April 14, 2024

అన్ని రంగాల్లో అమ్మాయిల పట్ల వివక్ష కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మనం అంతర్జాతీయ బాలికల దినోత్సవం జరుపుకుంటున్నాం. బాలికల హక్కులు, మానవ హక్కుల ఉల్లంఘనకు వ్యతిరేకంగా, ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఆడపిల్లలు ఎదుర్కొం టున్న సవాళ్లను ప్రపంచానికి తెలియజేయడంతో పాటు బాలికలకు సమాజ పోకడల పట్ల, అవగాహన కల్పించే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం అక్టోబర్‌ 11న అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని జరుపుకోవాలని డిసెంబర్‌ 19- 2011న ఐక్యరాజ్య సమితి తీర్మానం చేసింది. అప్పటినుండి ప్రతి సంవత్సరం ఒక నినాదంతో కార్యక్రమాల నిర్వహణ జరుగుతోంది. ఈ సంవత్సరం నినాదం Our time is now- our rights, our future ‘మన హక్కులు, మన భవిష్యత్తు- ఇదే సమయం’.

 

ఆధునికత, నాగరికత ఎంతగా వృధ్ధి చెందినా, కొన్ని బూజు పట్టిన బుర్రలు  ఇంకా తిరోగమనంలోనే పయనిస్తున్నాయి. అమ్మాయిలు, అబ్బాయిల మధ్య చూపుతున్న వివక్షే దీనికి నిదర్శనం. పాతరోజుల్లో ఆడపిల్ల పుడితే ఇంటికి వెలుగొచ్చిందని సంబరపడేవారు. కాని ఈ రోజుల్లో ఆడపిల్ల పుట్టుకను భారంగా భావిస్తున్నారు. ‘ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం’ అన్నమాట మనం చాలా కాలంగా వింటున్నా, అది కేవలం నినాదంగానే మిగిలిపోయింది తప్ప, ఆచరణ రూపం దాల్చలేదు. ఒక పక్క స్త్రీని మహాశక్తి అని ఆకాశానికెత్తుతూ, మరోపక్క దారుణంగా ప్రవర్తిస్తున్న దుర్మార్గం కళ్లకు కడుతూ ఉంది.  ఇది అంతమైనప్పుడే సమాజానికి నిజమైన వెలుగు, నాగరికతకు సరైన అర్థం చేకూరుతుంది. శాస్త్రసాంకేతిక రంగాల్లో శరవేగంతో  దూసుకుపోతున్నామని గొప్పలు చెప్పు కుంటున్న మనం బాలికల భద్రత, వారి హక్కుల పరిరక్షణలో ఎక్కడ ఉన్నామో ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇంటి నుంచి బడికో,  బయటికో వెళ్ళిన బాలిక  క్షేమంగా తిరిగొస్తుందన్న నమ్మకం  లేదు. మార్గమద్యంలో ఎక్కడ ఏ ప్రమాదం పొంచి ఉందో ఊహించలేని పరిస్థితి. నిర్భయ, అభయ, దిశలాంటి చట్టాలు వచ్చిన  తర్వాత కూడా అత్యాచార ఘటనలు లేకుండా ఒక్క రోజైనా గడిచింది లేదు. దేశవ్యాప్తంగా మహిళలు, పిల్లలపై అనునిత్యం జరుగుతున్న దారుణాలే దీనికి నిదర్శనం. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) తాజా నివేదిక ప్రకారం, 2021లో 18 ఏళ్లు పైబడిన మహిళ లపై అత్యాచారాలకు సంబంధించి మొత్తం 28,644 కేసులు నమోదయ్యాయి. మైనర్లపై 36,069 అత్యాచార కేసులు నమోదయ్యాయి. 2019 లో పిల్లలపై1,48,185 అత్యాచార సంఘటనలు చోటుచేసుకున్నాయని, 2020లో ఒక్క తెలంగాణలోనే బాలికలపై లైంగిక వేధింపులకు సంబంధించి 2,074 పోక్సో కేసులు నమోదయ్యాయని ఎన్‌సీఆర్‌బీ వెల్లడించింది.  దేశంలో మహిళలు, అమ్మాయిలకు రక్షణ లేని పరిస్థితి 2019 కంటే 2020లో మరికాస్త పెరిగింది. దేశ వ్యాప్తంగా ప్రతిరోజూ సగటున 77 అత్యాచార కేసులు, 80 హత్యలు నమోదవుతున్నాయని కూడా నివేదిక వెల్లడిరచింది. ఏడున్నర దశాబ్దుల స్వతంత్ర భారతంలో మనమింకా మహిళలు, పిల్లల హక్కులు, రక్షణ గురించి, హత్యలు, అత్యాచారాల లెక్కల గురించి మాట్లాడుకునే స్థితిలోనే        ఉన్నాం. ‘బేటీ పఢావో.. బేటీ బచావో’దగ్గరే చక్కర్లు కొడుతు న్నాం. నేటికీ ఆడ పిల్లలంటే చులకన భావం, వివక్ష కొనసాగుతోంది.  మహిళను మనిషిగా కూడా చూడని కుసంస్కారం ఉంది. హక్కుల నిరాకరణ, లైంగిక వేధింపులున్నాయి. గృహ హింస ఉంది. అమ్మాయిలు, అబ్బాయిలు సమానమేనన్న ఇంగితంలేదు. అన్ని రంగాల్లో అమ్మాయిల పట్ల వివక్ష కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మనం అంతర్జాతీయ బాలికల దినోత్సవం జరుపుకుంటున్నాం. బాలికల హక్కులు, మానవ హక్కుల ఉల్లంఘనకు వ్యతిరేకంగా, ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఆడపిల్లలు ఎదుర్కొం టున్న సవాళ్లను ప్రపంచానికి తెలియజేయడంతో పాటు బాలికలకు సమాజ పోకడల పట్ల, అవగాహన కల్పించే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం అక్టోబర్‌ 11న అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని జరుపుకోవాలని డిసెంబర్‌ 19- 2011న ఐక్యరాజ్య సమితి తీర్మానం చేసింది. అప్పటినుండి ప్రతి సంవత్సరం ఒక నినాదంతో కార్యక్రమాల నిర్వహణ జరుగుతోంది. ఈ సంవత్సరం నినాదం Our time is now- our rights, our future ‘మన హక్కులు, మన భవిష్యత్తు- ఇదే సమయం’. బాలికలు తమ భవిష్యత్తును నిర్మించుకోడానికి, హక్కుల్ని సాధించుకోడానికి, కౌమారదశలో ఆడపిల్లలు, యువతులు ఎదుర్కొనే వివిధ రకాల సమస్యలు, హింసలను అంతం చేసి, తమలో నిగూఢంగా ఉన్న శక్తి సామర్థ్యాలను గుర్తించేలా, సాధికారత ప్రాముఖ్యతను తెలుసు కొని తమ హక్కుల్ని దక్కించుకునేలా చేయడం దీని ప్రధాన ఉద్దేశ్యం. కిశోర బాలిక మహిళగా రూపాంతరం చెందే కీలక దశ కౌమార దశ. వర్తమానం లోనే కాదు భవిష్యత్తులోనూ సాధికారత దిశలో నడవడానికి తనకు అవగాహన,  చైతన్యం అవసరం. దీనికి సరైన ఆయుధం విద్యే.. విద్యాభివృధ్ధి ద్వారానే అన్నిరకాల దుర్మార్గాలను అంతం చేయవచ్చు. బాలికలను స్వీయ శక్తివంతులుగా తీర్చిదిద్దడానికి, వారిపై జరిగే హింసను అంతం చేయడానికి, సాధికారత వైపు నడిపించడానికి అందరూ పూనిక వహిస్తే ఇదేమంత కష్టంకాదు. ప్రభుత్వం, పౌరసమాజం, స్వచ్ఛంద సంస్థలు ఏకమై కలిసి కట్టుగా  ప్రణాళికా బద్ధంగా, నిబద్దతతో, అన్నిటికీ మించి చిత్తశుధ్ధితో కృషిచేయాలి. కిశోర బాలికలకు సాంకేతిక, వృతివిద్యా అవకాశాలు కల్పించాలి.

