నిర్భయ అత్యాచారం దారుణ హత్య తర్వాత దేశాన్ని ఆ స్థాయిలో కుదిపేసింది శ్రద్ధావాకర్ హత్య కేసు. నిర్భయ కేసులో మహిళల భద్రత, పాలనాయంత్రాంగం వైఫల్యం వంటి అనేక సమస్యలు కూడా చర్చకు వచ్చాయి. కాని శ్రద్ధ కేసులో ఈ అంశాలు లేవు. శ్రద్ధా బాయ్ ఫ్రండ్ ఆఫ్తాబ్ పూనావాలా ఈ హత్య చేశాడని పోలీసులు స్పష్టం చేశారు. శ్రద్ధను హత్య చేసి 35 ముక్కలు చేయడమే కాదు, ఆ ముక్కలను స్టోర్ చేయడానికి 350 లీటర్ల ఫ్రిజ్ కూడా కొన్నాడట. ప్రతిరోజు అర్థరాత్రి దాటిన తర్వాత ఒక్కో ముక్క తీసుకెళ్ళి పారేసి వచ్చేవాడట. చాలా మామూలుగా ఇతర మహిళలతో సంబంధాలు కూడా ఈ కాలంలో కొనసాగించాడని తెలుస్తోంది.
కరడుగట్టిన నేరస్తుడని చెప్పే చరిత్ర ఏదీ అతనికి లేదు. ఇన్ స్టాగ్రాంలో ఫుడ్ బ్లాగర్ గా పేరున్నవాడు. ఇలాంటి ఘోరమైన అమానుష నేరం చేసేవాడిలా కనిపించడం. ప్రస్తుత సమాజంలో ఎవరు ఎలాంటి వారో ముఖం చూస్తే చెప్పలేమనడానికి ఈ దుర్మార్గపు నేరం ఒక ఉదాహరణ…
ఇలాంటి నేరాలు ఇంతకు ముందు కూడా జరిగాయి. సన్నిహితులే హత్యలు చేసిన సంఘటనలున్నాయి. కాని ప్రజలు ఈ సంఘటనల వార్తలు వచ్చినప్పుడు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తారు, తర్వాత మరిచిపోతారు. షీనా బోరా హత్య కేసు ఇప్పుడు ఎందరికి గుర్తుండి ఉంటుంది. షీనా తల్లి ఇంద్రాణీ ముఖర్జీని పోలీసులు అరెస్టు చేశారు. ఏడేళ్ళు గడిచిపోయాయి. ఇప్పటికి కూడా కేసు విచారణలోనే ఉంది. నిందితులు పలుకుబడి కలిగిన వారైతే అప్పీలు చేసుకుంటారు. కేసును పొడిగిస్తారు. చాలా కేసుల్లో ఇలాగే ఆలస్యమవుతుంటుంది. ఒక తల్లి తన స్వంత కూతురినే హత్య చేసిన అమానుష కేసు విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది.
బిల్కిస్ బాను కేసు తీసుకుంటే ఇందులో రాజకీయ కోణాలు కూడా ఉన్నాయి. బిల్కిస్ బాను కేసు కూడా అత్యంత అమానుషమైనది. ఆమె కళ్ళ ముందే ఆమె మూడేళ్ళ కొడుకును చంపి ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు.
ఇలాంటి అమానుషాలు జరిగినప్పుడు ప్రజల్లో కనిపించే ఆగ్రహావేశాలు తర్వాత చల్లబడిపోతాయి. చాలా మంది మరిచిపోతారు. ఉదాహరణకు బిల్కిస్ బాను కేసు తీసుకుందాం, ఈ కేసులో దోషులకు శిక్షపడింది. కాని వాళ్ళు ఆ తర్వాత చాలా కాలం పెరోల్ పై బయటే ఉన్నారు. తర్వాత శిక్ష కూడా రద్దయిపోయింది. పెరోల్ పై బయటకు వచ్చిన తర్వాత కూడా నేరాలు చేసి వారిపై ఎఫ్ ఐ ఆర్ లు నమోదయ్యాయి. ఈ విషయాలేవీ ప్రజలకు తెలియవు. దోషులకు శిక్ష పడిందనే అనుకుంటారు. బాబా రామ్ రహీమ్ కేసు తీసుకుందాం. ఆయనకు పెరోల్ ఎన్నిసార్లు దొరకలేదు.
