December 6, 2024

జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ ప్రకారం ఫీజు కట్టలేక 2021లో 10 లక్షల మంది పిల్లలు చదువు మానేశారు. మనలో చాలా మంది దానిని ఒక వార్తగా చదివి వదిలేస్తాం, కాని 23 ఏళ్ల వలీ రహ్మానీ, ఒక న్యాయవిద్యార్థిగా ఈ పరిస్థితిని మార్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు.

దేశంలో విద్యాపరంగా చాలా వెనుకబడిన ముస్లిం సముదాయంలో పిల్లల చదువు కోసం ప్రయత్నిస్తున్నాడు. కోల్‌కతాకు చెందిన వలీ రహ్మానీ లా ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాడు. వలీ రెహ్మానీ ఉమీద్‌ అకాడమీని స్థాపించి పేద ముస్లిం కుటుంబాల నుండి వచ్చిన అమ్మాయిలు, అబ్బాయిలకు ‘‘కాన్వెంట్‌ తరహా’’ విద్యను అందించడానికి ప్రయత్నిస్తున్నాడు. 2018లో 12వ తరగతి ఉత్తీర్ణత సాధించిన వెంటనే అతను 10 మంది పిల్లలతో ఉమీద్‌ ఫౌండేషన్‌  ప్రాజెక్టును ప్రారంభించాడు.  ప్రస్తుతం  ఉమీద్‌ అకాడమీ క్యాంపస్‌ కోల్‌కతా సమీపంలోని రెండు ఎకరాల స్థలంలో నిర్మించబడుతోంది. ఇది పూర్తయితే బాలబాలికలకు ప్రత్యేక హాస్టళ్లు, ఫుట్‌బాల్‌ మైదానం, బాస్కెట్‌బాల్‌ కోర్టులతో గొప్ప స్కూలుగా మారుతుంది. వీటన్నింటికీ డబ్బు ఖర్చవుతుంది. ఒక వ్యక్తి భరించలేనిది కాబట్టి, పారదర్శకంగా,  వినూత్నంగా నిధులను సేకరించడానికి వలీ రెహ్మానీ సోషల్‌ మీడియాలో ఒక వీడియోను విడుదల చేశారు. అందులో, 10 లక్షల మంది ముస్లింలు ఒక్కొక్కరు రూ. 100 విరాళంగా ఇస్తే కోటి రూపాయలు సమకూరుస్తానని, తన కలలకు, పేదరికం కారణంగా రేసులో ఓడిపోయిన పిల్లలకు రెక్కలు ఇస్తానని చెప్పాడు. ఇటీవల యూట్యూబ్‌లో విడుదల చేసిన వీడియో సందేశంలో, వలీ రెహ్మానీ ముస్లింలలో పాఠశాల మానేసిన పిల్లల గణాంకాలను సులభంగా వివరించడానికి ప్రయత్నించారు. దేశంలోని 21 శాతం ముస్లింలు దారిద్య్ర రేఖకు దిగువన బతకాల్సి వస్తుందని 6 కోట్ల మంది భారతీయ ముస్లింల నెలవారీ ఆదాయం రూ.2500 కంటే తక్కువగా ఉందని వివరించాడు. కోల్‌కతాలో ప్రస్తుతం ఉన్న ఉమీద్‌ అకాడమీ క్యాంపస్‌ చిన్నదని, కొత్తగా రెండు ఎకరాల్లో క్యాంపస్‌ నిర్మిస్తున్నట్లు  చెప్పారు. ఈ ప్రయోగం విజయవంతమైతే రూ. 10 కోట్ల కార్పస్‌తో ఇలాంటి మరో 100 పాఠశాలలను నిర్మించేందుకు ప్రయత్నిస్తానని అన్నాడు. వలీరహ్మానీ అప్పీలుకు ప్రతిస్పందన కనిపిస్తోంది. విరాళాలు వస్తున్నాయి. తన పని  తన సామాజిక కర్తవ్యమని ఆయన అన్నాడు.