October 5, 2024

తెలంగాణాలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆరెస్ ఓడిపోతుందని రాహుల్ గాంధీ జోస్యం చెప్పేశాడు. కాంగ్రెసు నిర్వహిస్తున్న విజయభేరీ యాత్రలో పాల్గొన్న రాహుల్ గాంధీ ఈ మాటలు చెప్పారు. దొరల తెలంగాణకు, ప్రజల తెలంగాణకు మధ్య పోరాటంగా ఆయన రానున్న ఎన్నికలను వర్ణించాడు. కాంగ్రెసుకు వ్యతిరేకంగా బీజేపీ, మజ్లిస్ పార్టీలు బీఆరెస్ కు సహాయపడుతున్నాయని కూడా ఆయన ఆరోపించాడు. ఇటీవల రాహుల్ గాంధీ సభకు భారీ సంఖ్యలో హాజరైన ప్రజానీకం కాంగ్రెసు ఉత్సాహాన్ని ఇనుమడించేలా చేసింది.

ఐదేళ్ళు రాజకీయాల్లో చాలా పెద్ద కాలం. 2018లో కేసీఆర్ నాయకత్వంలోని బీఆరెస్ పార్టీ భారీ మెజారిటీతో తెలంగాణాలో రెండవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాని 2019 సాధారణ ఎన్నికల్లో బీఆరెస్ కు ఎదురుదెబ్బలు తగిలాయి. మొత్తం 17 లోక్ సభ స్థానాల్లో సగం మాత్రమే సాధించగలిగింది. బీజేపీ, కాంగ్రెసు పార్టీలు ఊహించినదాని కన్నా మెరుగైన ఫలితాలు సాధించాయి. ఆ తర్వాత బీజేపీ బలపడుతున్న సూచనలు కనిపించాయి. కాంగ్రెసును వెనక్కి నెట్టి బీజేపీ తెలంగాణలో ముందుకు దూసుకుపోతున్నట్లు కూడా కనిపించింది. కాని ఇది కేవలం కొన్ని రోజులు మాత్రమే. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెసు ప్రభంజనం వీస్తున్నట్లు కనిపిస్తోంది. బీజేపీ మూడో స్థానంలో కూడా సుదూరంగా కనిపిస్తోంది. నిజానికి కాంగ్రెసు పార్టీ తెలంగాణలో చావు దెబ్బలు తింది. కాంగ్రెసు నుంచి 12 మంది ఎమ్మెల్యేలు బీఆరెస్ లోకి దూకేశారు. ఏబిపి సి వోటర్ సర్వేలో బీఆరెస్ కు కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తున్నట్లు తెలిసింది. ఒడిశాలో నవీన్ పట్నాయక్ మాదిరిగా మూడవసారి కూడా సునాయాసంగా అధికారం అందుకోవచ్చని ఆశించిన కేసీఆర్ కు నవంబర్ 30న జరిగే పోలింగ్ గట్టి సవాలు విసిరేలా ఉంది.

తెలంగాణ ఏర్పడిన తర్వాత, అంటే 2014 నుంచి ముఖ్యమైన సమస్యలు ఉద్యమ కాలంలో వినిపించిన నినాదాలే. అంటే నియామకాలు, నీళ్ళు, నిధులు. నిజం చెప్పాలంటే కేసీఆర్ చాలా సమర్థవంతంగా రాష్ట్రాన్ని నడిపించారు. అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. ఈ సంక్షేమ పథకాల విషయంలో కొన్ని విమర్శలు వినిపించవచ్చు. కాని సంక్షేమపథకాలు ప్రవేశపెట్టి ఒక స్థాయిలో అమలు చేశారన్నది కాదనలేము. దశాబ్ధకాలంగా ఈ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వస్తున్నారు. అభివృద్ధి చర్యలు తీసుకున్నారు. కాళేశ్వరం వంటి ప్రాజెక్టులను పూర్తి చేశారు. ఇవన్నీ విజయాలుగానే భావించాలి. అక్టోబర్ 15వ తేదీన బీఆరెస్ మానిఫెస్టో విడుదల చేసింది. ఈ సంక్షేమపథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకుపోతామని హామీ ఇచ్చారు. దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న 93 లక్షల మందికి  15 లక్షల రూపాయల లైఫ్ ఇన్సూరెన్స్ కల్పిస్తామన్నారు. రేషను దుకాణాల్లో సన్నబియ్యం సరఫరా చేస్తున్నారు. వృద్ధులకు పెన్షన్లు పెంచారు. ఒంటరి మహిళలకు, వికలాంగులకు పెన్షన్లు ఇస్తున్నురు. మేనిఫెస్టోలో వీటన్నింటిని మరింత పెంచుతామంటున్నారు. రైతుబంధు, దళితబంధు తదితర కార్యక్రమాలతో తెలంగాణ మోడల్ ను కేసీఆర్ దేశంలో ప్రచారంలో పెడుతున్నారు. అక్టోబర్ 2022లో అంటే ఒక సంవత్సరం క్రితం కేసీఆర్ తన పార్టీని జాతీయపార్టీగా పేరు మార్చారు. కాని ఢిల్లీలో కార్యాలయం ప్రారంభించడం తప్ప జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ అడుగు ముందుకు వేయలేదు. కేసీఆర్ జాతీయ రాజకీయీల్లోకి రావడాన్ని ఆహ్వానించిన పార్టీ జనతాదళ్ సెక్యులర్. ఇప్పుడు ఆ పార్టీ కూడా ఎన్డీయే పంచన చేరింది. ఇది కేసీఆర్ కు ఎదురుదెబ్బగానే భావించాలి.