స్వీయ రక్షణకు తగినశిక్షణ ఇవ్వాలి. తమ జీవితాన్ని తాము తీర్చి దిద్దుకుని నడుచుకునేందుకు నాణ్యమైన విద్య, వృత్తి నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం, సామాజిక, ఆర్థిక, ఆరోగ్య అంశాలపై చైతన్యం తీసుకురావాలి. నేటి ఆడపిల్లలకు తప్పనిసరిగా అవసరమైన భద్రత, సాంకేతిక విజ్ఞానాన్ని అందుబాటులో ఉంచాలి. సామాజిక, రాజకీయ పరిస్థితులపై అవగాహన కల్పించాలి. అన్నిటికీ మించి పురుష దృక్పథంలో మార్పురావాలి. అత్యధిక కుటుంబాల్లో వేళ్ళూనుకు పోయిఉన్న పురుషాధిక్య భావన అంతరించాలి. ఏ విధంగానూ, ఏ రూపంలోనూ ‘ఆడపిల్ల’ అన్న చులకన భావన అంకు రించని విధంగా పిల్లల పెంపకం ఉండాలి. కుటుంబాల్లో, సమాజంలో నైతిక, మానవీయ, ఆధ్యాత్మిక విలువలు వెల్లివిరియాలంటే సంవత్సరానికి ఒకరోజు హడావిడి చేసి, ప్రచార ఆర్భాటాలు ప్రదర్శిస్తే సరిపోదు. చట్టాలు కూడా సర్వరోగ నివారిణికావు. దైవభీతి, నైతిక పరివర్తన చాలా ముఖ్యం. ఈభావనే బాలికలు, మహిళల సమస్యలతో పాటు, జీవన రంగాల్లోని సమస్త సమస్యలకూ పరిష్కారం.

– యండి.ఉస్మాన్‌ ఖాన్‌