ఈ వ్యాసంలో ఇస్లామ్ ధర్మాన్ని సంపూర్ణ జీవన సంవిధానంగా సంక్షిప్తంగా వివరించడం జరిగింది.
1. ఇస్లాం ఏకేశ్వరోపాసన (తౌహీద్)కు సంబంధించిన ధర్మం. అది ప్రజలందరికీ (వారిని సృష్టించిన) ప్రభువు తరఫు నుండి అందజేయబడిన సార్వజనీన సందేశం, అది మానవాళికి వారి ప్రభువు తరఫు నుండి చిట్టచివరి గ్రంథాన్ని (ఖురాన్‌ను) అందజేస్తుంది. మనసా వాచా కర్మణ- త్రికరణ శుద్ధితో దాన్ని స్వీకరిస్తే, అది మనిషి జీవితంలో విప్లవాత్మక మార్పు తీసుకు వస్తుంది.
2. నిజ దైవభావన
విశ్వాన్ని, విశ్వంలోని చరాచరాలన్నింటిని సృష్టించిన ఒక నిజ దేవుడిని ప్రజలు నమ్ముతారు. వారు ఆయనను మాత్రమే ఆరాధిస్తారు, ఆయనకు ఎవరినీ సహవర్తులుగా చేసి కొలవరు. ఆ నిజ ఆరాధ్యుని పేరే అల్లాహ్. ఆయన తప్ప నిజ ఆరాధ్యుడు ఎవడూ లేడు. ఆయన తప్ప మరెవ్వరూ ఆరాధనకు అర్హులు కారు. ఆయనకి భాగస్వాములు లేదా భార్యాపిల్లలు లేరు. ఆయన మాత్రమే మొత్తం విశ్వాన్ని నియంత్రించేవాడు, మరియు అయన మాత్రమే అందరికీ జీవితాన్ని ప్రసాదించేవాడు. ప్రజలందరూ వారి మరణానంతరం ఆయన వద్దకే తిరిగి వస్తారు.
3. ఇస్లాం భావార్థం
(1) ఇస్లాం అంటే సమస్త జీవారాసులను సృష్టించిన ఒకే నిజ దేవునికి (సర్వశక్తిమంతుడైన అల్లాహ్ కు) సమర్పణ విధేయత. (2) ఇస్లాం అంటే మనం శాంతిని పొందడం, ఇతరులకు శాంతిని అందించడం. ఈ అర్థాల ప్రకారం, ఇస్లాం అనేది సమస్త మానవాళి కోసం అల్లాహ్ సమ్మతించి ఆమోదించిన జీవన సంవిధానం, తొలి మానవుడు, ప్రవక్త అయిన హజ్రత్ ఆదమ్(అ) మొదలు అంతిమ దైవప్రవక్త ముహమ్మద్(స) వరకు లోక కల్యాణార్థం వచ్చిన ప్రవక్తలందరి సందేశ సారం.
4. ఇస్లాం చివరి ప్రవక్త
ఇస్లాం ధర్మాన్ని సమస్త మానవుల జీవన సంవిధానంగా పరిచయం చేస్తూ వచ్చిన ప్రవక్తల సంఖ్య అక్షరాల 1 లక్ష 24వేలు. ఈ పరంపరలో చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ (స). పేరు ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ (571-632 క్రీ.శ). ఆయన శుభ జననం అరేబియా ద్వీపకల్పంలోని మక్కాలో జరిగింది. అక్కడే ఆయన పుట్టి పెరిగారు. ఆయన (ఖురైష్) అనే గొప్ప అరబ్ తెగకు చెందినవారు. ఆయన ఉన్నత నైతిక ప్రమాణాలతో ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపారు. ఆయన నడవడికను చూసిన జాతి వారు ఆయన్ను సాదిక్ – సత్యవంతుడు, అమీన్ – నమ్మదగినవాడు అని ప్రేమతో పిలిచేవారు.