రెండుసార్లు కేసీఆర్ ముఖ్యమంత్రిగా పాలించారు. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత ఉందన్నది నిజమే అయినా ఇప్పటికీ కేసీఆర్ కు ప్రజల్లో పట్టు ఉంది. తెలంగాణ సాధించిన నేతగా గుర్తింపు ఉంది. ప్రజల్లో ఉన్న ఈ గుర్తింపు మాత్రమే ఇప్పుడు బీఆరెస్ విజయానికి ఉపయోగపడే ఏకైక మార్గం. ఎందుకంటే కాంగ్రెసు ఇప్పుడు మంచి ఊపు మీద ఉంది. కర్నాటక ఎన్నికల్లో లభించిన విజయం గొప్ప ఉత్సాహాన్నిచ్చింది. తెలంగాణలో కూడా అలాంటి ఫలితాలే సాధించాలని చూస్తోంది. మహిళలకు, రైతులకు హామీలు ఇస్తుంది. కుల జనగణన గురించి మాట్లాడుతోంది. విద్యార్థులకు ఆర్థిక సహాయం గురించి చెబుతోంది.

కులజనగణన విషయానికి వస్తే ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న మిజోరంలో కులం పెద్ద సమస్య కాదు. కులగణన జరిపి ఎంతమంది ఓబీసీలున్నారు? ఎంతమంది దళితులున్నారు? ఎంతమంది గిరిజనులున్నారు? వారి పరిస్థితేమిటి అనే లెక్కలు బయటకు తీస్తామని చెబుతుంది కాంగ్రెస్. తెలంగాణలో కూడా ఇలాంటి కులజనగణన చేయించాలని డిమాండ్ చేస్తోంది. కాని తెలంగాణ కాంగ్రెసులో రెడ్డ సముదాయమే ప్రాబల్యంలో ఉంది. కాంగ్రెసు జారీ చేసిన మొదటి జాబితా అభ్యర్థుల్లోని 55 మందిలో 15 మంది రెడ్డి సముదాయానికి చెందినవారే. ఇదే పరిస్థితి బీఆరెస్ లో కూడా ఉంది. కాంగ్రెసు పార్టీ ఓబీసీ నేతలను పక్కన పెడుతుందన్న ఆరోపణతోనే పొన్నల లక్ష్మయ్య వంటి సీనియర్ నాయకుడు పార్టీ వదిలి వెళ్ళారు. ఆయన బీఆరెస్ లో చేరవచ్చు. ఇలాంటి పరిస్థితి పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ మాట్లాడే కులజనగణనను ప్రజలు ఎంతవరకు విశ్వసిస్తారన్నది అనుమానమే. కేసీఆర్ 2014లో సమగ్రసర్వే ఒకటి చేయించారు. అందులో కులపరమైన వివరాలు, సామాజిక ఆర్థిక వివరాలు కూడా సేకరించారు. ఆ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 53.5 శాతం ఓబీసీలు, 18.5శాతం దళితులు, 11.7శాతం ఆదివాసీలు ఉన్నారని తెలిసింది. కాబట్టి తెలంగాణలో ప్రత్యేకంగా కులజనగణన అవసరమా అనే ప్రశ్న కూడా పుడుతుంది.

