November 12, 2024

రాజస్థాన్‌లో కమలానికి కష్టకాలమే కనిపిస్తోంది. రాజస్థాన్‌ బీజేపీలో అసమ్మతి స్వరాలు ఆకాశన్నంటుతున్నాయి. రాజస్థాన్‌ బీజేపీలో చాలా పెద్దనేత వసుంధర రాజే సింధియాను పక్కన పెట్టడానికి మోడీ, అమిత్‌ షాలు చేస్తున్న ప్రయత్నాలు వికటిస్తున్నట్లు కనిపిస్తున్నాయి. వసుంధర రాజే తలచుకుంటే బీజేపీ మరోసారి రాజస్థాన్‌లో ఓటమి  చవిచూడడం  ఖాయమనిపిస్తోంది. రాజస్థాన్‌ బీజేపీ ముఖ్యమంత్రి ముఖం ఎవరో ఇప్పటి వరకు ఎవరికీ  తెలియదు.  వసుంధర రాజే లాంటి అగ్రశ్రేణి నేతను పక్కన పెట్టి మోడీ తన స్వంత పలుకుబడితో గెలవాలను కుంటున్నారు. కాని రాజస్థాన్‌లో ప్రజాదరణ పలచబారుతున్న సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. మరోవైపు రాహుల్‌ గాంధీ ప్రజాదరణ పెరుగుతోంది. రాహుల్‌ గాంధీ యూట్యూబ్‌ చానల్‌లో వ్యూలు పెరుగుతున్నాయి. అందుకే కాబోలు ఇటీవల మోడీ స్వయంగా తన యూట్యూబ్‌ చానల్‌ను సబ్‌స్క్రయిబ్‌ చేయాలని, లైక్‌ చేయాలని అప్పీలు చేశారు.

ఏది ఏమైనా  ఇప్పుడు జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లోను, ఆ తర్వాత వచ్చే లోక్‌సభ  ఎన్నికల్లోను  గెలవాలంటే మరోసారి హిందూ ముస్లిం విభజన విద్వేష రాజకీయాలే శరణ్యమని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందువల్లనే పార్లమెంటులో డానిష్‌ అలీ  అనే  ముస్లిం  సభ్యుడి గురించి బీజేపీ సభ్యుడు రమేష్‌ బిధూరి అత్యంత అసభ్యంగా మాట్లాడాడు. మొత్తం ముస్లిం సముదాయాన్ని లక్ష్యంగా చేసుకుని ఆయన మాట్లాడాడన్నది స్పష్టం. ఈ  పనికి  తగిన బహుమతి వెంటనే లభించింది. ఆయన్ను రాజస్థాన్‌ ఎన్నికల బాధ్యతలు కట్టబెట్టారు. ఇప్పుడు బీజేపీ రాజకీయాల్లో  ముస్లిం  విద్వేషం మరింత అధికంగా కనిపిస్తుందని చాలా మంది విశ్లేషిస్తున్నారు.

అయితే ప్రధాని స్వయంగా హిందూ ముస్లిం రాజకీయాలకు ఇంత త్వరగా,  ఇంత  బాహాటంగా పూనుకుంటారని ఎవరు ఊహించలేదు.  ఉదయపూర్‌లో మాట్లాడుతూ మోదీ కన్నయ్యా లాల్‌ హత్యకేసును  ప్రస్తావించారు.  నుపుర్‌ శర్మ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు  చెలరేగిన గందరగోళం చాలా మందికి తెలిసే ఉంటుంది. అప్పట్లో నుపుర్‌ శర్మకు మద్దతిచ్చిన కన్నయ్యలాల్‌ అనే టైలరును  ముస్లిం గుండాలు హత్య చేశారు. ఆ వెంటనే రెండు రోజుల్లో వాళ్ళ అరెస్టులు జరిగాయి. హత్యలకు పాల్పడిన వారిని  వారే  మతస్తులైనా తీవ్రంగా ఖండించాలి. కఠినంగా శిక్షించాలి. దేశంలో ఎన్నో మూకహత్యలు జరిగాయి. ఎంతమందికి శిక్షలు పడ్డాయి. మూకహత్యల్లో హతులందరూ దాదాపు ముస్లిములే. మొన్నటికి మొన్న మతిస్థిమితం లేని ఒక ముస్లిం కుర్రాడు గుళ్ళో ప్రసాదం, ఒక అరటిపండు తిన్నాడని స్తంభానికి కట్టేసి చావగొట్టారు. ఇలాంటి సంఘటనల్లో ఎంత మందికి శిక్షలు పడ్డాయి.  ఈ ప్రశ్నలు కూడా అడగవలసిన ప్రశ్నలే.  మరో  వాస్తవమేమిటంటే, కన్నయ్యలాల్‌ను హత్య చేసిన హంతకులు బీజేపీ అగ్రనేతలతో సన్నిహితంగా ఉండే వారని చెప్పే అనేక ఫోటోలు బయటకు వచ్చాయి. ఈ హత్య వెనుక రాజకీయ కుట్ర ఉండవచ్చని అప్పట్లోనే చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ హత్యను మతరాజకీయాలకు ఎన్నికల్లో వాడుకుంటారని కూడా చాలా మంది అప్పట్లోనే విశ్లేషించారు.  ఈ హత్య జరిగింది 2022లో. కన్నయ్యలాల్‌ హంతకుడు రాజస్థాన్‌ బీజేపీ నేత గులాబ్‌ చంద్‌ కటారియాతో ఉన్న ఫోటోలు కూడా అప్పట్లో బయటకు వచ్చాయి. బీజేపీ మైనారిటీ మోర్చాలో ఈ హంతకుడు చురుకుగా ఉండేవాడన్న వార్తలు కూడా వచ్చాయి.  ఇప్పుడు ఆ హత్యను ప్రధాని ప్రస్తావించారు.

బట్టలు కుట్టించే సాకుతో  వాళ్ళు వచ్చి, గొంతుకోసి వెళ్ళిపోతారు అంటూ మోడీ తన ప్రసంగంలో చెప్పిన మాటలకు అర్థమేమిటి? అలా వచ్చి గొంతు కోసి వెళ్ళేవాళ్ళెవరు?  ఎవరిపై  ఎవరిని రెచ్చ గొడుతున్నారు? ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పలేనంత కఠినమైనవి ఏమీ కాదు.

ఇప్పుడు మతరాజకీయాలు చేయడం తప్ప గెలవడానికి మరో దారి లేని స్థితికి బీజేపీ చేరుకుందని చాలా మంది విశ్లేషిస్తున్నారు. ఇంతవరకు బీజేపీ గెలిచింది కూడా ఇలాంటి మతరాజకీయాల పుణ్యమే.  గత  అనేక  సంవత్సరాలుగా ఈ మతరాజకీయాలే బీజేపీకి అధికారాన్ని కట్టబెట్టాయి.  ఇప్పుడు ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో, ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికల్లోను ఇవే రాజకీయాలు పనికివస్తాయని బలంగా నమ్ముతున్నారు. కాని ఇప్పుడు ప్రజలు కూడా వాస్తవాలను గుర్తిస్తున్నారు. ఉద్యోగాలు లేవు,  ధరలు అందుబాటులో లేవు.