంది.  మండల్‌  ఉద్యమాన్ని నీరు గార్చడానికి బీజేపీ కమండల్‌ రాజకీయాలు  తీవ్రం చేసింది. 1992లో బాబరీ మస్జిద్‌ కూల్చివేత జరిగింది.  వెనుకబడిన వర్గాలను హిందూత్వ జెండా క్రింద సమీకరించడంలో బీజేపీ విజయం సాధించింది.  ఫలితం  మండల్‌  ఉద్యమం చల్లారి పోయింది. బాబరీ మస్జిద్‌ వివాదం ఇప్పుడు  లేదు. ఇలాంటి కొత్త వివాదాలు రగిలించే ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ అవి బాబరీ స్థాయిలో ఎగసిపడే అవకాశాలు కనబడడంలేదు. 2014 నుంచి మోడీ పూర్తి మెజారిటీతో అధికారంలో ఉన్నారు. నిరు ద్యోగం పెరిగింది. తలసరి ఆదాయం దిగజారుతోంది. వ్యవ సాయం కష్టాలపాలయ్యింది. రైతుల సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. పారిశ్రామికీకరణ కుంటుపడింది. హిందీ రాష్ట్రాలే బీజేపీకి బలంగా ఉన్నాయి. ఇప్పుడు హిందీ రాష్ట్రాల నుంచి వలసకూలీలు ఇతర రాష్ట్రాలకు పొట్ట చేతబట్టుకుని వస్తున్న పరిస్థితి.  నగదు బదిలీలు,  గ్యాస్‌ సిలిండర్లు ఇవ్వడం వంటి చర్యలు ఇప్పుడు  పెద్దగా  ప్రజలను ఆకట్టుకునే అవకాశాలు కనబడడం లేదు.

ఇండియా కూటమి ఇప్పుడు కులజనగణన దేశవ్యాప్తంగా జరగాలని ఏ సముదాయం  జనాభా  ఎంత ఉందో అంత హక్కు లభించాలని అంటోంది.  అంటే  ఉద్యోగాల్లో, విద్యావకాశాల్లో అన్నింటా భాగస్వామ్యం. కులజనగణన జరిగి, వెనుకబడిన కులాల  ప్రజలు  ఇప్పుడు  ఏ  స్థితిలో ఉన్నారో,  విద్యా ఉద్యోగావకాశాల్లో వారి భాగస్వామ్యం ఎంత ఉందో  బయటకు వస్తే,  ప్రస్తుతం  ఉన్న రిజర్వేషన్లను  మార్చవలసిన   పరిస్థితి రావచ్చు.  ఇప్పటికే  ఆర్థికంగా  వెనుకబడిన  అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు  కల్పించడానికి  రిజర్వేషన్ల  సీలింగ్‌ విషయంలో మినహాయింపులు వచ్చేశాయి. ఈ నేపథ్యంలో మరిన్ని రిజర్వేషన్ల కోసం డిమాండ్లు ముందుకు రావడం తథ్యం. ఉదాహరణకు బీహారులో  వెనుకబడిన  వర్గాలకు 27 శాతం కోటా ఉంది. అక్కడ వెనుకబడిన  వర్గాల  జనాభా 63 శాతం. కాబట్టి రిజర్వేషన్లు పెంచాలన్న డిమాండ్‌ ముందుకు రావచ్చు. అంటే జనరల్‌ కేటగిరీ కింద అందుబాటులో ఉన్న అవకాశాలు ఇప్పుడు తగ్గుతాయి.  నిజానికి  జనరల్‌ కేటగిరి కింద అవకాశాలన్నీ అగ్రవర్ణాలే  పొందుతున్నాయన్న విమర్శలు కూడా చాలా కాలంగా ఉన్నాయి.

చట్టప్రకారం రిజర్వేషన్లు 50 శాతం మించరాదు. ఇది సుప్రీం కోర్టు ఉత్తర్వు విధించిన పరిమితి. కాని 2022లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విషయంలో ఈ పరిమితి పాటించవలసిన అవసరం లేదన్నారు. తమిళనాడు వంటి రాష్ట్రాలు ఈ పరిమితిని ఎప్పుడో అధిగమించాయి. ఏది ఏమైనా రానున్న ఎన్నికల్లో రిజర్వేషన్లు, కులజనగణన, ఓబీసీ రిజర్వేషన్ల సమస్య ప్రధానంగా ముందుకు వచ్చేలా కనిపిస్తుంది. ఈ నెరేటివ్‌ బీజేపీకి ఇబ్బంది కరమైనది. ఈ నెరెటివ్‌ మార్చడానికి బీజేపీ ఇప్పటి వరకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించినట్లు కనబడడం లేదు.

  • అబ్దుల్ వాహెద్