November 22, 2024

వృద్ధాశ్రమాలు కాదు మనకు కావలసింది. తల్లిదండ్రుల సేవ చేయాలన్న సంస్కారాన్ని నేర్పే సిలబసు మనకు కావాలి. తల్లిపాదాల క్రిందనే స్వర్గముందని నమ్మే సంతానం మనకు కావాలి. తండ్రిని సేవించడం సాఫల్యానికి మార్గమని విశ్వసించే సంతానం మనకు కావాలి. సంతానం ఆడపిల్ల, మగపిల్లవాడు అన్నది ముఖ్యం కాదు. ఆడపిల్లలైనా, మగపిల్లలైనా తల్లిదండ్రుల్ని ప్రేమించేవారు కావాలి.

మన సమాజం ఏ స్థాయికి దిగజారిందో చెప్పే వీడియో ఒకటి ఇటీవల బయటకు వచ్చింది. ఈ సంఘటన జరిగింది చండీగఢ్‌ లో. ఒక 73 సంవత్సరాల మహిళ తన కన్నకొడుకు చేతిలో అనుభవించిన చిత్రహింసకు సంబంధించిన వీడియో ఇది. కన్నకొడుకు, కోడలు, చివరకు మనవడు కలిసి ఆమెకు నరకం చూపించారు. నిజం చెప్పాలంటే సమాజం వృద్ధులకు నరకం చూపిస్తుంది. ఎన్డీటీవీలో వచ్చిన కథనం ప్రకారం ఆ కొడుకు ఒక న్యాయవాది.
కన్నతల్లి, 73 సంవత్సరాల వృద్ధురాలిని లాక్కుని వచ్చి, నిర్దాక్షి ణ్యంగా ఆ కొడుకు కొడుతున్న వీడియో ఇది. ఒక వృద్ధమహిళపై ఎవరైనా దాడి చేస్తేనే మనసు చలించిపోతుంది. వృద్ధమహిళ తన కన్నతల్లి, ఆమెను ఆ కొడుకు అలా కొడుతున్నాడంటే, ఎలాంటి రాక్షసుడై ఉండాలి. అక్కడే ఉన్న కోడలు కూడా తమాషా చూసింది. మనవడు రాక్షసానందం పొందాడు.
ఆ వృద్ధమహిళ గదిలో ఒక సిసి టీవీ కెమెరా పెట్టారు. పెట్టింది ఆ కొడుకే. తల్లికి ఎప్పుడేమైనా అవసరమొస్తుందేమో అన్న శ్రద్ధతో పెట్టాడనుకుంటే పొరబాటు. తల్లి ఏం చేస్తుందో నిఘా పెట్టడానికి పెట్టాడు. ఒకరోజు ఆ వృద్ధమహిళ బాత్‌ రూములోకి వెళ్ళింది. అక్కడికి మనవడు వచ్చాడు. అక్కడి బాటిల్‌లో ఉన్న నీరు పడకపై వేశాడు. తండ్రిని పిలిచి చూడు నాయనమ్మ ఎలా పక్కపై మూత్రం పోసి తడిపేసిందో అని ఫిర్యాదు చేశాడు. కోడలు వచ్చింది, పక్క చూసి ఏదో మహాపాపం జరిగిపోయినట్లు ముఖం పెట్టింది. కొడుకు వెంటనే తల్లిని బాత్‌ రూము నుంచి లాక్కుని వచ్చి పడకపై కుదేసి, జుట్టుపట్టి లాగి చెంపలు పగిలేలా అనేకసార్లు కొట్టాడు. ఈ కుట్ర చేసింది మనుమడు. వంత పాడిరది కోడలు.
ఒకవేళ నిజంగానే ఆ మహిళ పక్కపై మూత్రం పోసి ఉన్నా అందులో అంత మహాపరాధం ఏముంది? 73 సంవత్సరాల మహిళ ఆరోగ్యస్థితి, వయసు పరిగణనలోకి తీసుకుంటే ఇలా జరగవచ్చు. సంతానం బాధ్యత ఆమెను కనిపెట్టుకుని, ఆమెకు సపర్యలు చేయడం కాదా? ఆమె దుస్తులు మార్చి, శుభ్రం చేసి సేవలు చేయడం కాదా? పసిపిల్లలుగా ఉన్నప్పుడు ఈ పనులన్నీ సంతానం కోసం ఆమె చేయలేదా? పెరిగి పెద్దయిన తర్వాత ఆ పనులు చేయవలసిన బాధ్యత, కర్తవ్యం పిల్లలపై లేదా?