ఆ సమాజంలో బహుదైవారాధన సర్వసాధారణమైనప్పటికీ ఆయన ఎప్పుడూ విగ్రహాలను పూజించలేదు. ఆయన తను ఒక ప్రవక్త అవ్వాలని ముందస్తు ప్రణాళిక వేయలేదు, ఇష్టాను సారంగా ప్రవక్త అయిపోలేదు. వాస్తవంగా అల్లాప్‌ా అయన ద్వారా అంతిమ సందేశం అయిన దివ్యగ్రంథం ‘‘ఖురాన్’’ను ప్రజలందరికీ తెలియజేయడానికి ఆయన్ను ఎంపిక చేసుకున్నాడు. ఖుర్‌ఆన్ అవతరణ 23 సంవత్సరాల వ్యవధిలో (610-632) ప్రవక్త ముహమ్మద్ (స) వారిపై దైవదూతల నాయకులైన జిబ్రిల్ ద్వారా అరబిలో అవతరింపజేయబడిరది. ఆయనను ముస్లింలు విశ్వ జనులందరి కోసం విశ్వ ప్రభువు అల్లాప్‌ా పంపిన ప్రవక్తగా నమ్ముతారు.
5. మూలం, వ్యాప్తి
ఇస్లాం అంతిమ సందేశం మక్కాలో సంపూర్ణమయింది. అయితే మొదటి ఇస్లామీయ సువ్యవస్థ మదీనాలో (మక్కాకు ఉత్తరాన 400 కి.మీ దూరాన) స్థాపించబడిరది. క్రీ.శ.623లో మహమ్మద్ ప్రవక్త మరియు ఆయన సహచరులు కొందరు అక్కడికి వలస వెళ్లారు.
ప్రవక్త ముహమ్మద్(స) మరణం తరువాత, ఆయన సహచరులు, వారి అనుచరులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ ఇస్లాం సందేశాన్ని తెలియజేయడానికి పూనుకున్నారు.
క్రీ.శ.636లో, ఇస్లాం పాలస్తీనా, సిరియా, ఈజిప్ట్, ఉత్తర ఆఫ్రికా లోని చాలా ప్రాంతాలతోపాటు భారత దేశానికి కూడా చేరుకుంది.
మాలిక్ బిన్ దీనార్, 20 మంది ముహమ్మద్ ప్రవక్త అనుయా యులు, మొదట కేరళలోని, కొడుంగళూర్ వచ్చారు. వీరు భారతదేశంలో ప్రవేశించినపుడు, ఈ రాష్ట్రాలలో ఇస్లాం ధర్మానికి మంచి స్పందన లభించింది. తదనంతరం, ఇతర రాష్ట్రాలలో కూడా మంచి స్పందన లభించింది. ఇస్లామీయ తత్వం, ఏకేశ్వరోపాసక నియమం, సర్వమానవ సోదర భావన, సమానత్వాల ప్రవచనాలు, శాస్త్రాలతో కూడిన ఖురాన్ సాదా సీదా జీవన సరళి మున్నగు విషయాలు ప్రజలపై ప్రభావం చూపాయి. మాలిక్ బిన్ దీనార్ మొదటి మస్జిద్‌ను నిర్మించాడు, ఈ మస్జిద్ భారతదేశంలోనే కాక భారత ద్వీపకల్పంలోనే ఇది ప్రథమ మస్జిద్ కూడానూ. ఇది క్రీ.శ. 629లో నిర్మింపబడినదని భావిస్తున్నారు. మరి ఒక ముఖ్యమైన ప్రాముఖ్యతను ఈ మస్జిద్ సంతరించుకొంది. అది యేమనగా, సౌదీ అరేబియా లోని మదీనా తరువాత ఈ మస్జిద్ ‘శుక్రవారపు ప్రార్థనలు’ జరుపుకున్న ప్రపంచంలోనే రెండవ మస్జిద్.
క్రీ.శ.642లో ఇస్లాం పర్షియాకు చేరుకుంది. అదనంగా, ఇస్లాం ఏడవ శతాబ్దిలో చైనాకు చేరుకుంది.
