July 27, 2024

గాజాలోని అహ్లీ ఆసుపత్రిపై పడిన మిస్సయిల్ తాము ప్రయోగించలేదని, అది గాజాలోని మిలిటెంట్లు ప్రయోగించిన మిస్సయిలే దారితప్పి ఆసుపత్రిపై పడిందని ఇస్రాయీల్ చెప్పిన మాటను ఇప్పుడు నమ్మేవారెవ్వరు లేరు. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కూడా ఇస్రాయీల్ కు వంతపాడుతు, నెతన్యాహు సమక్షంలోనే మాట్లాడుతూ, తన ఇంటిలిజెన్స్ వాళ్ళు చెప్పిన సమాచారం కూడా ఇదేనన్నాడు. గాజా ఆసుపత్రిపై పడిన మిస్సయిల్ మిలిటెంట్లు ప్రయోగించిందే అని చెప్పాడు. ఈ బైడెన్ గారు కొన్ని రోజుల క్రితం నలభై మంది ఇస్రాయీల్ పసిపిల్లల తలలు హామాస్ నరికేసిందని, ఆ ఫోటోలు చూశానన్నాడు. ఆ తర్వాత స్వయంగా శ్వేతసౌధం ముందుకు వచ్చి అలాంటి సమాచారం ఏదీ తమ వద్ద లేదని, ఎలాంటి ఫోటోలు లేవని స్పష్టం చేసి, తమ అధ్యక్షుడి అబద్దాన్ని బట్టబయలు చేయకతప్పలేదు. కాబట్టి అమెరికా అధ్యక్షుడి మాటల్లో సత్యం ఉందనుకోవడం నేతిబీరలో నెయ్యి ఉందనుకోవడమే.

కాని, ఇస్రాయీల్ చెబుతున్న మాట, దానికి వంతపాడుతూ అమెరికా చెబుతున్న మాటలను తీవ్రంగా ఖండిస్తూ స్వయంగా పాశ్చాత్య మీడియా ముందుకు వచ్చింది. బీబీసీ, చానల్ 4 వంటి మీడియా సంస్థలు ఈ మాటలను ఖండించాయి.

అహ్లీ ఆసుపత్రిపై మేం దాడి చేయలేదని ఇస్రాయీల్ చెబుతున్న మాటలను ఎలా నమ్మగలం?  ఎందుకంటే, అహ్లీ ఆసుపత్రి తర్వాత అల్ కుద్స్ ఆసుపత్రిపై ఇస్రాయీల్ బాంబు దాడులు చేసింది. అహ్లీ ఆసుపత్రిపై దాడిలో చాలా మంది మరణించారు కాబట్టి అక్కడ ముఖం చెల్లక ఈ అబద్దాలు చెప్పింది. తర్వాత మళ్ళీ ఆసుపత్రులపై దాడులు చేయడం కొనసాగిస్తోంది. అలాగే గాజాలో ఉన్న మస్జిదుపై బాంబు దాడులు చేసింది. ఈ మస్జిదులో అనేకమంది ఆశ్రయం పొందారు.  మిస్సయిల్ దాడిలో 30 మంది మరణించారు. ఈ మస్జిదు ఉంది నుసేరత్ శరణార్థి శిబిరంలో. శరణార్థులపై కూడా బాంబు దాడులు చేస్తున్న అమానుషం.

నెతన్యాహును కలిసి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆయనకు క్లీన్ సర్టిఫికేటు ఇచ్చి ఆలింగనం చేసుకుని వచ్చాడు. ఆయన నెతన్యాహును ఆలింగనం చేసుకున్న ఫోటో కూడా వచ్చింది. కాని చరిత్ర సిగ్గుపడే సంఘటనగా ఇది నమోదవుతుందని చాలా మంది వ్యాఖ్యానించారు.

అర్థమేమిటంటే, ఇస్రాయీల్ అమానుష దాడులు అడ్డుఅదుపు లేకుండా కొనసాగుతున్నాయి. ఎవరిపై దాడులు చేస్తోంది? ఇస్రాయీల్ పై దాడి చేసిన హమాస్ పై కాదు, సాధారణ పాలస్తీనా ప్రజలపై, ఆసుపత్రులపై, మస్జిదులపై, స్కూళ్ళపై దాడులు చేసి పసిపిల్లలను కూడా చంపుతోంది. గాజా జనాభాలో సగం పిల్లలే.  ఇక అహ్లీ ఆసుపత్రి దాడి గురించి చూద్దాం. ఇస్రాయీల్ ఈ దాడి మేం చేయలేదు. ఇది పాలస్తీనా మిలిటెంట్లు ప్రయోగించిన మిస్సయిలే అని చెబుతున్న మాటల్లో నిజమెంత?