రాష్ట్రంలో బీజేపీ పూర్తిగా కుదేలయ్యింది. నిజానికి ఉప ఎన్నికల్లోను, హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల్లోను బీజేపీ చెప్పుకోదగ్గ ఫలితాలు సాధించింది. కాని, ఆ తర్వాత పార్టీ గ్రాఫ్ పడిపోయింది. మజ్లిస్ పార్టీ హైదరాబాదుకు మాత్రమే పరిమితమైన పార్టీ. ఎప్పటి మాదిరిగానే మజ్లిస్ తన ఏడు స్థానాలు గెలుచుకోవచ్చు. బీహారు, పశ్చిమబెంగాల్, గుజరాత్ రాష్ట్రాల్లో విస్తరించడానికి మజ్లిస్ ప్రయత్నించింది. కాని ఇప్పుడు తెలంగాణలో మాత్రం కేవలం హైదరాబాదుకు మాత్రమే పరిమితమవుతోంది. కేసీఆర్కు, ఒవైసీకి మధ్య ఈ విషయమై స్పష్టమైన అవగాహన ఉందని చాలా మంది విశ్లేషిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ, వైయస్సార్ తెలంగాణ పార్టీలు కూడా రంగంలో ఉన్నప్పటికీ వాటి బలం పెద్దగా లేదు. బీజేపీ రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో పోటీ చేయడానికి సిద్ధపడడడం కేవలం కాంగ్రెసు ఓట్లను చీల్చి బీఆరెస్ కు సహాయపడడానికే అన్న వాదన కూడా వినిపిస్తోంది. కాని ఈ ఎత్తుగడ బెడిసికొట్టి బీఆరెస్ ఓట్లను బీజేపీ చీల్చినా ఆశ్చర్యపోనవసరం లేదని మరి కొందరి విశ్లేషణ.

ఈ నేపథ్యంలో తెలంగాణ ముస్లిములు ఎటు? అనే ప్రశ్నకు రాజకీయ పండితులు కూడా స్పష్టంగా ఏమీ చెప్పలేకపోతున్నారు. రాష్ట్రంలో మతసామరస్యం దెబ్బతినకుండా, అల్లర్లు లేకుండా పాలించిన నాయకుడిగా కేసీఆర్ కు గుర్తింపు ఉంది. ఈ సంవత్సరం ఆగష్టు నెలలో బీ.ఆర్.అంబేద్కర్ సెక్రటరీయేట్ ను కేసీఆర్ ప్రారంభించారు. ఈ ప్రాంగణంలో ఒక మస్జిదు కూడా నిర్మించారు. ఈ సెక్రటరియేట్ నిర్మాణం కోసం 2020లో అక్కడ ఉన్న రెండు మస్జిదులను కూల్చేశారు. ఒక గుడిని కూడా కూల్చారు. మస్జిదులను కూల్చడంపై ముస్లిముల నుంచి తీవ్ర నిరసన వచ్చింది. అలాగే గుడిని కూల్చినందుకు కూడా నిరసనలు ఎదుర్కోవలసి వచ్చింది. కాని, సెక్రటరీయేట్ నిర్మాణంతో పాటు మస్జిదు నిర్మాణాన్ని కూడా పూర్తి చేశారు. మస్జిదు కూల్చినప్పటికీ అక్కడ మళ్ళీ మస్జిదు కట్టించిన నాయకుడిగా కేసీఆర్ ముస్లిములకు పరిచయమయ్యారు. రాష్ట్రంలో ముస్లిం జనాభా 12.6 శాతం ఉంది. మొత్తం రాష్ట్ర జనాభా 3.51 కోట్లు. సెక్రటరీయేట్ లో మస్జిదు ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేసీఆర్ తో పాటు మజ్లిస్ నాయకుడు ఒవైసీ కూడా పాల్గొన్నారు. జామియా నిజామియాకు చెందిన ముఫ్తీ ఖలీల్ అహ్మద్ కూడా ఉన్నారు. జామియా నిజామియా 1872 నుంచి నడుస్తున్న ధార్మిక విద్యాసంస్థ. ఈ మస్జిదు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఫ్తీలు పాల్గొనడం వల్ల దీనిపై ధార్మికంగా ఎలాంటి అభ్యంతరాలు వచ్చే అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు నలుగురు ముఫ్తీలు అక్కడ పాల్గొన్నారు. ప్రార్థనలు చేశారు. ముఫ్తీ అంటే ధార్మికంగా ఏది సమ్మతమో కాదో చెప్పే వారు, ఫత్వాలు ఇచ్చే యోగ్యత ఉన్నవారు. అలాంటి వారే అక్కడ పాల్గొన్నారంటే ఇక అభ్యంతరాలు అవకాశమే లేదు. ఇదే విషయాన్ని ఒవైసీ కూడా చెప్పారు. కాంగ్రెసు హయాంలో కూల్చిన మస్జిదును నిర్మించలేకపోయారని, కాని బీఆరెస్ కూల్చిన మస్జిదును మళ్ళీ కట్టించిందని కూడా ఆయన బీఆరెస్ కు మద్దతుగా మాట్లాడారు. మజ్లిస్ పార్టీ నేతలు బీఆరెస్ కు మద్దతుగా, కాంగ్రెసుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారన్నది స్పష్టంగా తెలుస్తూనే ఉంది. ఈ నేతల ప్రభావం ముస్లిం ఓటర్లపై ఎంతవరకు ఉంటుందో వేచి చూడాలి. ఎందుకంటే, బీఆరెస్ పట్ల ముస్లిముల్లో అంత వ్యతిరేకత ఏమీ లేదు, కాని కొంత అసమ్మతి తప్పక ఉంది. బీఆరెస్ చాలా వాగ్దానాల విషయంలో విఫలమయ్యింది. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదన్న అసమ్మతి ముస్లిం సమాజంలో ఉంది. ఈ అసమ్మతిని దూరం చేయడానికి మజ్లిస్ ద్వారా బీఆరెస్ ప్రయత్నిస్తోంది.