6) ప్రవక్త ముహమ్మద్ (స) వారి అనుయాయులు
తాజా గణాంకాల ప్రకారం ప్రపంచంలోని ముస్లింల సంఖ్య దాదాపు 1.8 బిలియన్లు. ఇస్లాం భూమిపై రెండవ అతిపెద్ద మతం. వారు 50 దేశాలలో అత్యధిక జనాభాను కలిగి ఉన్నారు. ముస్లింలలో 20% మాత్రమే అరబ్బులు.
7) ఇస్లాం ధర్మ గ్రంథం ఖుర్‌ఆన్
‘‘ఖుర్‌ఆన్’’ ఇస్లాం ధర్మ గ్రంథం. దీనిని ‘‘పవిత్ర ఖుర్‌ఆన్’’ ‘‘పరిశుద్ధ ఖుర్‌ఆన్’’ అని పిలుస్తారు. దీనిని ముస్లింలు అల్లాప్‌ా అంతిమ గ్రంథంగా పరిగణిస్తారు. అది అల్లాప్‌ా మానవాళి కోసం పంపిన అన్ని మునుపటి గ్రంథాలను (వ్యాఖ్యానాలు, మార్పులు లేకుండా వాటి అసలు రూపాల్లో) ధ్రువపరుస్తుంది. ప్రవక్త ఇబ్రాహీమ్ (అ)కు ఇవ్వబడిన సుహుఫ్ (ప్రతులు), ప్రవక్త దావూద్(అ)కు ఇవ్వబడిన జబూర్ (కీర్తనలు), ప్రవక్త మూసా (అ)కు ఇవ్వబడిన తౌరాత్ (తోరా) మరియు ప్రవక్త ఈసా(అ)కు ఇవ్వబడిన ఇంజీల్ (దేవుని సువార్త) వంటి దైవ గ్రంథాలను ధ్రువీకరిస్తుంది, వాటి సారాంశాన్ని సంరక్షిస్తుంది.
ఖుర్‌ఆన్ భూమిపై ఉన్న సురక్షిత దైవగ్రంథం. అది మానవులచే మార్పులు చేర్పులు చేయబడకుండా అల్లాప్‌ా వాక్యాలను కలిగి ఉన్న ఏకైక గ్రంథం. అది సకల వక్రీకరణలు, వక్ర భావాల నుండి భద్రపరచబడిన అద్వితీయ అద్భుత దైవగ్రంథం.
అది దేవుని చట్టం, అల్లాహ్ ఆజ్ఞలతో పాటు ప్రజలందరి కోసం సార్వజనీన సందేశం. జాతులు మరియు భాషలతో సంబంధం లేకుండా ప్రపంచం నలుమూలల నివసించే కోట్లాది మంది ప్రజల హృదయాలను బలంగా ప్రభావితం చేసిన శక్తివంతమైన గ్రంథం. అలాగే ప్రాంతానికి, భాషకి, జాతికి అతీతంగా లక్షలాది మంది ప్రజలచే మొదటి నుండి చివరి వరకు కంఠస్తం చేయబడి భద్రపరచబడిన గ్రంథం.
8) ఇస్లాం ధర్మ నిర్మాణం
ఇస్లాంను రెండు భాగాలుగా విభజించవచ్చు: (1) ఇస్లామీయ విశ్వాసం (2) ఇస్లామీయ ధర్మ శాస్త్రం (చట్టం, జీవన విధానం). వాటిని సాధారణంగా అరబిలో అకీదః మరియు షరీఅహ్ అని పిలుస్తారు.
అకీదః అనేది ఇస్లాం ‘‘నమ్మకం’’. అది ఇస్లాంలోని అవిభాజ్యాంశం, కీలక భాగం. విశ్వాసం (ఈమాన్) ఆరు విధాలుగా ఉంటుంది. అవి – అల్లాప్‌ా పై దృఢమైన విశ్వాసం. ఆయన మనల్ని – ఆయన దూతలను, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలను, మరణానంతర జీవితాన్ని, మంచీ చెడు విధివ్రాతలను విశ్వసించ మని ఆజ్ఞాపించాడు.