నేరం జరిగినప్పుడు చాలా మంది ఆగ్రహావేశాలతో దోషులకు శిక్షలు పడాలని కోరుకుంటారు. కొన్ని సందర్భాల్లో ఆందోళనలు కూడా జరుగుతాయి. కాని తర్వాత కాలంతో పాటు చాలా మంది మరిచిపోతారు. నేరస్తులకు శిక్ష పడిందా లేదా? పడిన శిక్షను వాళ్ళు అనుభవిస్తున్నారా లేదా? అనేది ఎవరికి గుర్తుండదు. విచారణలు సుదీర్ఘకాలం కొనసాగుతాయి. న్యాయవాదులకు ఈ వాస్తవాలు తెలుసు. సంచలనాత్మక కేసుల్లో సాధ్యమైనంత వరకు వాయిదాలకు ప్రయత్నిస్తూ కేసును సాగదీస్తారు. ఈ లోగా ప్రజలు కేసును మరిచిపోతారు.
శ్రద్ధ కేసులో మరో కోణం ఏమిటంటే అఫ్తాబ్ పూనావాలా పేరు వినబడగానే దీనిపై లవ్ జిహాద్ గగ్గోలు మొదలయ్యింది. అత్యంత అమానుషమైన నేరానికి పాల్పడిన ఆఫ్తాబ్ కు తీవ్ర కఠిన శిక్ష విధించాలి. నిజానికి మరణశిక్ష విధించాలి. కాని పేరు వినగానే మొత్తం ముస్లిం సమాజాన్ని బోనులో నిలబెట్టేలా లవ్ జిహాద్ ప్రచారాల వెనుక రాజకీయాలు మనం గమనించాలి. శ్రద్ధ తండ్రి కూడా లవ్ జిహాద్ అనుమానాలు వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి.
ఘాజియాబాద్ లో అగష్టులో ప్రీతి శర్మ అనే మహిళ తన బాయ్ ఫ్రండ్ ఫిరోజ్ సల్మానీని హత్యచేసింది. అప్పుడు లవ్ జిహాద్ గగ్గోలు ఎక్కడా కనబడలేదు.
మే 2018లో సైఫ్ అలీ అనే ముస్లిం యువకుడిని అతని హిందూ గర్ల్ ఫ్రండ్ కుటుంబం హత్య చేసింది. సెప్టెంబర్ 2017లో జార్ఖండ్ లో ఒక హిందూ అమ్మాయితో స్నేహం చేస్తున్నందుకు ముస్లిం యువకుడి హత్య జరిగింది. ఇలాంటి చాలా కేసులున్నాయి. 1995లో ఢిల్లి తందూర్ హత్య కేసు ఎవరికైనా గుర్తుందా? సుశీల్ శర్మ తన భార్య నైనా సాహ్నీని చంపి ముక్కలు చేసి తందూరులో కాల్చేశాడు.
కొంత కాలం క్రితం మీరట్ లో వానియా అసద్ అనే వైద్యవిద్యార్థిని తోటి విద్యార్థి సిద్ధాంత కుమార్ పన్వర్ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న వార్త వచ్చింది. వారిద్దరి మతాల గురించి ఇక్కడ ప్రత్యేకంగా రాయనవసరం లేదు.
ఈ కేసులను గమనిస్తే పరువు హత్యలు, గృహహింస, హత్యల కేసులు కనిపిస్తాయి. అత్యంత దారుణమైన నేరమనస్తత్వం ఉన్న వాళ్ళు చేసే హత్యలివి. ఈ నేరస్తులను శిక్షించడానికి, శిక్షలు వాళ్ళు పూర్తి కాలం అనుభవించేలా చేయడానికి ప్రయత్నించడమే సమాజ సంక్షేమానికి అవసరం. అంతేకాని, లవ్ జిహాద్ పేరుతో ఈ దారుణాలను కూడా రాజకీయాలకు వాడుకోవడం సమాజహితం కాదు.