బీఆరెస్ ప్రభుత్వం ముస్లిములకు చేసిందేమిటి? ఈ విషయమై ముస్లిముల్లోను చర్చలు జరుగుతున్నాయి. ముస్లిం డిక్లరేషన్ పేరుతో ఒక పత్రాన్ని కూడా కొందరు ఇటీవల విడుదల చేశారు. ఇందులో 12 శాతం రిజర్వేషన్ల విషయంలో బీఆరెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదన్న విమర్శ ప్రధానంగా కనిపిస్తోంది. 2014లో షాద్ నగర్ వద్ద ఒక బహిరంగ సభలో కేసీఆర్ ఈ హామీ ఇచ్చారు. కేసీఆర్ పై మరో విమర్శ, శాసనసభలో ముస్లిముల ప్రాతినిథ్యం చాలా తక్కువగా ఉండడం. 119 నియోజకవర్గాల్లో బీఆరెస్ అభ్యర్థుల్లో కేవలం ముగ్గురే ముగ్గురు ముస్లిములు.

రాష్ట్రంలో ముస్లిముల సామాజిక ఆర్థిక పరిస్థితులను అధ్యయనం చేయడానికి కమీషన్ నియమించింది బీఆరెస్ ప్రభుత్వమే. ఈ కమీషనులో ప్రముఖ ఆర్థికవేత్త అమీరుల్లా ఖాన్, విద్యావేత్త అబ్దుల్ సుభాన్ లు ఉన్నారు. జి.సుధీర్ నాయకత్వం వహించిన ఈ కమీషన్ తన నివేదికను 2016లో విడుదల చేశారు. ముస్లిములకు రిజర్వేషన్లు ఇవ్వవలసిన అవసరం ఉందని ఈ కమీషన్ నివేదిక ఆధారంగా వాదించారు. రాష్ట్రంలో ముస్లిముల జనాభా 12.36 శాతం ఉంటే 23 ప్రభుత్వ విభాగాల్లో ముస్లిం ఉద్యోగులు కేవలం 7.36 శాతం ఉన్నారు. కమీషన్ ఈ విషయాన్ని కూడా ఎత్తి చూపించింది. ముస్లిం రిజర్వేషన్ల గురించి మాటలయితే చాలా చెప్పారు, కాని చేతల్లో జరిగిందేమీ లేదన్న అసంతృప్తి ముస్లిముల్లో ఉంది.

ఈ విషయమై కేసీఆర్ స్వయంగా అసెంబ్లీలో వివరణ ఇచ్చారు. రిజర్వేషన్లు కల్పించాలనే తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించి కేంద్రానికి పంపించిందని, కేంద్ర ప్రభుత్వం తొక్కి పెట్టిందని చెప్పారు. కాని 2019లో కూడా కేసీఆర్ మరోసారి తీర్మానం చేసి పంపిస్తామన్న మాటలే చెప్పారని, ముస్లిములకు రిజర్వేషన్ల విషయంలో బీఆరెస్ ఒక ఖచ్చితమైన చట్టబద్దమైన వ్యూహం లేకుండా వ్యవహరిస్తుందా అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి అసంతృప్తులు ఉన్నప్పటికీ, కేసీఆర్ పాలనలో ఎలాంటి మతపరమైన అల్లర్లు లేకుండా ప్రశాంతంగా ఉండడం కేసీఆర్ కు ప్లస్ పాయింట్. ప్రవక్త ముహమ్మద్ (స)పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను తక్షణం అరెస్టు చేయడంలో ప్రభుత్వం తాత్సరం చేయలేదు. మతతత్వాన్ని ఏమాత్రం సహించేది లేదనే స్పష్టమైన సంకేతాలు బీఆరెస్ ఇవ్వడాన్ని చాలా మంది ప్రశంసించారు.