ఇస్లామీయ ధర్మ శాస్త్రం అనేది ‘‘ఆచరణ’’ సంబంధితమైనది. అది ఇస్లామీయ సువ్యవస్థ, చట్టం మరియు జీవన విధానం. ఇది ఖుర్‌ఆన్, ప్రవక్త ముహమ్మద్(స) వారి (సున్నత్) బోధనలలో వివరించబడిరది.
అది మూడు ప్రధాన శాఖలను నియంత్రించే నియమాలు, నిబంధనలు మరియు మార్గదర్శకాలను సూచిస్తుంది:
1- ఆచారాలు/ఆరాధనలు
2- నైతికత, నీతి (ముస్లిం ప్రవర్తనలో అంతర్భాగంగా ఉండాలి)
3- వ్యక్తుల మధ్య లావాదేవీలు (సామాజిక/ఆర్థిక విషయాలు)
9) ఇస్లాంలో ఆరాధన (ఇస్లాం 5 మూల స్తంభాలు)
ఇస్లామీయ ధర్మ శాస్త్రంలో పేర్కొన్న ఆచారాలు, ఆరాధనలు. (ఇస్లాం ధర్మ 5 మూల స్తంభాలు) ముస్లింగా మారడానికి, మీరు మొత్తం ఐదు స్తంభాలను తెలుసుకోవాలి.
(1) షహాదహ్ (విశ్వాస సంబంధిత రెండు సాక్ష్యాలు).
(2) అల్లాప్‌ా ప్రీతి కోసం రోజువారీ ఐదు పూటల ప్రార్థనలను స్థాపించడం.
(3) ప్రతి సంవత్సరం రమజాన్ మాసపు పూర్తి ఉపవాసాలు పాటించడం (ఉపవాసం).
(4) పేదవారికి వార్షిక జకాత్ చెల్లించడం.
(5) మక్కాలో ఉన్న కాబా గృహాన్ని సందర్శించి జీవిత కాలంలో ఒకసారి హజ్ చేయడం.
హజ్ ప్రయాణం సుమారు ఒక వారం నుండి మూడు వారాల పాటు సాగుతుంది. ప్రవక్త ఇబ్రహీం(అ)కు సంబంధించిన అనేక సంప్రదాయాలను నిర్వహించడం అవసరం. (మస్జిద్ హరామ్ లోపల, వెలుపల).
10) ఇస్లాంలో చేయవలసినవి, చేయకూడనివి
ముక్తసరిగా చెప్పాలంటే, మంచిని ‘‘చెయ్యండి’’, చెడు చేయడం మానుకోండి.
ఇస్లాంలో ఘోర పాపాలు:
(1) విశ్వాన్ని, అన్ని జీవులను సృష్టించిన దేవుని ఉనికిని తిరస్కరిం చడం (అంటే నాస్తికత్వం). అదే విధంగా, నిజ ఆరాధ్యుడైన అల్లాప్‌ాను కాకుండా ఇతర సృష్టిరాసులపై నమ్మకం మరియు ఆలాప్‌ా ఆరాధనలో వారిని భాగస్తులుగా చేర్చడం (షిర్క్).
(2) తల్లిదండ్రులకు అవిధేయత, వారితో చెడుగా ప్రవర్తించడం.
(3) హత్య, ప్రజలను చంపడం ఆత్మహత్య చేసుకోవడం.
(4) వ్యభిచారం, స్వలింగ సంపర్కం, లైంగిక వేధింపులు
(5) అనాధ సంపదను అక్రమంగా వినియోగించడం లేదా స్వాధీనం చేసుకోవడం.
(6) కొలతల్లో తూనికల్లో మోసం చేయడం. ఇతరులతో ఆర్థిక, ఆర్థికేతర లావాదేవీలకు ఇది వర్తిస్తుంది.
(7) న్యాయస్థానంలో సాక్ష్యం చెప్పేటప్పుడు అసత్యం లేదా అబద్ధం చెప్పడం.
(8) అవసరమైన వ్యక్తులకు రుణమిచ్చేటప్పుడు వడ్డీ వసూలు చేయడం.