ఇస్రాయీల్ ఒక వీడియో విడుదల చేసి గాజా నుంచి వస్తున్న మిస్సయిల్స్ ఇవే చూడండి, ఇందులో ఒక మిస్సయిల్ దారితప్పి అహ్లీ ఆసుపత్రిపై పడిందని వాదించింది. కాని ఇస్రాయీల్ విడుదల చేసిన వీడియోలో, మిస్సయిల్స్ వస్తున్న ప్రాంతంగా చూపించిన ప్రదేశంలో విద్యుచ్ఛక్తి లైట్లు దేదిప్యమానంగా కనిపిస్తున్నాయి. గాజాలో విద్యుచ్ఛక్తి లేదు. ఈ విషయమే చాలా మంది నిలదీసి ప్రశ్నించారు.

ఇస్రాయీల్ ఒక ఆడియో కూడా విడుదల చేసింది. ఇందులో ఇద్దరు మిలిటెంట్లు మాట్లాడుకుంటూ, పొరబాటున ఒక మిస్సయిల్ ఆసుపత్రిపై పడిందని మాట్లాడుకుంటున్న ఆడియో అది. ఈ ఆడియోను బ్రిటన్ కు చెందిన చానల్ 4 వెరీఫై చేసి, ఈ ఆడియో ఫేక్ ఆడియో అని చెప్పింది.

ఇక్కడ గమనించవలసిన మరో విషయమేమిటంటే, రెండేళ్ళుగా హమాస్ ఇస్రాయీల్ పై దాడికి ఏర్పాట్లు చేసుకుంటుంటే గుర్తించలేని ఇస్రాయీల్ నిఘా సంస్థలు, అహ్లీ ఆసుపత్రిపై దాడి జరగ్గానే ఈ విషయం గురించి మాట్లాడుకుంటున్న ఇద్దరు మిలిటెంట్ల మాటలు రికార్డు చేసి మనకు వినిపించేశాయంటే నమ్మగలమా? బీబీసీ ప్రకారం ఈ దాడి గాజా నుంచి జరిగే అవకాశమే లేదు. దాడి జరిగిన చోట ఉన్న ఆధారాలు పరిశీలిస్తే ఇస్రాయీల్ సైన్యం వైపు నుంచే ఈ దాడి జరిగిందని బీబీసి చెప్పింది. ఆసుపత్రులపై దాడి చేయడం పిల్లలపై దాడి చేయడం ఇస్రాయీల్ కు కొత్త కాదు. 2022 అగష్టులో ఇస్రాయీల్ దాడిలో ఐదుగురు పాలస్తీనా పిల్లలు చనిపోయారు. ఈ దాడి చేసింది పాలస్తీనా మిలిటెంట్లని ఇస్రాయీల్ మొదట వాదించింది. తర్వాత దాడి చేసింది తామేనని ఒప్పుకోక తప్పలేదు. ఇస్రాయీల్ ఈ విధంగా దాడులు చేసి అమాయలకులను, పసిపిల్లలను చంపడం, తాము ఈ దాడి చేయలేదని వాదించడం, తర్వాత దాడులు చేసింది ఇస్రాయీల్ అని తేలడం ఇలా జరిగిన అనేక సంఘటనలను మేగన్ కే. స్టాక్ అనే జర్నలిస్టు ఒక జాబితానే విడుదల చేశారు. ఉదాహరణకు మే 11, 2022న అమెరికా పౌరుడు అబూ అక్లే హత్య జరిగింది. అతను జర్నలిస్టు. వెస్ట్ బ్యాంక్ లోని జెనిన్ శరణార్థి శిబిరంపై ఇస్రాయీల్ దాడులను కవర్ చేస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. అక్లేను హత్య చేసింది పాలస్తీనా మిలిటెంట్లని మొదట ఇస్రాయీల్ వాదించింది. కాని తర్వాత తెలిసిందేమిటంటే, ఇస్రాయీల్ సైనికుడే అక్లేను కాల్చి చంపాడని రుజువయ్యింది. ఈ మాట స్వయంగా ఇస్రాయీల్ కూడా ఒప్పుకోక తప్పలేదు. ఇలాంటి చాలా సంఘటనలున్నాయి.

అహ్లీ ఆసుపత్రిపై దాడి జరిగిన తర్వాత హనన్యా నఫ్తాలీ అనే అక్కడి జర్నలిస్టు ఈ దాడి ఇస్రాయీల్ చేసిందేనని గొప్పగా ట్వీటు చేశాడు, తర్వాత డిలీట్ చేశాడు. తర్వాత ఈ దాడి చేసింది పాలస్తీనా మిలిటెంట్లని ఒక వీడియో పెట్టాడు. ఆ వీడియో 2022 నాటిదని, అప్పట్లో గాజాలో విద్యుత్ సరఫరా బాగుండేదని, అందువల్లనే లైట్ల వెలుగులు కనిపిస్తున్నాయని చాలా మంది విశ్లేషించి చెప్పారు.

అనేకసార్లు ఇస్రాయీల్ ఇలాంటి దాడులు చేసిందన్నది దృష్టిలో ఉంచుకోవాలి. ఇస్రాయీల్ దుర్మార్గాన్ని ఇప్పుడు యావత్తు ప్రపంచం ఖండిస్తోంది.