బీఆరెస్ పట్ల ముస్లిముల్లో ఉన్న కొద్దిపాటి అసంతృప్తిని రాజకీయంగా వాడుకునే ప్రయత్నాలు కాంగ్రెసు చేస్తూనే ఉంది. ముస్లిం డిక్లరేషన్ కోసం కాంగ్రెసు కసరత్తులు చేస్తోంది. ముస్లిం మేధావులు, నేతలు, సంస్థలతో మాట్లాడి వారి సలహా సూచనలు తీసుకుని ఒక స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వచ్చే ప్రయత్నాలు చేస్తోంది. కాని కాంగ్రెస్ హయాంలో అంటే 1980 నుంచి 1990 మధ్య కాలంలో హైదరాబాదులో జరిగిన అల్లర్లను చాలా మంది గుర్తు చేస్తున్నారు. బీఆరెస్ కాలంలో ఇలాంటి పరిస్థితి ఎన్నడూ తలెత్తలేదు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి చాలా సందర్భాల్లో కేసీఆర్ అనుకూలంగా వ్యవహరించారు. బీజేపీ తీసుకున్న ముస్లిం వ్యతిరేక నిర్ణయాల విషయంలో కూడా కేసీఆర్ ఖండించడం వంటివి చేయలేదు. ఈ ధోరణి కూడా ముస్లిముల్లో చాలా మందికి నచ్చలేదు. బీజేపీ వంటి మతతత్వ పార్టీని కేంద్రంలో నిరోధించాలంటే కాంగ్రెసును బలపరచాలన్న భావన కూడా బలంగా ఉంది. కాంగ్రెసు, బీఆరెస్ మధ్య ముస్లిం ఓట్లు చీలిపోతే బీజేపీ లాభపడుతుందన్న భయాలు కూడా మరోవైపు ఉన్నాయి. ముఖ్యంగా నిజామాబాద్, ఆదిలాబాద్ వంటి జిల్లాల్లో బీజేపీ లాభపడవచ్చు.

మరికొందరి విశ్లేషణ ప్రకారం పట్టణ ప్రాంతాల్లో, ఉన్నత మధ్యతరగతి ముస్లిములు కాంగ్రెసు వైపు మొగ్గు చూపినా గ్రామీణ ప్రాంతాల్లోను, దిగువ తరగతి ముస్లిముల్లోను బీఆరెస్ పలుకుబడి ఏమాత్రం తగ్గలేదని మరికొందరు అంటున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ స్కీముల వల్ల లాభపడిన కుటుంబాలు బీఆరెస్ వెంటనే ఉన్నాయి.

కర్నాటక వంటి ఫలితాలు కాంగ్రెసు తెలంగాణలో సాధించాలని కోరడంలో అర్థం లేదు. ఎందుకంటే కర్నాటకలో ముస్లిములంతా పాలక బీజేపీ ఓడించాలని నిర్ణయించారు. ముస్లిమేతరుల్లోను చాలా పెద్ద సంఖ్యలో బీజేపీ వ్యతిరేకత ఉంది. పైగా కర్నాటకలో బీజేపీ ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచి వచ్చింది కాదు, పార్టీ మార్పిళ్ళ రాజకీయాలు నడిపి ప్రభుత్వాన్ని కూల్చి గద్దెనెక్కారు. కర్నాటకలో ఎలాంటి ప్రాంతీయ పార్టీ రంగంలో లేదు. తెలంగాణ పరిస్థితి అది కాదు. ఇక్కడ పాలకపక్షం బీఆరెస్ పట్ల ప్రజల్లో అసంతృప్తి ఉండవచ్చు, కాని ఆగ్రహం లేదు. ముస్లిముల్లోను అసంతృప్తి ఉంది కాని ఆగ్రహం లేదు. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెసును బలపరచాలన్న భావన చాలా మందిలో ఉంది. కాని ఈ భావన ఓట్ల చీలికకు దారి తీయవచ్చు. ఈ ఓట్ల చీలిక చివరికి బీజేపికి లాభిస్తుందా? అనే ప్రశ్న ఇప్పుడు కొత్తగా ముందుకు వస్తోంది.

–      వాహెద్