11) ఆహార పానీయాలు
కింది వాటిని మినహాయించి సముద్రపు ఆహారంతో సహా అన్ని ఆహారాలు (అంటే హలాల్) తినడానికి అనుమతి ఉంటుంది:
(1) పంది మాంసం
(2) మాంసం తినే ఏదైనా జంతువు.
(3) చనిపోయిన జంతువులు.
(4) ఇస్లామీయ పద్ధతి ప్రకారం వధించబడని ఏదైనా జంతువు.
రక్తం, ఆల్కహాలిక్ డ్రింక్స్ (ఉదా. వైన్) మినహా అన్ని పానీయాలు ధర్మసమ్మతమైనవి. మత్తుపానీయాలు తక్కువ తాగినా లేదా ఎక్కువ తాగినా మతి భ్రమించేలా చేస్తాయి.
12) డ్రస్ కోడ్
మహిళలు : యుక్తవయస్సు వచ్చినప్పుడు మాత్రమే శరీరం, తల వెంట్రుకలను కప్పి ఉంచే నిరాడంబరమైన వస్త్రధారణ చేసుకోవాలి.
పురుషులు : ప్రధానంగా నాభి (బొడ్డు) నుండి మోకాళ్ల వరకు కప్పి ఉంచే నమ్రతతో కూడిన వస్త్రధారణ చేసుకోవాలి.
13) వారాంతం
ముఖ్యంగా ముస్లిం దేశాలలో శుక్రవారం ముస్లింలకు విశ్రాంతి దినం. వారు మస్జిదులో సామూహిక శుక్రవారం ప్రార్థనలు చేయవలసి ఉంటుంది మరియు ఒక చిన్న ప్రసంగాన్ని వినవలసి ఉంటుంది.
14) పండుగలు
చంద్రమానం ప్రకారం రెండు వార్షిక పండుగలు నిర్దేశించబడ్డాయి.
ఈదుల్ ఫిత్ర్ : రమజాన్ ఉపవాస నెల ముగింపులో.
ఈదుల్-అజ్హా : (3 రోజులు)
ఇస్లాంలో మూడు పవిత్ర స్థలాలు మాత్రమే ఉన్నాయి :
(1) మక్కాలోని మస్జిదె హరామ్, ఇందులో కాబా ఉంది.
నిజ ఆరాధ్యుడైన అల్లాహ్ ను కీర్తించడానికి, ఆరాధించడానికి భూమిపై నిర్మించబడిన మొదటి ప్రార్థనా గృహం.
ప్రవక్త ఇబ్రాహీం(అ) దానిని పునర్నిర్మించారు. దాని అసలు పునాదిపై దాని గోడలను ఎత్తారు.
ప్రపంచం నలుమూలల నుండి ముస్లింలు మక్కాలోని మస్జిదె హరామ్‌లోని కాబా వైపు ముఖం చేసి ప్రార్థన చేస్తారు.
(2) మదీనాలోని ప్రవక్త ముహమ్మద్ (స) మస్జిద్ (మస్జిదె నబవి)
ఇస్లామీయ సువ్యవస్థ వైపునకు ప్రస్థానం తర్వాత నిర్మించబడిన మొదటి మస్జిద్.
మానవాళికి దేవుని సందేశాన్ని తెలియజేయడానికి ప్రారంభ స్థానం.
(3) ఫాలస్తీనా (జెరూసలేం)లోని అల్-అక్సా మసీదు, ఒకే ఒక్క నిజ ఆరాధ్యుడైన అల్లాహ్ ను ఆరాధించడానికి భూమిపై నిర్మించబడిన రెండవ మసీదు. ఇది ఇస్లాంలో మొదటి ‘‘కిబ్లా’’ కూడా. ప్రార్థన సమయంలో దిశ కాబాకు మార్చడానికి ముందు ముస్లింలు ఈ దిశకు ముఖం చేసి ప్రార్థన చేసేవారు.
సయ్యద్ అబ్దుస్సలామ్ ఉమరీ