ఎంత కఠినాత్ముడైతే ఆ స్థితిలో ఉన్న తల్లిని అమానుషంగా లాక్కువచ్చి కొడతాడు. ఈ మొత్తం వ్యవహారం ఎలా బయటకు వచ్చిందంటే, తల్లిని చూడడానికి వచ్చిన కూతురితో ఆమె తనను రోజు కొడుకు కోడలు కలిసి కొడుతున్నారని చెప్పింది. అనుమానం వచ్చిన కూతురు ఎలాగో సిసి టీవీ ఫుటేజి సంపా దించి పరిశీలిస్తే ఈ మొత్తం హింసాకాండ బయటపడిరది. ఇందులో ఇలాంటి చాలా సంఘటనలున్నాయి. ఈ మూత్రం పోసి పక్క తడిపిన సాకుతో కొట్టడం అందులో ఒక్క సంఘటన మాత్రమే. ఒకసారి మనవడు ఆమెను పడక అంచుపై పడుకో బెట్టి ఆమెను క్రిందపడేలా చేశాడు. ఇలాంటి చిత్రహింసల సంఘటనల వీడియోలు అనేకం ఆమెకు దొరికాయి. ఆ వెంటనే కూతురు పోలీసు కేసు పెట్టింది
అభాగ్యురాలైన ఆ తల్లి పేరు ఆషారాణి. ఆ కొడుకు పేరు అంకుర్‌ వర్మ. ఇప్పుడు అతనిపై కేసు నడుస్తోంది. ఆషారాణి పంజాబులోని రూప్‌ నగర్లో తన కొడుకు కోడలుతో ఉంటుంది. ఆమె భర్త గుండెపోటుతో మరణించిన తర్వాతి నుంచి కొడుకు ఇంట ఉంటుంది. కొడుకు అంకుర్‌ వర్మ, కోడలు సుధ, మనవడు అందరూ కలిసి ఆమెను హింసించేవారు. ఈ కొడుకు ఇలాగే తండ్రి పట్ల కూడా వ్యవహరించాడని, తండ్రి మరణం కూడా అసహజమైన మరణమని తల్లి చెబుతోంది.
ఈ అంకుర్‌ వర్మ ఒక న్యాయవాది. బార్‌ అసోసియేషన్‌ అతని సభ్యత్వాన్ని రద్దు చేసింది. పోలీసులు ఆ వృద్ధమహిళను కాపాడి ఆసుపత్రికి చేర్చారు. అంకుర్‌ వర్మ భార్య, కొడుకులపై కేసు నమోదయ్యింది.
కన్నతల్లిపై రాక్షసంగా ప్రవర్తించిన ఈ కొడుకు, వృద్ధురాలైన అత్తగారిపై అమానుషంగా వ్యవహరించిన ఈ కోడులు … వీరిద్దరు ముసలివాళ్ళు అవుతారు కదా… ఈ మనవడు… కుట్రతో తన నాయనమ్మ పడకపై నీళ్ళు పోసి మూత్రం పోసిం దని తన తండ్రితో నాయనమ్మను చావబాదించిన వాడు రేపేం చేస్తాడో ఊహించడం కష్టమా? ఇదే పరిస్థితిలో ఈ అంకుర్‌ వర్మ, ఆయన భార్య సుధాలు తమ కొడుకు చేతుల్లో నరకం అనుభవించడం జరగదా?
ఎలాంటి విషవలయం ఇది?
వృద్ధాశ్రమాలు కాదు మనకు కావలసింది. తల్లిదండ్రుల సేవల చేయాలన్న సంస్కారాన్ని నేర్పే సిలబసు మనకు కావాలి. తల్లిపాదాల క్రిందనే స్వర్గముందని నమ్మే సంతానం మనకు కావాలి. తండ్రిని సేవించడం సాఫల్యానికి మార్గమని విశ్వసించే సంతానం మనకు కావాలి. సంతానం ఆడపిల్ల, మగపిల్లవాడు అన్నది ముఖ్యం కాదు. ఆడపిల్లలైనా, మగపిల్లలైనా తల్లిదండ్రుల్ని ప్రేమించేవారు కావాలి.